యుద్ధం – వాణిజ్యం: బట్టబయలైన మోడి, ఆయన వంధిమాగధుల దళారి స్వభావం


————-ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి: తేదీ: 03-06-2025

ఆర్టికల్ 370ని రద్దు చేయటం వలన కశ్మీరీ లోయలో శాంతి పునః స్థాపన జరిగిందనీ, ఉగ్రవాదం సమూలంగా నాశనం అయిందనీ, కశ్మీరీలలో అసంతృప్తి తగ్గిపోతోందని -మోడీ, అతని పరివారాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కథ మాత్రం వేరుగా ఉంది. కశ్మీర్ లో పర్యాటకులు సేద తీరే పట్టణం పహల్గామ్ లో జరిగిన ఒకానొక దిగ్బ్రాంతికర సంఘటనలో నలుగురు ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండా ప్రత్యక్షం అయి, 26మంది అమాయక పర్యాటకులను క్రూరంగా చంపేశారు. ఈ సంఖ్యలనూ, విషయాన్నీ మోడి ప్రభుత్వమే నిర్ధారణ చేసింది.

హత్యాకాండ జరిగిన వెనువెంటనే భారత ప్రభుత్వం ఈ దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ తన వాయువ్య పొరుగు దేశమైన పాకిస్తాన్ ను నిందించింది. ఎలాంటి చెప్పుకోదగ్గ రుజువును చూపించకుండా, విచారణను జరపకుండా -భారత విదేశీ కార్యదర్శి ‘సరిహద్దుకు ఆవలి ఉగ్రవాదులు’ అంటూ అస్పష్ట ప్రస్తావన చేశారు. భారత ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను నిశితంగా పరిశీలించకుండా, భారత మీడియా ఎక్కువగా ఆ ఆరోపణలనే ప్రతిధ్వనించింది. దాని వలన పొరుగు దేశమైన పాకిస్తాన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది.  

మొదట్లో భారతప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఊతాన్ని ఇస్తూ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే పెద్దగా పేరు లేని గ్రూపు ఒకటి, పర్యాటకుల మీద జరిగిన క్రూర దాడికి బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేసింది. స్థానికులు కానివారికి శాశ్వత నివాస పత్రాలను ఇవ్వటం ఈ దాడికి కారణంగా పేర్కొంది. ఈ ప్రకటన వెలువడిన వెనువెంటనే భారతప్రభుత్వం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ను లష్కర్ ఏ తోయిబా అనే సాయుధ సంస్థకు అనుసంధానం చేసేసింది. ఈ సంస్థ గురించి భారత నిఘా వర్గాలకు ఎప్పుడో తెలుసునని ప్రకటించేసింది.

అయితే ఇదంతా జరిగిన కొద్ది రోజుల్లోనే, ఏప్రిల్ 26న, పహల్గామ్ ఘటనలో తమ ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ తన ట్విటర్ ఖాతాలో ప్రకటన చేసింది. దాడికి తామే కారణం అని ఏదైతే చెబుతున్నారో, అది కశ్మీరీ ప్రతిఘటనను అపఖ్యాతి పాలు చేయటంలో భాగమని ఆ ప్రకటనలో వాళ్లు చెప్పారు. విస్తృతమైన డిజిటలు యుద్ధ వ్యూహంలో భాగంగా భారత ప్రభుత్వ వర్గాలన్నీ కలిసి తమపై నేరాన్ని అల్లటానికి సైబర్ చొరబాటు చేశారని వాళ్లు ఆరోపణ చేసారు.

