యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం


ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025

ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన                                      

పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని వేస్తూ, సమస్యను ఎదుర్కొనేందుకు దేశం దృఢ నిశ్చయంతో కట్టుబడి ఉన్నదని చెప్పటం పైనే దృష్టిని కేంద్రీకరించాయి. తద్వారా పత్రికలు సృష్టించిన ఉన్మాదపూరిత వాతావరణానికి ఆజ్యం పోసినట్లు ప్రకటనలు, వ్యాఖ్యలు విడుదల అయ్యాయి. అప్పటికే కాక మీద ఉన్న మీడియా మరింత చెలరేగి ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనను నిర్మూలించటంలో నిమగ్నం అయ్యాయి. ప్రధాన మంత్రి, ప్రభుత్వ నేతల ప్రకటనలలో ఎక్కడా టెర్రరిస్టు దాడుల నుండి హిందూ యాత్రీకులను రక్షించటంలో కశ్మీరీ పౌరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తించిన జాడలే లేవు. ఆ ప్రకటనలు క్షేత్రస్థాయిలో నెలకొన్న సున్నితమైన వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించటంలో విఫలం అయ్యాయి.  

కేంద్ర ప్రభుత్వం ప్రచారంలో పెట్టిన కాశ్మీరీ రాజకీయాల అవగాహనకూ, హింసా దాడులకు ప్రత్యక్ష బాధితులుగా ఉన్న కాశ్మీరీ ప్రజల రోజు వారీ అనుభవాలకూ మధ్య నెలకొన్న లోతైన తేడాను ప్రధాన మంత్రి గారి విభిన్న దృక్పథం స్పష్టంగా ప్రతిఫలించింది. స్థానిక ప్రజా సమూహాలన్నీ ఐక్యతను, దయార్ద్రతను, ధైర్యాన్ని ప్రదర్శించగా, -దేశ నాయకత్వం మరియు మీడియాలోని అత్యధిక భాగం మాత్రం మత విభజనలను మరింత తీవ్రం కావటంలో, కరడు గట్టిన మూస వాదనలను ఇంకా బలపరిచే వైపుగా ఆసక్తి కనబరిచాయి.

భారతదేశం, పాకిస్తాన్ కంటే మించిన సైనిక శక్తి, వ్యూహాత్మక ఆధిక్యతలను కలిగి ఉన్నదని చాటి చెప్పటంలో భారత ప్రభుత్వ అధికారిక స్పందన కేంద్రీకరించింది. భారత ప్రభుత్వం, మొదట చేసిన పని సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయటం. ఆ ఒప్పందం పాకిస్తాన్ వ్యవసాయానికి జీవనాధారం. అక్కడి లక్షలాది రైతు, గ్రామీణ శ్రామికుల జీవనోపాధులకు అత్యవసరమైనది. పహల్గాం వుగ్రవాద దాడి జరిగాక ప్రతీకార చర్యగా దీన్ని ప్రయోగించారు. (నిజానికి 2024 ఆగస్టులోనే ఈ ఒప్పందాన్ని మళ్లీ చర్చించి, సమీక్షించాలనే డిమాండును భారతదేశం అధికారికంగానే చేసింది). దానికి స్పందనగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని, భారత సైనిక దౌత్యవేత్తలను వెళ్లగొడతామని, పాకిస్తాన్ లో ఉన్న భారత పౌరుల ప్రత్యేక వీసాలను రద్దు చేస్తామని, భారత వైమానికదళానికి ఆకాశ మార్గాన్ని మూసి వేస్తామని, వాఘా సరిహద్దు ద్వారా జరిగే వ్యాపారాన్ని జరగనీయమని బెదిరిస్తూ పాకిస్తాన్ దౌత్య పరమైన ఉద్రిక్తతలను తీవ్రం చేసింది. 

హిందూ మతోన్మాదులలో యుద్ధావేశాలను సొమ్ము చేసుకుంటూ భారతదేశం మే 7న ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టింది. పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది మిలటరీ క్యాంపుల మీద, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నిర్దిష్ట లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల మిసైళ్లను ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం ప్రయోగించింది. భర్త చిరకాలం జీవించాలని కోరుతూ హిందూ వివాహిత స్త్రీ నుదిటిపై ధరించే కుంకుమను ప్రతీకగా తీసుకుంటూ పెట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పేరు హిందూ పురాణాల్లో ఉన్న మూల ఆదిశక్తికి  ప్రతీకాత్మక ఆవాహన. ప్రజా సెంటిమెంటును సొమ్ము చేసుకోవటానికి సాంస్కృతిక, మత ప్రతీకాత్మక చిత్రంగా దాన్ని ప్రభుత్వం ప్రయోగించింది. ఈ కథనాన్ని కొనసాగించటానికి ప్రభుత్వం జాగ్రత్తగా తీసుకొన్న ఇంకో చర్య ఏమిటంటే -జాతీయ ఉన్మాదంతో ఊగిపోతున్న మీడియాతో మాట్లాడటానికి కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ పేర్లు కలిగిన ఇద్దరు మహిళా సైనిక అధికారులను ఎన్నుకోవటం. రాబోయే ఎన్నికల ప్రచారానికి మస్కట్ లుగా ఈ ఇద్దరు మహిళా అధికారులను బిజెపి ఉపయోగించుకోనున్న పుకార్లు వెలువడటం గమనార్హం.  

లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్, హిజ్ బుల్ ముజాహిదీన్ అనే సంస్థల స్థావరాలకు గురి పెట్టి మిసైళ్లను ప్రయోగించామని ప్రభుత్వ నేతలు భారత ప్రజలకు చెప్పారు. అధికారిక సమాచారం ప్రకారం 31మంది అనుమానిత మిలిటెంట్లు చనిపోయారు. అయితే ఈ వాదనలను పాకిస్తాన్ కొట్టి పారేసింది. ఈ దాడులు సామాన్య పౌరుల హత్యలకు దారి తీసాయని ఆరోపించింది. ‘మా అమాయక ప్రజలకు హాని తలపెట్టిన వారి మీదనే మిసైళ్లు ప్రయోగించామని’ భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెబుతూ వచ్చాడు. మరుసటి రోజు లాహోర్ దగ్గర ఉన్న పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ మీద భారత్ దాడి మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు ప్రతిస్పందన అని చెబుతూ ఆ దేశపు 11 వైమానిక స్థావరాల మీద భారత సైనిక దళం దాడులు కొనసాగించింది. 

ఈ ప్రతీకార చర్యలు, ప్రతీకార చర్యల మీద మళ్లీ ప్రతీకార దాడుల పరంపరల మధ్య అసలు వాస్తవం యుద్ధం మొదటి రోజే అదృశ్యమై పోయింది. సాయుధ గ్రూపులకు పాకిస్తాన్ సైన్యం ఇస్తున్న రక్షణ వ్యవస్థ మీద గురిపెట్టి చేసిన దాడులు తమ వ్యూహాత్మక మేధో కుశలతకు సాక్ష్యం తమ దాడులు అని భారత్ ఘనంగా చాటుకుంది. జె-10 యుద్ధ విమానాలతో సహా చైనా సరఫరా చేసిన ఆయుధాలతో తాము 5 భారత జెట్ విమానాలను కూల్చి వేశామని ఇంకో పక్క పాకిస్తాన్ ప్రకటించింది. ఇరు దేశాల మిలటరీల నాటకీయ ప్రదర్శనలో కాశ్మీర్ ప్రజల ఆర్తనాదాలు వారి ప్రజాస్వామిక ఆకాంక్షలు ఎవరికీ వినిపించకుండా పోయాయి. యుద్ధ ఫలితాల భారాన్ని ఆ కాశ్మీరీలే దీర్ఘకాలం పాటు మోయనున్నారు. వుగ్రవాద వ్యతిరేక చట్టాలను, వ్యవస్థాపరమైన వివక్షను, అసమ్మతీ భావ ప్రకటనా స్వేచ్ఛల అణచివేతను, పునరావృతం అవుతున్న ప్రాధమిక మానవ హక్కులూ రోజువారీ స్వేచ్ఛల ఉల్లంఘనలనూ -లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఇరు వైపులా ఉన్న కాశ్మీరీ ప్రజలే ఎదుర్కొంటున్నారు.  

భౌగోళిక రాజకీయాలు  

ఇక్కడ ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రభావాన్ని విస్మరించటానికి వీలు లేదు. బ్రిక్స్ గ్రూపుకి భారత్ వ్యవస్థాపక సభ్యురాలు అయినప్పటికీ, భారత పాలకులు అమెరికా దగ్గర సంబంధాలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, రక్షణ మంత్రి అమిత్ షాల హిందూ జాతీయవాద నాయకత్వం అభివృద్ధి అయ్యాక ఈ ధోరణి మరింత ప్రస్ఫుటమయ్యింది. పై ఇరువురి నాయకత్వంలో అమెరికాతో సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి గట్టి ప్రయత్నాలను భారత్ చేసింది. ట్రంప్ మొదటి పదవీకాలంలో అమెరికా మోడికి చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించింది. అమెరికాతో సంబంధాలను పటిష్ట పరచుకునే ప్రయత్నాలకు సంకేతంగా మోడి ‘అబ్ కీ బార్, ట్రంప్ సర్కార్’ (ఈసారి ట్రంప్ ప్రభుత్వమే వస్తుంది) అని అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటించటం అందరికీ తెలిసిందే. హోస్టన్ లో ‘హౌడి మోడి’ కార్యక్రమం జరుగుతున్నపుడు ప్రధాని మోడి ఈ నినాదం ఇచ్చాడు. అమెరికా అంతర్గత వ్యవహారమైన అక్కడి అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒక అభ్యర్ధికి ఒక విదేశీ ప్రధాన మంత్రి నేరుగా మద్దతు ప్రకటించటం అసాధారణ అంశంగా అప్పట్లో అంతర్జాతీయంగా చర్చ జరిగింది.  

