
NRI Quota Vs. Caste Quota
సేవ్ మెరిట్, సేవ్ ఇండియా అంటూ అగ్ర కులాల విద్యార్ధులు 1980, 1990 దశాబ్దాల్లో ఉద్యమాలు నిర్వహించారు. రిజర్వేషన్ల వల్ల దేశం వెనుకబడి పోతున్నదంటూ ఆక్రోశించారు. అగ్ర కులాల విద్యార్ధులకు ఇంజనీరింగ్, మెడిసిన్ మొ.న కాలేజీలలో సీట్లు రాకపోయినా, లేక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక కాకపోయినా అందుకు ప్రధమ, ఏకైక కారణం రిజర్వేషన్లే కారణం అని వారు వాదించారు.
వీళ్ళు కేవలం తమకు విద్య, ఉద్యోగాలలో సీట్లు రాకపోవడం ఒక్కటే ప్రధాన సమస్య. దేశంలో మరే ఇతర సమస్యలు లేవు. ఎస్.సి, ఎస్.టి కులాల ప్రజలు అంటరాని వారుగా చూడబడుతూ వేల యేళ్ళ పాటు అణచివేతకు గురై కనీస జీవికకు అవసరమైన భూములు గానీ, విద్యాలయాల్లో ప్రవేశం గానీ నిరాకరించ బడ్డారని, ఆ కారణంగా సౌకర్యాలు, అవకాశాలు మృగ్యమైనాయన్న సంగతిని గుర్తించేందుకు నిరాకరిస్తారు.
అనేక అసమానతలు ముఖ్యంగా సామాజిక, ఆర్ధిక అసమానతలు పాతుకుపోయిన సమాజంలో “సమానుల మధ్య పోటీ” అన్నది వాస్తవంగా ఉండదనీ గారు గుర్తించరు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి “ప్రతిభ” కు గుర్తింపు రావడం లేదని “మేడి పండు” తరహా వాదన చేస్తారు. వీరి దృష్టిలో ప్రతిభ అంటే ఎక్కువ మార్కులు రావటం. తక్కువ మార్కులు వస్తున్న ఎస్.సి, ఎస్.టి విద్యార్ధులు, ఉద్యోగార్ధులు కాలేజీ సీట్లు, ఉద్యోగాలు పొందటం వలన దేశాభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వాదిస్తారు.
ఎస్.సి, ఎస్.టి విద్యార్ధులకు తక్కువ మార్కులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వారికి చదువుకునే అవకాశాలు 1970 ల నాటి వరకు అందుబాటులోకి రాలేదు. రిజర్వేషన్ అనే అవకాశం ఒకటి ఉందన్న సంగతి తెలియని ఎస్.సి, ఎస్.టి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. వారికి భూములు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ పాఠశాల, కాలేజీ తప్ప ట్యూషన్లు చెప్పించుకునే తాహతు ఉండదు. ఎంసెట్, లాసెట్, నీట్, ఇత్యాది పరీక్షల్లో విజయవంతం కాగలిగే విధంగా కోచింగ్ లు వారు పొందలేరు. ఎందుకంటే వారి కుటుంబాల్లో తిండి గడవడం, సరిపడా బట్ట కట్టడం వరకే వారి సంపాదన సరిపోతుంది గనక.
దాదాపు అందరూ అనుకుంటున్నట్లు ఎస్.సి, ఎస్.టి ప్రజలకు రిజర్వేషన్లు కల్పించినది ఆర్ధిక ప్రాతిపదికన కాదు. సామాజిక అణచివేత (అంటరానితనం) గురైనందున ఆస్తులకు అవకాశాలకు దూరమై, ఆర్ధికంగా కూడా వెనుకబడినందున వారికి రిజర్వేషన్ ఇవ్వబడింది. అగ్ర కులాలతో పాటు ఎంబిసి, బిసి, ఇబిసి ఇత్యాది కులాల వాళ్ళు కూడా ఎస్.సి, ఎస్.టి లతో సామాజిక సంబంధాలకు ఇప్పటికీ ముందుకు రాని పరిస్ధితి నెలకొని ఉన్నది. అందుకే ఎస్.సి, ఎస్.టి లకు రిజర్వేషన్లు.
