అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్


యుపిఏ 2.0 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్ని వైపుల నుండీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2జి సెక్ట్రమ్ స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కామ్, హెలికాప్టర్ స్కాం, ఇలా అనేక స్కాం లు వరస బెట్టి వెలుగు చూడటం వలన అసలు దోషులకు బదులు ప్రధాన మంత్రి పదవిలో ఉన్న డా. మన్మోహన్ సింగ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టబడ్డాయి.

ఎన్ని విమర్శలు వచ్చినా చాలా కాలం వరకు డా. మన్మోహన్ సింగ్ విమర్శలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. దానితో మరిన్ని విమర్శలు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. “నేనుగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదు” అని మాత్రమే చెబుతూ వచ్చారు.

నిజానికి యుపిఏ హయాంలో జరిగిన కుంభకోణాలకు బాధ్యులలో అప్పటి ప్రధాన మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ ఒకరు అనడంలో సందేహం లేదు. అత్యంత కీలకమైన పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్, “నేను అవినీతికి పాల్పడలేదు” అని చెప్పి తన బాధ్యత నుండి తప్పించుకోజాలరు. తాను అవినీతికి పాల్పడకపోవడమే కాకుండా ఇతర మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారులు అవినీతికి పాల్పడకుండా చూడవలసిన బాధ్యత ప్రధాన మంత్రి పైన తప్పనిసరిగా ఉంటుంది.

డా. మన్మోహన్ సింగ్ ను విమర్శించిన వారిలో అప్పటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అగ్రభాగాన నిలిచారు. ఇతరులు “కేంద్ర ప్రభుత్వానికి” లో ‘పాలసీ పెరాలసిస్’ వచ్చిందని, సంస్కరణలు మందగించాయని విమర్శించారు. కానీ నరేంద్ర మోడి మాత్రం, ప్రభుత్వం పైన కాకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ పైన వ్యక్తిగతమైన విమర్శలు చేయటం ద్వారా పత్రికల్లో, వార్తా ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆకర్షించారు.

‘పాలసీ పెరాలసిస్’ అన్న విమర్శ ప్రజల వైపు నుండి వచ్చిన విమర్శ కాదు. ఈ విమర్శ వెనుక ఉన్నది విదేశీ బహుళజాతి కంపెనీలు, ఆ కంపెనీల నుండి కమీషన్లు, అప్పులు తీసుకునే దేశీయ కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. సంస్కరణల ద్వారా మొత్తం లబ్ది పొందినదీ, పొందుతున్నదీ వాళ్ళే మరి! అయితే పత్రికల్లో, చానెళ్లలో వచ్చే ఈ విమర్శలను ప్రజలు సొంతం చేసుకోవటం కద్దు.

భారత ప్రజలు (నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు… ఇలా అందరూ) తీవ్రంగా నష్టపోయారు. పబ్లిక్ సెక్టార్ అమ్మకానికి పెట్టడంతో ఉద్యోగాలు కరువైనాయి. కోట్లమంది నిరుద్యోగ సైన్యం తయారయింది. రైతులకు ఎరువుల సబ్సిడీలు, ఇన్-పుట్ సబ్సిడీలు, కనీస గిట్టుబాటు ధరలు ఇవ్వటం పాపంగా పరిగణించటం వలన కోట్లాది మంది రైతాంగం జీవన స్థాయి అడుగంటింది. లక్షలాది మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ అంశాలు మాత్రం కేవలం ఎన్నికల ముందు ప్రతిపక్షాల వాళ్ళు చర్చకు తెస్తారు.

ఏ సంస్కరణలైతే సకల రంగాల ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చాయో, అవే సంస్కరణలను సరిగ్గా అమలు చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ సంస్కరణల వల్లనే ప్రజల జీవన స్థితిగతులు అధోగతి పాలైన సంగతి ప్రతిపక్షాలు చెప్పలేదు, చెప్పవు కూడా. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఆ సంస్కరణల విధానాలనే తాము కూడా అమలు చేయాలి గనుక. యుపిఏ 2.0 తర్వాత అధికారం చేపట్టిన ఎన్.డి.ఏ 2.0, ఎన్.డి.ఏ 3.0 ప్రభుత్వాలు మరింత తీవ్రంగా సంస్కరణలు అమలు చేశాయి తప్ప ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు. ఎన్.డి.ఏ 4.0 హయాంలో కూడా అదే జరుగుతోంది అని వేరే చప్పనవసరం లేదు.