అయితే ట్రంప్, మోడీల స్నేహం వాస్తవిక భాగస్వామ్యంగా పరిపక్వత చెందక ముందే, బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమెరికాలో భారతదేశానికి పైకి కనిపిస్తున్న పరపతి తగ్గిపోతున్నట్లు అనిపించింది. బైడెన్ అధ్యక్షుడిగా వున్నపుడు, అతను మోడి ప్రభుత్వంతో చెప్పుకోదగ్గ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగలేదు. ఈ కాలంలో భారత్ తన దృష్టిని మరలించుకొని, బ్రిక్స్ భాగస్వాములతో క్రియాశీలకంగా పని చేసింది. బ్రిక్స్ గ్రూపు విస్తరణలో భారత్ కీలకపాత్ర నిర్వహించింది. 2023లో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను బ్రిక్స్ గ్రూపులో చేర్చుకోవడాన్ని సమర్థించింది. తర్వాత 2025లో ఇథియోపియా బ్రిక్స్ లో శాశ్వత సభ్యురాలిగా మారింది. అర్జెంటీనాను కూడా ఆహ్వానించారు కానీ, ఆ దేశం మొదట్లో బ్రిక్స్ సభ్యత్వాన్ని అంగీకరించినప్పటికీ తర్వాత అమెరికా అనుకూల జావియర్ గెరార్డో మిలే ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వెనక్కి తగ్గింది. జావియర్ గెరార్డో మిలే పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థకు అనుగుణమైన స్వేచ్ఛా వాణిజ్య విధానాలకు బహిరంగ ప్రచారకుడు. ఈ పరిణామాలు భారత్, అమెరికాల మధ్య దూరం పెరగటానికి దోహదపడ్డాయి.

ట్రంప్ రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన తరువాత -అమెరికా, భారత్ లు తమ సంబంధాలను పునరుద్ధరించుకొన్నాయి. బుర్ర తిరిగిపోయే పన్నులు వేస్తుందని ట్రంప్ భారత్ ను మిగతా దేశాలతో బాటు తిట్టి పోసినా సరే -ఇరు దేశాలు తమ సంబంధాలను మాత్రం పునరుజ్జీవించుకొన్నాయి. చైనా, కెనడాలతో బాటు అత్యధిక పన్నులు విధించే దేశమని ట్రంప్ భారత్ ను ప్రత్యేకంగా ఆరోపించాడు. భారత్  పన్నుల రారాజు అనీ, పెద్ద దుర్వినియోగదారుడని కూడా నిందించాడు. అన్ని దేశాల మీద ప్రతీకార పన్నులు విధిస్తానని మార్చి మొదటి వారంలో ప్రకటించాడు.

ట్రంప్ రెండో దఫా పాలన మొదలయ్యాక -భారత్ మీద, ఇంకా ఇతర దేశాల మీద పన్నులు పెద్ద ఎత్తున ప్రకటించినా కూడా -భారత్, అమెరికాల మధ్య సంబంధాలు పునర్జీవనం పొందాయి. చైనా, కెనడాలతో పాటు భారత్ ను అత్యధిక సుంకాల అడ్డంకులు విధించే దేశాలుగా ట్రంప్ ప్రత్యేకంగా గుర్తించాడు. మార్చి మొదట్లో ట్రంప్ అన్ని దేశాల మీద ప్రతీకార పన్నుల అమలును ప్రకటించాడు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ల డాలర్లని చెబుతూ, భారత్ తో వాణిజ్య కార్యకలాపాలకు అమెరికా విముఖత ప్రదర్శించటానికి ఈ లోటు ప్రధాన కారణంగా ప్రకటించాడు.    

బిజెపి పాలకవర్గాల స్వభావం బహిర్గతం

పాకిస్తాన్ తో జరిగిన నాలుగు రోజుల ఘర్షణలు భారతీయ విదేశీ విధానం, దౌత్య సంబంధాల మీద  పరిమితులు విధించాయి. ఆపరేషన్ సింధూర్ జరిగే సమయంలో భారతదేశం వంటరి అయిపోయింది. పక్క దేశాల నుండి కూడా మద్దతు దొరకలేదు. యూరోపియన్ యూనియన్ తో బహిరంగ వివాదంలో చిక్కుకొని పోయింది. ఎప్పటి నుండో భాగస్వాములుగా ఉన్న రష్యా లాంటి దేశాలు, దక్షిణ ప్రపంచదేశాలు  ఎటు వైపు మొగ్గు చూపకుండా ఉదాసీనంగా ఉండిపోయాయి. అమెరికా జోక్యం చేసుకోవటమే చెప్పుకోదగ్గ పరిణామం. దాని మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మే 10 సాయంకాలానికి భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ ఘర్షణలను ఆపమని వత్తిడి చేయటంలో విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి.

