డా|| ఎంఎంఎస్: హోమ్ శాఖ ఆంగ్ల పాండిత్యమా ఇది?


కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో కేంద్ర ప్రజా సమాచార కార్యాలయం నుండి వెలువడిన లేఖ ఒకటి ట్విట్టర్ లేదా ఎక్స్ లో చక్కర్లు కొడుతోంది.

సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ లో జాయింట్ సెక్రటరీ అయిన జి.పార్ధ సారధి సంతకంతో వెలువడిన ఈ లేఖలో ఆంగ్ల భాషకు సంబంధించి దొర్లిన తప్పులు భారత కేంద్ర మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఉన్నతశ్రేణి అధికారుల భాషా పరిజ్ఞానంపై అనుమానాలు కలుగ జేస్తున్నాయి.

ఈ లేఖ, ఎవరైనా ఆర్.టి.ఐ దరఖాస్తు చేసిన ఫలితంగా వెలువడిందా లేక పత్రికలకు సమాచారం నిమిత్తం వెలువడిందా అన్నది తెలియటం లేదు. బహుశా పత్రికలకు సమాచారం ఇచ్చే నిమిత్తం వెలువడిన లేఖ అయి ఉండవచ్చు.

లేఖను కింద చూడవచ్చు.

ఈ లేఖలో ప్రధానంగా రెండు తప్పులు కనిపిస్తున్నాయి.

మొదటి తప్పు: ప్రభుత్వం పూర్తి స్థాయి రాజ్య మర్యాదలతో, లాంఛనాలతో “డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి” దహన కార్యక్రమం నిర్వహించటానికి ప్రభుత్వం నిర్ణయించింది అని రాయటం. దహన కార్యక్రమం నిర్వహించేది “డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి” మాత్రమే. ఏకంగా “డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికే” దహన కార్యక్రమం నిర్వహించకూడదు.

రెండో తప్పు: లేఖలోని చివరి వాక్యానికి అర్ధం ఏమిటో ఒక పట్టాన అంతు పట్టదు. బహుశా will అన్న పదం స్థానంలో with అని ఉండాలి కాబోలు. లేకుంటే “to make arrangements for State funeral will full military honors” అన్న పదబంధానికి ఏ అర్ధమూ రాదు, అది ‘అప్పు తచ్చు’ అయితే తప్ప!

హోమ్ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారి నుండి ఇలాంటి తప్పులు దొర్లకూడదు. అందునా మరణం సంభవించిన సందర్భంలో. అది కూడా భారత దేశంలో సరికొత్త ఆర్ధిక వ్యవస్థను నిర్మించి నవ ఆర్ధిక శకానికి నాంది పలికిన వ్యక్తిగా దేశ దేశాల్లో కీర్తించబడుతూ, ఏకంగా పదేళ్ళు దేశ ప్రధానిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి వారి విషయంలో అలాంటి తప్పు అసలే దొర్లకూడదు.

ఆయన ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు-ఐఎంఎఫ్ లు, ఆర్ధిక సంక్షోభంలో భారతదేశం ఉన్నట్లు చెప్పబడుతున్న కష్ట కాలాన్ని అవకాశంగా తీసుకుని, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు అమలు చేసి తీరాలన్న ఘోరమైన షరతులతో అప్పులు ఇచ్చి, నూతన ఆర్ధిక విధానాలను దేశంపై బలవంతంగా రుద్ది, తద్వారా దేశంలోని మానవ (శ్రామిక), నీటి, ఖనిజ, అటవీ, పారిశ్రామిక వనరులను విదేశీ/పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టడమే కాకుండా దేశంలోని కార్పొరేట్ కంపెనీల సంపదలు పదుల రెట్లు పెరిగేందుకు దోహదం చేసి, ప్రజల జేబులకు అడుగు (bottom) అన్నదే లేకుండా చేసేందుకే దోహదం చేశాయి అన్నది వేరే సంగతి!

డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి దహన సంస్కారం నిమిత్తం మరియు మెమోరియల్ నిర్మాణం నిమిత్తం స్థలాన్ని ఎక్కడ కేటాయించాలి అన్న విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య విభేదాలు తలెత్తాయి.

