
ఆంగ్లం: విజయశేఖర్
అనువాదం: రమాసుందరి
అంగోలా ఇటీవలి కాలంలో ఆర్థిక సంస్కరణలు, సామాజిక కలహాల కూడలిలో చిక్కుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సూచనలతో మొదలైన కఠిన ఆర్థిక (పొదుపు) సంస్కరణల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదరికంతో అలమటిస్తున్న ప్రజలు తమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం మీద ప్రభుత్వం ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించటం అత్యంత విషాదానికి దారితీసింది. 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తదుపరి పరిణామాలు దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో చెరగని మచ్చలను మిగిల్చాయి. పరిపాలన, జవాబుదారీతనం, అలాగే ఆర్థిక పునర్నిర్మాణం కోసం చెల్లిస్తున్న మానవ ప్రాణహానిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి.
అంగోలాకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు – అంతర్జాతీయ ద్రవ్యనిధి
ముడి చమురు, ఖనిజ సంపదతో అలరారే అంగోలా దేశం -ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, ఇంకా అంతర్జాతీయ వస్తువుల ధరల హెచ్చుతగ్గులతో గతకొంతకాలంగా తీవ్రంగా సతమతమైతోంది. విస్తృతమైన సంపద ఉన్నప్పటికీ, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు ఈ దేశంలో అత్యధికంగా ఉన్నాయి.
ఈ పరిస్థితులను నియంత్రించేందుకు, ఇంకా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అంగోలా ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయం కోరింది. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్యనిధితో (IMF) తో ఒక ఒప్పందం కుదిరింది. ‘And along came the spider and its web’ (దానితో బాటు సాలీడు, దాని గూడు వచ్చాయి) అనే సినిమా టైటిల్ లాగా అంతా జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రమేయం వలన కఠిన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. వీటినే పొదుపు విధానాలని పేరు పెట్టారు. వీటిలో ఇంధన, ఆహార సబ్సిడీలపై కోతలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచకుండా ఆపేయడం, సామాజిక ఖర్చులను తగ్గించడం, కొత్త పన్నులను విధించటం వంటి చర్యలు ఉన్నాయి. ఈ విధానాల ఉద్దేశ్యం బడ్జెట్ లోటును తగ్గించి ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావడం. అయితే, సామాన్య అంగోలా ప్రజలకు ఇవి వారి జీవన వ్యయాల పెరుగుదలకు, ప్రభుత్వ సేవల తగ్గుదలకు, సామాజిక భద్రతా క్షీణతకు తోడ్పడ్డాయి.
ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం డీజిల్ పై సబ్సిడీ తొలగించడం. దీని వల్ల డీజిల్ ధర లీటరుకు 300 క్వాంజాస్ నుండి 400 క్వాంజాస్ (అంటే సుమారు 0.33 నుండి 0.44 అమెరికా డాలర్లు)కు పెరిగింది. ఈ పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, ఇంధన ఖర్చులు తడిసి మోపడయ్యాయి. దేశ రాజధాని లువాండాలో 90 శాతం మంది ప్రజలు రోజువారీ ప్రయాణాలకు ‘కాండొంగెయిరో’ (నీలం-తెలుపు మినీబస్ టాక్సీలు)పై ఆధారపడుతున్నారు. ఇలా ఆధారపడుతున్న వారిలో ముఖ్యంగా కార్మికులు, పేదలు -ఈ ఇంధన ధరల పెరుగుదల వల్ల అత్యధికంగా నష్టపోయారు.
విస్ఫోటనం, ప్రజా ఉద్యమం
ఐఎంఎఫ్ పొదుపు విధానాల ప్రభావం అంగోలా సమాజాన్ని అంతర్గతంగా కుదిపేసింది. ముఖ్యంగా పట్టణ పేదలు, యువతలో అసంతృప్తి పేరుకుపోయింది. రోజువారీ బతుకు కఠినతరమైయ్యింది. ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు మితిమీరాయి, నిరుద్యోగం తారస్థాయికి చేరింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు, కార్మిక సంఘాలు, పౌరసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఉద్యమించాయి. వేతన వేటులను వెనక్కు తీసుకోవాలని, న్యాయమైన ఆర్థిక విధానాలను అమలు చేయాలని వీరంతా డిమాండ్ చేశారు. పొదుపు విధానాలను అమలు మొదలు పెట్టిన జులై మొదటివారంలోనే చిన్న స్థాయిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. జూలై 28న, కాండొంగెయిరో డ్రైవర్లు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రజలను సంఘటితం కమ్మని ఢంకా కొట్టి పిలిచింది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యమంలో పాల్గొన్నారు. లువాండాలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ప్రజలు ఆహారం కోసం షాపులపై దండెత్తారు. సాయుధ బలగాలు వీధుల్లో పహారా కాస్తుండటంతో దుకాణాలు, వ్యాపారాలు మూతపడ్డాయి.