పహల్గామ్ హత్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఖండనల ఫలితంగా బహుశా ఈ ప్రతిస్పందన వచ్చి వుండవచ్చు. ఏది ఏమైనా మాజీ అమెరికా, యూకే నిఘా అధికారులతో సహా కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు ఈ ఘటన పట్ల అనుమానాలను వ్యక్తం చేశారు. తమ వాదనలకు సరైన సాక్ష్యాలు లేనప్పటికీ, ఈ దాడి ఇతరులపై నింద వేయటానికి ఉద్దేశించిన చర్య అయివుండవచ్చునని ఈ వర్గాలు సూచించాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత అంతర్జాతీయ విచారణకు అనుమతినివ్వటానికి భారతదేశం ఉత్సాహం చూపకపోవటం విశేషం. ఆరు లక్షల భారత మిలటరీ, పారా మిలటరీ వుండి -ప్రపంచంలోకెల్లా అత్యంత సైనికీకరణ జరిగిన ప్రాంతంలో ఇది ఎలా జరిగిందని పరిశీలకులు ప్రశ్నలు లేవనెత్తారు. 400 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని వచ్చి, ఇంత పెద్ద దాడిని నిర్వహించి, ఏ జాడ లేకుండా ఎలా మాయమవుతారనేది వీరి ప్రశ్న.

దీనికి భిన్నంగా పహల్గామ్ దాడి విషయంలో ఎలాంటి తటస్థ, పారదర్శక, విశ్వసనీయ విచారణకైనా తాము సిద్దమేనని పాకిస్తాన్ ప్రధానమంత్రి  షహ్బాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికా, రష్యా, చైనాతో సహా అనేక దేశాలు ఈ దాడిని ఖండించాయి కానీ, పాకిస్తాన్ ను బాధ్యురాలిగా చేస్తూ భారత్ చేస్తున్న ఆరోపణను ఏ దేశం కూడా బలపరచలేదు. అంతేకాదు, తగాదాను మరింత పెంచుకోకూడదని కోరుతూ, ఇరు దేశాలు సంయమనాన్ని పాటించాల్సిన అవసరాన్ని గట్టిగా నొక్కి చెబుతూ అంతర్జాతీయ ప్రతిస్పందన ఉండింది. టర్కీ, అజర్ బైజాన్ దేశాలు బహిరంగంగా పాకిస్తాన్ ను బలపర్చాయి. దానికి వాటి సొంత భౌగోళిక రాజకీయాలు కారణాలు కావచ్చు. అవి ఈ వ్యాస పరిధిలో లేవు.

అమెరికా తెర వెనుక దౌత్య పరమైన మధ్యవర్తిత్వం వహిస్తుందని చెప్పటానికి స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. 2025 మే 2న, అమెరికా ఇండియా, పాకిస్తాన్ రెండింటితో ‘దగ్గర సంబంధాలతో’ వుందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించాడు. భారత్ ప్రతి చర్యలు సరిహద్దు ఘర్షణలను పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వ కార్యదర్శి మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పెట్ హెగ్సెత్ లు కూడా భారత ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, తన భూభాగం నుండి పని చేస్తున్న ఉగ్రవాదుల్ని వేటాడాలని పాకిస్తాన్ ను కోరారు వాన్స్. ప్రధానమంత్రి మోడి అభిమాన గణం భావోద్వేగాలను సంతృప్తి పరచటానికి ఈ సందేశం ఇచ్చినట్లుగా కనబడుతున్నది. ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ అమెరికా తను భారత్ పట్ల సంఘీభావంతో వుంటుందనీ, తనను తాను రక్షించుకునే భారత్ హక్కుకు మద్దతిస్తుందని హెగ్ సెత్ ప్రకటించాడు. అయితే ఏ విషయంలోనో మాత్రం వివరించలేదు. ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదంలో అమెరికా గత వాగాడంబరాన్ని పోలి ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. స్వయం రక్షణ హక్కు పేరుతో హమాస్ కు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయిల్ ను పదే పదే వెనకేసుకు వచ్చే వ్యాఖ్యలు ప్రధానంగా ఇలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలలోని భాష ఏకపక్షంగా ఉందనే విమర్శ ఉంది. దానికి కారణాలు అందరికీ తెలిసినవే.   

