బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి


రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు.

అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా రాజీలేని ధోరణి అవలంబిస్తుందని మోడి ప్రకటించాడు. మోడి ప్రవేశ పెట్టిన పత్రం, గాజాలో ‘ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో చెలరేగి కొనసాగుతున్న హింసకు ఇజ్రాయెల్ దేశాన్ని కారణంగా గుర్తించటం విశేషం. లెబనాన్ లో పరిస్ధితి పట్ల కూడా ఈ పత్రం ఆందోళన ప్రకటించింది.

నరేంద్ర మోడి నేతృత్వంలో బిజెపి అధికారం చేపట్టిన దరిమిలా ఇండియా, ఇజ్రాయెల్ తో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం తెలిసిన విషయం. చారిత్రకంగా ఇజ్రాయెల్ వలస ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటానికి ఇండియా మద్దతు ఇవ్వగా, మోడి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా, పాలస్తీనాపై యూదు రాజ్యం అణచివేతను పక్కన పెట్టి, ఐ.టి, వాణిజ్య రంగాల్లో ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగు పడేందుకు శ్రమించాడు.

రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా వేలాది మంది యూదులను వెంటాడి వేటాడి చంపించిన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు ఓ వైపు మద్దతు ఇచ్చే ఆర్.ఎస్.ఎస్-బిజెపి పరివారం, మరో వైపు పాలస్తీనా ప్రజలపై యూదు జాత్యహంకారంతో అణచివేస్తున్న యూదు రాజ్యానికి సైతం మద్దతు ఇస్తున్నది. ఈ నేపధ్యంలో బ్రిక్స్ కూటమి ప్లీనరీ సమావేశంలో మోడి ప్రవేశ పెట్టిన పత్రం గాజా మారణకాండకు ఇజ్రాయెల్ ను తప్పు పట్టడం విశేషం. రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు మూడూ ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండను తీవ్రంగా ఖండించినప్పటికీ ఇండియా పాలకులు గోడ మీద పిల్లి వాటం అనుసరిస్తూ వచ్చారు. బ్రిక్స్ పత్రం ప్రవేశ పెట్టడం వలన ఇండియా, అమెరికా-ఇజ్రాయెల్-పశ్చిమ ఐరోపా దేశాలకు ఆగ్రహం తెప్పించటం ఖాయం.

“బ్రిక్స్ దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణను మేము ఆహ్వానిస్తున్నాము. స్థానిక కరెన్సీలలో వాణిజ్యం, సరిహద్దుల మధ్య చెల్లింపులు సమస్యలు లేకుండా మృదువుగా సాగిపోవటం ద్వారా మన ఆర్ధిక సహకారాన్ని బలీయం చేస్తుంది. ఇండియా అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) భారీగా విజయవంతం కావటంతో పాటు అనేక ఇతర దేశాలు కూడా దానిని వినియోగించుకుంటున్నాయి” అని చెప్పిన మోడి మరిన్ని దేశాలు ఇండియా వలే స్థానిక కరెన్సీలలో గానీ లేదా స్థానికంగా అభివృద్ధి చేసిన చెల్లింపుల యంత్రాంగాన్ని వినియోగించటాన్ని గానీ చేయాలని పిలుపు ఇచ్చాడు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టాక అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల చెల్లింపుల వ్యవస్థ ‘SWIFT’ నుండి రష్యాను తొలగించాయి. రష్యా, పశ్చిమ దేశాల బ్యాంకులలో డిపాజిట్ చేసిన 600 బిలియన్ డాలర్ల నిల్వలను స్తంభిపజేసి, డిపాజిట్లపై వడ్డీని ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్న ఆయుధాల ఖర్చు కింద జమ చేస్తున్నాయి. అనేక విడతల పాటు ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించాయి. చైనా పైన కూడా గత అయిదారేళ్లుగా వివిధ ఆంక్షలను, టారిఫ్ లను అమెరికా, పశ్చిమ ఐరోపాలు అమలు చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని తయారు చేసుకోవాల్సిన అవసరం రష్యా, చైనా లకు తరుముకొచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుండే రష్యా, చైనా, ఇండియా, ఇరాన్, వెనిజులా తదితర దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యం ప్రారంభించాయి. ఉక్రెయిన్ యుద్ధంతో డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ అభివృద్ధి చేసుకోవటం అనివార్యం అయింది. ఆ విధంగా రష్యాపై ఆంక్షలతో అమెరికా సామ్రాజ్యవాదం తాను తీసిన గొయ్యిలో తానే పడిపోయింది. తనతో పాటు ఐరోపా దేశాలను కూడా గోతిలోకి లాగుతున్నది.