ఈ ఘటనలు ఇతర నగరాలకు వ్యాపించాయి. హువాంబో, లుబాంగో, బెంగుయెలా వంటి నగరాల్లో కూడా నిరసనలు రగిలాయి. లుబాంగోలో నిరసన తెలుపుతున్న 16 ఏళ్ల యువకుడిని ఒక పోలీస్ కాల్చి చంపిన ఘటన జరిగింది. అతను అధికార పార్టీ ఎంపీఎల్ఏ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కాల్పులు జరిగాయి. వలసవాద పోర్చుగీస్ పాలన నుండి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎంపీఎల్ఏ పార్టీనే అంగోలాలో అధికారంలో వుంది. (దీని గురించి తరువాత తెలుసుకుందాం)
సామాజిక మీడియా ఈ ఉద్యమానికి శక్తివంతమైన పరికరంగా మారింది. ప్రజలు తమ కష్టగాథలను పంచుకుంటూ రాజధానిలోని, లుబాండాలోనూ, ఇంకా ఇతర ప్రదేశాల్లో కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. ఆందోళన ప్రారంభంలో శాంతియుతంగా సాగింది. ప్రజలు ‘రొట్టె, శాంతి, న్యాయం’ అనే ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించారు. ఐఎంఎఫ్ విధానాలకు, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక టీవీ స్టేషన్లూ, ఏఎఫ్ బీ, బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సామాన్య అంగోలా ప్రజల వేదనను ప్రపంచానికి పరిచయం చేశాయి. వారి బాధలనూ, కటిక ఆకలి వాస్తవాలనూ, పేదరికాన్నీ, పెరిగిన ధరలనూ, నిరుద్యోగాన్నీ ఎత్తి చూపించాయి.
ఆఫ్రికాలో నైజీరియా తరువాత అంగోలా రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. అయితే ఈ ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నవి మాత్రం అమెరికా, యూరప్ దేశాలకు చెందిన బహుళజాతీయ చమురు కంపెనీలే. వీటిలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్, అమెరికా కంపెనీలు ఎక్సాన్ మొబిల్, షెవ్రాన్ లు (ఇవి 180 దేశాల్లో పని చేస్తున్నాయి), ఇటలీకి చెందిన ఎనీ, నార్వేకు చెందిన ఇక్వినోర్ వున్నాయి. ఇవన్నీ అంగోలాలోని తీర ప్రాంతాల వద్ద చమురు తవ్వకాల్లో నిమగ్నమై ఉన్నాయి. విషాదమేమిటంటే, అంగోలాకు చెందిన ప్రభుత్వ చమురు సంస్థ సొనాంగోల్ కూడా ఈ కంపెనీలతో కలిసి చమురు వెదుకులాటనూ, తవ్వకాలను చేపడుతోంది. ఈ పశ్చిమ దేశాల కంపెనీలు పెడుతున్న అధిక ధరల కారణంగా ఇంధన ధరలపై ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తూ వస్తోంది. అలా ఇవ్వటం వలనే సామాన్య ప్రజలు నిత్యావసరవస్తువులను పొందగలుగుతున్నారు.
అంగోలా చమురు సంపద నిజానికి అంగోలా ప్రజలదే కాదని ఈ వాస్తవాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీల లాభాల ఆకలి తీరాక ఈ సంపదలో చివరి తునకలు మాత్రమే ప్రజలకు అందుతున్నాయి. ఇప్పుడు ఐఎంఎఫ్ సూచించిన విధంగా ఆ చివరి తునకలు కూడా ప్రజలకు కాకుండా ఆర్థిక లోటును తగ్గించేందుకు మళ్లించారు. అంటే అంగోలా, దాని ప్రజలు వేరువేరు అని చెబుతున్నారు. వీళ్లు చెబుతున్న ఆర్థిక లోటు అంగోలా చమురు, ఖనిజ వనరులను సామ్రాజ్యవాద దేశాలు అడ్డూ ఆపూ లేకుండా తవ్వటం వలనే వచ్చింది. సామ్రాజ్యవాద దేశాలు చెప్పినట్లుగానే అంగోలా ప్రజల మీద ఐఎంఎఫ్ వ్యవస్థీకృత సర్దుబాటు కార్యక్రమాలను(Structural Adjustment Programs -SAP), పొదుపు విధానాలను నిర్దేశించింది. ఒక దేశపు సంపదను తవ్వించి, దాన్ని మళ్లీ అప్పుగా మార్చించి, ఆ ప్రజలపై మళ్లీ పొదుపు విధానాలను రుద్దటమన్నమాట.
నిరసనలపై విరుచుకుపడిన ప్రభుత్వం – హింస
నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని గుర్తించిన అంగోలా ప్రభుత్వం, ప్రజల ఆవేదనను అర్థం చేసుకునే బదులు పెద్ద ఎత్తున బలాన్ని ఉపయోగించి వాటిని అణచివేయాలని నిర్ణయించింది. భారీగా దళాలను నియమించి, నిరసనకారులను చెదరగొట్టటానికి భాష్ప వాయువు గోళాలనూ, రబ్బరు తూటాలనూ, కొన్ని విషాద ఘటనలలో నేరుగా నిజమైన తూటాలను ప్రయోగించారు. ఇంధన సబ్సిడీల తొలగింపుపై మొదలైన నిరసనలు దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక దుస్థితిపై తిరుగుబాట్లుగా మారాయి. జూలై 28 నుండి 30 వరకు, లువాండా నగరం, ఇంకా ఇతర ప్రాంతాల్లో పోలీసులు తూటాలు ప్రయోగించటంతో 22మంది నిరసనకారులు హతమయ్యారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. 1200 మందిని అరెస్ట్ చేశారు. బలగాల చేతుల్లో ప్రజల ప్రాణనష్టంపై ప్రభుత్వ మంత్రులు ఖేదం వ్యక్తం చేసినప్పటికీ -విధ్వంసం, అల్లర్లు ఎల్లెడలా శాంతి భద్రతల సమస్యను సృష్టించాయని అన్నారు. నేరస్త మూకల కారణంగా నిరసన కార్యక్రమాలు ప్రమాదంగా మారాయని చెబుతూ నిరసనకారుల హత్యలను సమర్ధించుకున్నారు.

