
వాణిజ్య ప్రయోజనాల కోసం భారత దేశ స్వావలంభన, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే సమస్యే లేదని విదేశీ మంత్రి జై శంకర్ గత కొద్ది వారాలుగా పదే పదే చెబుతున్నారు. రష్యాలో ఉన్నా, చైనాలో ఉన్నా, లేక ఐరోపా, అమెరికాలలో ఉన్నా రష్యా చమురు దిగుమతి గురించి పశ్చిమ దేశాల విలేఖరులు ప్రశ్నించినప్పుడల్లా జై శంకర్ గారు ఈ సంగతే నొక్కి మరీ వక్కాణిస్తూ వస్తున్నారు.
అయితే జై శంకర్ మాటలకు భిన్నంగా వాస్తవ పరిణామాలు జరుగుతున్నట్లు న్యూయార్క్ నుండి పని చేసే అంతర్జాతీయ బిజినెస్ పత్రిక ‘బ్లూమ్ బర్గ్’ వెల్లడి చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన 25% ప్లస్ 25% టారిఫ్ ఆగస్టు 27 నుండి అమలులోకి రావటంతో బహుశా భారత చమురు రిఫైనరీ కంపెనీలకు టారిఫ్ తాలూకు వేడి తాకినట్లుంది.
అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ భారత దిగుమతులపై టారిఫ్ ను 25% నుండి 50% కి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
రష్యన్ చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ వచ్చిన భారత ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రష్యన్ చమురు కొనుగోలును రానున్న రోజుల్లో తగ్గించే ఉద్దేశ్యంతో ఉన్నాయని కొద్ది రోజుల క్రితం బ్లూమ్ బర్గ్ వెల్లడి చేసింది.
హెచ్.పి.సి.ఎల్, ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ ఆయిల్ మొ.వి ప్రైవేటు చమురు రిఫైనరీ కంపెనీలు. అక్టోబర్ నెలలో రోజుకి 1.4 మిలియన్ బ్యారెళ్ళ రష్యన్ చమురు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వ కంపెనీలు భావిస్తుండగా, ప్రైవేటు కంపెనీలు రోజుకి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తామని బ్లూమ్ బర్గ్ పత్రికకు తెలిపాయి.
ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో సగటున రోజుకి 1.8 మిలియన్ డాలర్లు భారత పబ్లిక్, ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలు దిగుమతి చేసుకున్నాయి. అంటే పబ్లిక్ కంపెనీలు 22%, ప్రైవేట్ కంపెనీలు 11% మేరకు రష్యా చమురు దిగుమతుల్ని తగ్గించుకోబోతున్నాయి. అమెరికా అమలు చేస్తున్న టారిఫ్ ఒత్తిడి భారత ప్రభుత్వం పైన పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఈ తగ్గింపు ఎంత కాలం కొనసాగుతుంది అన్న అంశాన్ని బట్టి అమెరికా ఒత్తిడి పని చేస్తున్నాదా లేదా అన్న విషయంలో ఒక నిర్ధిష్ట అవగాహనకు రావచ్చు.
పనిష్మెంట్?
ఇండియాపై విధించిన భారీ టారిఫ్ ల వెనుక అమెరికాకు ఉన్న ప్రధాన లక్ష్యం ఏమై ఉంటుంది? రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవటం వల్లనే పనిష్మెంట్ గా ఇండియాపై అదనంగా 25% టారిఫ్ విధించామని అమెరికా చెబుతుండగా, ఇండియా స్పందన కూడా అమెరికా చెబుతున్న కారణాలను ఆమోదించినట్లుగా కనిపిస్తున్నది.
కానీ అసలు కారణం, రష్యా నుండి ఇండియా చమురు దిగుమతి కాదు. అదే కారణం అయితే చైనా పైన ఇంకా భారీ సుంకాలు అమెరికా విధించాలి.
అదీ కాక రష్యా చమురు దిగుమతి చేసుకోవాలని ఇండియాకు చెప్పింది అమెరికాయే. ఉక్రెయిన్ యుద్ధం మొదలయిన 2022 ఫిబ్రవరి వరకు ఇండియా దిగుమతి చేసుకున్న రష్యన్ చమురు అతి తక్కువ. యుద్ధం నేపధ్యంలో ఐరోపా, అమెరికాలు రష్యన్ చమురు వాణిజ్యం పైన భారీ ఆంక్షలు ప్రకటించటం వలన అంతర్జాతీయంగా చమురు ధరలు తీవ్ర ఒత్తిడికి గురై చమురు ధరల్లో అనిశ్చిత పరిస్ధితి ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఈ అనిశ్చిత పరిస్ధితి నుండి అంతర్జాతీయ చమురు మార్కెట్ ను తప్పించేందుకు రష్యా చమురు దిగుమతి చేయాలని ఇండియాను, అమెరికా కోరింది.
అంతే కాదు. ముడి చమురు దిగుమతిని దిగుమతి చేసుకున్న భారత రిఫనరీ కంపెనీలు, దాన్ని రిఫైన్ చేసిన అనంతరం, అమెరికా ఐరోపా రాజ్యాలు ఇండియా నుండి మారు బేరానికి రిఫైన్ చేసిన పెట్రోలియం, ఇతర చమురు ఉత్పత్తులు కొనుగోలు చేశాయి. తద్వారా చమురు ధరల అనిశ్చిత పరిస్ధితి నుండి అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కంపెనీలు నష్టాలు ఎదుర్కోకుండా తప్పించుకున్నాయి.