వాళ్లు దేవతల వలే వచ్చారు

మీడియా వర్గాలు, హిందూ మతతత్వ సమూహాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రోజూ యుద్ధ ప్రగల్భాలను ఒక పక్క వెదజల్లుతుండగా, చాలామంది భారత పౌరులు -ముఖ్యంగా ముస్లిములు, కశ్మీరీలతో సహా -పహల్గామ్ దాడిని బహిరంగంగానే ఖండించారు. దృశ్య, ముద్రణా మాధ్యమాల్లో, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో పెచ్చరిల్లిన యుద్ధోన్మాద కథనాలను ఈ సమూహాలు బలంగా నిరసించాయి. విషాదాన్ని ఎన్నికల ప్రయోజనాలకు వాడుకునే రాజకీయ ప్రయత్నాల పట్ల కూడా ఈ వర్గాలు అభ్యంతరాలు  తెలియచేశాయి. ముస్లిములు మాత్రమే కాకుండా, హిందూ పౌరులు కూడా చాలామంది సంయమనంతో ఉండాలని కోరటం విశేషం. మత ఏకీకరణను ఆపాలని కోరుతూ, రెచ్చగొట్టే ప్రసంగాలను తగ్గించాలని, శాంతి స్థాపన మీద దృష్టి పెట్టాలని -వాళ్లు రాజకీయ నాయకులను కోరారు.     

నిజానికి దాడి విషయం బయటకు రాగానే, స్థానిక కాశ్మీరీలే కలగజేసుకొని, ఉగ్రవాదులు పర్యాటకులను చంపనివ్వకుండా తమ ప్రయత్నం చేశారు. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే గుర్రం తోలే వ్యక్తి అందుకు ఒక ఉదాహరణ. పూనా నుండి వచ్చిన కౌస్తుభ్ గన్బోతే, సంతోష్ జగ్దలే అనే ఇద్దరు పర్యాటకులను సాయుధ వ్యక్తులు కాల్చబోతుండగా అతను వారితో గొడవపడ్డాడు. అమాయక ప్రజలను గురి పెట్టి చంపటంలో హంతకుల ఉద్దేశ్యాన్ని ఆదిల్ హుస్సేన్ షా ప్రశ్నించి, వారి చేతిలోని ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశాడు. అందుకు సమాధానంగా అతని గుండెకు గురి పెట్టి మూడుసార్లు కాల్చటంతో అతను అక్కడికక్కడ మరణించాడు. కాశ్మీర్ లోయలో అతని శౌర్యానికి ఎంత ప్రజా గుర్తింపు ఉందో తెలియచేస్తూ, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో సహా వేలాదిమంది ప్రజలు అతని అంత్యక్రియలకు హాజరు అయ్యారు.

పహల్గామ్ దాడిలో తండ్రిని, బాబాయిని కోల్పోయిన అసవరి జగదాలే అనే ఆమె అతను ఘటన స్థలం నుండి పారిపోవటానికి అక్కడి గుర్రం తోలే వ్యక్తి ఎలా సహాయం చేశాడో పూస గుచ్చినట్లు చెప్పింది. కశ్మీరీ టాక్సీ డ్రైవర్ చూపించిన ప్రేమను కూడా గుర్తు చేసుకున్నది. అతను ఇప్పటికీ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె శ్రీనగర్ వదిలి వెళ్లిన తరువాత కూడా ఆమెకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె చెప్పినదాని ప్రకారం అతను మాట్లాడుతున్నపుడు కళ్ల నీళ్ల పర్యంతం అయ్యాడు. వీడ్కోలు సమయంలో ఆమెకు జరిగిన నష్టానికి ప్రగాఢమైన బాధను వ్యక్తం చేశాడు. కశ్మీరీ ప్రజల నుండి అందిన కృతజ్ఞతను, దయను, మద్దతును గుర్తు చేసుకుంటూ ‘దేవుడు పంపిన దేవతలు వాళ్లు’ అన్నదామె.

ఇంకో గుర్రాలు తోలే వ్యక్తి నజకత్ అహమద్ షా (28), ముగ్గురు పిల్లలతో సహా 11మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడాడు. ఆ గందరగోళంలో ఒక  చిన్న దారిని కనుక్కొని కుటుంబాలను అటు వైపు రమ్మని సైగ చేశాడు. వాళ్లు మొదట తమ పిల్లలని కాపాడమని అడిగారు. ఆయన మొదట ఇద్దరు పిల్లలని పట్టుకొని జారుకొని, తరువాత మరో బిడ్డతో పహల్గామ్ పట్టణం వైపు పరుగులు పెట్టాడు. మిగతా వాళ్లకు సహాయం చేయటానికి మళ్లీ వచ్చి, మొత్తం 11మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. అతని నుండి సహాయం పొందిన పర్యాటకులు అతనికి తమ కృతజ్ఞతను సామాజిక మాధ్యమాల ద్వారా తరువాత తెలియచేశారు. మానవత్వాన్ని బతికించినందుకు వాళ్లు అతనికి ధన్యవాదాలు తెలిపారు.