ఆ చీకటి రోజున లువాండా చౌరస్తాలో వేలాదిమంది సమీకృతమయ్యారు. అలా ఒకదగ్గర చేరటాన్ని పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రకటించి ఆందోళనకారులపై కాల్పులు ప్రారంభించారు. ఈ విధ్వంసంలో కొందరు కాల్పుల్లో మరణించగా, మరికొందరు పారిపోతూ తొక్కిడిలో చనిపోయారు. ఎందరో గాయపడ్డారు, అరెస్టయ్యారు. ఈ ఘటనపై అంగోలాలోని హక్కుల సంఘాలు, ఇంకా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా స్పందించాయి. వాళ్లు ప్రభుత్వం ప్రయోగించిన అతి బలప్రయోగం మీద స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ స్పందన
ఈ హత్యా వార్తలు అంగోలా అంతటా ఆగ్రహాన్ని రేపాయి. ఈ ఆగ్రహం ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది. దేశమంతటా పలు నగరాల్లో అప్పటికప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా జ్ఞాపక సభలు నిర్వహించారు. హత్యకు గురైన వారి కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయి ఉండగా, ప్రజలు సమాధానం చెప్పమని ప్రభుత్వాన్ని నిలేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ. ప్రభుత్వం తన సొంత ప్రజల సంక్షేమం కంటే ఐఎంఎఫ్ ఆదేశాలకే ప్రాధాన్యతనిచ్చిందని ఆరోపించారు.
అంతర్జాతీయంగా, ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితి, ఆఫ్రికన్ యూనియన్, ఇంకా అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి హక్కుల సంస్థలు స్పందించాయి. ప్రభుత్వం సంయమనం పాటించాలనీ, ప్రజల స్వేచ్ఛను గౌరవించాలనీ, మానవహక్కులను రక్షించాలనీ, జరిగిన హింసకు బాధ్యులైన వారిని శిక్షించాలనీ డిమాండ్ చేశాయి. ఐఎంఎఫ్ కూడా దాని విధానాల ఫలితంగా వచ్చిన సామాజిక దుష్ఫలితాల వలన తీవ్రమైన విమర్శలకు గురైంది. ప్రాణనష్టం విచారకరమనీ, ఆర్థిక సంస్కరణలు ఎప్పుడూ సామాజికంగా బలహీనులైన వారిని పరిరక్షించే విధంగా అమలు జరగాలనీ ప్రకటించాల్సి వచ్చింది. అయితే, అనేకమంది అంగోలా ప్రజలకు ఈ మాటలు ఖాళీ అర్థహీనంగా అనిపించాయి. ఎందుకంటే వాళ్ల కుటుంబ సభ్యులెందరో మరణించారు, జీవితాలు శాశ్వతంగా విచ్ఛిన్నమయ్యాయి.
ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలు
ఈ హింసాకాండ అనంతరం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం అలముకుంది. రాజకీయ ఉద్విగ్నత తారస్థాయికి చేరుకుంది. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత కోల్పోయారు. సామాన్య ప్రజల పోరాటాల నుండి దేశ నాయకత్వం విడిపోవటానికి ప్రతీకగా ఈ ఘటనలను వాళ్లు చూసారు. మార్పు రావాలని కోరుతూ కార్మిక సమూహాలు, ఇంకా పోరాటంలో ఉన్న ఇతర ప్రజలు తమ పిలుపులను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ అధికారగణం మాత్రం శాంతిభద్రతల మీది దృష్టి పెట్టి, విదేశీ పెట్టుబడిదారులకు పూల దారులు పరిచింది.
ఈ ఘటనల తరువాత
· రాజకీయ, చట్టపరమైన పరిణామాలు: కాల్పులు జరిగిన కొన్ని వారాల తరువాత ప్రతిపక్షాలు పార్లమెంటరీ విచారణ డిమాండు చేశాయి. బాధితులకు న్యాయం జరగాలని కోరాయి. విచారణ కోసం కొంతమంది అధికారులను నియమించారు. అయితే ఈ ప్రయత్నాలలో ఉన్న నిష్పక్షపాతం, సమగ్రతల గురించి సందేహాలు వుంటూనే వున్నాయి. పారదర్శకత, ప్రజల పర్యవేక్షణలో సైనిక బలగాలు ఉండాలనే డిమాండ్లు తీవ్రం అయ్యాయి.
