బిజెపి గెలవటానికి ఇతర రాష్ట్రాల నుండి వోటర్లను తరలించాం -బిజెపి


బిజెపి గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందో ఆ పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడి చేశాడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కి చెందిన సురేశ్ గోపి (సినీ నటుడు) త్రిస్సూర్ నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. సురేశ్ గోపి ని గెలిపించటానికి తాము ఇతర రాష్ట్రాల నుండి ఓటర్లను త్రిస్సూరు పార్లమెంటు నియోజక వర్గానికి తరలించామని కేరళ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాల కృష్ణన్ వెల్లడి చేశాడు. తాము చేసిందాంట్లో తప్పు లేదని కూడా ఆయన తమ చర్యను సమర్ధించుకోవటం విశేషం.

“మేము గెలవాలని భావించిన పార్లమెంటరీ నియోజకవర్గం లోకి మేము ఇతర రాష్ట్రాల నుండి ఓటర్లను తరలించాము. చివరికి జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం నుండి కూడా ఓటర్లను తరలించాం. కనీసం ఒక సంవత్సరం ముందుగా వారిని మేము గెలవాలనుకున్న చోటకి తరలించి వారు అక్కడ సెటిల్ అయ్యేలా చూస్తాము. వాళ్లు ఓటింగ్ ప్రాసెస్ లో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో అనుమానం ఏమీ లేదు. భవిష్యత్తులో కూడా మేము ఇది చేసి తీరతాం” అని కేరళ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాల కృష్ణన్ తడుము కోకుండా చెప్పేశాడు.

ఐతే బిజెపికి ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఓటర్లు ఎక్కడ సెటిల్ అయ్యారని బిజెపి నాయకుడు చెప్పాడో అక్కడ నివసించే స్థానికులు అలాంటి ఓటర్లు ఎవరూ తమ లోకాలిటీ లేరని చెప్పటం విశేషం. అంటే బిజెపి నాయకుడు చెప్పినట్లు ఇతర రాష్ట్రాల నుండి కేరళకు ఒక సం. ముందుగానే వచ్చి సెటిల్ అవటం కాకుండా, ఎన్నికల కోసమే అక్కడికి వచ్చారని, వారు ఎలాంటి అడ్డంకులు లేకుండా త్రిస్సూర్ నియోజక వర్గంలో ఓటు వేసేలా వారి కోసం ముందే ఓటర్ల జాబితా సవరించి పెట్టారని భావించ వలసి వస్తున్నది.

అదే విషయాన్ని విలేఖరులు బిజెపి నాయకుడి దృష్టికి తెచ్చి ప్రశ్నించారు. కానీ స్థానికులు చెప్పింది నిజం కాదని ఆయన కొట్టి పదేశాడు. “కొన్ని చోట్ల స్థానికులు అపార్ధం చేసుకుని ఉండవచ్చు. అలాంటి కేసులు ఏవో కొన్ని తప్ప పెద్ద సంఖ్యలో ఉండవు” అని ఆయన తమ చర్యను సమర్ధించు కున్నాడు. బైట వాళ్ళెవరూ తమ ప్రాంతంలో వచ్చి సెటిల్ అయి ఓటింగ్ లో పాల్గొన లేదని స్థానికులు చెప్పిన నిజాన్ని ఆయన కొట్టిపారేశాడు.

స్థానికులు చెప్పింది నిజమే అయినట్లయితే బిజెపి కేరళ లోని త్రిస్సూరు పార్లమెంటు నియోజక వర్గంలో అక్రమ పోలింగ్ కి పాల్పడటం ద్వారా సినీ నటుడు సురేశ్ గోపి ని గెలిపించుకున్నారని భావించ వచ్చు. లేదా బోగస్ ఓటింగ్ కు (స్థానికంగా నివాసితులు కానీ వాళ్లు బోగస్ ఓటింగ్ హక్కు సంపాదించి ఓటు వేయటం) పాల్పడటం ద్వారా బిజెపి తమ అభ్యర్ధి గెలిచే లాగున అక్రమానికి పాల్పడింది.

అయితే బిజెపి నాయకుడు తాము బోగస్ ఓటింగ్ కు పాల్పడలేదని స్మర్ధించుకున్నాడు. “బోగస్ ఓటింగ్ అంటే చని పోయిన వ్యక్తి స్థానంలో ఓటు వేయటం గానీ లేదా ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటు వేయటం. అలాంటి పనికి మేము పాల్పడలేదు” అని బిజెపి నేత చెప్పుకొచ్చాడు.

ఇంకో కొత్త అర్ధాన్ని కూడా బిజెపి నేత చెప్పుకొచ్చాడు. “యుడిఎఫ్, ఎల్.డి.ఎఫ్ కూటములు, బిజెపి ని ఓడించడానికి ఒకదానితో ఒకటి కుమ్మక్కు అయ్యాయి. వాళ్లు కుమ్మక్కు కావటంలో అనైతికత లేనట్లయితే మేము చేసినదానిలో కూడా అనైతికత ఏమీ లేదు” అని తమ చర్యను వెనకేసుకొచ్చాడు.

