పహల్గామ్ దాడి గురించి ప్రధానికి ముందే తెలుసు! -ఖార్గే సంచలనం


పహల్గామ్ టెర్రరిస్టు దాడి, అనంతరం ఇండియా – పాకిస్థాన్ దేశాల 4 రోజుల యుద్ధం అంశాలపై పార్లమెంటులో రెండు రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ప్రశ్నలతో నిలదీస్తుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే ప్రధాన మంత్రి మోడి పైన విరుచుకు పడ్డారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడి తదనంతరం జరిగిన నాలుగు రోజుల యుద్ధంపై జరిగిన చర్చ సందర్భంగా పహల్గామ్ దాడి విషయంలో ఖార్గే వెల్లడించిన అంశం ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నది.

ఖార్గే వెల్లడి చేసిన అంశం రాజ్యసభలో ఎంతగా గగ్గోలు పుట్టించింది అంటే రాజ్యసభ బిజెపి పార్లమెంటు నేత జె పి నడ్డా, “ఖార్గే కు మతి భ్రమించినట్లు ఉన్నది” అంటూ తీవ్రంగా స్పందించేంతగా! జె పి నడ్డా వ్యాఖ్యలపై ప్రతిపక్షాల సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పటంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించక తప్పలేదు.

ఖార్గే తీవ్ర ఆరోపణ

పహల్గామ్ దాడి జరగడానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం పర్యటించాల్సి ఉన్నదని, దాడి జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించాడని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నాయకుడు మల్లిఖార్జున్ ఖార్గే, చర్చలో పాల్గొంటూ వెల్లడి చేశాడు. ఈ అంశాన్ని ఇంతవరకు ఏ పత్రికా వెల్లడి చేయకపోవటం గమనార్హం. కాగా ఖార్గే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “తన కాశ్మీర్ పర్యటనను మోడి రద్దు చేసుకోవటం బట్టి అక్కడ టెర్రరిస్టు దాడి జరగనున్న విషయం ప్రభుత్వానికి ముందే సమాచారం ఉన్నట్లు స్పష్టం అవుతున్నది” అని ఖార్గే వెల్లడి చేశాడు.

ప్రధాన మంత్రి పైన తన సంచలన ఆరోపణను కొనసాగిస్తూ ఖార్గే, “తనను తాను కాపాడుకునేందుకు ప్రధాన మంత్రి ముందే నిర్ణయించిన పర్యటనను రద్దు చేసుకున్నాడు. కానీ అమాయక టూరిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ రకంగా ఇతర ప్రజలు చనిపోవటానికి అనుమతించటమే వారి దేశ భక్తా?” అని ఖార్గే రాజ్య సభలో తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ఆరోపణతో బిజెపి సభ్యులు గట్టిగా అరుస్తూ అభ్యంతరం చెప్పారు. ఒక్కుమ్ముడిగా లేచి ఖార్గే వైపు చేతులు చూపుతూ కేకలు వేయటం మొదలు పెట్టారు.

రాజ్య సభ నాయకుడు బిజెపి మాజీ అధ్యక్షుడు జె పి నడ్డా లేచి, ప్రధాని పైన ఖార్గే చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా అభివర్ణిస్తూ ఆయన ఆరోపణలు ధృవీకరణ కాకపోయినట్లయితే ఆయన మాటలను రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేశాడు. ఖార్గే ప్రసంగం సందర్భంగా ఒక దశలో జె పి నడ్డా, ప్రసంగానికి అడ్డు పడుతూ “ఖార్గేకు మతి పోయినట్లుంది” అని తిట్టి పోశాడు. దానితో ప్రతిపక్ష పార్టీల సభ్యులు నడ్డా మాటలకు అభ్యంతరం తెలిపారు. సభ్యులు ఒక్కసారిగా అరుస్తూ లేచి నిలబడి నడ్డా తన మాటలని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. దానితో నడ్డా తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

బాధ్యత తీసుకోరా?

ఖార్గే తన ప్రసంగం కొనసాగిస్తూ పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచాలని ప్రతిపక్షాలు అనేక మార్లు విజ్ఞప్తి చేశాయని, తమ విజ్ఞప్తులను ప్రభుత్వం ఖాతరు చేయలేదని విమర్శించాడు. పార్లమెంటు ప్రత్యేక సెషన్ కు బదులు ‘ఆపరేషన్ సింధూర్’ పైన అఖిలపక్ష సమావేశం జరపటానికి మాత్రమే ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశాడు. తీరా చూస్తే ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి కూడా హాజరు కాలేదని ఎత్తి చూపాడు.

“మీరు బీహార్ లో రాజకీయ ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్లారు. చర్చకు అనుమతించి, ఆ చర్చ జరుగుతున్నప్పుడు ఉభయ సభల్లో ఒక సభకు మీరు హాజరు కావలసి ఉండగా అలా జరగలేదు. ప్రతిపక్షాల అభిప్రాయాలను వినటానికి కావలసిన ధైర్యం మీకు లేనట్లయితే ఆ పదవిలో ఉండే అర్హత మీకు లేదు” అని కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖార్గే స్పష్టం చేశాడు.

రాజ్యసభ చర్చలో ఖార్గే కనీసం గంట సేపు ప్రసంగించాడు. జమ్ము కాశ్మీర్ లో ఏప్రిల్ 22 తేదీన ‘పహల్గామ్’ లో జరిగిన దాడి వెనుక ఇంటలిజెన్స్ మరియు భద్రతా వర్గాల తీవ్ర వైఫల్యం దాగి ఉన్నదనీ ఈ వైఫల్యానికి, తత్ఫలితంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటానికి హోమ్ మంత్రి అమిత్ షా యే బాధ్యత వహించాలని ఖార్గే తన ప్రసంగంలో పేర్కొన్నాడు. 2016 లో యూరి, పఠాన్ కోట్ లలోనూ, 2019 లో పుల్వామా లోనూ, 2025 లో పహల్గామ్ లోనూ టెర్రరిస్టులు హంతక దాడులు నిర్వహించగా వాటిలో ఏ ఒక్క భద్రతా వైఫల్యానికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదని ఖార్గే ఎత్తి చూపాడు.

ఇది భద్రతా వైఫల్యమే

పహల్గామ్ దాడి విషయమై జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జులై 14 తేదీన స్పందిస్తూ, ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం ఫలితమే అనటంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. దాడికి తాను బాధ్యత వహిస్తున్నట్లు కూడా ప్రసంగించాడు.

ఈ సంగతిని గుర్తు చేస్తూ ఖార్గే, భారత దేశ హోమ్ మంత్రి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహించటం వెనుక దాక్కోవడం అసమంజసం అని స్పష్టం చేశాడు. “భారతీయ జనతా పార్టీలో నంబర్ 1, నంబర్ 2 అంటే ఇతర నాయకులందరూ భయపడుతున్న నేపధ్యం లోనే లెఫ్టినెంట్ గవర్నర్, భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ బాధ్యత తప్పనిసరిగా హోమ్ మంత్రి పైనే ఉందన్నది వాస్తవం” అని ఖార్గే వ్యాఖ్యానించాడు.

వ్యాఖ్యానించండి