బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?


బ్రిక్స్ కూటమి 16వ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు బ్రిక్స్ కరెన్సీ పేరుతో ఒక నమూనా నోట్ ను బహూకరించటం ఇండియాలో కలకలం రేగటానికి కారణం అయింది. కరెన్సీ నోట్ నమూనా పైన భారత దేశం తరపున భారత జాతీయ పతాకంతో పాటు తాజ్ మహల్ బొమ్మ కూడా ఉండటం ఈ కలకాలానికి ప్రధాన కారణం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2014 లో అధికారం చేపట్టిన తర్వాత వివిధ ముస్లిం మత నిర్మాణాలకు, వివిధ పట్టణాలకు ఉన్న ముస్లిం పేర్లకు వ్యతిరేకంగా కొన్ని ఫ్రింజ్ మత సంస్థలు వివాదం రేపుతూ వచ్చాయి. ఢిల్లీ లోని కుతుబ్ మీనార్, హైద్రాబాద్ లోని ఛార్మినార్, ఆగ్రా లోని తాజ్ మహల్ అటువంటి నిర్మాణాలలో కొన్ని.

తాజ్ మహల్ ను బ్రిక్స్ నోట్ మాక్-అప్ (అనుకరణ నమూనా) పైన ముద్రించటం పట్ల సామాజిక వెబ్ సైట్లలో అనుకూల ప్రతికూల వ్యాఖ్యలు జోరందుకున్నాయి. తాజ్ మహల్ కు బదులు అశోక్ చక్రాన్ని ముద్రించాలని కొందరు వాదించగా, మరి కొందరు ఏకంగా అయోధ్య లోని రామ మందిరం ముద్రించాలని కోరారు.

తాజ్ మహల్ పట్ల తమకు వ్యతిరేకత లేదని కానీ అంతకు మించిన కట్టడాలు సౌత్ ఇండియాలో ఉన్నాయని, ఉదాహరణకు మధుర మీనాక్షి ఆలయం ముద్రించ వచ్చని అభిప్రాయాలు మరి కొందరు వ్యక్తం చేశారు.

అయితే బ్రిక్స్ కూటమి అధికారికంగా ఎలాంటి ఉమ్మడి కరెన్సీని ఇంతవరకు ప్రకటించలేదు. డాలర్ పై ఆధార పడటం తగ్గించే లక్ష్యంతో ప్రత్యామ్నాయ కరెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న అంశంపై అనేక యేళ్లుగా చర్చలు జరుతున్న మాట వాస్తవం. కానీ అది ఉమ్మడి కరెన్సీ నోటు రూపంలో ఉంటుందని అధికారికంగా బ్రిక్స్ ఇంతవరకు చెప్పలేదు.

అక్టోబర్ 23 తేదీన జరిగిన సమావేశాల్లో చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ బ్రిక్స్ కూటమి ఉమ్మడి చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ఒక చారిత్రక ప్రకటన చేశాడు. బ్రిక్స్ కూటమికి నూతన చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆయన వివరించాడు. “అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ ను సంస్కరించ వలసిన అత్యవసర కర్తవ్యం నేటి పరిస్ధితులలో ఏర్పడింది” అని జిన్ పింగ్ చెప్పాడు.

“నూతన చెల్లింపుల వ్యవస్థను ప్రమోట్ చేయటంలో బ్రిక్స్ నాయకత్వ పాత్ర వహించి తీరాలి. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ధిక బలాబలాల సమతూకంలో తీవ్ర స్థాయిలో వచ్చిన మార్పులను ఈ నూతన చెల్లింపుల వ్యవస్థ ప్రతిబింబించాలి” అని ఆయన వివరించాడు.