అయితే సమాన అవకాశాలు లేదా కనీసం పోల్చగల అవకాశాలు అందుబాటులో ఉన్నట్లయితే ఎస్.సి, ఎస్.టి లు కూడా “ప్రతిభ” చూపగలుగుతారని లేదా ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతారని ఇప్పుడు అనేక పరీక్షల్లో వారు రుజువు చేస్తున్నారు. నిజానికి ఎస్.సి, ఎస్.టి లకు అగ్ర కులాల ప్రజలతో పోల్చితే సమాన సామాజిక, ఆర్ధిక అవకాశాలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. కానీ ఒకటి రెండు తరాల పాటు రిజర్వేషన్ ద్వారా మధ్య తరగతి స్థాయి సంపాదించిన ఎస్.సి, ఎస్.టి విద్యార్ధులు, వేల యేళ్లుగా అవకాశాలు సొంతం చేసుకున్న అగ్ర కుల “ప్రతిభా” సంపన్నులతో పోటీ పడగలుగుతున్నారని వివిధ రకాల ఎంట్రన్స్, రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు
క్రింద పట్టికలో ఓపెన్ కేటగిరీ, బి.సి లోని వివిధ కేటగిరీలు, ఎస్.సి, ఎస్.టి కేటగిరీలకు, ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో నిర్ణయించబడిన కటాఫ్ మార్కులు మరియు ఆయా కేటగిరీల అభ్యర్ధులకు వచ్చిన అత్యధిక మార్కులు ఇవ్వబడ్డాయి. ఈ పట్టిక చూసినట్లయితే కాస్తంత అవకాశం వచ్చినా సరే, ఎస్.సి, ఎస్.టి విద్యార్ధులు కూడా అత్యధిక మార్కులు సంపాదించగలరని, లేదా భేషైన ప్రతిభ కనపరచగలరని తెలుస్తుంది.
ఇంకా విపరీతం ఏంటంటే అగ్ర కులాల ప్రజల్లో ఆర్ధికంగా వెనుకబడ్డ వారి ప్రతిభ “నాసిరకంగా” (ఈ మాట రాస్తున్నందుకు క్షమాపణలు) ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్న సంగతి వారికి విధించబడిన కటాఫ్ మార్కుల ద్వారా తెలుస్తున్నది.

ఇక్కడ మనం ప్రధానంగా చూడవలసింది ప్రతిభ గురించి. ప్రతిభా వాదులు ఇంతకాలం ప్రతిభ అన్నది అగ్ర కులాల సొత్తు అన్న భ్రమలో ఉన్నారు. అంటే వారు ఆర్ధికంగా వెనకబడ్డా కూడా ప్రతిభ వారి సొంతం అనీ, వారిని వదిలి పెట్టి రిజర్వేషన్ పేరుతో నాసిరకం ప్రతిభ కలిగి ఉండే ఎస్.సి, ఎస్.టి వాళ్ళకు కాలేజీ సీట్లు, ఉద్యోగాలు ఇవ్వటం తగదని, దాని వల్ల దేశం తగలబడి పోతున్నదని వారు చెబుతూ వచ్చారు.
కానీ జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో చూస్తే ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కులాలలకు కటాఫ్ మార్కులు 68గా తేలగా, ఎస్.సి లకు కటాఫ్ మార్కులు 75 గానూ, ఎస్.టి లకు కటాఫ్ మార్కులు 74 గానూ తేలింది. అత్యధిక మార్కులు EWS వారికి 90 రాగా, ఎస్.సి కులాల వాళ్ళు వారికంటే ఎంతో దూరంలో లేరని వారికి వచ్చిన అత్యధిక 86 మార్కుల ద్వారా తెలుస్తున్నది. అత్యంత వెనుకబడిన ఎస్.టి లు సైతం అత్యధికంగా 85 మార్కులు సంపాదించారు.
అత్యల్ప కటాఫ్ మార్కులు (58) కలిగి ఉన్న బి.సి (సి) వారికి కూడా అత్యధికంగా 85 మార్కులు సంపాదించారు. అంటే కేవలం 30, 40 సంవత్సరాలుగా మాత్రమే రిజర్వేషన్ల ద్వారా కాస్తో కూస్తో అవకాశాలు పొందిన ఎస్.సి, ఎస్.టి లు కూడా అగ్ర కులాల వాళ్ళ కంటే అత్యధిక మార్కుల్లో ఎంతో దూరంలో లేరు.
