
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ అయిన మోహన్ భగవత్ ముస్లింల పట్ల దయ తలిచారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా కూడదనీ, వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక్కటయ్యారని తేల్చి చెప్పారు. భారత దేశంలో ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికీ ఉన్నదని కూడా చాటారు.
ఆర్ఎస్ఎస్ సంస్థ రెండవ గురువు, సిద్ధాంత కర్తగా పేర్కొనే గురు గోల్వాల్కర్ గారు ముస్లిం లకు అలాంటి స్వేచ్ఛ ఉందన్న సంగతి నిరాకరించారు. ముస్లిం మతావలంబకులు ఈ దేశంలో నివసించ దలచుకుంటే రెండో తరగతి పౌరులుగా బ్రతకాలని, అందుకు నిరాకరిస్తే దేశం విడిచి వెళ్ళి పోవాల్సిందే అనీ శాసించారు.
ఇప్పుడు ముస్లింల పట్ల ఆర్ఎస్ఎస్ అవగాహన మారిందని మోహన్ భగవత్ మాటలు సూచిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సమావేశాల సందర్భంగా ఆయన ఈ మాటలు చెప్పారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెబ్ సైట్ ప్రచురించిన వీడియో ద్వారా తెలుస్తున్నది.
“మతం అన్నది వ్యక్తిగత ఎంపిక (ఛాయిస్), ఉపాధి హక్కు పొందటానికి పౌరులకు మతం ఎలాంటి ఆటంకం కాదు. భారత దేశంలో ముస్లింలకు ఉపాధి పొందటానికి అన్నీ అవకాశాలు ఉన్నాయి. వారికి సమాన అవకాశాలు పొందే హక్కు ఉన్నది” అని మోహన్ భగవత్ చాటారు.
అంతే కాదు. ముస్లిం లను క్రైస్తవులను ఇతరులుగా చూడటానికి వ్యతిరేకంగా హెచ్చరిక సైతం జారీ చేశారు. “అసలు హిందూ-ముస్లింలు ఐక్యం కావలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఐక్యంగా ఉన్నారు” అని ఆర్ఎస్ఎస్ అధిపతి వ్యాఖ్యానించారు.
“భారత దేశం నుండి ఇస్లాం మతం ఎప్పటికయినా అంతరించి పోతుందని ఏ ఒక్క హిందువు కూడా భావించ కూడదు” అని చెబుతూ, ఒక మెలిక పెట్టారు. “అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్నది. భారత సమాజం కూడా అక్రమ వలసలను అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషించాలి” అని నొక్కి చెప్పారు.
చదువుకోక ముందు కాకరకాయ అన్న వాడు చదువుకున్న తర్వాత ‘కీకర కాయ’ అనడం మొదలు పెట్టాట్ట! అలా ఉంది భగవత్ గారు చెబుతున్నది.
ఇలా అనడం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భక్త గణం, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్ ఇత్యాది సంస్థల కార్యకర్తలతో పాటు హిందూ మత పరిరక్షణ పేరుతో కుప్పలు తెప్పలుగా దేశం అంతా వెలిసిన చిన్నా చితకా సంఘాల (fringe groups) గణాలు ఇటీవల కాలంలో అక్రమ వలసల పేరుతో బెంగాలీ ముస్లిం లను బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలన్నింటా విదేశీయులు అనీ, బంగ్లాదేశీయులనీ, అక్రమ వలసదారులనీ వేధించటం ఎక్కువయింది.
అంతెందుకు? ఏకంగా బిజెపి నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వాలే బెంగాలీ మాట్లాడే ముస్లిం ప్రజలను “బంగ్లా భాష మాట్లాడుతున్నారు” అని చెబుతూ నిర్బంధిస్తున్నారు. పోలీసులే “బంగ్లా భాష మాట్లాడుతున్నారు కాబట్టి బంగ్లాదేశ్ పౌరులు అయుంటారు” అని చెబుతూ వందల కొద్దీ బెంగాలీ ముస్లిం లను అరెస్టు చేస్తున్నారు.
మోహన్ భగవత్ గారు “అక్రమ వలసలను అరికట్టడంలో సమాజం కూడా తన వంతు పాత్రను పోషించాలి” అని పిలుపు ఇచ్చారు కదా! సరిగ్గా ఆర్ఎస్ఎస్, అనుబంధ సంఘాల కార్యకర్తలు ఆ పనే చేస్తున్నారు. తమ వంతు కర్తవ్యంగా బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలు ఎక్కడ కనపడ్డా పోలీసులకు రిపోర్ట్ చేస్తుంటే, పోలీసులు ఆగ మేఘాల మీద వారిని నిర్బంధం లోకి తీసుకుంటున్నారని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో ఇది ఎక్కువగా జరుగుతున్నది. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది జాస్తిగానే జరుగుతోంది. బెంగాలీ ముస్లింలు, ఆ మాటకొస్తే భారత దేశంలోని మెజారిటీ ముస్లింలు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు అని సచార్ కమిషన్ ఎన్నడో తేల్చి చెప్పింది. బెంగాలీ ముస్లింలు ఉపాధి కోసం మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా లాంటి రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు పొట్ట చేత పట్టుకుని వలస పోవడం ఒక కఠిన వాస్తవం. వీళ్ళని విదేశీయులని, అక్రమ వలసదారులని ముద్ర వేసి ప్రభుత్వాలే నిర్బంధిస్తున్నాయి.