నూతన చెల్లింపుల వ్యవస్థ ఎలా ఉండబోతోంది? డాలర్ ఆధిపత్య నిర్మూలన దిశలో బ్లాక్ చెయిన్ ఆధారిత బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేయటం అభిలషణీయం అన్నది ప్రధాన అభిప్రాయంగా ఉంటూ వచ్చింది. తద్వారా పశ్చిమ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన SWIFT చెల్లింపుల వ్యవస్థను అధిగమిస్తూ పురోగతి సాధించవచ్చని బ్రిక్స్ కూటమి భావిస్తున్నది. తద్వారా బ్రిక్స్ సభ్య దేశాల కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించటానికి తగిన అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నట్లు వార్తలు తెలియజేస్తున్నాయి.

అయితే బ్రిక్స్ కరెన్సీ గురించిన ఆలోచనలు కూడా లేకపోలేదు. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే బ్రిక్స్ కరెన్సీకి 40 శాతం బంగారం మద్దతు, మిగిలిన 60 శాతం స్థానిక కరెన్సీల మద్దతు ఉండేలా బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేయాలని ఒక తాత్కాలిక అవగాహన ఏర్పడినట్లు తెలుస్తున్నది. యువాన్, రూబుల్, రూపాయి, రియల్, ర్యాండ్ లాంటి స్థానిక కరెన్సీల మద్దతు కొత్త కరెన్సీకి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే కాజన్ సమావేశాల్లో ఉమ్మడి కరెన్సీ సృష్టి గురించి ఎలాంటి చర్చలు జరగడం లేదని అక్టోబర్ 22 తేదీన బ్రెజిల్ విదేశీ శాఖ ప్రతినిధి ఎడ్వర్డో పేస్ సాబోయా, బ్రెజిల్ పత్రికలకు చెప్పాడు. చెల్లింపుల ప్లాట్ ఫార్మ్ గురించి జాతీయ కరెన్సీల వినియోగం గురించీ మాత్రమే చర్చ జరుగుతున్నదని ఆయన స్పుత్నిక్ న్యూస్ పత్రికకు చెప్పాడు.

“బ్రిక్స్ కరెన్సీ చర్చల్లాంటివి ఏవీ జరగటం లేదు. పేమెంట్ ప్లాట్ ఫార్మ్ ల గురించి, జాతీయ కరెన్సీల వినియోగం గురించి వివిధ స్థాయిల్లో సాంకేతిక చర్చలు జరుగుతున్నాయంతే. ఆర్ధిక మంత్రిత్వ శాఖలు మరియు సెంట్రల్ బ్యాంకుల స్థాయిలో ఈ అంశాలను చర్చిస్తున్నారు. జోహాన్స్ బర్గ్ లో 2023 లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో వారికి ఆ బాధ్యతను అప్పగించారు. ఇవి పూర్తిగా సాంకేతికమైన అంశాలు” అని ఆయన చెప్పాడు.

నిజానికి పుతిన్ కి బహూకరించబడిన నమూనా నోటు కూడా 2023 నాటిదే కావటం గమనార్హం. ఎందుకంటే కరెన్సీకి రెండో వైపున ‘రిపబ్లిక్ అర్జెంటీనా’ అని కూడా ముద్రించి ఉండటమే అందుకు తార్కాణం. అర్జెంటీనా 2024 సమావేశాలకు హాజరు కాలేదు. గత యేడు నూతన సభ్యులుగా చేరానున్నట్లు ప్రకటించిన దేశాల్లో అర్జెంటీనా కూడా ఉన్నది. అయితే 2023 బ్రిక్స్ సమావేశాల అనంతరం 22 అక్టోబర్ 2023 తేదీన జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడుగా ఎన్నికయిన మితవాద అభ్యర్ధి జేవియర్ మిలీ “అర్జెంటీనా బ్రిక్స్ కూటమిలో చేరటం లేదు” అని ప్రకటించాడు. ఆ దేశ దరఖాస్తును వెనక్కి తీసుకున్నాడు. అందుకు కారణం జేవియర్ మిలీ అమెరికాకు మద్దతుదారుడు కావటమే.