నిజానికి ఒకటిన్నర దశాబ్దాల నుండే డాలర్ ఒక్కదాన్నే అంతర్జాతీయ కరెన్సీగా ఉపయోగించటం బదులు ప్రధాన కరెన్సీల బాస్కెట్ ను ఆచరణలోకి తేవాలని ఐఎంఎఫ్ లాంటి బహుళపక్ష వేదికలపై చైనా, ఇండియా లాంటి దేశాలు ప్రతిపాదించాయి. అయితే ఈ బాస్కెట్ లో మళ్ళీ డాలర్, బ్రిటిష్ పౌండ్, ఐరోపా యూరో, జపనీస్ యెన్, చైనా యువాన్ ల వరకే ప్రతిపాదించారు. ఇందులో రూపాయి ఉండాలని ఎవరూ ప్రతిపాదించలేదు. ఈ ప్రతిపాదన, ప్రతిపాదన గానే ఉండిపోయింది తప్ప ముందడుగు వేయలేదు. అమెరికాకు కోపం తెప్పించటం అప్పట్లో ఎవరూ సాహసించలేదు.

ప్రతి పరిణామానికీ, ప్రతి వివాదానికీ అమెరికా ఆంక్షలు విధించటం ఎక్కువ కావటంతో వివిధ దేశాలకు డాలర్ లలో జరిగే వాణిజ్యం గురించి భయాలు తలెత్తడం మొదలయింది. ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యా వాణిజ్యాన్ని సంపూర్ణంగా ఆటంకపరచటంతో పాటు ఆ దేశ డాలర్ నిల్వలను సైతం స్తంభింపజేయటంతో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు డాలర్ వాణిజ్యం అంటే భయం పట్టుకుంది. రష్యాకు ఎదురైన పరిస్ధితి తమకూ ఎదురు కావచ్చన్న అనుమానాలు తలెత్తాయి. చైనాతో పాటు వివిధ దేశాలు తమ డాలర్ నిల్వలను తగ్గించుకోవటం మొదలు పెట్టాయి. రష్యా, చైనా, ఇండియాలు బంగారం నిల్వలను భారీగా పెంచుకోవడం ప్రారంభించాయి. ఈ పరిణామాలు చివరకు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ అభివృద్ధికి కట్టుబడటం వరకు దారి తీశాయి.

“బ్రిక్స్ దేశాల మధ్యా, వాణిజ్య భాగస్వాముల మధ్యా, స్థానిక కరెన్సీల వినియోగాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. బ్రిక్స్ దేశాలలో సంబంధిత బ్యాంకింగ్ నెట్ వర్క్ లు మరింత బలీయం చేయటాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ క్రాస్-బోర్డర్ పేమెంట్స్ ఇనీషియేటివ్ (BCBPI) వ్యవస్థకు అనుగుణంగా స్థానిక కరెన్సీ చెల్లింపులను అమలులోకి తేవాలని ఆకాంక్షిస్తున్నాము. అయితే బిపిసిపిఐ అమలు అన్నది కేవలం స్వచ్ఛందం మాత్రమే. దానికి కట్టుబడి ఉండాలన్న నియమం లేదు” అని బ్రిక్స్ దేశాలు ప్రకటించాయి.

అయితే భారత ప్రధాని తలుపు సందులో కాలు పెట్టే ధోరణిని మాత్రం విడిచిపెట్ట లేకపోయాడు. ఉమ్మడి ఆకాంక్షలను బలీయం చేసే క్రమంలో ఇతర గ్లోబల్ సంస్థలను ప్రతిక్షేపించేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేశాడు. “బ్రిక్స్ లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకేళ్లే క్రమంలో మన సంస్థ ఇతర గ్లోబల్ సంస్థలను స్థానాన్ని వశం చేసుకుంటున్నదన్న అభిప్రాయాన్ని కలిగించకుండా జాగ్రత్త వహించాలి. మనం కేవలం ఉన్న వ్యవస్థల సంస్కరణను మాత్రమే కోరుతున్నాము తప్ప ఇతర ఉద్దేశాలు మనకు లేవు” అంటూ భారత ప్రధాని బ్రిక్స్ యంత్రం లోకి రెంచిని విసిరాడు. తద్వారా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల ఆగ్రహానికి గురి కాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నాడు.

Russians welcome PM Narendra Modi

తాజా 16వ బ్రిక్స్ సమావేశాల్లో నూతన సభ్య దేశాలు ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇధియోపియా, ఇరాన్ లు కూడా పాల్గొన్నాయి. 10 సభ్య దేశాలు ‘కాజన్ డిక్లరేషన్’ పేరుతో ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటన గాజా, ఉక్రెయిన్ ఘర్షణలపై తన అవగాహనను ప్రకటించింది. మరింత బాధ్యతాయుతమైన అంతర్జాతీయ ద్రవ్య ఆర్కిటెక్చర్ ని సృష్టించడం గురించి ప్రకటించింది.