· ఆర్థిక ప్రభావం: నిరసనోద్యమాలు, తదుపరి హింస -ప్రభుత్వ సంస్కరణల ఎజెండా బలహీనతను ఎత్తి చూపాయి. ఆర్థిక అభివృద్ధి సూచికలు కిందకు చూపించటంతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. ఐఎంఎఫ్ పొదుపు విధానాల అమలు కొనసాగుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగింది. దానివలన తదుపరి రోజులలో చెదురుమదురుగా నిరసనలు, సమ్మెలు చెలరేగాయి.
· సామాజిక ప్రతిస్పందన: ఈ దుర్ఘటన పాలక వర్గాల పట్ల భ్రమలు తొలిగిన కొత్త తరం ఉద్యమకారులు తయారవడానికి సహాయపడింది. ఒకరికొకరు సహాయం చేసుకొనే నెట్వర్కులు, పునాదివర్గాల ఉద్యమాలు బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాయి. వ్యవస్థ మార్పుకు దోహదపడ్డాయి. కళా రంగం, స్వతంత్ర మీడియా -వారి కథనాల ద్వారా చనిపోయినవారిని స్మరించుకోవడంలోనూ, ప్రజల స్మృతులలో వారిని సజీవంగా నిలబెట్టటంలోనూ కీలక పాత్రను నిర్వహిస్తున్నాయి.
పాశ్చాత్య దోపిడి ఏజెంట్లు
ఐఎంఎఫ్, వరల్డ్‌బ్యాంకులను బ్రెటన్‌వుడ్ అక్కాచెల్లెళ్లని అంటుంటారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పేద దేశాలకూ, వాళ్ల ప్రజలకూ రక్షకులుగా తమకు తాము చెప్పుకొంటాయివి. కానీ వాస్తవంగా వాటి కార్యకలాపాలు పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాల (అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ) ప్రయోజనాల కోసం ఈ దేశాలను అణచివేస్తాయని చరిత్ర చరిత్వచరణంగా చెబుతోంది. అంగోలా ఇటీవల అనుభవమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అంగోలా ప్రజల బాధాతప్త ప్రయాణం నిరసనోద్యమంగా బద్దలవటాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది.
ఐఎంఎఫ్ ఒత్తిడి వల్ల, అంగోలా ప్రభుత్వం 2023లో నుంచి ఇంధన సబ్సిడీలను తగ్గించడం ప్రారంభించింది. 2023లో సబ్సిడీలు తగ్గటం మొదలుపెట్టి, 2024 వరకూ కొనసాగాయి. 2023 జూన్ లో పెట్రోల్ ధరలు 87 శాతం పెరిగాయి. 2024 ఏప్రిల్ లో డీజిల్ ధరలు 48 శాతం పెరిగాయి. బడ్జెట్టు లోటును తగ్గించటానికి 2025 చివరికల్లా అన్ని సబ్సిడీలు తొలగించి, అప్పులు తీర్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటికి దేశం అప్పు మొత్తం 58 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండింది. అది దేశపు జీడీపీలో 63 శాతం.
ఆర్థిక క్రమశిక్షణ పేరిట పొదుపు విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలుపరచడానికి ఐఎంఎఫ్ కు ఒకే నమూనా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు సహాయం పేరిట ఈ నమూనాను అమలు చేస్తుంది. 1990లలో ఆసియా టైగర్స్ (ఆగ్నేయ ఆసియా దేశాల) సంక్షోభం, అదే 90లలో భారతదేశపు మిగులు అప్పు చెల్లింపుల సంక్షోభంల, 2007-2008ల మధ్య ప్రపంచ మాంద్యం (పెను మాంద్యం) తరువాత ఐరోపాలో ఋణ సంక్షోభం -ఈ నమూనా అమలుకు కొన్ని ఉదాహరణలు. దక్షిణ ప్రపంచ దేశాలను ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు ప్రభావం కిందకు తీసుకొచ్చిన గాట్ ప్రక్రియ కూడా వ్యవస్థీకృత సర్దుబాటు కార్యక్రమాలతో పాటుగా జరిగింది. ఈ వ్యవస్థీకృత సర్దుబాట్లలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు భాగంగా ఉంటాయి.
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ప్రభుత్వరంగ సంస్థల మూసివేత లక్ష్యంగా ఉంటాయి. ఈ విధానాల వలన దేశీయ అతి చిన్న, చిన్న, మధ్యస్థ కంపెనీలు వాటి సొంత మార్కెట్టులను కోల్పోతాయి. వ్యవసాయంలోనూ, పరిశ్రమలలోనూ స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటానికి రూపొందించిన అంతర్గత నియంత్రణలు రద్దవుతాయి. ఖనిజ, మానవ వనరులను కారుచౌక ధరలకు దోపిడీ చేస్తారు. అంతిమంగా ఈ విధానాలు దక్షిణ ప్రపంచ దేశాలను గ్లోబల్ వాల్యూ చైన్ లో అట్టడుగు స్థానానికి నెడతాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే దేశాలలో పరిశోధనా, అభివృద్ధి (Resarch and Development) రంగాలను కాపాడుతూ, దక్షిణ ప్రపంచ దేశాలను కేవలం మానవ, సహజ వనరుల చౌక సరఫరాదారులుగా మారుస్తాయి.