బిజెపి కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం టి రమేశ్ కూడా తమ అక్రమాలను సమర్ధించుకున్నాడు. “చట్టం ప్రకారం ఏ పౌరుడైనా ఒక చోట 6 నెలల కంటే ఎక్కువ కాలం నివసించినట్లయితే ఆ పౌరుడు అక్కడ ఓటు వేయవచ్చు. ఆరు నెలల నివాస ధృవీకరణ ద్వారా పౌరుడు ఎక్కడైనా ఓటు వేయవచ్చు. ఇది కాశ్మీర్ కి కూడా వర్తిస్తుంది. త్రిస్సూరు లో త్రిస్సూరు నివాసులు మాత్రమే ఓటు వేశారు. సి.పి.ఏం, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే బూటకపు వోట్లు వేశారు తప్ప బిజెపి కాదు” అని ఆయన అన్నాడు.

ఇతర రాష్ట్రాల నుండి ఒక యేడాది ముందే త్రిస్సూరు పార్లమెంటరీ నియోజక వర్గానికి ఓటర్లను బిజెపి పార్టీ తరలించింది. ఇది మొదటి వాస్తవం. ఈ సంగతి బిజెపి నాయకుడే ఒప్పుకున్నాడు గనక ఈ విషయంలో తగాదా లేదు. అలా సెటిల్ అయిన వాళ్లు బిజెపి కి ఓటు వేశారు తప్ప ఇతర పార్టీలకు వేయలేదు. ఈ సంగతి కూడా బిజెపి నాయకుడే ఒప్పుకున్నాడు.

కానీ ఒక లోకాలిటీలో కొత్త ఓటర్లు వచ్చి స్థిరపడి ఓటు వేసినట్లయితే ఆ చిరునామా లో ఉన్నవారికి ఆ కొత్త ఓటర్ల సంగతి తెలుస్తుంది. కానీ త్రిస్సూరు లోని ఆయా ప్రాంతాల్లో కొత్త వోటర్లు ఏ అడ్రస్ నుండైతే ఓటు వేశారని బిజెపి చెప్పిందో ఆ అడ్రస్ లోని వాళ్లు అక్కడ నుండి కొత్త వాళ్లు ఎవరూ ఓటు వెయ్యలేదని స్పష్టం చేశారు. స్థానికులకు తెలియని వోటర్లు, బైటి రాష్ట్రాల నుండి బిజెపి తరలించిన వోటర్లు ఏ విధంగా త్రిస్సూరులో ఓటు వేసి ఉంటారు?

ఖచ్చితంగా వాళ్లు బోగస్ ఓటర్లే అయి ఉండాలి. ఎందుకంటే స్థానికులు స్వయంగా అలాంటి ఓటర్లు లేరని చెబుతున్నారు గనుక. బిజెపి నాయకుడు కూడా “అబ్బే వాళ్లు అపార్ధం చేసుకుని ఉంటారు” అంటున్నాడు తప్పితే “మేము రుజువు చేస్తాం. ఫలానా ఓటర్ ఫలానా అడ్రస్ లో ఇతర రాష్ట్రం నుండి వచ్చి నివసిస్తున్నాడు. కావాలంటే విచారించండి” అని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు.

కనుక ఓటర్ల జాబితాలో అక్రమంగా అదనపు పేర్లను చేర్చి ఆ పేర్లతో ఇతర రాష్ట్రాల నుండి బిజెపి తరలించిన ఓటర్లు త్రిస్సూరు నియోజక వర్గంలో బిజెపి అభ్యర్ధి సురేశ్ గోపి కి ఓటు వేయటం వలన ఆయన అక్కడ విజయం సాధించినట్లు అనుమానించ వలసి వస్తున్నది.

త్రిస్సూరు నియోజక వర్గంలో 2019-2024 మధ్య ఏకంగా 1,46,656 వోటర్లు అదనంగా ఓటర్ల జాబితా లో కలిశారని, ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు కలవటం స్థానిక జనాభా పెరుగుదల ధోరణి కి పూర్తి భిన్నంగా ఉన్నదని, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ద్వారా కేరళలో తమ అభ్యర్ధి సురేశ్ గోపి ని బిజెపి గెలిపించుకున్నదని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు గత యేడాదిగా ఆరోపిస్తున్నాయి కూడా. ఈ ప్రాంతంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అలాంటిది ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు పెరగడం ఏమిటని వారి ప్రశ్న. బిజెపి నేతల ఒప్పుకోలు ద్వారా వారి ఆరోపణలు వాస్తవమన్న అనుమానాలు బలపడ్డాయి.

బిజెపి అక్రమ ఓటింగ్ ద్వారా విజయాలు సాధించింది అని చెప్పటానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఏం కావాలి? స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్!

వ్యాఖ్యానించండి