
చాతుర్వర్ణాల హైందవ నాగు భారత దేశ సామాజిక వ్యవస్థను తన విష కౌగిలిలో బంధించి ఉంచడం కొనసాగుతున్నదన్న సంగతిని దేశంలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న ఘటనలు చాచి కొట్టినట్లు చెబుతూనే ఉన్నాయి.
బెంగుళూరుకు చెందిన 35 యేళ్ల వ్యక్తి పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ డ్యూటీలో చేరేందుకు గురుగ్రాంలో ఉన్న కార్పొరేట్ ఆఫీసుకి వెళ్ళడం తోనే మరే ఇతర కొత్త పైలట్ కు ఎదురు కాని కష్టాలు మొదలయ్యాయి.
బెంగుళూరు పోలీసు స్టేషన్ లో దాఖలైన జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న ముగ్గురు సీనియర్ అధికారులు కొత్త పైలట్ ఆఫీసు లోకి ప్రవేశించటం తోనే ఆయనను వేధించటం ప్రారంభించారు.
గురు గ్రాం లోని ఎమార్ క్యాపిటల్ టవర్ 2 లో ఉన్న ఇండిగో విమానయాన సంస్థ ప్రధాన కార్యాలయంలో కొత్త పైలట్ వేధింపులు ఎదుర్కొన్నట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తున్నది. కార్యాలయం లోకి ప్రవేశించగానే అక్కడి అధికారి తపస్ దే అతనితో అవమానకరమైన పద్ధతిలో మాట్లాడుతూ “ముందు నీ ఫోను, బ్యాగ్ రూమ్ బైట పెట్టు” అని ఆజ్ఞాపించాడు. “ఆ తర్వాత నేను ఎదుర్కోబోతున్న అవమానాలు, తిట్లు, వేధింపులు ఎలా ఉండబోతున్నాయో వారి అమానవీయమైన ఆహ్వానం ఒక ఉపోద్ఘాతం లాంటిదని నాకు తర్వాత అర్ధం అయింది” అని పైలట్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ట్రైనీ పైలట్ల కోసం ఏప్రిల్ 28 సాయంత్రం 3:30 కి ఏర్పాటు చేసిన సమావేశం పొడవునా తనను కుల పరమైన వ్యాఖ్యానాలతో, దూషణలతో వేధించారని ఆయన చెప్పాడు. “విమానాన్ని నడపటానికి నువ్వు తగిన వాడివి కావు. ఇంటికి వెళ్లి చెప్పులు కుట్టుకో ఫో!” అనీ, “ఇక్కడ కనీసం వాచ్ మేన్ గా ఉండటానికి కూడా నువ్వు పనికి రావు” అనీ దూషించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు.
తాను షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని అన్న సంగతి పదే పదే గుర్తు చేస్తూ తనను అవమానించటానికి, తన సామాజిక హోదాని కించపరచటానికి వారి వ్యాఖ్యానాలు, దూషణలు ఉద్దేశించబడ్డాయని పైలట్ చెప్పాడు. అధికారులు తపస్ దే, మనీష్ సహాని, కెప్టెన్ రాహుల్ పాటిల్ లు ఈ అవమానాలకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.
వారి వేధింపులు కేవలం దూషణలు, అవమానకర వ్యాఖ్యలతోనే ఆగిపోలేదు. వృత్తి పరంగా తూలనాడుతూ ఆర్థికపరమైన వేధింపులకు గురి చేశారు. ఎలాంటి కారణం లేకుండా కుంటి సాకులు చూపిస్తూ వేతనంలో కోత పెట్టే వాళ్లు. ట్రావెలింగ్ అలవెన్స్ సౌకర్యాన్ని ఏకపక్షంగా రద్దు చేసేవారు. ఎటువంటి సహేతుకత లేకుండా హెచ్చరిక లేఖలు జారీ చేసేవారు. అవసరం లేకుండా రీట్రైనింగ్ (పునఃశిక్షణ) సెషన్లు తనకు మాత్రమే నిర్వహించేవారు.
ఇంకా ఘోరం ఏమిటంటే తన పరిస్ధితి గురించి పై అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. కంపెనీకి చెందిన ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దానితో తప్పనిసరి పరిస్ధితుల్లో ఫిర్యాదుదారు పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. రోజుల తరబడి వేధింపులు కొనసాగించటం ద్వారా తన చేత పైలట్ వృత్తి నుండి రాజీనామా చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెంగుళూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేయగా, సంఘటన గురు గ్రామ్ లో జరిగినందున అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం దానిని గురు గ్రామ్ లోని డి.ఎల్.ఎఫ్ – 1 పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఫిర్యాదు గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక, ఇండిగో ఎయిర్ లైన్స్ ను వివరాలు అడిగినప్పటికీ వారు స్పందించలేదని పత్రిక చెప్పింది.