అలాగే బి.సి లతో పోల్చితే (వీళ్ళు కూడా ఇప్పటికీ ఎస్.సి, ఎస్.టి ప్రజలను అంతరానివారుగా పరిగణిస్తూ ఇళ్ళల్లోకి రానివ్వటం లేదు. ఎంత పెద్ద ఎస్.సి ఉద్యోగి అయినా ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.) ఎస్.సి, ఎస్.టి లకు కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి.
ఉదాహరణకి బిసి-ఏ మరియు బిసి-ఇ కేటగిరీలతో పోల్చితే ఎస్.సి, ఎస్.టి వాళ్ళ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి. అత్యధిక మార్కుల విషయంలో చూస్తే ఎస్.సి, ఎస్.టి వాళ్ళు, బిసి-ఏ, బిసి-ఇ లతో సమాన మార్కులు సాధించారు. ఓపెన్ కేటగిరీతో పోల్చితే ఎస్.సి, ఎస్.టి లు కేవలం 4, 5 మార్కులు మాత్రమే తక్కువ సంపాదించారు. ఈ 4, 5 మార్కుల తేడా బట్టి అగ్ర కుల అభ్యర్ధుల కంటే, ఎస్.సి, ఎస్.టి అభ్యర్ధులు తెలివి తక్కువ వారనీ, నాసిరకం ప్రతిభ కలిగిన వారనీ చెప్పవచ్చా?

Equality Vs Affirmative action
చెప్పవచ్చని అగ్ర కులాల ప్రతిభా సంపన్నులు బల్ల గుద్ది వాదిస్తున్నారు. సెప్టెంబర్ 15 తేదీన బీహార్ ఎస్.ఐ.ఆర్ విషయంలో వాదనలు వింటున్న సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచి ఒక వ్యాఖ్యానం చేసింది. “బీహార్ ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రస్తుతానికి కొనసాగుతున్నప్పటికీ, చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే అంతిమ తీర్పులో ఎస్.ఐ.ఆర్ ను రద్దు చేయాల్సి ఉంటుంది” అని ధర్మాసనం లోని జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించాడు. (మరో జడ్జి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి)
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వెబ్ సైట్ లో ఈ అంశం పైన వార్త ప్రచురిస్తే దాని కింద 200 పైగా కామెంట్లు పెట్టారు. వాటిలో 99 శాతం మంది సుప్రీం కోర్టు జడ్జి లను పరమ అభ్యంతరకరంగా విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేశారు. కొందరైతే బూతులే తక్కువ అన్నట్లు కామెంట్లు రాశారు. వారిలో ఒకరు “రిజర్వేషన్ల వల్ల వచ్చిన దుస్థితి ఇది. వాటి వల్ల కోర్టులో కూడా న్యాయం దక్క కుండా పోతున్నది” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యానానికి 60 కి పైగా అప్ వోట్లు వచ్చాయి.
బోడి గుండు ^ మోకాలు
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి… వీళ్ళిరువురు రిజర్వేషన్ తో సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమితులు కాలేదు. అసలు బీహార్ ఎస్.ఐ.ఆర్ లో ఇంతవరకు వాదనలు కూడా పూర్తి కాలేదు. అక్టోబర్ 7 తేదీన తుది విడత వాదనలు వింటాం అని నిన్న ధర్మాసనం చెప్పింది కూడా. కానీ రిజర్వేషన్ తో సంబంధం లేని న్యాయమూర్తులు, వాదనలు జరుగుతుండగా చేసిన వ్యాఖ్యానానికి రిజర్వేషన్లు కారణమని మన ప్రతిభా మూర్తులు భావిస్తున్నారు.
మన ప్రతిభా సంపన్నుల ప్రతిభ ఏ స్థాయిలో ఉన్నదంటే బోడి గుండుకు, మోకాలు కు ముడి పెట్టగల సామర్ధ్యం చూపగలిగేటంతగా! బీహార్ ఎస్.ఐ.ఆర్ పైన వాదనలు వింటున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇద్దరూ ఇంతవరకూ వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులు గమనిస్తే కాస్తో కూస్తో సామాన్య ప్రజలకు అనుకూలంగా లేదా న్యాయానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన సంగతి గమనించవచ్చు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు నియంతలనీ, బుర్ర లేదని, వామపక్ష పార్టీలకు సేవలు చేస్తున్నారని, అసలు చట్టాల గురించి వాళ్ళకి ఏమీ తెలియదని, అసలు వీళ్ళు లా డిగ్రీ చదివారా లేక కొన్నారా అనీ ఇలా దరిద్ర గొట్టు వాదనలు, ఆరోపణలు ఇద్దరు జడ్జిల పైన ప్రతిభా సంపన్నులు చేశారు.