ఈ విధానాలు వాటంతట అవి మరింత సంక్షోభానికి దారి తీస్తాయి. ఆ సంక్షోభం జరిగినపుడు ఐఎంఎఫ్ ఇంకా కఠిన పొదుపు విధానాలను అమలు చేయాలని నిర్దేశిస్తుంది. కనుచూపు మేరలో బయటపడే మార్గం కనబడదు. అంతిమంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు పాశ్చాత్య సామ్రాజ్యవాద ప్రయోజనాలకు తప్పనిసరిగా పని చేస్తాయి. అలా చేస్తూ పాశ్చాత్య దేశాల దోపిడీకి పావుల్లా పనిచేస్తాయి.
అదే అంగోలాలో జరిగింది. 2024 మార్చ్‌లో ఐఎంఎఫ్ ఒక పత్రికా ప్రకటనలో ‘సబ్సిడీల తొలగింపులు ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత అవసరం. అయితే పేదలపై ప్రభావాన్ని తగ్గించటానికి మంచి వ్యూహాత్మక సమాచారం, పొదుపు చర్యలు అవసరమ’ని చెప్పింది.
2015లో చమురు ధరలు తగ్గటం, దేశీయ ఉత్పత్తి దిగజారిపోవటంలో అంగోలా సంక్షోభపు మూలాలు ఉన్నాయి. సబ్ సహారా ఆఫ్రికాలో అంగోలా రెండవ పెద్ద చమురు ఉత్పత్తిదారుడు అయినప్పటికీ, వచ్చే భారీ ఆదాయం కొద్దిమంది ధనిక ఎంపీఎల్ఏ సభ్యులకు, వాళ్ల విదేశీ యజమానులకు అందుతుంది. సగానికి పైగా ప్రజలు దారిద్య్ర రేఖకు కింద జీవిస్తున్నారు. నిరుద్యోగం 30 శాతంగా వుంది. అందులోనూ యువత నిరుద్యోగం 50 శాతాన్ని దాటింది. 2025 జూన్ నాటికి ద్రవ్యోల్బణం 20 శాతానికి చేరింది. ఏడాదికేడాది బడ్జెట్టులో కోత విధిస్తూ ఇస్తున్న అరకొర కేటాయింపులు వలన ప్రజా సేవలు క్షీణ దశలో ఉన్నాయి.
స్వాతంత్ర్య పోరాటం – అంతర్యుద్ధం
దాదాపు ఐదు దశాబ్దాల క్రితం, ఎమ్‌పీఎల్ఏ (MPLA) నాయకుడు అగోస్టిన్యో నేటో ‘మన ప్రజా రాశుల ఆకాంక్షలు నిర్దిష్టంగా అర్థం చేసుకొని ఎంపీఎల్ఏ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అంగోలా క్రమంగా ప్రజాస్వామిక దేశంగా ముందుకు పోతుంది. కార్మిక, కర్షక చెలిమి కేంద్ర బిందువుగా ఎలాంటి దోపిడీదారులు లేని, ఎలాంటి దోపిడీ ఉండని సమాజాన్ని నిర్మించే పోరాటంలో -సామ్రాజ్యవాదానికీ, దాని దళారులకు వ్యతిరేకంగా దేశభక్తయుత రంగాలన్నీ ఐక్యం అవుతాయి’ అని ప్రకటించాడు.
ఫాసిస్టు పోర్చుగీసు నియంతృత్వానికి వ్యతిరేకంగా 13 సంవత్సరాల వీరోచిత గెరిల్లా యుద్ధం చేశాక ఈ వాగ్దానాన్ని ఎంపీఎల్ఏ పార్టీ చేసింది. 1974 ఏప్రిల్‌లో పోర్చుగల్‌లో జరిగిన ‘కార్నేషన్ విప్లవం’తో గెరిల్లా యుద్ధం ముగిసింది. కార్నేషన్ విప్లవంలో నియంత అయిన ‘ఎస్తాదో నోవో’ పాలన కూలిపోయింది. 1975లో వలసవాదం నుండి అంగోలా బయటపడిన కొద్దికాలానికే, దేశం 27 ఏళ్ల అంతర్యుద్ధంలో చిక్కుకొని పోయింది. అమెరికా, దక్షిణాఫ్రికాలు ఈ అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టాయి. ఈ దేశాలు అంగోలాలోని రైటిస్టు యూనిటా (UNITA) వర్గానికి, దానితో బాటు ఎఫ్ఎన్ఎల్ఏ (FNLA)కు మద్దతు ఇచ్చాయి. తరువాత అంతర్గత ఆధిపత్య పోరాటంలో ఎఫ్ఎన్ఎల్ఏని యూనిటా తుదముట్టించింది. మరోవైపు, సోవియట్ యూనియన్, క్యూబాలు ఎమ్‌పీఎల్ఏ పార్టీకి మద్దతుగా నిలిచాయి. యూనిటా బలగాలపై పోరాటంలో ఎమ్‌పీఎల్ఏ సైన్యానికి సహాయం చేయడానికి క్యూబా దశలవారిగా వేలాది సైనికులను పంపించింది. ఈ అంతర్యుద్ధంలో 10 లక్షల మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
అంగోలాలో ముగిసిన ప్రచ్ఛన్నయుద్ధం, ఎమ్‌పీఎల్ఏ నాయకత్వ స్వభావంపై ప్రభావం చూపింది. సోవియట్ యూనియన్‌లో బహిరంగ పెట్టుబడిదారివిధానపు పునరుద్ధరణ జరిగి, అది విచ్ఛిన్నం అయ్యాక -సోషలిజానికి అప్పటివరకు ఇస్తున్న నామమాత్రపు మద్దతును కూడా ఎమ్‌పీఎల్ఏ ఉపసంహరించుకున్నది. సోషల్ డెమోక్రటిక్ గా తనను తాను పునర్నిర్వచించుకుంది. మోజాంబిక్‌లోని ఎఫ్‌రెలిమో (FRELIMO), దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC)లు కూడా ఇలాగే చేశాయి. తమను తాము వ్యాపార అనుకూలులుగా ప్రకటించుకొని -ఐఎంఎఫ్ మార్కెట్ సంస్కరణలను, కఠిన ఆర్థిక చర్యలను, ప్రైవేటీకరణను అమలు చేశాయి.