శాలువాలు అమ్ముకుంటూ, టూరిస్టు గైడుగా ఉన్న సాజిద్ అహమద్ భట్ ఒక పిల్లవాడిని వీపు మీద మోస్తూ కొండల్లో పరిగెత్తుతున్న వీడియో అంతటా కనిపించింది. ‘ఈ దాడి మానవత్వం మీద దాడి’ అని అతను అనటాన్ని పిటిఐ కోట్ చేసింది. గాయపడిన వారిని వీపుల మీద మోసుకొని పహల్గామ్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లిన వాళ్లు ఎందరో ఉన్నారు. తక్కువలో తక్కువ 18 నుండి 20 మందిని గుర్రాల మీద మోసుకొని వెళ్లామని భట్ ప్రెస్ వాళ్లకు చెప్పాడు. ఒక హోటలు ఉద్యోగులు ముందే హెచ్చరించి పర్యాటకులను దాడి ప్రాంతానికి పోకుండా కాపాడారు. తుపాకుల శబ్దాలు విని హోటలు ఉద్యోగులు  ప్రమాదాన్ని పసిగట్టారు. ఒక సైనికుడు ఘటనా స్థలానికి పరిగెత్తటం చూసి, వాళ్లు పర్యాటకులను దగ్గరుండి వెనక్కి, హోటలు దగ్గరకు తీసుకొని వచ్చారు.

దాడి జరిగిన సమయమంతా, లక్ష్యానికి గురి అయిన పర్యాటకులను రక్షించటానికి, సహాయం చేయటానికి చాలామంది స్థానిక కశ్మీరీలు సాహసవంతమైన ప్రయత్నాలు చేశారు. స్థానికవాసులు పర్యాటకులకు తమ ఇళ్లల్లో ఆశ్రయం ఇచ్చి, లేకపోతే దగ్గరి అడవుల్లో వాళ్లు దాక్కోవటానికి సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఘటన జరిగిన తరువాత గాయపడిన వారికి ప్రాధమిక చికిత్స చేసి, దగ్గరి ఆసుపత్రులకు రవాణా ఏర్పాటు చేసి -వీళ్లంతా కీలకమైన పాత్ర వహించారు. ఇంకా చాలా కేసుల్లో గాయపడిన వారిని ఏది దొరికితే దాంతో స్వయంగా మోసారు. కశ్మీరీలు ప్రదర్శించిన సాహసం, ప్రేమ, తక్షణ స్పందన  -హింసకు వ్యతిరేకంగా నిక్కచ్చిగా నిలబడ్డాయి. సంక్షోభ సమయంలో వారి మానవత్వాన్ని, సహానుభూతిని ఎత్తి చూపించాయి.   

దురదృష్టవశాత్తు పహల్గామ్ దాడిలో కశ్మీరీలు చూపించిన సాహసం, ప్రేమల మీద భారత ప్రధాన స్రవంతి ముద్రణా, దృశ్య మీడియాలు అతి తక్కువ దృష్టి పెట్టాయి. హింసాత్మక చర్యలు పతాక శీర్షికల్ని  చలాయించి విస్తృతంగా ప్రచారం పొందగా, పర్యాటకులను రక్షించటానికి ప్రాణాలను పణంగా పెట్టి కశ్మీరీ పౌరుల కథనాలను చాలావరకు ఒక మూలకు నెట్టారు. కొన్నిసార్లు ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. మాధ్యమాలు ప్రదర్శించిన మౌనం యాదృచ్చికమైనది కాదు. పాలక బీజేపీ, దాని సైద్ధాంతిక అనుబంధ సంస్థల పట్ల సానుభూతి వున్న ప్రముఖ మీడియా సంస్థలు చాలా ఈ కథనాలను ముందుకు తీసుకొని రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ కథనాలు ఉనికిలో వున్న హిందూ ముస్లిం విభజనకు సవాలు విసిరాయి. కశ్మీరీలు అంటే సాయుధ పోరాటంలో కుట్రలు చేసేవారనీ, వంశానుగతంగా అనుమానితులనీ చెప్పే చిత్రీకరణను సంక్లిష్టం చేసాయి.    

