ఇండియాలో అమెరికా పోస్టల్ సేవల సస్పెన్షన్


ఇండియా నుండి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా, ఆగస్టు 27 తేదీ నుండి 50% పైగా కస్టమ్స్ సుంకాలు అమెరికా ప్రకటించిన నేపధ్యంలో అమెరికాకు వెళ్ళే పోస్టల్ సేవలను భారత ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

సస్పెన్షన్ తాత్కాలికం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సస్పెన్షన్ ఆగస్టు 25 తేదీ నుండి అనగా రేపు సోమవారం నుండి అమలు లోకి రానున్నట్లు ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది.

ఇప్పటి వరకు భారత సరుకులను అమెరికా తన కస్టమ్ సుంకాల నుండి మినహాయించింది. అందులో భాగంగా పోస్టల్ సేవల ద్వారా ఇండియా నుండి అమెరికా వెళ్ళే వివిధ సరుకుల పైన జీరో కస్టమ్స్ సుంకాలు ఉండేవి. భారత సరుకులపై కస్టమ్స్ సుంకాలను అమెరికా పెంచిన నేపధ్యంలో ఆగస్టు 27 నుండి ఈ మినహాయింపు రద్దు కానుంది.

ఈ మేరకు అమెరికా ప్రభుత్వం జులై 30 తేదీనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324 జారీ చేసింది. ఇప్పటి వరకు పోస్టు ద్వారా వచ్చే 800 అమెరికన్ డాలర్ల లోపు ఖరీదు చేసే భారత సరుకులను సుంకాల నుండి అమెరికా మినహాయించగా ఇప్పుడు అది రద్దవుతుంది.

ఈ నేపధ్యంలో ఆగస్టు 25 నుండి అమెరికాకు వెళ్ళే పోస్టల్ సర్వీసుల ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఆ విధంగా 50 శాతం సుంకాలను పోస్టల్ సర్వీసులు ఎదుర్కోకుండా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకుంది.

ఈ మేరకు భారత పోస్ట్ ఆఫీస్ విభాగం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా కస్టమ్స్ నిబంధనలు ఆగస్టు 27 నుండి మారనున్న నేపధ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పోస్టల్ శాఖ ప్రకటించింది.

అమెరికా కొత్త కస్టమ్స్ నిబంధనలను ఆగస్టు 15 తేదీన ప్రకటించింది. దానితో అంతర్జాతీయ విమాన కేరియర్ కంపెనీలు తాము ఆగస్టు 25 నుండి ఇండియా నుండి వచ్చే కన్సైన్ మెంట్ లను అంగీకరించలేమని భారత పోస్టల్ అధికారులకు వర్తమానం పంపారు.

అమెరికా ఇచ్చిన జీరో సుంకం రాయితీలను భారత పోస్టల్ సేవలు దుర్వినియోగం చేశాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఆరోపించడం గమనార్హం.

రాయితీ పోస్టల్ సర్వీసుల ద్వారా అక్రమ ఫెంటనిల్ మరియు ఇతర సింధటిక్ ఓపియాయిడ్ (కృత్రిమ మత్తు పదార్ధాలు), ఓపియాయిడ్ ల తయారీకి వినియోగించే ఇతర పదార్ధాలను అమెరికాకు తరలించబడ్డాయని వైట్ హౌస్ ఆరోపించింది. రాయితీ పోస్టల్ సేవల ద్వారా పంపే సరుకులపై తక్కువ స్థాయి భద్రతా ప్రమాణాలు అమలు చేస్తారని, వాటిని వినియోగించుకుని మత్తు పదార్ధాలను అమెరికాకు సరఫరా చేసి తద్వారా అమెరికన్ల ప్రాణాలు హరిస్తున్నారని వైట్ హౌస్ ఆరోపించింది.

ఈ చర్యతో తక్కువ ధరల సరుకుల రవాణా పైన ఆధారపడ్డ చిన్న భారత ఈ-కామర్స్ కంపెనీలు గడ్డు పరిస్ధితి ఎదుర్కొనున్నాయి. కొన్ని కంపెనీలు మూత పడినా ఆశ్చర్యం లేదు.

అమెరికా దురహంకారంతో ప్రకటిస్తున్న టారిఫ్ లు భారత కంపెనీల వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపడం మొదలయింది.

చైనా, రష్యాల వైపు దృష్టి మరల్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ మేరకు రష్యా నుండి ప్రకటనల రూపంలో హామీ లభించింది. కానీ ఈ హామీలు ఎంతవరకు ఆచరణ లోకి వస్తాయన్నది చూడవలసి ఉన్నది. అసలు రష్యా, చైనాల సహకారం అమెరికాతో తో ఇండియా వాణిజ్యాన్ని సంపూర్తిగా రీ ప్లేస్ చేయగల స్థాయిలో ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకం.

వ్యాఖ్యానించండి