సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణకు ఇండియా, చైనా అంగీకారం!


Nathu-La pass

ఇండియా, చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించటానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల వాణిజ్యం అనేక శతాబ్దాలుగా, ప్రధానంగా లెజెండరీ స్థాయి సంపాదించిన సిల్క్ రోడ్ ద్వారా కొనసాగుతూ వస్తున్నది.

మోడి ప్రభుత్వం హయాంలో వరుస పెట్టి ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వద్ద అనేక హింసాత్మక ఘర్షణలు చెలరేగిన దరిమిలా సరిహద్దు వాణిజ్యం నిలిపివేయబడింది. ఇప్పుడు ఆ వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తున్నారు. కోవిడ్ 19 వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిందని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఎంత ఉన్నదో అనుమానమే.

ఇరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం ప్రధానంగా మూడు రూట్ల ద్వారా జరుగుతూ వచ్చింది. లిపులేఖ్ పాస్, షిప్కి-లా పాస్, నాథు-లా పాస్. ఈ మూడు రూట్లను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల విధేశాంగ మంత్రుల మధ్య అంగీకారం కుదిరింది.

జులై నెలలో భారత విదేశీ మంత్రి జైశంకర్ చైనాను సందర్శించగా, ఆగస్టు నెలలో చైనా విదేశీ మంత్రి వాంగ్ యీ ఇండియా సందర్శించాడు. వాంగ్ యీ సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తున్నది.

భారత దిగుమతుల పైన 50% పైగా వాణిజ్య సుంకాలు విధిస్తామని, అవి ఆగస్టు 27 నుండి అమలులోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన నేపధ్యంలో ఇండియా అనివార్యంగా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసిన అవసరం వచ్చి పడింది.

మోడి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియా, అంత్యంత దూకుడుగా అమెరికా అనుకూల వైఖరిని, చైనా వ్యతిరేక వైఖరిని అవలంబించటం ప్రారంభించింది. చివరికి డొనాల్డ్ ట్రంప్ తరపున, భారత ప్రధాన మంత్రే నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వరకు ఈ వైఖరి వెళ్లింది. కానీ మోడి పట్ల కృతజ్ఞత తో ఉండవలసిన డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞత మాట అటుంచి, కనీస మిత్ర వైఖరి కూడా కాకుండా శత్రువైఖరి అవలంబించడం మొదలు పెట్టాడు.

రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ శత్రు వైఖరి అవధులు దాటింది. ఇండియాను నేరుగా పేరు పెట్టి దూషించటం మొదలు పెట్టాడు. అమెరికా వాణిజ్య మంత్రి, ఇతర విదేశాంగ శాఖ అధికారులైతే ఇండియా స్వార్ధంతో వ్యవహరిస్తున్నదని, రష్యాతో చమురు వాణిజ్యం ద్వారా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నదని తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తున్నారు. గత రెండు రోజుల్లో కూడా ఈ ఆరోపణలను అమెరికా అధికారులు చేశారు.

ఇండియాను టారిఫ్ కింగ్ గా ప్రకటించటమే కాకుండా అమెరికా సరుకులపై టారిఫ్ విధించినందుకు ప్రతీకారంగా 25 శాతం టారిఫ్, రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు మరో 25% టారిఫ్ ఇండియా దిగుమతులపై ట్రంప్ ప్రకటించాడు. ఇంకా ప్రకటించని అపరాధ టారిఫ్ కూడా ఈ 50 శాతం తో జత చేస్తామని చెప్పాడు.

దానితో మోడి అర్జెంటుగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు పంపాడు. ఆ తర్వాత చైనా, రష్యా లకు విదేశీ మంత్రి జై శంకర్ ను పంపాడు. దరిమిలా ఇండియాకు సంపూర్ణ మద్దతు అందజేస్తున్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ లు ప్రకటనలు జారీ చేశారు.

వాణిజ్య పునరుద్ధరణ వార్త కొద్ది రోజుల క్రితమే వెలువడింది. అయితే ఈ రోజు కొత్తగా హిమాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి మరో ప్రకటన వెలువడింది. షిప్కి లా రూట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. “చైనాతో వాణిజ్యాన్ని షిప్కి లా పాస్ ద్వారా పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్య పునరుద్ధరణకు చైనా-ఇండియా మధ్య అంగీకారం కుదిరినట్లు విదేశీ మంత్రి ఎస్. జై శంకర్ నుండి తమకు వర్తమానం వచ్చిందని హిమాచల్ ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేయటంతో ఈ వార్తకు మరోసారి ప్రాముఖ్యత ఏర్పడింది.

షిప్కి లా పాస్ రూటు, హిమాచల ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉండగా, లిపులేఖ్ పాస్ రూటు ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్నది. కాగా నాథు లా పాస్ రూటు సిక్కిం రాష్ట్ర సరిహద్దులో ఉన్నది.