ఇలాంటి ప్రతిభా సంపన్నులతోనా దేశం ముందుకు వెళ్ళేది? చైనా, అమెరికా, రష్యా, ఐరోపా లాంటి దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాలు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగం లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టి పరిశోధనలు నిర్వహించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించి వాటిని అమ్ముకుని లబ్ది పొందుతున్నాయి.
భారత దేశ పాలకులు చేస్తున్నదేమిటి? యోగా ను ప్రపంచానికి మేమే అందించాం అంటూ ప్రపంచ స్థాయి ప్రచారానికి నిధులు గుమ్మరించి ఐరాస చేత యోగా డే అంటూ ఒక రోజు ప్రకటింప జేసి “చూశారా మా ప్రతిభ” అంటూ చంకలు గుద్దుకుంటున్నారు.
అంతేనా? సాక్షాత్తు ప్రధాన మంత్రి గారే ముంబైలో అనేక మంది నిష్ణాతులైన డాక్టర్లు హాజరైన సభలో మాట్లాడుతూ “భారత దేశం ఒకానొక కాలంలో వైద్య శాస్త్రంలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి సాధించిందని గర్వంగా చెప్పవచ్చు. కర్ణుడు ఒక మానవ స్త్రీకి జన్మించలేదని మహాభారతం చెబుతుంది. అంటే జన్యు శాస్త్రం మన దేశంలో ఆనాటికే అభివృద్ధి చెందిందని మనం గ్రహించ వచ్చు. అందు వల్లనే కర్ణుడు స్త్రీ గర్భంలోపల కాకుండా గర్భం బైట జన్మించాడు” అని గొప్పగా చాటాడు.
“మనం గణపతి దేవుడిని పూజిస్తాం. మానవుడి శరీరానికి ఏనుగు తల అంటించారంటే ఆ నాటికే ఒక తరహా ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ అభివృద్ధి చెందిందని గ్రహించవచ్చు” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వాక్రుచ్చారు. అంటే భారత దేశ పాలకులు శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి నిధులు కేటాయించి కృషి చేయటానికి బదులు మైధాలజీని తెచ్చి అదే మన సైన్స్ అని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
క్రమ బద్ధమైన శరీర వ్యాయామం బదులు యోగా యే సర్వస్వంగా చెబుతూ, పుక్కిటి పురాణాలను శాస్త్ర సాంకేతిక అభివృద్ధిగా ప్రమోట్ చేస్తూ భారత దేశ పాలకులు ఎలాంటి ప్రతిభా సంపన్నులను ఉత్పత్తి చేస్తున్నట్లు?
రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ఛోటా, మధ్య స్థాయి బిజెపి నాయకులు మొదటి నుండి చెబుతూ వచ్చారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఆనాడు అంగీకరించలేదు. ఈనాడు ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామని అనేక మంది బిజెపి నాయకులు బహిరంగంగా దూకుడు ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనల వలన ఓట్లు తగ్గే పరిస్ధితి ఏర్పడడంతో బిజెపి అధినాయకులు వారిని కంట్రోల్ చేసినట్లు పత్రికలు చెప్పాయి.
ఈ తరహా రాజకీయం బిజెపి కి వెన్నతో పెట్టిన విద్య. మొదట కొందరు నాయకుల చేత దూకుడు ప్రకటనలు చేయిస్తారు. ఆ ప్రకటనలకు వచ్చే స్పందనను బట్టి అధి నాయకులు ఏం చెప్పాలన్నదీ నిర్ణయించుకుంటారు. ముందుకు పోవచ్చు అనుకుంటే ఒక చట్టం చేసేసి, మంద బలంతో, అధికారం అండతో చట్టాలను బుల్ డోజ్ చేస్తూ పార్లమెంటులో పాస్ చేసుకుంటారు. రైతు చట్టాలను భారత రైతాంగం తీవ్రంగా ప్రతిఘటించిన తరహాలో ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైతే తప్ప బిజెపి బుల్ డోజర్ పాలనకు, బుల్ డోజర్ చట్టాలకు, బుల్ డోజర్ వాదనలకు తిరోగమనం ఉండదని భారత ప్రజల అనుభవం చెబుతున్నది.
