ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!


ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి?

ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు కొట్టుకున్నట్లు ఆయన జోక్యంతోనే, ఇంకా చెప్పాలంటే ట్రంప్ బెదిరించడం తోనే భయపడి పోయి ఇండియా, పాక్ ప్రభుత్వాలు కాల్పుల విరమణ నిర్ణయం ప్రకటించాయా?

మే 7 తేదీన మొదలైన యుద్ధం మే 10 తేదీన అకస్మాత్తుగా ముగిసింది. కాల్పుల విరమణకు నిర్ణయం జరిగినట్లు చానెళ్లు బ్రేకింగ్ న్యూస్ లో ప్రకటించాయి. విచిత్రంగా దాడి, ప్రతి దాడులకు నిర్ణయించిన ఇరు దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణ నిర్ణయం ప్రకటించలేదు. పోనీ ఇరు దేశాల మిలటరీలు కూడా ఆ నిర్ణయం ప్రకటించలేదు. భారత ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి, రక్షణ మంత్రి, ఇలా యుద్ధ విరమణ గురించి చెప్పవలసిన బాధ్యత కలిగిన భారత నేత ఎవరూ తమ ప్రజల ముందుకు వచ్చి ‘ఇక యుద్ధం విరమించాము’ అని చెప్పలేదు.

వీరెవరూ కాకుండా యుద్ధంతో సంబంధం లేని (అని చెప్పబడుతున్నది) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ ఇరు దేశాలను కాల్పుల విరమణకు అంగీకరింప జేశానని ప్రకటించాడు. “వీళ్ళ ఘర్షణ శ్రుతి మించి పోయింది. ఒకరిపై ఒకరు అణు బాంబులు ప్రయోస్తారా అన్న తీవ్ర స్థాయికి ఇరు పక్షాలూ వెళ్ళాయి. ఇక లాభం లేదని యుద్ధం విరమించకపోతే అమెరికాతో వాణిజ్యం చెయ్యలేరని ఇరు దేశాలనూ బెదిరించి, భయపెట్టి యుద్ధం విరమించేలా చేశాను. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య రాత్రంతా చర్చలు జరిగాక సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు అంగీకరించాయి” అని డొనాల్డ్ ట్రంప్ అట్టహాసంగా ప్రకటించాడు.

దాంతో ఇండియాలో ప్రతిపక్ష పార్టీలు మెల్లగా అభ్యంతరం ప్రకటించటం మొదలు పెట్టాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ద్వారా ప్రకటన వెలువరించింది. ఇక యుద్ధం విరమిద్దామని కోరుతూ పాకిస్తాన్ మిలటరీకి చెందిన డిజిఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్), మన డిజిఎంఓ తో నేరుగా ప్రతిపాదించాడనీ, ఆ వెంటనే మన డిజిఎంఓ కాల్పుల విరమణను ఖరారు చేశాడనీ ఆ ప్రకటన సారాంశం.

కాల్పుల విరమణ ఖచ్చితంగా భారత్ విధించిన షరతులకు లోబడి మాత్రమే జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మే 10 తేదీన వివిధ పత్రికల వెబ్ సైట్లు వార్తా కధనాలు ప్రచురించాయి. ఆపరేషన్ సిందూర్ ఫలితంగా పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ), ఎయిర్ ఐఎస్ఐ చీఫ్ అసీమ్ మాలిక్ లు భారతీయ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో సంప్రదింపులు జరపాలని కోరాయని, అయితే ప్రధాని మోడి మాత్రం ‘కేవలం భారత షరతుల మేరకే కాల్పుల విరమణ విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అజిత్ దోవల్, విదేశీ మంత్రి జై శంకర్ కు గట్టిగా ఆదేశాలు జారీ చేశారనీ ఇండియా టుడే లాంటి పత్రికలు మే 10 తేదీన అర్ధ రాత్రి దాటాక వెల్లడి చేశాయి.

