
మన తండ్రులు తాతలు ఉదయాన్నే లేచి చద్దన్నం తినేవాళ్ళు. మన చేత కూడా తినిపించే వాళ్ళు. పట్టణాల్లో కాదు గానీ పల్లెల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో, పేద-మధ్య తరగతి రైతు కుటుంబాల్లో ఇది ఎక్కువగా జరిగేది.
బహుశా పట్టణాల్లో ఫ్యాక్టరీల కార్మికుల కుటుంబాల్లో కూడా ఇది జరిగి ఉండవచ్చు.
మా అమ్మ నాన్న ఇద్దరూ టీచర్స్. అయినా రాత్రి వండిన అన్నం మిగిలి పోతే ఉదయాన్నే మా చేత చద్దన్నం తినిపించే వాళ్ళు. ముఖ్యంగా వేసవి కాలం వస్తుందంటే చద్దన్నంతో కూడిన ఉదయాల్ని తలుచుకుని నేను టెన్షన్ పడే వాడిని.
పొద్దున్నే చద్దన్నం మిగల్చటానికే రాత్రి పూట ఎక్కువ అన్నం మా అమ్మ వండేదా అన్న అనుమానం ఇప్పుడు వస్తోంది.
చద్దన్నం పట్ల ఉన్న విముఖత వలన “పెద్దల మాట చద్ది మూట!” అన్న సామెత ఎందుకు చెప్పారో అర్ధం అయ్యేది కాదు.
ఎంత టెన్షన్ పడ్డా చద్దన్నం నేను తినను అని చెప్పగల ధైర్యం మా అన్న దమ్ములకు ఉండేది కాదు. అమ్మా, నాన్న ఇద్దరూ టీచర్స్ అని చెప్పా కదా! వారి క్రమ శిక్షణ అలా ఉండేది మరి! వేసవి కాలంలో సెలవులు వచ్చాయన్న సంతోషాన్ని ఈ చద్దన్నం ప్రతి రోజూ హరించి వేసేది.
చద్దన్నం తింటే బలం అని మా అమ్మ, నాన్న చెప్పే వాళ్ళు. కాలేజీ చదువులకి వచ్చాక, మన చేత చద్దన్నం తినిపించటానికే అలా ‘చద్దన్నం తింటే బలం’ అని చెప్పేవారని నేను భావించే వాడిని.
మిగిలి పోయిన అన్నాన్ని పడేయటం ఇష్టం లేక, అన్నం మెతుకు విలువ తెలిసిన వారు అవటం చేత చద్దన్నాన్ని మా (పిల్లల) చేత మాటలు చెప్పి తినిపించే వారని నేను అనుకునే వాడిని.
కానీ అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్యలు చెప్పింది నిజమే అని, ఆ మాటలు సైంటిఫిక్ అని ఇప్పుడు తెలుస్తున్నది.
ఎలాగంటే, చద్దన్నం లో ప్రో బయాటిక్స్ ఉంటాయట! (మేలు చేసే బాక్టీరియా, యీస్ట్ మొ.న వాటిని ప్రొబయాటిక్స్ అంటారు) ఇవి జీర్ణం ప్రక్రియకు ఇతోధికంగా దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇందులో ఉండే మేలు చేసే బాక్టీరియా కడుపు (gut) ఆరోగ్యంగా వుంచుతుందిట.

–
చద్దన్నం వలన ఉపయోగాలు ఇంకా ఇలా వున్నాయి:
- ప్రో బయాటిక్స్ జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి.
- పోషకాలను మన జీర్ణ వ్యవస్థ సమర్ధవంతంగా స్వీకరించి జీర్ణ వ్యవస్థ సమస్య లను, మల బద్ధకం ను, కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి.
- అల్సరేటివ్ కొలైటీస్, డ్యూయోడినల్ అల్సర్స్, సెలియాస్ వ్యాధి, క్రాన్స్ వ్యాధి లాంటి వ్యాధులను మేనేజ్ చెయ్యటానికి, అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి.
- విటమిన్ B12 కలిగి ఉంటుంది. శాకాహారులకు ఇది బాగా ఉపయోగం.
- ఐరన్ లాంటి జీవ పోషకాల అందుబాటు, శోషణ లను సులభ తరం చేస్తాయి.
- పోషక వ్యతిరేక పదార్ధాలను తగ్గించి జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరిస్తాయి.
- సోడియం, పోటాషియం, మెగ్నీషియం, సెలెనియం, లాంటి ఎలెక్ట్రోలైట్లు, క్లోరైడ్ సాల్ట్ లు కలిగి ఉంటుంది. ఇవి రక్తపోటు స్థిరంగా ఉంచేందుకు సహకరిస్తాయి.
- యాంటి ఆక్సిడెంట్ గుణాల వలన కొన్ని చర్మ వ్యాధుల లక్షణాలను మెరుగు పరుస్తాయి.
- పొట్ట ఆరోగ్యం, శరీర మెటబాలిజం లను మెరుగు పరిచి బరువు మెరుగు పడటంలో సహకరిస్తాయి.
- చద్దన్నం లో ఉండే హిస్టమిన్ కొందరికి పడక పోవచ్చు. అలాంటి వారు చద్దన్నం జోలికి పోకపోవటం మంచిది.