మే 2 నాటికే అమెరికా ఉపాధ్యక్షుడు జె డి వాన్స్, అతని సహ నాయకులు ప్రధానమంత్రి మోడి అధికారగణంతో సంభాషణలు జరుపుతున్నామని సంకేతాలు ఇచ్చినా, మే 12న అధ్యక్షుడు ట్రంప్ అమెరికా నిర్ణయాన్ని నిర్ధారించి చెప్పాడు. మీ యుద్ధ తగాదాలను ఆపక పోతే, మీతో వాణిజ్యం ఉండదని -భారత్, పాకిస్తాన్ లకు హెచ్చరిక చేశానని చెప్పాడు. అతని భాషలోనే చెప్పాలంటే ‘మేము అణు యుద్ధాన్ని నివారించాము. లేకపోతే అదొక భయంకరమైన అణు యుద్ధం అయి ఉండేది. లక్షలాది ప్రజలు చనిపోయే వాళ్లు. ఈ పని చేసినందుకు గాను ఉపాధ్యక్షుడు జేడీ వాన్సీకూ, ప్రభుత్వ కార్యదర్శి మార్కో రుబియో లకు ధన్యవాదాలు చెప్పాలనుకొంటున్నాను’ అని అన్నాడు. ట్రంప్ మాటలు, ముఖ్యంగా అణు యుద్ధాన్ని ప్రస్తావిస్తూ వదరిన మాటలు ఆయనకు సహజ లక్షణమైన అతి వాచాలతను మాత్రమే పట్టిస్తాయి. అయినప్పటికీ అంతర్లీనంగా ఉన్న వాస్తవం ఏమిటన్నది స్పష్టమే: ఇండియా, పాకిస్తాన్ ఇరు దేశాలను తమ ఘర్షణను విరమించి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరింపజేయటంలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను పోషించింది.

భారత ప్రభుత్వం అమెరికాతో లోతైన వ్యూహాత్మక స్నేహం బలపరుచుకునేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్న సందర్భంలోనే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండవ అధ్యక్ష పదవీకాలం ప్రారంభం అయిన పిమ్మట ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్ ను ట్రంప్ బహిరంగంగా అవమానిస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నా, భారత నాయకత్వం అతన్ని మంచి చేసుకునే ప్రయత్నాల్లో మునిగినట్లు పరిణామాలు సూచిస్తున్నాయి. అనేక రకాల వ్యాపార రాయితీలను ఇవ్వజూపటం, “అణు ప్రమాద పరిహార చట్టం – 2010” లో అమెరికా కంపెనీలకు అనుకూలమైన సవరణలు చేయటానికి అంగీకరించటం లాంటి సౌకర్యాలను అమెరికా కంపెనీలకు కల్పిస్తామని మోడి ప్రభుత్వం ప్రతిపాదించింది. అణు ప్రమాద పౌర పరిహార చట్టం – 2010, అమెరికా అణు కంపెనీలను భారత మార్కెట్‌లలోకి రానీయకుండా దీర్ఘకాలికంగా అడ్డు కొన్నది. ఈ చట్టం ప్రకారం అణు ప్రమాదం జరిగినట్లయితే అణు ఫ్యాక్టరీ ఆపరేటర్ అనగా అమెరికా కంపెనీ, భారత ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నష్టపరిహారం చెల్లించేందుకు అమెరికా అణు కంపెనీలు సిద్ధంగా లేవు. అందుకే అవి ఇంతవరకూ ఇండియాలో అణు రియాక్టర్లు నెలకొల్పేందుకు సుముఖత చూపలేదు. భారత ప్రజలకు మేలు చేసి అణు ప్రమాద పరిహార చట్టానికి అమెరికా కంపెనీలకు అనుకూలంగా ఉండేలా సవరణలు చేసేందుకు సైతం బిజెపి-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం సిద్ధపడింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద ‘పన్నుల రారాజు’ అని ముద్ర వేసిన నేపధ్యంలో, భారత ప్రధానమంత్రి సాధ్యమైనంత త్వరగా అమెరికా అధ్యక్ష భవనం సందర్శించేలా తగిన ఏర్పాట్లు పొందేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు సాగించింది. చివరికి భారత వలసదారుల పట్ల అమెరికా అవలంబించిన అమానవీయ పద్దతులను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అంత పెద్ద విషయం కాదని కొట్టి పారేసే వరకూ ఈ ప్రయత్నాలు వెళ్ళాయి. భారత వలసదారులను మిలటరీ రవాణా విమానంలో సీట్లకు కాళ్లూ చేతులను కట్టేసి స్వదేశానికి అమెరికా బలవంతంగా రవాణా చేసిన సందర్భంలో, అక్రమ వలసదారులను అలా నిర్బంధంగా ఇండియాకు తిప్పి పంపటం అన్నది, అమెరికా చట్టాల ప్రకారమే జరిగిందని భారత విదేశీ మంత్రి అమెరికా చర్యలను వెనకేసుకు వచ్చాడు. భారతీయులు ఆ దేశ పద్ధతులను, చట్టాలను గౌరవించాలని కూడా జైశంకర్ బోధించాడు. ఆ విధంగా అమెరికాను ప్రసన్నం చేసుకునే చర్యల్లో భాగంగా అక్రమ వలసదారుల పేరుతో భారతీయ వలసదారులకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రచారానికి భారత ప్రధానమంత్రి మద్దతు ప్రకటించాడు కూడా. ఆయన అమెరికా వెళ్లక ముందే, భారత ప్రభుత్వం అనేక అమెరికా వస్తువుల మీద పన్నులను ఏకపక్షంగా తగ్గించింది. వాటిల్లో హార్లే డేవిడ్ సన్ మోటార్ సైకిళ్లు, బర్బన్ విస్కీ కూడా ఉన్నాయి. అమెరికా భారత్ కు చేస్తున్న ఎగుమతుల మీద సుంకాలను సగానికి సగం తగ్గించేందుకు ఇండియా సుముఖత వ్యక్తం చేసింది. ఇండియా ఇవ్వజూపిన ఈ తగ్గింపు విలువ సుమారు 23 బిలియన్ల డాలర్లు ఉండటం గమనార్హం.