“ప్రతిభా” వాదనకు జన్మ స్థలం ఎక్కడ ఉన్నదో ఈ పాటికే అర్ధం కావాలి.
ప్రతిభ ఏ ఒక్క వ్యక్తి లేదా సమూహం సొంతం కాదు!
గుడ్డి ద్వేషంతో రిజర్వేషన్లను వ్యతిరేకించటం కాకుండా తమకు ఉందని చెబుతున్నా “ప్రతిభ” తో ఆలోచించి రిజర్వేషన్ల వెనుక కారణాలను ప్రతిభా వాదులు గుర్తించాలి. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు గానీ లేదా ఏ ఒక్క కులం సొత్తు కాదని అందరూ గుర్తించాలి.
సమాన స్థాయి అవకాశాలు ఇచ్చినట్లయితే లేదా లభించినట్లయితే ఎస్.సి, ఎస్.టి లు తమ ప్రతిభ ఏ పాటితో చూపగలరని గ్రహించాలి. సమాన పునాది లేని చోట సమాన సామర్ధ్యం చూపలేరని ఆ దృష్టితోనే రాజ్యాంగంలో “ఆఫర్మేటివ్ యాక్షన్” నిమిత్తం “పాజిటివ్ డిస్క్రిమినేషన్” కు వీలు కల్పిస్తూ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారని గుర్తించాలి.
ఒక తరం రిజర్వేషన్ లో ఉద్యోగం పొందాక తర్వాత తరానికి రిజర్వేషన్ ఉండకూడదని ఆలోచన కొరవడిన వాదనలు కొందరు చేస్తున్నారు. ఈ వాదన చేస్తున్న వాళ్ళు, ఒక గుమాస్తా, ఒక టీచర్, ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్, ఒక బ్యాంకు మేనేజర్ లాంటి ఉద్యోగాలు పొందిన మాల, మాదిగ కులాల వ్యక్తులు అగ్ర కులంతో సమానంగా సామాజిక హోదా పొందగలరా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వగలగాలి.
సమాన సామాజిక హోదా అంటే అగ్ర కులాల ఇళ్లలో తమతో సమానంగా భోజనానికి పిలవటం, తమ కొడుకు, కూతురుతో వివాహానికి అంగీకరించటం, పండగలు పబ్బాల్లో ఎస్.సి, ఎస్.టి లకు ఆహ్వానాలు పంపి, వారు పాల్గొనేందుకు అవకాశం కల్పించటం, మొ.వి. వీటిలో ముఖ్యమైనది తమ కొడుకు, కూతుళ్లతో ఎస్.సి, ఎస్.టి కుటుంబాల లోని కూతుళ్ళు, కొడుకులతో వివాహాలకు అంగీకరించటం. ఇది జరుగుతుందా?
మరో ప్రశ్న. ఎవరు ఫ్యాక్టరీ లేదా పరిశ్రమ స్థాపించినా, వాళ్ళు తప్పనిసరిగా దేశంలోని సహజ వనరులను పొంద వలసిందే. పెట్టుబడి (అది కూడా బ్యాంకు రుణాలే అత్యధికం) తప్ప ఇతరాలన్నీ ప్రకృతి నుండి ఫ్యాక్టరీ/పరిశ్రమ కు రావలసిందే. కనుక ఒక తరం అగ్ర కుల కుటుంబం ఫ్యాక్టరీ తాలూకు లాభాలను అనుభవించిన తర్వాత తమ ఫ్యాక్టరీని మరొక పేద కుటుంబానికి అప్పగిస్తుందా?
ప్రకృతి వనరులను ఉపయోగించుకుని, బ్యాంకు రుణాలు పెట్టుబడిగా పొంది లాభాలు సంపాదించటం అంటే అదేమీ కష్టపడి చేసే సంపాదన కాదు. ప్రభుత్వం నుండి ప్రకృతి వనరుల దోపిడీకి అనుమతి పొంది బ్యాంకులు ప్రజల నుండి సేకరించిన పొదుపు డబ్బుని పెట్టుబడిగా పెట్టి సంపాదించే లాభాలవి.