ఐఎంఎఫ్ నిర్దేశించిన కఠిన ఆర్థిక చర్యలకు వ్యతిరేకంగా అంగోలాలో జరిగిన నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు, దేశ చరిత్రలో ఒక ఆవేదనాభరిత అధ్యాయంగా నిలిచాయి. ప్రభుత్వ బలగాల చేత 22మంది ప్రాణాలు కోల్పోవడం, ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణతో బాటు జరిగే మానవ ప్రాణనష్టాలకు నికార్సైన గుర్తుగా మిగిలింది. అయినా ఆ తర్వాత కూడా న్యాయం, సంస్కరణల కోసం కొత్త ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఈ ఉద్యమాలు చీకటి సమయాలలో కూడా ఆశ, తిరుగుబాట్లు నిలిచే ఉంటాయని చెబుతున్నాయి.
ఆఫ్రికా వనరుల కోసం తన్నులాట
కేపటలిస్టు చైనా ఎదిగాక -చైనాకూ, అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాలకూ పోటీ తీవ్రమయ్యింది. ఆఫ్రికాలో ఉన్న ఖరీదైన వనరుల గురించి తన్నులాడుకొంటూ, ఈ సామ్రాజ్యవాద గొడవల తుఫానులోకి అంగోలాను లాగారు. ఎంపిఎల్ఏ పార్టీ నేతృత్వంలో అంగోలా ఆఫ్రికా ఖండంలోనే అమెరికాకు బాగా అనుకూలమైన దేశాలలో ఒకటిగా మారింది. ‘ముందస్తు రక్షణా సహకారం’ పేరిట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్రికా కమాండ్ (AFRICOM) ఎంపీఎల్ఏ ఏలుబడితో సైనిక సహకారాన్ని గట్టిపరచుకొంటోంది.
కఠిన ఆర్థిక చర్యలకు వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, AFRICOM డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ జాన్ బ్రెన్నన్ ఇటీవల అంగోలాను, నమీబియానూ సందర్శించాడు. దక్షిణ ఆఫ్రికాలో ఐసిస్/ఇస్లామిక్ స్టేట్ ప్రమాదాలు ఉన్నాయనీ, మత్తుపదార్థాలనమ్మే మెక్సికో వ్యాపారసంస్థల ఉనికి వున్నదనీ -నమ్మదగని ఆరోపణలు చేశాడు. ఈ ప్రమాదాలను ఎత్తి చూపుతూ, ఆ చెబుతున్న ప్రమాదాల నుండి రక్షించే వీరుడిగా తనను తాను చెప్పుకొంటూ, అంగోలియా ప్రజలు వాళ్ల నమ్మకాన్ని అమెరికా మీద వుంచాలని బలవంతం చేస్తూ -అంగోలాలో మరింతగా తన సైనిక ఉనికిని పాతుకొంటోంది అమెరికా. అమెరికా-అంగోలియాల మధ్య విస్తరిస్తున్న సైనిక చర్యలనూ, ఆయుధ వ్యాపారాన్నీ, సముద్రయాన నిఘా సహకారాన్ని సమర్ధించుకోవటానికి ఈ కథనాలను వాడుతున్నారు.
అమెరికా చైనాతో తగాదాకు కాలు దువ్వుతూ, అంగోలా వ్యూహాత్మక సముద్రతీరాన్ని సైనికమయం చేస్తోంది. అమెరికా చేస్తున్న ప్రపంచయుద్ధంలో పరికరంగా అంగోలాను తన వైపు లాక్కుంటుంది. అమెరికా అధ్యక్షుడిగా బైడన్ వున్నప్పటి నుండే, చైనా ఏర్పరచుకొంటున్న ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ కు పోటీగా ‘లోబిటో కారిడరు’ ను అమెరికా దూకుడుగా ముందుకు తెస్తోంది. రాగీ, కోబాల్టు సమృద్ధిగా ఉన్న డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగోను -అంగోలా రైలు, ఓడరేవులకున్న మౌలిక సదుపాయాల ద్వారా అట్లాంటికా సముద్రానికి ఈ కారిడారు కలుపుతుంది. లోబిటో కారిడరు ద్వారా,ఈ ప్రాంతపు అమెరికా వ్యూహాత్మక యుద్ధ ప్రణాళికలో అంగోలా కీలకభాగం అవుతోంది. ‘ఆర్థిక అభివృద్ధి జరగాలంటే భద్రత అవసరం. ఆర్థిక అభివృద్ధి రక్షణవ్యవస్థను పటిష్టపరుస్తుంది’ అంటూ అమెరికా అధికారగణం బహిరంగంగానే వర్ణిస్తున్నారు.