ప్రారంభ రౌండ్ ఎన్నికల్లో వామ పక్ష అభ్యర్ధిగా అభివర్ణించబడిన సెంటర్-లెఫ్ట్ అభ్యర్ధి సెర్గియో మాస్సా అత్యధికంగా 36 శాతం ఓట్లు రాగా జేవియర్ మిలీకి 30 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం జరిగిన రనాఫ్ ఎన్నికల్లో అనూహ్యంగా జేవియర్ మిలీ 55.7 శాతం ఓట్లతో విజయం సాధించగా మాస్సా 44.35 శాతం ఓట్లతో ఓడిపోయాడు. ఎన్నికల్లో గెలిచీ గెలవటం తోనే మిలీ, బ్రిక్స్ సభ్యత్వం కోసం అర్జెంటీనా పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.

2024 కాజన్ సమావేశాలకు భాగస్వామ్య రాజ్యాలుగా హాజరు కావాలని 13 దేశాలను బ్రిక్స్ కూటమి ఆహ్వానించింది. అవి: టర్కియే, ఇండోనేషియా, అల్జీరియా, బెలారస్, క్యూబా, బొలీవియా, మలేషియా, ఉజ్బెకిస్తాన్, కజఖ్ స్తాన్, ధాయిలాండ్, వియత్నాం, నైజీరియా, ఉగాండా. ఆహ్వానం మేరకు ఈ 13 దేశాలు తమ ప్రతినిధులను పంపాయి. వెనిజులా కూడా ఆసక్తి చూపినప్పటికీ ఆ దేశానికి ఆహ్వానం పంపటాన్ని బ్రెజిల్ వీటో చేసింది. అమెరికా ఆంక్షల కింద మగ్గుతున్న చమురు దేశం వెనిజులా చేరికను బ్రెజిల్ వ్యతిరేకించటం బహుళ ధృవ ప్రపంచ ఏర్పాటు లక్ష్యానికి ప్రతికూలమే గానీ అనూహ్యం కాదు.

Venezuela President Nikolas Maduro

వెనిజులా చేరికను బ్రెజిల్ వ్యతిరేకించటానికి కారణం బ్రెజిల్ అనుసరిస్తున్న ‘రెండు పడవల పై కాళ్ళు పెట్టి ప్రయాణించే’ విధానమే. అమెరికా, ఐరోపా దేశాలతో సంబంధాలు చెడగొట్టుకోవటం బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వాకు ఇష్టం లేదు. అయినప్పటికీ అర్జెంటీనాకు ఎప్పుడు సభ్యత్వం ఇచ్చేదీ నిర్ణయించే అంశాన్ని బ్రెజిల్ కే వదిలి పెట్టే అవగాహనతో అర్జెంటీనాను పుటిన్ స్వయంగా ఆహ్వానించాడు. పుటిన్ ఆహ్వానం మేరకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కాజన్ సమావేశాలకు హాజరయ్యాడు కూడా.

ఇటీవల జరిగిన వెనిజులా ఎన్నికల్లో నికోలస్ మదురో, అవినీతి పద్ధతుల్లో గెలిచాడని అమెరికా ప్రకటించింది. మదురో ఎన్నికను గుర్తించేందుకు నిరాకరించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా, అమెరికాను అనుసరిస్తూ మదురో ఎన్నికను గుర్తించలేదు. కేవలం ఆర్ధిక సంబంధాల కోసమే బ్రెజిల్, బ్రిక్స్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంగతి దాదాపు బహిరంగ రహస్యమే. బ్రిక్స్ కూటమి నుండి ఆర్ధిక లబ్ది పొందుతూ అమెరికా, ఐరోపాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం బ్రెజిల్ లక్ష్యం.

కానీ వెనిజులా, అమెరికా ఆధిపత్యాన్ని ససేమిరా తిరస్కరిస్తుంది. ఏ విధంగా కూడా అమెరికా అదుపాజ్ఞలకు లోబడి ఉండటం ఆ దేశానికి ఇష్టం లేదు. గత అధ్యక్షుడు హ్యూగో ఛావేజ్, అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు కూడా ఆయన ఎన్నికను అమెరికా గుర్తించలేదు. వెనిజులా చమురు తవ్వకాలకు అమెరికా కంపెనీలను అనుమతించకపోవటంతో ఆ దేశంపై కక్ష కట్టి తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నది. తన వారసుడుగా ఛావెజ్ స్వయంగా ప్రకటించిన మదురో విషయంలోనూ అమెరికా అదే విధానం అనుసరిస్తున్నది.