కాశ్మీర్ సమస్య కేవలం ద్వైపాక్షిక సమస్య మాత్రమే అని ఇండియా అవగాహన. ఇరు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం ఈ అంశాన్ని నొక్కి చెప్పింది. మూడో పార్టీ (దేశం) పాత్రను ఈ సమస్య పరిష్కారంలో అంగీకరించేది లేదని ఇండియా దశాబ్దాల నుండి ఒక విధానంగా చెబుతూ వస్తున్నది. కనీసం ఐక్యరాజ్య సమితి పాత్రను కూడా అంగీకరించబోమని ఇండియా చెబుతుంది. మూడో దేశం మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే సమస్యను అంతర్జాతీయం చేయటమే అవుతుందని అలా చేసేందుకు తాము వ్యతిరేకం అనీ ఇండియా చెబుతుంది.

మరో పక్క పాకిస్తాన్, కాశ్మీర్ సమస్యను వీలైన ప్రతిసారీ ఐరాస సమావేశాల్లో ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ సమస్యగా కాశ్మీర్ సమస్యను మార్చాలని ప్రయత్నిస్తూ వచ్చింది. అలా చేస్తే కాశ్మీర్ సమస్య తమకు అనుకూలంగా పరిష్కారం అవుతుందని పాకిస్తాన్ ఆశిస్తుంది. భారత పాలకులు కూడా ఆ భయంతోనే మూడో దేశం మధ్యవర్తిత్వానికి నిరాకరిస్తున్నారని పరిశీలకుల అభిప్రాయం.

నాలుగు రోజుల యుద్ధం తర్వాత జరిగిన కాల్పుల విరమణ కూడా అమెరికా జోక్యం వల్లనే సాధ్య పడిందని పాకిస్తాన్ ప్రధాని షావాజ్ షరీఫ్ ఎలాంటి అరమరికలు లేకుండా ప్రకటించాడు. దానితో అమెరికా, పాకిస్థాన్ ల మాటలు ఒకే రకంగా ఉంటే, భారత నేతల అవగాహన మాత్రం భిన్నంగా ఉన్నట్లుగా అంతర్జాతీయ పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు.

జులై 29 తేదీన లోక్ సభ, రాజ్య సభ లలో జరిగిన చర్చల్లో కూడా ఈ అంశం పైన ప్రతిపక్షాలు, ప్రభుత్వం పై దాడి ఎక్కుపెట్టాయి. సీజ్ ఫైర్ ను భారత ప్రభుత్వం కాకుండా అమెరికా అధ్యక్షుడు ప్రకటించటం ఏమిటని ప్రశ్నించాయి.

“యుద్ధంలో మనం ముందంజలో ఉన్నాం. మన సైన్యం స్ధిరంగా ప్రతీకార చర్యలు అమలు చేస్తున్నది. పాకిస్తాన్ దాదాపు మన కాళ్ళ దగ్గర ఉన్నది. అలాంటి సమయంలో ‘కాల్పుల విరమణ’ ప్రకటించారు. ఎవరు ప్రకటించారయ్యా అంటే ఇండియా కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రకటన చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ తానే కాల్పులు విరమింపజేశానని కనీసం 29 సార్లు ట్రంప్ ప్రకటించాడు” అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎత్తి చూపించాడు.

“అన్నిసార్లు తానే యుద్ధాన్ని విరమింపజేశానని చెపుతున్న ట్రంప్ తో అబద్ధాలు చెప్పటం ఆపండి అని ప్రధాన మంత్రి నిలదీయగలరా?” అని రాహుల్ గాంధీ లోక్ సభలో సవాలు సైతం విసిరాడు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖార్గే కూడా ఈ అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఇండియా, పాకిస్తాన్ ల కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే సాధ్యం అయిందా లేదా అన్నది ప్రధాని వివరించాలని కోరాడు. వాణిజ్య బెదిరింపులు, ఆర్ధిక బ్లాక్ మెయిల్ కు పాల్పడటం ద్వారా ట్రంప్ ఇండియా పైన ట్రంప్ ఒత్తిడి తెచ్చాడా అని వ్యంగంగా అడిగాడు. అసాధారణ రీతిలో ఒక దేశ ప్రధాని చేయకూడని విధంగా, ట్రంప్ ని గెలిపించటానికి అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న భారత ప్రధాని, తన మిత్రుడు పదే పదే యుద్ధాన్ని ఆపానని చెపుతుంటే ఆ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నేరుగా ప్రశ్నించాడు.