మరోవైపు, చైనా అంగోలా యుద్ధానంతర ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించింది. 21వ శతాబ్దం ప్రారంభం నుండి, చైనా అంగోలాకు అతిపెద్ద రుణదాతగా మారింది. చమురు ఆధారిత రుణాల రూపంలో కోట్ల అమెరికా డాలర్లను మంజూరు చేసి, రహదారులు, రైల్వేలు, ఆసుపత్రులు, గృహ నిర్మాణాల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది చైనా. వీటిలో ఎక్కువభాగాన్ని చైనా ప్రభుత్వరంగ సంస్థలే నిర్మించాయి. చైనాతో ఈ ఒప్పందాలను ‘అంగోలా మోడల్’ అని పిలుస్తారు. ఈ విధానంలో రుణాలను నిర్ధారిత చమురు ఎగుమతులకు కట్టపెడతారు. ప్రతిఫలంగా ఎంపీఎల్ఏ పాలకవర్గం ద్రవ్య లభ్యతను (డబ్బుతో శీఘ్ర గతిన మార్పిడి కాగల సామర్ధ్యం) పొందగలిగింది. అమెరికా ఆధ్వర్యంలోని శిబిరం, చైనా-రష్యా ఆధ్వర్యంలోని బ్రిక్స్ శిబిరాలలో -ఎటు వైపు నిలవాలనే దానిపై నిర్ణయం తీసుకోవలసిన వత్తిడి అంగోలా పాలకవర్గానికి వస్తోంది. అన్ని ఆఫ్రికా దేశాలకూ ఇదే పరిస్థితి దాపురించింది.
అంగోలాలో చెప్పుకోదగ్గ ప్రతిపక్షం లేని, బలమున్న పార్టీ ఎంపీఎల్ఏ. ఈ పార్టీ అంతర్గతంగా చీలిపోయి వుంది. ఈ చీలికల్లో ఏ వర్గం కూడా సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వదు. కార్మిక, ఇతర పెటీ బూర్జువా వర్గాలు -అంగోలా గ్రామీణ ప్రాంతంలో వ్యాపించి ఉన్న వ్యవసాయ పేదలను కలుపుకొని -జరిపే పోరాట వాతావరణం మాత్రమే విప్లవ మార్గంలో నిర్దిష్ట, సంఘటిత, దృఢమైన ఉద్యమాలకు దారులు వేయగలదు. విదేశీ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా ఆ మార్గం ఉండాలి. ఎంపీఎల్ఏ వ్యవస్థాపకుడు అగోస్టిన్యో నేటో చెప్పినట్లు ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించటంలో దేశీయ పారిశ్రామికవేత్తలు, గ్రామీణ ధనికులు ఎప్పుడో ఆసక్తి కోల్పోయారు.
నిరాశ తప్ప ఆఫ్రికాలో ఇంకేమీ కనబడటం లేదు.
ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు మద్దతు తీసుకొని తీవ్రమవుతున్న సామ్రాజ్యవాద దోపిడీ భారం ఆఫ్రికా అంతటా వున్నపుడు -పాత రకం వలస వ్యతిరేక ఉద్యమాల సౌరభం ఆవిరి అయిపోతుందని గుర్తు పెట్టుకోవాలి.
1990లో దక్షిణ ఆఫ్రికా నమీబియాపై తన హక్కును వదిలివేసిన తరువాత, దక్షిణ ఆఫ్రికా నుంచి స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన నమీబియా స్వాపో (సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్) పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా నిలిచింది. ఆ పార్టీ ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగం, అసమానత, పేదరికం, అవినీతి కారణంగా స్వాపో తన పరపతిని త్వరతగతిన కోల్పోతోంది.
దక్షిణ ఆఫ్రికాలో వర్ణవివక్ష పతనం తరువాత దేశాన్ని పాలించిన ఏఎన్సీ, 2024లో పార్లమెంటు మెజారిటీని కోల్పోయింది. 1966లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి పాలిస్తున్న బోట్స్వానా డెమోక్రాటిక్ పార్టీ (బీడీపీ), బోట్స్వానా దేశంలో జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది.