“ఒడిషా నుండి ఢిల్లీ వరకు, గుజరాత్ నుండి మహారాష్ట్ర వరకు బెంగాలీ బాష మాట్లాడుతున్న కార్మికులను (కూలీలు) చుట్టుముట్టి, విచారణ పేరుతో, అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు అన్న అనుమానంతో నిర్బంధం లోకి తీసుకునే కలవర పరిచే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువయింది” అని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక జులై 20 తేదీన ఒక కధనం ప్రచురించింది.
మోహన్ భగవత్ మాటలను సూక్ష్మంగా గమనిస్తే ఆయన ముస్లింల ఉపాధి హక్కు సమస్యని, అక్రమ వలసల సమస్యని రెండింటినీ ముడి వేసి మాట్లాడటం గమనించవచ్చు. ఉపాధి కోసం ముస్లింలు బెంగాల్ నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేపధ్యంలో “భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లింకీ ఉపాధి పొందే హక్కు ఉన్నది” అంటూనే “అక్రమ వలసలను అరికట్టడంలో సమాజం తగిన పాత్ర పోషించాలి” అంటున్నారు.
ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఈ మాటలు ఉన్నాయి.
ముస్లింలకు ఉపాధి పొందే హక్కు ఉన్నదని ఓ పక్క ముస్లింలకు మద్దతు ఇస్తున్నట్లు, వారు కూడా దేశ పౌరులేనని హిందువుల్లో కలిసి పోయారని, హిందూ-ముస్లిం అన్న తేడా లేదని ప్రకటిస్తూ మరో పక్క అదే ముస్లిం లను “అక్రమ వలసదారుల” పేరుతో ముస్లింలను నిర్బంధం లోకి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు “సమాజం తమ వంతుగా సహకరించాలి” అని భగవత్ గారు బోధిస్తున్నారు.
కొన్ని పత్రికలు “ఐక్యత మరియు సమ్మిళితత్వం (inclusiveness) లకు సంబంధించి ఆర్ఎస్ఎస్ సందేశంలో మార్పు వచ్చింది” అని భాష్యం చెబుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కూడా అదే భాష్యం చెప్పింది. హిందూ ముస్లిం సంబంధాలు, మత సామరస్యంలకు సంబంధించి సరికొత్త చర్చను భగవత్ మాటలు రేపాయి అని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ అధిపతి, ప్రధాన మంత్రి ఇత్యాధి ముఖ్యుల మాటలు ఎప్పుడూ నేరుగా (direct) ఉద్దేశిస్తూ ఉండవు. మాటలు చక్కగా సానుకూలంగా ఉన్నట్లు ఉంటాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి లు ప్రభోదించే భావజాలం నేపధ్యంలో చూస్తే ఆ మాటలు విభజనను ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి మరియు అనుబంధ సంఘాల కార్యకర్తల వాస్తవ ఆచరణే ఆ సంగతి చెబుతాయి.
అందరూ సమానమే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎన్నిసార్లు పార్లమెంటులో, బహిరంగ సభల్లో చెప్పలేదు? అందరూ ఒకటే అంటారు గానీ “మతం పేరుతో ఇతర మతాల ప్రజలపై ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్ల పైన దాడులు చేయకండి. అలా ఇతర మతాలపై ద్వేషం పెంచుకోవడం సరైనది కాదు. ముస్లింలపై అల్లర్లు, కొట్లాటలకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఆర్ఎస్ఎస్ సహించదు” అని మోహన్ భగవత్ గానీ, నరేంద్ర మోడి గాని ఎన్నడైనా నేరుగా చెప్పారా?
ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సమావేశాల్లోనే రెండు మూడు రోజుల క్రితం మోహన్ భగవత్ ఏమని చెప్పారు? “అయోధ్యలో రామ మందిరం నిర్మించటం వరకే ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉన్నది. అది సాధించాం. వారణాసి (కాశీ విశ్వనాధుని గుడి భాగం కూల్చి గ్యాన్ వాపి మసీదు కట్టారన్న వివాదం), మధుర (షాహీ ఈద్గా మసీదు కృష్ణ జన్మ స్థలంలో కట్టారన్న తగాదా) వివాదాలతో ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు. కానీ హిందువులు, హిందూ సంస్థలు ఎవరైనా గ్యాన్ వాపి మసీదు, షాహీ ఈద్గా మసీదులు హిందు దేవుళ్ళ స్థలాలని నమ్మితే వారికా హక్కు ఉన్నది” అని ప్రకటించాడు.