ప్రధానమంత్రి మోడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలవటానికి తయారవుతుండగానే, మోడిని అమెరికా అధ్యక్షుని ఓవల్ ఆఫీసుకు ఆహ్వానించేందుకు సరిగ్గా రెండు గంటల ముందు, అమెరికా ప్రభుత్వం ఇండియాకు అవమానకరంగా పరిణమించే చర్యలను చర్యను ప్రకటించింది. భారత దేశ ఎగుమతుల మీద ట్రంప్ విస్తృతమైన ప్రతీకార సుంకాలను ప్రకటించాడు. అది ట్రంప్ ను కలిసేందుకు వస్తున్న భారత ప్రధాన మంత్రి ముందరి కాళ్లకు బంధం వేసే రీతిలో ఆయన నోటికి తాళం వేసేందుకే ఈ ముందస్తు ప్రకటన అని పరిశీలకులు అంచనా వేశారు. (ఆ విధంగా అమెరికా-ఇండియా ప్రభుత్వ నేతల మధ్య జరగనున్న చర్చల్లో తాను ఎలాంటి ధోరణితో వ్యవహరించ నున్నదీ డొనాల్డ్ ట్రంప్ ముందే హెచ్చరించాడని తాత్పర్యం.) అమృత్ సర్ విమానాశ్రయంలో చేతులకూ కాళ్లకూ సంకెళ్లతో దిగిన దాదాపు వంద మందికి పైగా భారత వలసదారుల అమానవీయ వెలివేతకు గాను ట్రంప్ నుండి మోడి సంజాయిషీని డిమాండు చేస్తాడని భారత ప్రజలు కోరుకుంటున్న సమయంలో, ప్రధాని మోడి దానికి బదులుగా రాజీ పద్దతులను ఎంచుకున్నాడు. దృఢంగా వ్యవహరించడానికి బదులు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అనేక వస్తువుల మీద మోడి మరిన్ని సుంకాలపై రాయితీలను ఇవ్వజూపటం ద్వారా భారత నేత భారతీయ రైతుల ప్రయోజనాలను అమెరికా బహుళజాతి వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలకు పాదాక్రాంతం చేశారు.

అంతటితో ఆగకుండా, అమెరికా టెక్ దిగ్గజాలను ఇబ్బంది పెడుతున్న దేశీయ విధానాలను, నియంత్రణలను సమీక్షించటానికి ప్రధాన మంత్రి అంగీకరించాడు. అమెరికా అణు రియాక్టర్ల సరఫరాదారులకు అత్యంత లాభదాయక వాణిజ్య ప్రయోజనాలు కలిగించేందుకు సిద్ధపడ్డాడు. అమెరికా ఉత్పత్తి చేసే చమురు, ద్రవీకరించిన సహజ వాయువు, రక్షణ యంత్రాంగాల కొనుగోలును పెంచుతానని మాటిచ్చాడు. భారత దేశ మాజీ దౌత్యవేత్త ఎం.కే భద్ర కుమార్ మాటల్లో చెప్పాలంటే, “వీటన్నిటినీ ఖండించటానికి ఒకే పదం ఉంది. దళారీ పాలక వర్గాల లొంగుబాటు”.   

ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మోడి నేతృత్వం లోని ఇండియా ఇలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నది. అంతకంతకూ తీవ్రం అవుతున్న భారత్ – పాకిస్తాన్ మిలటరీల యుద్ధ చర్యల విషయంలో ఏదైనా ఒప్పందం కుదిరినట్లయితే, అలాంటి ఒప్పందాన్ని వాస్తవానికి భారత్, పాక్ ప్రకటించాల్సి ఉన్నది. అందుకు బదులు, ఇరు దేశాలు పరస్పర దాడులను ముగించటానికి అంగీకరించాయని ప్రపంచం ముందు ప్రకటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ద్వైపాక్షిక వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం గురించి స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు కోరినప్పటికీ ప్రధానమంత్రి ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ద్వైపాక్షిక వివాదాల్లో, ముఖ్యంగా ఎన్నటికి సమసిపోని కశ్మీర్ వివాదంలాంటి వాటిలో -మూడో పక్షం ప్రమేయానికి భారతదేశం వ్యతిరేకం అనే దీర్ఘకాలిక అవగాహన నుండి ఎందుకు వైదొలిగారో ఆయన చెప్పలేదు. చేయబోయే దాడి గురించి ముందే పాకిస్తాన్ కి ముందే తెలియచేశారా అని రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రి జై శంకర్ ను అడిగినపుడు కూడా అప్రస్తుతమైన కోపాన్ని వెళ్లగక్కటం తప్ప ఆయన ఏమీ చెప్పలేదు.   