అంటే ఎస్.సి, ఎస్.టి కుటుంబాలు రిజర్వేషన్ ఎలా పొందుతున్నారో, అగ్ర కులాల సంపన్నులు, తాము సంపన్నులం అయినప్పటికీ ప్రభుత్వం నుండి ప్రకృతి వనరులు, బ్యాంకు పెట్టుబడులు, వాటికి తోడు అనేకానేక రాయితీలు. అప్పులు తీర్చలేకపోతే రుణాల రద్దులు అనుభవిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక తరం పాటు పరిశ్రమ లాభాలు అనుభవించిన అగ్ర కుల కుటుంబం తర్వాతి తరంలో మరో అగ్ర కులం పేద కుటుంబానికి తమ పరిశ్రమను అప్పగిస్తాడా? ఇవ్వడు గాక ఇవ్వడు.
కోట్లు సంపాదించి పెట్టే పరిశ్రమ/ఫ్యాక్టరీని మరో తరంలో మరో పేద అగ్ర కుల కుటుంబానికి ఇవ్వలేనప్పుడు, ఆఫ్టరాల్ ఒక గుమాస్తా, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ ఉద్యోగం అనుభవించినంత మాత్రాన మరో తరానికి రిజర్వేషన్ ఇవ్వకూడదన్న వాదనలో సహేతుకత ఉన్నట్లా, లేనట్లా?
కేవలం రిజర్వేషన్ల పై పచ్చి ద్వేషంతో, ఎస్.సి, ఎస్.టి లు పొందుతున్న అరకొర ఉద్యోగాలను కూడా ఊడబీకాలనీ పధకాలు వెయ్యటం, వెర్రి మొర్రి వాదనలు చేయటంలో ఏ మాత్రం ప్రతిభ దాగి ఉన్నదో ఆ ప్రతిభా సంపన్నులే చెప్పాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లు ఒక కంటి తుడుపు మాత్రమే తప్ప అంతిమ పరిష్కారం కాదు. పేదల మధ్య తగవు పెట్టేందుకు పాలక వర్గాలు ప్రతిభా వాదనకు తెర వెనుక మద్దతు ఇస్తున్నారు. స్వయంగా పటేల్ ఉద్యమం అనీ, మరాఠా ఉద్యమం అనీ వివిధ వర్గాలను చేరదీసి రెచ్చగొట్టి ప్రజా వ్యతిరేక ఉద్యమాలు రెచ్చగొడుతున్నారు. ఉద్వేగాలు రెచ్చగొడుతూ, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగాన్ని అసలుకే మొత్తంగా రద్దు చేసే తమ విధానాల నుండి ప్రజల దృష్టి మరలిస్తున్నారు.
“ప్రతిభ” దానికదే స్వయంభవు కాదు. అదేమీ పుట్టుకతో వచ్చేదీ కాదు. అనేక సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, మానసిక పరిస్ధితులను బట్టి ప్రతిభ అనేది ప్రజా సమూహాలకు వచ్చి చేరుతుంది. ఆ ప్రతిభ ఒక్క నాటితో వచ్చినది కూడా కాదు. మనిషి చెకుముకి రాళ్ళతో నిప్పు తయారు చేసినప్పటి నుండి, పదునైన రాళ్ళతో వేట సాగించిన కాలం నుండి ప్రతిభ అన్నది పొరలు పొరలుగా పేరు కుంటూ వచ్చింది. ఈ నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుట్టుకకు ఆనాటి చెకుముకి రాయితో నిప్పు అనే శక్తి (ఎనర్జీ) ని తయారు చేసిన ఆదిమ మానవుడి జ్ఞానం పునాది అని గ్రహిస్తే ప్రతిభా వాదనలో ఉన్న డొల్లతనం ఇట్టే తేలిపోతుంది.
ఆనాటి ఆదిమ మానవుడి కులం ఏమై ఉంటుంది? అగ్ర కుల ప్రతిభ తోనే ఆదిమ మానవుడు నిప్పును కనిపెట్టాడా? అగ్ర కుల ప్రతిభ తోనే హరప్పా నాగరికత లోని మానవుడు అద్భుతమైన నాగరికతను అభివృద్ధి చేసుకున్నాడా? రిజర్వేషన్ల వల్లనే హరప్పా నాగరికత నశించిందా?