ఓ పక్క రామ మందిరం వరకే ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది, కాశీ, మధుర మసీదుల జోలికి వెళ్లబోదు అని చెబుతూనే హిందువులు ఎవరైనా ఆ రెండు మసీదులు హిందూ దేవుళ్ళ జన్మ స్థలాలు అని నమ్మితే మాకు సంబంధం లేదని చెప్పటం అంటే వారణాసి, మధుర వివాదాలకు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లే కదా? హిందువులు అందరి తరపున తాము మాట్లాడతామని, తామే అసలు సిసలైన ప్రతినిధులమని చెబుతున్నప్పుడు హిందువులు ఎవరైనా కాశీ, మధుర వివాదాలు లేవనెత్తితే వాటికి ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తున్నట్లే కదా?
ఒక నాలుకతో వివాదాన్ని రెచ్చగొట్టాలి. మరో నాలుకతో వివాదంతో తమకు సంబంధం లేదంటూ తాము గొప్ప ఐక్యతావాదులమన్న ప్రతిష్ట కూడా పొందాలి. ఇదే కదా రెండు నాల్కల ధోరణి అంటే?!
ఇటువంటి మాటలు చెప్పిన తర్వాత, మద్దతు ఉందని పరోక్ష సంకేతాలు ఇచ్చేశాక “ఒకే భారత ఐడెంటిటీ కింద వివిధ మార్గాలలో దేవుడిని కొలిచే పద్ధతులను గౌరవించాలి. మతం అన్నది వ్యక్తిగత ఎంపిక” అని చెబితే సంఘ్ కార్యకర్తలు ఏది అనుసరిస్తారు? వారి ఆచరణ ఏమి చెబుతున్నది?
హిందువులు-ముస్లింలు అందరూ భారతీయులే అన్న సందేశాన్ని వాళ్ళు ఎన్నడూ ఆచరణలో నమ్మలేదు, పాటించలేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా, నాయకులు రెచ్చగొట్టినప్పుడల్లా, ఎన్నికల అవసరం వచ్చినప్పుడల్లా ముస్లింలపై ద్వేషంతో వ్యవహరిస్తూ, మత ఘర్షణలకు పాల్పడుతూనే ఉన్నారు. ఏ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా “పాకిస్తాన్ కు వెళ్లిపోండి” అని చిన్నా పెద్దా నాయకులు కార్యకర్తలు అందరూ అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ముస్లిం, క్రైస్తవ మత భావనలు, దేవుళ్ళు, పూజలు వరకూ ఎందుకు? కనీసం లిబరల్ భావనలనైనా సాహిస్తున్నారా? కనీసం సెక్యులరిజం భావనతో ఐనా సహనంతో ఉన్నారా? రాజ్యాంగ పీఠిక నుండి “సెక్యులరిజం, సామ్యవాదం” పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బోలే కొద్ది రోజుల క్రితమే కోరారు కదా! సామ్యవాదం, లౌకిక వాదం పదాలను కూడా సహించలేని వాళ్ళు హిందూ-ముస్లిం-క్రిస్టియన్ ఐక్యతను కోరుకుంటున్నారని ఎలా నమ్మాలి?
బాబ్రీ మసీదు కూల్చి రామ మందిరం నిర్మించాలని కోరుతూ రధ యాత్ర చేసి, రధయాత్ర పొడవునా మత కొట్లాటలను చెలరేగుతున్నా మారు మాట్లాడ కుండా, కరసేవకులు బాబ్రీ మసీదు ని కూల్చుతుంటే “ఔర్ ఏక్ ఢక్కా మారో” అని దగ్గర నిలబడి ప్రోత్సహించిన లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా మసీదు కూల్చివేత కేసును విచారించిన లిబర్హాన్ కమిషన్ ముందు నిలబడి “రామ రామ నేను అక్కడ లేనే లేను. మసీదు కూల్చబోతున్నారన్న సంగతే నాకు తెలియదు” అని సాక్ష్యం చెప్పినప్పుడు ఆర్ఎస్ఎస్, బిజెపి నేతల మాటలను ఎలా నమ్మటం? ఎంత కాలం ఈ దగా? వీళ్ళు వంచిస్తున్నది తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతున్న సామాన్య హిందూ ప్రజానీకాన్ని కాదా?
అసలు భారత ప్రజలను భారతీయులుగా ఎందుకు చూడరు? మతం కళ్లద్దాలు తీసేసి జనాన్ని జనంగా, మనుషులుగా, శ్రమ జీవులుగా, అన్నం పెట్టే వారుగా, అనేకానేక సౌకర్యాలు కల్పించి పెట్టే కష్ట జీవులుగా ఎందుకు చూడలేరు?
అలా చూస్తే వాళ్ల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యం, ఆ ఆధిపత్యంతో సకల శ్రామిక జనాన్ని మతం పేరుతో కులం పేరుతో విడగొట్టి లబ్ది పొందుతున్న సంగతి వాళ్ల కళ్లకే నగ్నంగా కొట్ట వచ్చినట్లు, వెక్కిరిస్తూ కనపడుతుంది కాబట్టి జనాన్ని జనంగా, కష్ట జీవులుగా చూడరు గాక చూడరు.
శ్రామికులలో చైతన్యం నిమ్పవలసిన కర్తవ్యం ఎవరిదీ? కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యం తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో మతం ప్రాతిపదికన bjp చిచ్చు పెడుతుంటే అమాయకులు బలి అవుతున్నారు !