Shipki-La pass

“కిన్నౌర్ జిల్లా లోని షిప్కి లా పాస్ ద్వారా వాణిజ్యం పునరుద్ధరించటానికి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు స్థిరంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అయ్యాయి. కేంద్రం అధికారికంగా ఈ అంశాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లి ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది” అని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొన్నది.

నాధు లా పాస్, లిపులేఖ్ పాస్ ల ద్వారా ఇప్పటికే వాణిజ్యం జరుగుతుండగా షిప్కి లా పాస్ రూట్ ను కూడా పునరుద్ధరించేందుకు తాజాగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తున్నది.

షిప్కి లా పాస్ రూటు ఒకప్పటి చారిత్రక సిల్క్ రోడ్ రూట్ లో భాగం అన్నది గమనార్హం. షిప్కి లా, సరిహద్దు వాణిజ్య పాయింట్ గా 1994 లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో ఇరు దేశాలు గుర్తించాయి. అప్పటి నుండి ఇది ముఖ్యమైన రూట్ గా కొనసాగుతూ వచ్చింది.

వాణిజ్యం తో పాటు టిబెట్ ద్వారా మానస సరోవర్ యాత్ర ను పునరుద్ధరించేందుకు కూడా ఇరు దేశాలు అంగీకరించాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు విదేశీ మంత్రి వర్తమానం పంపారని తెలుస్తున్నది.

వాణిజ్యం, మానస్ సరోవర్ యాత్ర లతో పాటు టూరిజం, పరస్పర సాంస్కృతిక మార్పిడి, ఆర్ధిక అభివృద్ధి కూడా త్వరలో సాధ్యం అవుతాయని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన చెప్పటం విశేషం.

బిజెపి-మోడి హయాంలో చైనా ఒక శత్రు దేశంగా ఇప్పటి వరకు భారత ప్రజలకు చెబుతూ వచ్చారు. ఆ మేరకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల కేడర్ తో పాటు బిజెపి అభిమాన గణాలు చైనా పట్ల విపరీతమైన విద్వేషాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ వచ్చారు.

కానీ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అసలు రంగును అరమరికలు లేకుండా బైట పెట్టడంతో ఈ విద్వేష గణాలకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. నిన్నటి వరకు చైనా వ్యతిరేక విద్వేషాన్ని పెంచి పోషించటంలో మోడి ప్రభుత్వ విధానాలే కారణంగా నిలిచాయి.

ఉదాహరణకి చైనాకు వ్యతిరేకంగా పసిఫిక్ మహా సముద్రంలో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి అమెరికా క్వాడ్ కూటమిని ఏర్పాటు చేస్తే, భారత ప్రభుత్వం సగర్వంగా అందులో భాగస్వామి అయింది.

అమెరికా రెచ్చగొట్టడంతో రెచ్చిపోయి దక్షిణ చైనా సముద్రంలో భారత నౌకలను “స్వేచ్ఛా సముద్ర యానం” పేరుతో యధేచ్చగా తిప్పారు. చైనా ఖండించినప్పటికీ భారత ప్రభుత్వం లెక్క చేయలేదు.

చైనాకు చెందిన హ్వువావీ లాంటి భారీ ఎలక్ట్రానిక్ కంపెనీల నుండి ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి కాకుండా ఇండియా నిషేధం విధించింది. ఈ పరికరాల ద్వారా ఇండియాపై చైనా నిఘా పెడుతున్నదని అమెరికా నూరిపోయడంతో ఇండియా చైనా ఎలక్ట్రానిక్ దిగుమతుల పై నిషేధ విధించింది. ఇప్పుడేమో ఈ నిషేధంలో చాలా అంశాలను ఇండియా మెల్లగా ఎత్తివేస్తున్నదని పత్రికల ద్వారా తెలుస్తున్నది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అన్నమాట!

భారత ప్రయోజనాలను కాకుండా అమెరికా లాంటి సామ్రాజ్యవాద రాజ్యాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు సిద్ధపడితే ఇలాంటి పరిణామాలను భారతదేశం ఎదుర్కొక తప్పని పరిస్ధితి ఏర్పడుతుంది.

మునుముందు ఇండియా-చైనా, ఇండియా-రష్యా, ఇండియా-అమెరికా, ఇండియా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఏర్పడనున్న ద్వైపాక్షిక పరిణామాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి.

4 thoughts on “సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణకు ఇండియా, చైనా అంగీకారం!

  1. What is meant by “RSS ఘనం”?

    Maybe its a typo.

    RSS should tell it’s opinion on the changed stance of Modi govt.

    And I don’t think RSS may have any objection on it as long as it’s Hindutva interests are served.

    There were many RSS supporters in Congress party also.

    Now large part of them migrated to BJP, but still there are some RSS elements in Congress party.

    This tells us that RSS actually do not subscribe to anti-MNC or anti-FDI sentiments though it says so in public.

    RSS never fought against British occupation of India. Only thing is it wants to resurrect age old Hindu fundamentalist and feudalistic society in India that existed before British rule.

వ్యాఖ్యానించండి