సంచలనం, జాతీయ వాదం, రాజకీయ సంకరణాలు సంపాదక ప్రాధాన్యతలను తీర్చిదిద్దుతున్న భారత మీడియాలో -ఈ కథనాలు ఎక్కువగా కవరేజి పొందక పోవటం విస్తృత ధోరణిగా ప్రతిఫలిస్తోంది. ఈ వాతావరణంలో కశ్మీరీలను మానవీకరించే, వారిని వివాదాల ప్రతినిధులుగా కాకుండా ప్రేమ మూర్తులుగా చూపించే కథలను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయిన కూడా సయ్యద్ హుస్సేన్ ఆదిల్ షా, నజకత్ అహమద్ షా లాంటి వ్యక్తుల శౌర్యాన్ని గురించి  కొన్ని స్వతంత్ర డిజిటల్ వేదికలు, ప్రాంతీయ ప్రచురణలు రాశాయి. బాధితులకు ఆశ్రయం ఇచ్చి, సహాయం చేసిన స్థానికుల విస్తృత ప్రయత్నాలను బయటకు తెచ్చాయి. ఆధిపత్య జాతీయ మీడియా కథనాలకు భిన్నంగా వాళ్ల రిపోర్టులు ముఖ్యంగా ఘటన దగ్గర ఉన్న వ్యక్తుల నుండి సేకరించినవి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు, ఆపద నుండి బయటపడిన వ్యక్తుల సందేశాలు ఒక ప్రత్యామ్నాయ రికార్డును అందించాయి. అవి దాడి కలిగించిన భయోత్పాతాన్ని మాత్రమే కాకుండా, దాడికి ప్రతిఫలనంగా ఉద్భవించిన మానవత్వాన్ని ఎత్తి చూపాయి.

ముఖ్యంగా హిమాన్షీ నరవాల్ అనే యువతి స్పందన అందరినీ కదిలిస్తోంది. ఆమె భర్త 26 సంవత్సరాల వినయ్ నరవల్, పహల్గావ్ దాడిలో హత్యకు గురి అయ్యాడు. అతను హర్యానాకు చెందిన నౌకాదళ అధికారి. ఒక వారం క్రితమే వాళ్ల పెళ్లి అయింది. ఆ సమయంలో హనీమూన్ లో ఉన్నారు. తీవ్రమైన వ్యక్తిగత నష్టం జరిగినప్పటికీ, ఆ విషాదం జరిగిన తరువాత రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయం మీద ఆమె నిలబడింది. ముస్లిముల మీద, కశ్మీరీల మీద కోపాన్ని ప్రదర్శించవద్దని ఆమె బహిరంగంగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో వివిధ పట్టణాల్లో ఉంటున్న కశ్మీరీ వ్యాపారులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న వేధింపులు, అవమానాలు, ఇంకా చెప్పాలంటే భౌతిక దాడుల రిపోర్టులు విన్న తరువాత ఆమె తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

విచారకరంగా ఆమె దయా పూర్వక, హేతుబద్ధ వినతి సామాజిక మాధ్యమాల్లో మతోన్మాద గుంపుల నుండీ, హిందూ తీవ్రవాద గొంతుకల నుండి ద్వేషాన్ని చవిచూసింది. కొంతమంది ఆమె తన భర్త స్మృతులను అగౌరవ పరుస్తుందని అనగా, ఇంకొంతమంది ఆమె స్నేహాల గురించీ, చదువుకునే రోజుల్లో కశ్మీరీ మగ విద్యార్థులతో ఆమె పాత సాహచర్యాల గురించి తీవ్రమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.

——సశేషం

వ్యాఖ్యానించండి