చిన్న తరగతుల్లో బొటా బొటీ మార్కులతో పాస్ అయిన విద్యార్ధులు అనంతర కాలంలో అత్యున్నత సాంకేతిక ఆవిష్కరణలు చేసిన చరిత్ర మానవ జాతి సొంతం. గణిత శాస్త్రవేత్త రామానుజన్, స్కూల్ పరీక్షల్లో లెక్కల్లో తప్ప అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఆయనకు ప్రతిభ ఉన్నదీ లేనిదీ పరీక్షల్లో వచ్చిన ఫెయిల్ మార్కులు నిర్ణయించాయా? లేక ఆయన కులం నిర్ణయించిందా?
చిన్నతనంలో అద్భుతమైన ప్రతిభ కనబరచి, పిన్న వయసు డాక్టర్ గా ప్రపంచ గుర్తింపు పొంది అమెరికా వెళ్ళిపోయి అక్కడ కట్నం కోసం భార్యను వేధించిన వ్యక్తులకు కూడా భారతదేశం జన్మనిచ్చింది. అలాగే హై స్కూల్ వరకు ఫస్ట్ ర్యాంకులు పొంది అనంతర కాలంలో పరీక్షలు తప్పి బెత్తెడు సంపాదనతో కాలం వెళ్లదీస్తున్న వాళ్ళూ ఉన్నారు. వీళ్ళందరి జీవనాల విషయంలో వారి చుట్టూ ఉన్న సామాజిక, ఆర్ధిక పరిస్ధితులతో పాటు మానసిక, శారీరక పరిస్ధితులు కూడా తమ తమ పాత్ర పోషించాయి.
గూగుల్ సి.ఈ.ఓ అయినంత మాత్రాన పిచ్చయ్య భారత దేశానికి ఏమన్నా ఒరగబెట్టాడా? ఆయన కంటే దేశ స్వాతంత్రం కోసం ఉరితాడుని ముద్దాడిన షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు భారత దేశానికి అత్యంత ప్రీతి పాత్రమైన ముద్దుబిడ్డలు కాదా? స్వాతంత్రం కోసం బ్రిటిష్ సేనలతో ఒంటరి పోరాటం చేసి ఊపిరి కోల్పోయాక కూడా బ్రిటిష్ సేనలు దగ్గరికి రావటానికి సైతం సాహసించలేని విధంగా వీరత్వం చూపిన ఆజాద్ చంద్ర శేఖర్ ఒక సివిల్ సర్వీస్ ఉద్యోగి కాలేనందుకు ప్రతిభ లేకుండా పోయాడని చెప్పవచ్చా?
తనతో పాటు ఎదుటి వ్యక్తితో కూడా తన చుట్టూ ఉన్న సంపద వనరులను పంచుకోవడానికి సిద్ధపడ లేని వ్యక్తికి ఎంత ప్రతిభ ఉన్నా ఏమిటి ప్రయోజనం. జీవన సహచరిని సమానురాలుగా గుర్తించలేక కట్నం తెచ్చి పెట్టే వనరుగా చూస్తూ ఆమెకు ఒక అనుభూతిని కోరే మనసు, ఒక అనుభవం కోరే శరీరం, ఒక ప్రేమ కోరే హృదయం ఉంటుందని గుర్తించలేకపోతే పిన్న వయసు డాక్టర్ అయినా, గూగుల్ సి.ఈ.ఓ అయినా, సూపర్ ఫాస్ట్ కోడింగ్ చేసే ఇంజనీర్ అయినా ఏమిటి ప్రయోజనం?
శాస్త్ర, సాంకేతిక రంగాలకు గానీ, శాస్త్ర ఆవిష్కరణలకు గానీ చివరికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మైక్రో సాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీల ఫలితాలు మానవ జాతి ఉమ్మడి ప్రయోజనాలకు కాకుండా కేవలం ఒకరిద్దరు సూపర్ ధనికులకు అలవిలేని లాభాలు కూడబెడితే వారి ప్రతిభ వలన ప్రజలకు, దేశానికి ఒనగూరుతున్న ప్రయోజనం ఏమిటి?