“కాల్పుల విరమణ ఒప్పందం కోసం వాణిజ్యాన్ని ఉపయోగించానని ట్రంప్ చెప్పాడు. మోడి దేశభక్తుడనీ, అమిత్ షా కూడా దేశ భక్తుడనీ నేను నమ్ముతున్నాను. కానీ ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ఎవరు లబ్ది పొందారు? అసలు ఎవరైనా లబ్ది పొందుతున్నారా లేదా?” అని ప్రశ్నించిన ఖార్గే “దేశాన్ని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించాలని కోరుకునేది ఎవరు?” అంటూ ప్రధాని, హోమ్ మంత్రిలను నిలదీశారు. మరో కాంగ్రెస్ సభ్యుడు శక్తి సిన్హ్ గోహిల్ అందుకుని “ఆ ఒప్పందం అదానికి లబ్ది చేకూర్చటానికే” అంటూ ముగింపు ఇచ్చాడు.

బలవంతపు కౌగిలింతలు, ఫోటో సెషన్ లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు ఇవేవీ బలమైన విదేశీ విధానానికి ప్రత్యామ్నాయం కాజాలవని నిరసిస్తూ, మిల్లిఖార్జున్ ఖార్గే, ప్రపంచంలో ఏ దేశం కూడా, చివరికి ట్రంప్ కూడా, పహల్గామ్ దాడికి బాధ్యురాలిగా పాకిస్తాన్ ను ఖండించలేదని గుర్తు చేశాడు. పైగా పాకిస్థాన్ ఆర్మీ అధిపతి ఆసిఫ్ మునీర్ ను అమెరికా అధ్యక్షుడు తన రెండవ పదవీకాలంలో మొట్టమొదటి ఆహ్వానితుడిగా ఎంచుకుని వైట్ హౌస్ లో లంచ్ కి ఆహ్వానించాడని ఎత్తిపొడిచాడు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు పాకిస్థాన్ కు రుణాలు ఇవ్వడం కొనసాగిస్తుంటే భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని వ్యాఖ్యానించాడు.

“పాకిస్థాన్ ని రెండుగా విడగొట్టిన ఇందిరా గాంధీతో మిమ్మల్ని పోల్చుకుంటున్నారు… మీరు విశ్వ గురువు ని మీరు నమ్ముతారు… కానీ ఈ ఘటనలు మీ విదేశీ విధానం సత్తా ఏమిటో రుజువు చేశాయి” అని ఖార్గే తేల్చేశాడు.

రాహుల్ గాంధీ నిలదీసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఒక్కసారైనా పత్రికా ముఖంగా అమెరికా అధ్యక్షుడిని నేరుగా నిలదీయకపోయినా, కనీసం విలేఖరులను సమావేశ పరిచి భారత్ పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర ఏమీ లేదు అని ప్రత్యక్షంగా కెమెరాల ముందు భారత ప్రధాన మంత్రి ప్రకటిస్తే సరిపోతుంది.

లేదా ప్రధాన మంత్రి ఎప్పుడూ చేసినట్లే ట్విట్టర్ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసినా సరిపోతుంది. “అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్లుగా ఇండియా, పాకిస్థాన్ ల యుద్ధ విరమణ వెనుక ఆయన పాత్ర ఏమీ లేదు. అది అబద్ధం. ఇది కేవలం మా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితమే” అని ఆ సందేశంలో చెబితే అందరి నోళ్ళు మూత బడతాయి. పైగా ప్రధాని మోడి పైన గౌరవం ఒక్కసారిగా ఆకాశం లోకి దూసుకుపోతుంది కూడా. అమెరికా అధ్యక్షుడి అబద్ధాన్ని బట్టబయలు చేసిన వ్యక్తిగా మోడీకి ప్రపంచ దేశాలు, కనీసం గ్లోబల్ సౌత్ దేశాలు నీరాజనం పడతాయి.

కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణలన్నీ కర్రా విరగలేదు, పామూ చావలేదు అన్నట్లుగానే ఉన్నాయి. అసలు పాము ని కర్రతో కొడుతున్నట్లు నటన కోసం అయినా జరిగినట్లు ఏ మాత్రం కనపడలేదు.

తానే మధ్యవర్తిత్వం వహించానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోడి, ట్రంప్ కు ఫోన్ చేసినట్లూ, ‘మన మధ్య జరిగిన సంభాషణలో కాల్పుల విరమణ గురించిన ప్రస్తావనే జరగలేదు’ అని మోడి, ట్రంప్ కి చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా పత్రికల్లో ఒక కధనం మాత్రమే వెలువడింది. ఆ కధనం ఫలానా పదవిలో ఉన్న ఫలానా అధికారి చెప్పారనో, ఫలానా నాయకుడు చెప్పారనో ఎలాంటి వివరణా పత్రికలు ఇవ్వలేదు.

పార్లమెంటులో చర్చలో కూడా “ఇండియా నిర్ణయం మేరకే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది” అని చెప్పారు తప్ప, “తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవటంలో వాస్తవం లేదు” అని గానీ, “ట్రంప్ అబద్ధం చెప్పాడు” అని గానీ ప్రధాన మంత్రి చెప్పలేకపోతున్నాడు.

చూసేందుకు చిన్న విషయం వలె కనిపిస్తుండ వచ్చు. అయితే ఇంత చిన్న విషయాన్ని కూడా ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్న అనుమానం వెంటనే ఉదయిస్తుంది. జరిగింది జరిగినట్లు చెప్పుకోవటానికి ఒక సార్వభౌమ, స్వతంత్ర, గణతంత్ర దేశం యొక్క ప్రధాన మంత్రి ఎందుకు వెనకాడుతున్నారు? అన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తుంది.

ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెబితే అది ఏమై ఉంటుంది అన్న ప్రశ్న ప్రజలు (పాఠకులు) వేసుకోవాలి. 140 కోట్లకు పైగా ప్రజలు, ఇంకా ఉపయోగంలో పెట్టని విలువైన ఖనిజ వనరులు, ఉత్తరం నుండి దక్షిణాగ్రం వరకు వ్యాపించిన జనవనరుల జీవ నదులు, దండిగా విస్తరించిన అటవీ వనరులు… వీటన్నింటి అండతో స్వతంత్రంగా, స్వయం సమృద్ధంగా మనగల సామర్ధ్యం ఉన్నప్పటికీ, వాగాడంబరుడైన డొనాల్డ్ ట్రంప్ ని చూసి, భారత పాలకులు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నారని భారత ప్రజ కనీసం తమను తాము ప్రశ్నించుకోవాలి. సరైన సమాధానం కోసం అన్వేషించాలి.

నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం వెతకటం తేలిక కాదు, అలాగని కష్టమూ కాదు. కళ్లెదుట కనిపిస్తున్న నిజాలతో పాటు, ఆ నిజాల వెనుక దాగిన మర్మం ఏమిటో తవ్వితీస్తే సరి!

పాలకులు అమలు చేస్తున్న ఆర్ధిక విధానాలు భారత ప్రజల కోసం కాదని, సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా దేశాన్ని చుట్టుముట్టిన విధేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే అనీ గ్రహించినట్లయితే ఆ ప్రయోజనాల చుట్టూనే భారత రాజకీయాలు తిరుగుతున్నాయనీ, ప్రభుత్వాల బడ్జెట్లు తయారవుతున్నాయనీ, వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) లలోని బహుళజాతి ఫైనాన్స్ కంపెనీల అప్పులు, వడ్డీలకు భారత ప్రజల జీవనాలు కట్టివేయబడ్డాయనీ, అందుకే డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలను ‘అబద్ధాలు’ అని తేల్చేయగల దమ్ము భారత పాలకులకు కొరవడిందనీ అర్ధం అవుతుంది.

వ్యాఖ్యానించండి