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షరీఫ్ ట్రంప్ వాగాడంబర మాటలకు అనుగుణంగానే తమ అవగాహన ఉన్నట్లు సంకేతాలు ఇస్తూ, ప్రాంతీయ శాంతి కోసం, రక్షణ కోసం మాత్రమే యుద్ధ విరమణకు పాకిస్తాన్ తల వొగ్గిందని చెప్పాడు. ఆ విధంగా ట్రంప్ ప్రకటనను తమకు అనుకూలంగా మలుచుకోగలిగాడు. భారత ప్రధానమంత్రి మోడి మాత్రం ఇతర దేశాల ముందు (పాకిస్తాన్ పైన) రాజకీయంగా పై చేయి సాధించినట్లు అభిప్రాయం కలిగించటం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఘర్షణను పరిష్కరించటంలో అమెరికా నిర్మాణాత్మక పాత్రను గుర్తించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటించగా, భారత విదేశాంగ మంత్రి మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన ఇవ్వటానికి నిరాకరించటం ద్వారా, పాకిస్తాన్ మాటలకు విశ్వసనీయతను చేకూర్చాడు. 

ఇరు దేశాల ఘర్షణలు ప్రధానంగా ట్రంప్ పెట్టిన వత్తిడి వలనే తగ్గుముఖం పట్టాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా భారత నాయకత్వం ధోరణి ఇదే పద్ధతిలో కొనసాగింది. తమకు వ్యూహాత్మక మిత్ర దేశాలైన మరో రెండు దేశాలు (ఇండియా, పాకిస్తాన్) ఘర్షణ పడుతూ ఉండటం పట్ల ట్రంప్ సానుకూలంగా లేడన్నది స్పష్టమే. యుద్ధంలో మునిగి ఉన్న రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగేలా చూడటం ద్వారా, గాజా యుద్ధంలో ఉద్రిక్తతలు తగ్గించటం ద్వారా, ఇరాన్ తో అణు ఒప్పందం తరహాలో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా ప్రపంచ దేశాల ముందు తన ప్రతిష్టను పెంచుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఆతృతగా ఉన్నాడు. కానయితే, గాజాపై జరుగుతున్న సామూహిక హత్యాకాండ విషయంలో ట్రంప్ విధానంలో మానవతా కోణం ఏ మాత్రం లేకపోగా సొంత ప్రతిష్ఠ కోసం పాకులాడటం పైనే అది కేంద్రీకృతం అయి ఉన్నది. గ్లోబల్ స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లను అభివృద్ధి చేసి తన కుటుంబానికి భారీగా లబ్ది చేకూర్చే దృష్టితోనే గాజా (పాలస్తీనా) ప్రాంతాన్ని డొనాల్డ్ ట్రంప్ పరిగణిస్తున్నాడని విమర్శకులు తీవ్రంగా తప్పు పడుతుండడం మరొక వాస్తవం.

భారత ప్రధానమంత్రి ఇటీవలి ఉక్రెయిన్ పర్యటించటం, ఆ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్^స్కీ ని పక్కన పెట్టుకుని “యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు” అంటూ వ్యాఖ్యానించటం… ఈ అంశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ పరిగణనలోకి తీసుకొన్నట్లు కనిపిస్తోంది. ‘సీమాంతర ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం’ అంటూ ప్రధాన మంత్రి మోడి అంతర్జాతీయ వేదికలపై ఖండన మండనలు జారీ చేస్తున్నప్పటికీ సదరు ఖండనల పట్ల పుటిన్ ఉదాసీనతతో ఎందుకు ఉన్నాడన్నది ఇది పాక్షికంగానైనా వివరిస్తుంది. ఉక్రెయిన్ పాలక వ్యవస్థలో పాతుకు పోయిన నయా నాజీ గ్రూపుల సారధ్యంలో 2014లో ఉక్రెయిన్ కుట్ర జరిగినప్పటి నుండి డాన్ బాస్ ప్రాంతంలో ప్రజల మీద జరుగుతూ వచ్చిన టెర్రరిస్టు దాడుల గురించి రష్యా ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తున్నప్పటికీ భారత నాయకత్వం ఆ టెర్రరిస్టు దాడులను గుర్తించినట్లు గానీ, రష్యా గోడు పట్టించుకున్నట్లు గానీ ఒక్కసారి కూడా ఆందోళన ప్రకటించటం లాంటిది చేయలేదు. పైగా ఉక్రెయిన్ పై రష్యా దాడిని సాకుగా చూపుతూ పశ్చిమ దేశాలు రష్యా చమురు, సహజ వాయువు, ఎరువుల వాణిజ్యంపై ప్రపంచ స్థాయిలో ఆంక్షలు విధించిన నేపధ్యంలో రాయితీ ధరలకు లభించిన రష్యా చమురు మరియు ఎరువులను దిగుమతి చేసుకోవటం ద్వారా భారీగా ఆర్ధిక లబ్దిని భారత పాలక వర్గాలు పొందారు. మరో పక్క అమెరికాతో వ్యూహాత్మక అనుసంధానం కోసం ఎదురవుతున్న ఒత్తిడికి తల వొగ్గి రష్యా ఆయుధాలపై ఆధారపడడాన్ని స్థిరంగా తగ్గించుకునే ప్రయత్నాల్లో ఇండియా పడిపోయింది.   