వాణిజ్య చర్చలు
రెండో సారి పదవి చేపట్టిన వెంటనే, జనవరిలోనే ఇండియా, చైనాలతో పాటు ఇతర దేశాలన్నింటి పైనా భారీ టారిఫ్ విధించబోతున్నానని, అనేక దేశాలు అమెరికాతో వాణిజ్యం చేస్తూ వాణిజ్య మిగులు పోగు చేస్తున్నాయని, ఇలా జరగటానికి వీలు లేదని, ట్రేడ్ బ్యాలన్స్ ఉండాలని, 2025 ఆరంభం నుండి డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో భారత మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో భారత వాణిజ్య బృందం అమెరికా వెళ్ళి అనేక రోజుల పాటు వాణిజ్య చర్చలు జరిపింది. ఈ చర్చల ద్వారా ఇండియాకు మరిన్ని ఎగుమతులు చేయటానికి అమెరికా ప్రతిపాదించింది. ముఖ్యంగా టెక్స్ టైల్స్, రెడీ మేడ్ దుస్తులు, డెయిరీ రంగం, వ్యవసాయ రంగం… వీటిల్లో అమెరికా కంపెనీల సరుకులకు అవకాశం ఇవ్వాలని అమెరికా ఒత్తిడి తెచ్చింది.
కానీ ఈ రంగాలు భారత దేశంలో ఏ పార్టీకైనా అత్యంత సున్నితమైన అంశాలు. వ్యవసాయ దిగుమతులకు ఒప్పుకుంటే కోట్లాది రైతాంగం నుండి వ్యతిరేకతను ప్రధాని మోడి ఎదుర్కోవాలి. భారత దేశ పల్లెల్లో కోట్లాది కుటుంబాల్లో స్త్రీలు గేదెలు, ఆవులు మేపుతూ అవి ఇచ్చే పాలతో వ్యాపారం చేస్తూ ఇళ్లు గదుపుకుంటున్నారు. డెయిరీ రంగంలో అమెరికా కంపెనీలు ప్రవేశిస్తే ఈ కుటుంబాల జీవనోపాధి దెబ్బ తిని ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ప్రబలుతుంది. ఈ నేపధ్యంలో ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరకుండానే భారత బృందం వెనక్కి వచ్చేసింది.
ఇండియాపై అమెరికా ఆగ్రహానికి ఇదే కారణం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇండియాతో వాణిజ్య లోటు తగ్గించుకోవాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం ఇండియా రద్దు చేసిందని అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం. ఈ పరిస్ధితి నుండే డొనాల్డ్ ట్రంప్ అదనంగా, రష్యా చమురు దిగుమతిని సాకుగా చూపిస్తూ పనిష్మెంట్ పేరుతో మరో 25% టారిఫ్ ప్రకటించాడు.
నిజానికి ఇండియాతో అమెరికాకు వాణిజ్య లోటు, ఇండియాకు వాణిజ్య మిగులు ఉంటేనే అమెరికాకు ఉపయోగం. ఇండియాకు కూడా అదే ఉపయోగం. వాణిజ్య మిగులు ద్వారా ఇండియా వద్ద అంతర్జాతీయ మారక ద్రవ్యంగా చెలామణిలో ఉన్న డాలర్ నిల్వలు సమకూరుతాయి. ఇండియా చమురు కొనుగోలు చేయాలంటే అంతర్జాతీయ మారక ద్రవ్యాన్నే చెల్లించాలి కాబట్టి ఇండియా, అమెరికన్ డాలర్లను సమకూర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. లేనట్లయితే ఇండియాకు డాలర్లు ఎక్కడి నుండి వస్తాయి?
ఇండియా లాగే ఇతర దేశాల పరిస్ధితి కూడా. అమెరికాతో వాణిజ్య మిగులు ద్వారా ఇతర దిగుమతులను ప్రపంచ దేశాలు డాలర్లతో కొనుగోలు చేయగలుగుతున్నాయి. డాలర్ల నిల్వలు అడుగంటితే చెల్లింపుల సమతూకంలో సంక్షోభం (balance of payment crisis) ఏర్పడి అనేక దేశాలు సంక్షోభంలో జారుకుంటాయి. ఇది అమెరికా కు కూడా మంచిది కాదు.
ఇవేవీ పట్టించుకోకుండా అమెరికా వాణిజ్య లోటు తగ్గించాలన్న ఏకైక లక్ష్యంతో అమెరికా అనుకూల వాణిజ్య షరతులను ప్రపంచ దేశాలపై అమలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి, మొండిగా, ఆధిపత్య ధోరణితో, అహంభావ పూరితంగా వ్యవహరిస్తున్నాడు.
అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్నట్లు పైకి ప్రకటిస్తున్న భారత పాలకులు వాస్తవంలో మాత్రం రష్యా చమురు దిగుమతి క్రమంగా తగ్గించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇది అవాంఛనీయం. పైకి ఒకటి చెబుతూ వాస్తవంలో అందుకు విరుద్ధమైన విధానాలు అమలు చేయటం వలన ప్రజల ప్రయోజనాలు దెబ్బ తింటాయి.
ఎందుకంటే రష్యా చమురు దిగుమతి ఆపేస్తే లేదా తగ్గించుకుంటే ఆ ఖాళీని అమెరికా చమురుతో భర్తీ చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. అమెరికా చమురు బాగా ఖరీదైనది. దాని వలన మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు వేగంగా హరించుకుపోతాయి. మరో పక్క తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా వచ్చే మిగులు అంతర్ధానం అవుతుంది.
ఇంతకీ రష్యా చమురు దిగుమతి విషయంలో మోడి ప్రభుత్వం వాస్తవ విధానం ఏమిటి? వాస్తవ విధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా?
సోషల్ , ప్రింట్ మీడియా ల ను ఉపయోగించి ప్రజలకు అబద్దాలు చెబుతూ, అమెరికా ( కంపెనీల) ఒత్తిడికి తలవంచడం హిందుత్వ దళారీ పాలకుల నైజం!