ఇప్పటి ప్రధాన మంత్రి, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, డా. మన్మోహన్ సింగ్ ను “బలహీన ప్రధాన మంత్రి” అని విమర్శించారు. “మౌనీ బాబా” అంటూ హేళన చేశాడు. ఈ విమర్శలకు తన పదవీకాలం చివరి దశలో డా. మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పారు. ఆయన ఇచ్చిన సమాధానం లోని కొంత భాగాన్ని కింద లంకె లోని ట్విట్టర్ వీడియోలో చూడవచ్చు.

https://twitter.com/i/status/1872584656761286786

ఈ వీడియోలో ఆయన “బలమైన ప్రధాన మంత్రి అంటే మీ అర్ధం ఏమిటి? మీ పర్యవేక్షణలో అహ్మదాబాద్ వీధుల్లో అమాయక పౌరుల పైన దారుణ మైన సామూహిక హత్యాకాండను అమలు చేస్తే.., మీ దృష్టిలో అదే అసలైన బల ప్రదర్శనకు కొలబద్ద అయితే… ఈ దేశానికి అవసరమైనది అటువంటి బలం కాదనీ, ముఖ్యంగా ప్రధాన మంత్రిలో కనీసంగా కూడా అలాంటి బలం ఉండవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను” అని నరేంద్ర మోడీకి సమాధానం ఇచ్చారు.

ఇటువంటి బలమైన విమర్శను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి పైన ఎక్కుపెట్టిన వారు అప్పట్లో లేరు, ఇప్పటికీ లేరు. ఎన్.డి.ఏ 1.0 హయాంలో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి నరేంద్ర మోడిని విమర్శిస్తూ “గుజరాత్ ముఖ్యమంత్రి తన రాజధర్మాన్ని నిర్వర్తించలేదు” అని పరోక్షంగా విమర్శించారు తప్ప ప్రత్యక్ష విమర్శ చేయలేదు. మోడిని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని వాజ్ పేయి భావించగా, ఎల్.కె అద్వానీ ఆయనను వారించారని పత్రికలు చెప్పటం తప్ప నిజం ఏమిటో తెలియదు.

డా. మన్మోహన్ సింగ్ ఒక్కరే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో గుజరాత్ ప్రజలపైన సామూహిక హత్యాకాండ జరిగిందని “దాదాపు” ప్రత్యక్షంగా విమర్శించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, ఇతర గుజరాత్ కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఈ తరహాలో నరేంద్ర మోడి ని విమర్శించలేకపోయారు. మన్మోహన్ సింగ్ విమర్శ వెనుక సోనియా గాంధీ మద్దతు ఉంటే ఉండవచ్చు.

అప్పటికే గుజరాత్ సామూహిక హత్యాకాండలో గుజరాత్ ప్రజలే పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నదని చెబుతూ “ఇది గుజరాత్ గౌరవానికే అవమానం” అని నినాదం ఇవ్వటం ద్వారా అప్పటికే కాంగ్రెస్ పరోక్ష విమర్శలను కూడా తనకు ప్రత్యక్ష అనుకూలతగా మోడి మార్చుకోవటంతో సోనియా, రాహుల్ లు నోరు మెదపలేకపోయారు.

One thought on “అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్

  1. భారత ప్రజలు (నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు… ఇలా అందరూ) తీవ్రంగా నష్టపోయారు. పబ్లిక్ సెక్టార్ అమ్మకానికి పెట్టడంతో ఉద్యోగాలు కరువైనాయి. కోట్లమంది నిరుద్యోగ సైన్యం తయారయింది. రైతులకు ఎరువుల సబ్సిడీలు, ఇన్-పుట్ సబ్సిడీలు, కనీస గిట్టుబాటు ధరలు ఇవ్వటం పాపంగా పరిగణించటం వలన కోట్లాది మంది రైతాంగం జీవన స్థాయి అడుగంటింది. లక్షలాది మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ అంశాలు మాత్రం కేవలం ఎన్నికల ముందు ప్రతిపక్షాల వాళ్ళు చర్చకు తెస్తారు.

    సర్, పై వాటికి చెందిన సమగ్ర వివరాలు లభించే సోర్సెస్ ( పుస్తక రూపంలో గానీ, మరే విధంగా అయినా) ఉంటే తెలియజేయండి.

వ్యాఖ్యానించండి