క్వాడ్ లోనూ, ఇంకా ఇతర అమెరికా పోషక గ్రూపుల్లో తన పాత్ర ద్వారా అమెరికాతో తమ స్నేహ బాంధవ్యాలు పటిష్టం అయ్యాయని భారత నాయకత్వం భావిస్తుండవచ్చు. అమెరికాతో సరిసమానంగా తాము వ్యూహాత్మక  భాగస్వామిగా ఉన్నామని చెప్పటానికి ఈ అంశాలు రుజువుగా వారికి కనిపిస్తుండవచ్చు. అమెరికా ప్రోద్బలంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాకు సమాన ప్రత్యర్థిగా ఎదుగుతున్నామన్న భావనకు భారతదేశ పాలకవర్గాలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే వాస్తవం మాత్రం అందుకు తగినట్టుగా లేదు. అమెరికా, తనకు లేదా చైనాకు సమాన శక్తిగా భారతదేశం ఎదగటం కంటే తమ సొంత ప్రపంచ రాజకీయ లక్ష్యాలకు వాడుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అసలు ఈ ప్రాంతంలో మరొక చైనాలాంటి శక్తి పెరగటం అమెరికాకు ఇష్టం వుండే అవకాశం ఎంతమాత్రం లేదు. అమెరికా లక్ష్యం స్పష్టమే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియాను శక్తివంతంగా మార్చటం కంటే, బీజింగ్ ను నిలువరించే కృషిలో ఇండియాను ఒక పావుగా ఉపయోగించుకోవటంలోనే అమెరికాకు ఆసక్తి ఉన్నది తప్ప మరో సరికొత్త ప్రత్యర్థిని తయారు చేసుకోవటం అమెరికా లక్ష్యం కాజాలదు.

అత్యంత ఖరీదైన 5వ జనరేషన్ ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను ఇండియా కొనుగోలు చేయాలని అమెరికా లాబీ దారుల నుండి భారత ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వత్తిడి వున్నది. అమెరికా ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయ లెక్కల ప్రకారం ఈ యుద్ధ విమానం జీవితకాలం అయిన 66 సం.ల కాలంలో వాటి కొనుగోలుకు, ఆపరేషన్ కూ, స్థిరమైన పనితనాన్ని కొనసాగించటానికి కనీసం 1.7 ట్రిలియను డాలర్లు అవసరం అవుతుంది. విమానాల తయారీలో జరిగే జాప్యం వలనా, అత్యధిక నిర్వహణా ఖర్చుల భారం వలనా ఇంతటి భారీ వ్యయం మోయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో మోడి అమెరికా వెళ్లినపుడు ఎఫ్-35 జెట్ ఫైటర్ల కొనుగోలుకు అంగీకారం తెలిపాడు. ఏక ధృవ ప్రపంచ సంకటంలో పడి ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న భారత దళారీ పాలకులు, భౌగోళిక రాజకీయ యవనికపై వేగంగా అవతరిస్తున్న బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ పట్ల బొత్తిగా నిద్రావస్థలో ఉన్నట్లు కనిపిస్తున్నది. బహుళ ధృవ ప్రపంచంలో అమెరికా మరియు దాని ఉపగ్రహ రాజ్యాలయిన పశ్చిమ ఐరోపా దేశాలు, ఏక ధృవ ప్రపంచ కాలానికి మల్లే గ్లోబల్ సౌత్ (దక్షిణార్ధ గోళం దేశాలు) దేశాలపై ఏకపక్షంగా తమ ప్రయోజనాలను శాసించే స్థితిలో లేవని భారత పాలకుల దృష్టిలో ఉన్నదా లేదా?

ఇండియా పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న శతృత్వాలకూ, రెండు దేశాల కార్మిక ప్రజానీకం ప్రయోజనాలకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రధానంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటి ఆధిపత్య సామ్రాజ్యవాద శక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కృత్రిమంగా సృష్టించిన తగాదాలలో ఈ ఘర్షణలకు మూలాలు ఉన్నాయి. వలస వాద, వలసానంతర కాలాలలో ఈ శక్తులు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మధ్య తమ ఇష్టా రీతిన సరిహద్దులను నిర్ణయించారు. సరిహద్దుల నిర్ణయాల్లో జాతుల పరంగా, సంస్కృతుల పరంగా, భౌగోళికంగా వాస్తవంగా ఉన్నటువంటి సరిహద్దులకు వారు ఎలాంటి విలువ, గౌరవం ఇవ్వలేదు. వాళ్ల లక్ష్యం ఆయా దేశాల స్థిరత్వం కాదు. తమ దీర్ఘకాల ప్రయోజనాలే పశ్చిమ సామ్రాజ్యవాదుల లక్ష్యం. తప్పనిసరి సరిహద్దు వివాదాలకు విత్తనాలను నాటుతూ వాళ్లు ఆయా దేశాల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకోవటానికి అవకాశాలను పదిల పరచుకున్నారు. వైరి దేశాలు ఎల్లకాలం ఘర్షణల్లో మునిగి తేలుతూ, వివాదాల పరిష్కారం కోసం తమ పైన ఆధారపడి ఉండేలా పరిస్ధితులను తయారు చేసుకుని పక్కకు తప్పుకున్నారు. తద్వారా అధికార మార్పిడుల అనంతరం కూడా తమ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను పదిలం చేసుకున్నారు.