“మేము సాక్ష్యాలను సేకరించటం ప్రారంభించాము. ఇందులో ఉన్న వ్యక్తులు అందరి నుండి స్టేట్ మెంట్లు సేకరిస్తాము” అని సబ్ ఇన్స్పెక్టర్ దల్వీందర్ సింగ్ చెప్పాడని టిఓఐ తెలియజేసింది.
పైలట్ కోర్స్ లో గానీ, ఆ తర్వాత ట్రైనింగ్ లో గానీ ఎస్.సి, ఎస్.టి, ఓబిసి లకు అర్హతల విషయంలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. పైలట్ కోర్సు ఎస్.సి, ఎస్.టి, ఓబిసి అభ్యర్ధులకు అందుబాటులో ఉంచేందుకు ఫీజు విషయంలో మాత్రమే రాయితీ ఉంటుంది. ప్రతిభ కనబరుస్తే వారికి ప్రత్యేక స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇలా ఆర్థికపరమైన సడలింపులు తప్ప ఇతరత్రా ఎలాంటి రిజర్వేషన్ వారికి అందుబాటులో ఉండదు. ఈ మాత్రం సడలింపు కూడా కేవలం ప్రభుత్వరంగ ఎయిర్ లైన్ కంపెనీలలో మాత్రమే అందుబాటులో ఉన్నది తప్ప ప్రైవేటు విమానయాన సంస్థలో అందుబాటులో లేదు.
ఇండిగో ఎయిర్ లైన్స్, ఒక ప్రైవేటు విమానయాన సంస్థ. కనుక అక్కడ ఫీజు రాయితీ, మెరిట్ స్కాలర్‌షిప్ లాంటివి ఏమీ ఉండవు. కనుక వార్తలోని ఫిర్యాదుదారు షెడ్యూల్డ్ కులానికి చెందినప్పటికీ ఫీజులు అన్నీ పూర్తిగా చెల్లించి, కోర్సులో మరియు శిక్షణలో ప్రతిభ కనబరిచి, ఆ తర్వాతే ట్రైనీ పైలట్ గా ఎంపికయ్యాడు. అయినప్పటికీ ఇండిగో సీనియర్ అధికారులు సంతృప్తి పడలేదు. వారి అభ్యంతరం ఒక ఎస్.సి కులానికి చెందిన వ్యక్తి ఉన్నత స్థాయి ప్రతిభ అవసరం అయిన విమాన పైలట్ ఉద్యోగానికి ఎంపిక కావడమే.
వారి దృష్టిలో హిందూ మతంలో అంటరాని కులాల వాళ్ళుగా అణచ బడ్డ ప్రజలు నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థలో అట్టడుగున ఎల్లకాలం కునారిల్లి పోవాలి తప్ప ప్రతిభ ఉన్నా సరే విమాన పైలట్ లాంటి ఉద్యోగాల స్థాయికి ఎదిగి రాకూడదు. అందులోనూ ప్రైవేటు కంపెనీల ఉద్యోగాలలో కూడా ప్రతిభా సంపత్తులు కనబరుస్తే ఇక తమ సామాజిక హోదా ఎలా నిలబడుతుంది? ఎస్.సి కులపోడు గనుక వాడికి ప్రతిభ ఉండకూడదు, అంతే!
21 వ శతాబ్దం లోనే ఇంత వెనుకబాటుతనంతో కుళ్ళిపోయిన మెదళ్లతో ఇలాంటి అగ్రకుల ప్రతిభా సంపన్నులు ఉండగా, ఇక అంబేద్కర్ జీవించిన 20వ శతాబ్దం ఆరంభ కాలంలో ఎలాంటి దుర్భర పరిస్ధితులు ఆయన, ఇతర దళిత కులాల ప్రజలు ఎదుర్కొన్నారో ఊహించటానికే భయం కొలుపుతోంది.
అయితే భయపడటం కాదు ఇప్పుడు కావలసింది. అంబేద్కర్ ప్రబోధించిన కుల నిర్మూలన లక్ష్యం కోసం మరింత శ్రద్ధతో, పట్టుదలతో ఉద్యమ స్థాయిలో కృషి చేయటమే మనం చేయవలసింది. ఈ కృషిలో ఆదర్శ భావాలు కలిగిన, కుల వ్యతిరేక అభ్యుదయ భావాలు కలిగిన సో-కాల్డ్ అగ్ర కులాల ప్రజలు కూడా కలిసి వస్తేనే అది సఫలం అవుతుంది. దళితుడూ దళితుడూ కలిస్తే దళితులు అవుతారు తప్ప దళితేతరులు కాలేరు. అగ్రకులాల లోని అభ్యుదయ కాముకులను కలుపుకుని ఉద్యమ స్థాయి కృషి చేస్తేనే కుల నిర్మూలన వైపు అడుగులు వేయ గలుగుతాము.
హిందుత్వ మత్తులో అధికార గణం ఉన్నచోట ఆ అభాగ్యుడికి న్యాయం దొరకడం దుర్లభం !