ప్రభుత్వ ప్రముఖుల పార్ధివ దేహాలను దహనం/ఖననం చేసే ‘నిగమ్ బోధ్’ లో అంతిమ క్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతిమ క్రియల అనంతరం ఒక మెమోరియల్ కూడా నిర్మించేందుకు వీలుగా, ఢిల్లీలో ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి అక్కడే అంతిమ క్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

మరణించిన మాజీ ప్రధాన మంత్రులు అందరికీ ఉమ్మడి స్మశాన స్థలం కేటాయించాలని యు.పి.ఏ ప్రభుత్వమే నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షం వైపు లేదా కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపింది. అతల్ బిహారీ వాజ్ పేయి కి 7 ఎకరాల స్థలం కేటాయించి అక్కడ మ్యూజియం కూడా నిర్మించిన సంగతిని కాంగ్రెస్ ఎత్తి చూపింది.

సిక్కు ధర్మం ప్రకారం దహనం, ఖననం ఏదైనా చేయవచ్చు. కానీ మరణించిన వారి కోసం స్తూపం లేదా మెమోరియల్ లాంటివి నిర్మించ కూడదు. హిందూ మతం లాగానే సిక్కు మతం కూడా దేహం ఆశాశ్వతం అనీ ఆత్మ మాత్రమే శాశ్వతమనీ, ఒక దేహాన్ని వదిలి పెట్టిన ఆత్మ మరో దేహం లోకి ప్రవేశిస్తుందని నమ్ముతుంది. పునర్జన్మలను నమ్ముతుంది. ఆశాశ్వతమైన దేహం కోసం స్మృతి లేదా స్మారక చిహ్నం, మెమోరియల్స్ నిర్మించటం వృధా అని నమ్ముతుంది.

“ఒక ప్రధమ సిక్కు ప్రధాన మంత్రి మరణిస్తే, ఆయన స్మారక నిర్మాణానికి ఒక స్థలం కేటాయించటానికి ప్రభుత్వం అంగీకరించకపోవటం ద్వారా డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అవమానం మిగిల్చారు” అని కాంగ్రెస్ నిందించింది. ప్రధమ సిక్కు ప్రధాని అనటం ద్వారా కాంగ్రెస్ పార్టీ సమస్యను రాజకీయం చేసేందుకు నిర్ణయించింది అన్నది స్పష్టమే.

చివరికి ప్రభుత్వమే దిగివచ్చి, త్వరలో కేబినెట్ సమావేశం జరిపి ప్రత్యేక స్థలం కేటాయిస్తామని, మెమోరియల్ నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

ఈ గడబిడ కారణంగానే సి‌పి‌ఐ‌ఓ చేసిన పై ప్రకటన హడావుడిగా వెలువడి ఉండవచ్చు. అయినా కానీ రెండో తప్పు వరకు సరి పెట్టుకున్నా, మొదటి తప్పు మాత్రం జరిగి ఉండకూడదు. అసలు ఇదంతా అసంగత చర్చ, ఆయనే పరమపదించిన తర్వాత ఇంత చర్చ వ్యర్ధమే అంటారా? ఇక సమస్యే లేదు.

DISCLAIMER: ట్విట్టర్ / ఎక్స్ లో అందుబాటులో ఉన్న లేఖ అధికారికంగా వెలువడిందా లేక కృత్రిమంగా సృష్టించబడిందా అన్న సంగతి ఈ బ్లాగర్ కి తెలియదు. కృత్రిమం కావచ్చు లేదా నిజమైనదే అయినా కావచ్చు. జి. పార్ధ సారధి గారు ఎవరా అని వెతికితే హోమ్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో కింద ఉదహరించిన జాబితా లభించింది. ఇక మిగిలింది వారి వారి ఊహాశక్తికి వదిలి పెట్టవలసిందే.

2 thoughts on “డా|| ఎంఎంఎస్: హోమ్ శాఖ ఆంగ్ల పాండిత్యమా ఇది?

  1. ప్రభుత్వ ప్రముఖుల పార్ధివ దేశాలను దహనం/ఖననం చేసే ‘నిగమ్ బోధ్’ లో అంతిమ క్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    “దేహాలను” బదులు దేశాలను అని ఉంది.

  2. అవును. దేహం అని టైప్ చేసినప్పుడల్లా దేశం అని టైప్ అయింది. విండోస్ 11 లో తెలుగు టైపింగ్ కోసం వియోగించే ఇండిక్ తెలుగు టూల్ సరిగా పని చేయటం లేదు. కొన్ని అక్షరాలు, వత్తులు మనం కోరుకున్నట్లు కాకుండా వాడి ప్రోగ్రాం ప్రకారమే టైప్ అవుతున్నాయి. మళ్ళీ లేఖినికి వెళ్ళి అక్కడ టైప్ చేసి, అక్కడి నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే తప్ప పని కావటం లేదు. ఆ ఓపిక లేక ఒక్కోసారి తప్పుల్ని అలాగే వదిలేస్తున్నాను.

వ్యాఖ్యానించండి