మొజాంబిక్‌లో ఫ్రెలిమో (మొజాంబిక్ లిబరేషన్ ఫ్రంట్) పార్టీ అక్టోబర్ ఎన్నికల్లో తాము గెలిచామని ప్రకటించినప్పటికీ, ఆ ప్రభుత్వం ఎన్నికల మోసం ఆరోపణలను విస్తృతంగా ఎదుర్కొంటోంది. అక్టోబర్ 9న వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రకటన తరువాతి కొన్ని వారాలకు, భారీ నిరసనలు జరిగాయి. దశాబ్దాల తరబడి పేరుకొనిపోయిన పేదరికం, నిరుద్యోగం, అవినీతి తరువాత కార్మికులు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున సమీకృతులు అయ్యారు. దానికి సమాధానంగా నిరసనోద్యమాన్ని అణచివేయమని ప్రభుత్వం క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. తరువాతి మూడు నెలల పాటు శాంతియుత నిరసనలపై దాడులు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ లాంటి అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల లెక్కల ప్రకారం 315 మంది మరణించారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. 4000 మందికి పైగా అరెస్టయ్యారు.
2023 లో నైజీరియాలో ఐఎంఎఫ్ కు తొత్తుగా పని చేస్తున్న ‘తినుబు’ ఇంధన సబ్సిడీలను తొలగించాడు. దీని ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. ఈ భారం కార్మికుల, యువకుల నడ్డి విరిచింది. వారంతా #EndBadGovernanceInNigeria బ్యానరు కింద ఒకటయ్యారు. వారి డిమాండ్లు చాలా సాధారణమైనవి, న్యాయమైవి. నైజీరియా ప్రభుత్వ కార్మికుడికైనా, ప్రయివేట్ కార్మికుడికైనా న్యాయమైన వేతనాలు ఇవ్వాలి. లాగోస్ నగరం నడిబొడ్డున ఉన్న ప్లకార్డు ప్రజల ఆగ్రహాన్ని ఒక్క మాటలో వివరిస్తుంది. ‘ఒక రోజు పేదలకు తినటానికి ఏమీ మిగలదు -తమను దోపిడీ చేస్తున్నవారిని తప్ప…’
అత్యంత వివాదాస్పద ఎన్నికలనుండి గెలిచి వచ్చిన తినుబు పాలకులు, వాళ్ల రాజభక్తి ఎక్కడ వుందో ఋజువు చేసుకోవటానికి కాలాన్ని వృధా చేయలేదు. వాళ్ల విధేయత ప్రజల పక్షాన లేదు. ప్రపంచబ్యాంకు, యూరో బాండు హోల్డర్లు, చైనా ఎక్జిమ్ బ్యాంకులాంటి సామ్రాజ్యవాద రుణదాతల పట్ల వుంది. వారి ఆదేశాల ప్రకారం పాలకులు కఠిన ఆర్థిక విధానాలను అమలు చేసి, తమ తుపాకులను ప్రజలవైపు తిప్పారు. శాంతియుత నిరసనలను నేరస్తం చేశారు. స్వతంత్ర మీడియా నోరు మూయించారు. పోలీసులు, సైనికులు భీభత్సాన్ని సృష్టించారు. ఈ హింసలో13 మందిని హత్య చేశారు. అనేకమంది గాయపడ్డారు. 700 మందికి పైగా అరెస్ట్ చేశారు. వీరిలో 50 మంది జర్నలిస్టులున్నారు. కొందరు మత నేతలు, పదవి విరమణ చేసిన సైనిక అధికారులు కూడా సిగ్గు లేకుండా ఈ దమనకాండకు మద్దతు పలకటానికి లైను కట్టారు.
మాజీ అధ్యక్షుడు ఒలుసెగున్ ఒబాసాంజో ఒకప్పుడు చెప్పిన మాటలు ఎప్పటికంటే నిజం అనిపిస్తున్నాయి. ‘ఆఫ్రికా అగాధం అంచున నిలబడి అందులోకి కళ్లప్పగించి చూస్తోంది. యువత రగిలిపోతోంది. వారికి ఉపాధి లేదు. అధికారం లేదు. వారికి నిరాశ తప్ప ఇంకేమీ కనబడటం లేదు’.
ఈ వాస్తవం కేవలం నైజీరియాకు సంబంధించింది మాత్రమే కాదు. ఆఫ్రికా ఖండమంతా ధంకర్ నుండి దార్ ఎస్ సలాం వరకూ, లుసక నుండి ట్రిపోలి వరకూ -ఇదే నమూనా పునరావృత్తం అవుతోంది. అవినీతిపరులైన పాలకులు దేశంలో కూర్చొని తమ విదేశీ యజమానులకు చెత్త పనులు చేసి పెడుతున్నారు. ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు.
ఈ పాలనల కింద ప్రజలకు భవిష్యత్ లేదు. దళారీ రాజకీయ నాయకులు, విదేశీ ఋణదాతల చేతుల్లో వారికి విముక్తి వుండదు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మహిళలు, వృత్తి నైపుణ్య కార్మికులు కూడా తిరుగుబాటుకు సంసిద్ధం అవాలి. చెల్లాచెదురైన ఆగ్రహంతో కాదు, ఐక్య పోరాటాలతో ముందుకు రావాలి. తిరిగి పోరాడటానికి, సంఘటితం అవటానికి, మన బాధలతో బలుస్తున్న వ్యవస్థను నాశనం చేయటానికి సమయం వచ్చింది.
చావో బతుకో నిర్ణయించుకొనే సమయం వచ్చింది.