వెనిజులా అనుసరిస్తున్న పక్కా అమెరికా వ్యతిరేక విధానం తనకు సమస్య అవుతుందని బ్రెజిల్ భావిస్తున్నది. రష్యా, చైనాలతో లోతైన సంబంధాలు ఏర్పరచుకున్న వెనిజులా బ్రిక్స్ లో చేరినట్లయితే బ్రిక్స్ కూటమి మరింత శక్తివంతంగా బహుళధృవ ప్రపంచ ఏర్పాటు దిశగా ప్రయాణం చేస్తుందని బ్రెజిల్ భయపడుతోంది. అది జరిగితే అమెరికా, ఐరోపాలతో బ్రెజిల్ సంబంధాలు దెబ్బ తినడం ఖాయం.

వెనిజులా – అమెరికాల మధ్య ఉన్న శత్రు సంబంధాలలో న్యూట్రల్ పాత్ర పోషిస్తున్నట్లు బ్రెజిల్ ఇప్పుడు నటిస్తున్నది. వెనిజులా బ్రిక్స్ లో చేరితే ఈ నటన సాధ్యం కాదు. వెనిజులా చేరిన పక్షంలో వెనిజులా – అమెరికా ఘర్షణలో, బ్రెజిల్ సాటి బ్రిక్స్ సభ్య దేశం అయిన వెనిజులాకు అనివార్యంగా మద్దతు ఇవ్వవలసి వస్తుంది. అంటే అమెరికాను వ్యతిరేకిస్తూ వెనిజులాకు అండగా నిలవాల్సి ఉంటుంది.

ఈ రెండు కారణాలు, ఒకటి: వెనిజులా చేరిక బ్రిక్స్ కూటమిని దూకుడుగా బహుళ ధృవ ప్రపంచ స్థిరీకరణ వైపుగా వేగంగా తీసుకెళ్ళేందుకు దోహదం చేయటం; రెండు: వెనిజులా – అమెరికా ఘర్షణలో అమెరికాను వ్యతిరేకించి వెనిజులాకు మద్దతు ఇవ్వవలసి రావటం…. వెనిజులా సభ్యత్వాన్ని బ్రెజిల్ వీటో చేసేందుకు దారి తీసింది.

అనగా బ్రిక్స్ కూటమిలో ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా గోడ మీద పిల్లి వాటం అనుసరిస్తున్నది. ఈ రెండు దేశాలు ఓ వైపు అమెరికా, ఐరోపాలతో సత్సంబంధాలు కలిగి ఉంటూనే బ్రిక్స్ సభ్యత్వం ద్వారా చేకూరుతున్న అంతర్జాతీయ ప్రతిష్ట, ఆర్ధిక లబ్దిని పొందుతున్నాయి.

అయితే మరో 10 సభ్య దేశాలు, మరో 12 భాగస్వామ్య దేశాలతో పాటు మరో 30 గ్లోబల్ సౌత్ దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరేందుకు సుముఖంగా ఉన్న నేపధ్యంలో భవిష్యత్తులో గోడ మీద పిల్లి దేశాలు ఆటో, ఇటో ఒక్క శిబిరం లోనే రెండు కాళ్ళు ఉంచి నిలబడవలసిన పరిస్ధితి రావచ్చు. అప్పటి వరకు గో.పి దేశాల ఆటలు సాగుతాయి. కానీ 140 కోట్ల జనాభాతో విలసిల్లుతున్న ఇండియాను బ్రిక్స్ కూటమి వదులుకునే సాహసానికి పూనుకునే అవకాశం చాలా చాలా తక్కువ.

3 thoughts on “బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?

వ్యాఖ్యానించండి