“గాజా స్ట్రిప్ లో మున్నెన్నడూ ఎరుగని తీరులో హింస చెలరేగటానికి ఇజ్రాయెల్ మిలట్రీ దాడియే కారణం. తక్షణం ఈ దాడిని ఆపేయాలి. గాజాలో తక్షణమే, సమగ్ర, శాశ్వత కాల్పుల విరమణ అమలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాము. ఇరు వైపులా ఉన్న బందీలను, అరెస్టు చేసిన అందరినీ బేషరతుగా విడుదల చేయాలి. వారిని చట్టవిరుద్ధంగా బందీలను కావించారు. గాజా స్ట్రిప్ కు ఆటంకం లేకుండా, స్థిరంగా మానవతా సాయం అందజేయాలి. దూకుడు చర్యలను నిలిపివేయాలి” అని కాజన్ డిక్లరేషన్ కోరింది.

“మానవతా సాయం ప్రక్రియల పైన, సదరు ప్రక్రియలలో చురుకుగా ఉన్న వ్యక్తుల పైనా గాజా స్ట్రిప్ లో దాడులు జరగటానికి ఇజ్రాయెల్ దే బాధ్యత” అని కూడా కాజన్ డిక్లరేషన్ ప్రకటించటం పెద్ద విశేషంగా చెప్పవచ్చు. పాలస్తీనాకు తక్షణమే ఐరాస సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ కూటమి డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం అంతానికి ‘రెండు రాజ్యాల’ పరిష్కారానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. బీరుట్ లో పౌరుల ఇళ్లపై దాడులను ఇజ్రాయెల్ తక్షణమే ఆపాలని బ్రిక్స్ సమావేశాలు పిలుపు ఇచ్చాయి. హిజ్బొల్లాకు చెందిన పేజర్లు, మొబైల్ హ్యాండ్ సెట్లను సామూహికంగా పేల్చివేయటం పట్ల ఆందోళన ప్రకటించాయి. లెబనాన్ లో పేజర్ దాడుల్ని ఖండించాయి. సెప్టెంబర్ 17 తేదీన జరిగిన పేజర్ దాడి “పధకం ప్రకారం జరిగిన దాడి” అని చెబుతూ ఇది అంతర్జాతీయ చట్టాలకు బద్ధ విరుద్ధం అని స్పష్టం చేశాయి.

ఇజ్రాయెల్ దాడులను ఇంత తీవ్ర స్థాయిలో ఖండించిన ఉదాహరణ గానీ, స్పష్టంగా ఇజ్రాయెల్ మారణకాండను తప్పు పట్టిన ఉదాహరణ గానీ, గాజా-లెబనాన్ లలో ఇజ్రాయెల్ సాగిస్తున్న సామూహిక హత్యలకు ఇజ్రాయెల్ ను నేరుగా బాధ్యురాలిని చేసిన ఉదాహరణ గానీ ఇంతవరకు లేదు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 7, 2014 తేదీన హమాస్ కార్యకర్తలు యూదు పౌరులను, ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేయటాన్ని ఖండించే పనికి పోకుండా కేవలం ఇజ్రాయెల్ ని మాత్రమే జరుగుతున్న మానవ హననానికి బాధ్యురాలిని చేసిన దేశం గానీ దేశాల కూటమి గానీ లేనే లేదు.

కనుక 16వ బ్రిక్స్ కూటమి దేశాల డిక్లరేషన్ చరిత్రాత్మక ఘటనగా పాలస్తీనా పోరాట చరిత్రలో చోటు సంపాదిస్తుంది. ముఖ్యంగా ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి పశ్చిమాసియా దేశాలు ఈ ప్రకటనలో భాగం పంచుకోవటం బ్రిక్స్ కూటమి సాధించిన భారీ విజయంగా చెప్పుకోవచ్చు. కాజన్ డిక్లరేషన్, పాలస్తీనాకు సంబంధించినంత వరకు అత్యంత ప్రాముఖ్యమైనది. భౌగోళిక రాజకీయ పరిణామాల్లో కూడా కాజన్ డిక్లరేషన్ ఒక మైలు రాయి గా నిలిచిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

పైగా ‘కాజన్ డిక్లరేషన్’, అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆస్ట్రేలియా, కెనడా, యుకె, యూరోపియన్ యూనియన్, జపాన్ దేశాలకు చావుదెబ్బతో సమానం. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యం పతన దిశలో సాగుతున్న ప్రయాణంలో కాజన్ డిక్లరేషన్ అతి పెద్ద ఉత్ప్రేరకం కాగలదని ఆశించటంలో తప్పు లేదు.

వ్యాఖ్యానించండి