ఈ వ్యాసంలో చెప్పినట్లుగా -దేశ సార్వభౌమత్వాన్ని, లేక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోటానికి మూడో ప్రపంచ దేశాల పాలకవర్గాలకు నిజాయితీగా ఎలాంటి ఆసక్తి లేదు. ప్రజా ప్రయోజనాల సంగతి అటుంచి, కనీసం తమ దీర్ఘకాల వ్యూహాత్మక ప్రయోజనాలను స్థిరం చేసుకోవటంలో తగిన సామర్ధ్యం గానీ ఆసక్తి గానీ వారికి లేవు. ఫలితంగా సామ్రాజ్యవాద శక్తులకు జూనియర్ భాగస్వాములు గానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో వాళ్లు కీలకమైన దేశ వనరులైన భూమి, నీరు, అడవులు, పరిమితమైన ఖనిజ నిక్షేపాలు, పట్టణ మరియు గ్రామాల లోని రియల్ ఎస్టేట్ వనరులు మీద నియంత్రణను సామ్రాజ్యవాద శక్తులకు అప్పగిస్తున్నారు. సామ్రాజ్యవాద ఆధిపత్య శక్తులు ఏది కోరుకుంటే అది అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రక్రియలో దేశీయ ఆధిపత్య శక్తులు దేశీయ అభివృద్ధికి సారధులుగా కాకుండా, విదేశీ దోపిడీకి దళారులుగా వ్యవహరిస్తున్నారు. 

అతి కొద్దిమందిగా ఉన్న విప్లవ శ్రేణులను భద్రతా దళాలు విచక్షణారహితంగా నిర్మూలిస్తున్న ప్రస్తుత కాలంలో, విప్లవ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సరికొత్త సాంకేతిక సాధనాలను ఆకళింపు చేసుకుని వాటి లోతుపాతులను అవగాహన చేసుకుని వాటిని ఉపయోగంలో పెట్టవలసిన కాలం అత్యవసరంగా తరుముకొచ్చింది .          

———-అయిపోయింది. 03-06-2025 01:06 AM

4 thoughts on “యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం

  1. మోడి ట్రంప్ తో అంట కాగడానికి ముఖ్యంగా తన స్నేహితుడైన ఆదాని కేసు విషయం ఎందుకై ఉండకూడదు? లేక కేవం దలారి తనమేనా?

  2. అదాని, అంబాని, టాటా, మూర్తి మొదలైన దళారీ బడా బూర్జువాలకు మన నేతలు ప్రతినిధులు. అది కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా ఎస్ పి ఎన్.సి.పి బి.ఎస్.పి ఇత్యాది అన్నీ ఒక తానులో గుడ్డలే. గ్రూపు ప్రయోజనాల కోసం వేరు పార్టీలు పెట్టారు. పంపకం లో తేడాలు వస్తే కొత్త పార్టీలు పుడతాయి. ఎన్ని పార్టీలు ఉన్నా తమ అదుపులో ఉన్నంత కాలం పశ్చిమ దేశాలు అందరిని అనుమతిస్తారు. తోక జాడిస్తే ఏదోలా కత్తిరిస్తారు. వై ఎస్ ఆర్, కేవలం గోదావరి బేసిన్ చమురు లో వాటా అడిగాడు. ఆయనకీ ప్రమాదం జరిగింది. అదాని పెద్దాయనకి బినామి అన్న రూమర్ ఉంది కదా.

  3. దళారీ వర్గం అంటే అది ఆర్ధిక వర్గమే. కేవలం రాజకీయాలకే పరిమితం కారు. రాజకీయాల ద్వారా ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు.

  4. For information sake, the U.S. develops profiles of all world leaders -including chota mota leaders with potential to influence their countries’ national politics- so as to act on them when need arises. CIA caries out such responsibilities. So not only Adani and other industry leaders, there is every chance that the political leaders also get their own files. For example, it may be recalled that the US diplomats posted in India, almost harassed and accosted Narendra Modi when he was Gujarat CM with questions of govt role in 2002 riots (revealed in wikileaks). It was a way of warning him that they were observing and recording everything. If he denies to cooperate certain actions might be followed. It is well known that Modi was denied US passport till he became Indian PM.

వ్యాఖ్యానించండి