
పశ్చిమాసియాలో అరబ్ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న సామూహిక దారుణ మారణకాండ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంల పుణ్యమాని ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మెరుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సూచనలేనా లేక వాస్తవ రూపం దాల్చేనా అన్న సంగతి మాత్రం ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు.
రష్యన్ నగరం కాజన్ లో ఈ రోజు (అక్టోబర్ 23) బ్రిక్స్ కూటమి దేశాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే ఇండియా, చైనా దేశాల అధినేతల మధ్య ఈ సమావేశాల సందర్భంగా ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అక్టోబర్ 21 తేదీన ఇరు దేశాల మధ్య -ఎల్.ఏ.సి వెంబడి తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో- కుదిరిన ఒప్పందాన్ని ఇద్దరు నేతలు ఆహ్వానించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళనున్నదని ఇరు దేశాల అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
ఎల్.ఏ.సి వెంట వివిధ చోట్ల ఇరు దేశాల సైనికుల మధ్య ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు ఘర్షణలు జరిగిన తర్వాత ఇండియా, చైనాల మధ్య సంబంధాలు, చర్చలు ప్రతిష్టంభనకు గురైనాయి. ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల నేతలు అత్యున్నత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలకు ఉపక్రమించటం ఇదే మొదటిసారి. అందుకు బ్రిక్స్ కూటమి సమావేశాలే వేదిక కావటం భౌగోళిక రాజకీయ పరిణామాల్లో ఒక ముఖ్య పరిణామంగా చెప్పవచ్చు.
‘మన స్నేహితులను ఎంచుకోవచ్చు గానీ ఇరుగు పొరుగు వారిని ఎంచుకోలేము’ అన్న నానుడి ప్రపంచ దేశాల విషయంలో ప్రత్యక్షర సత్యం. ‘ఇరుగు పొరుగు’ అన్న నానుడి ఉండనే ఉన్నది. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొని ఉన్నప్పుడు ఏ దేశమైనా ప్రశాంతంగా గుండె పైన చేయి వేసుకుని తన పని తాను చేసుకుపోవచ్చు. పొరుగు దేశాలతో శత్రు సంబంధాలు ఉన్నట్లయితే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేయాల్సిన ఖర్చు రక్షణ ఖర్చులకు తరలించాల్సి ఉంటుంది; అలాగే సరిహద్దు తగాదాలతో శాంతికి కరువు ఏర్పడుతుంది.
ఇవేవీ వివిధ దేశాలకు చెందిన తల పండిన నాయకులకు తెలియని సంగతులు ఏవీ కావు. కానీ ప్రపంచ దేశాలపై నిర్నిరోధ పెత్తనం కోసం అర్రులు చాచే అమెరికా, దాని తైనాతీ దేశాలైన పశ్చిమ ఐరోపా దేశాలకు చెందిన బహుళజాతి ఫైనాన్స్ మరియు ఆయుధ తయారీ కంపెనీలకు వివిధ దేశాల మధ్య సామరస్య, స్నేహ సంబంధాలు లాభసాటి కాజాలవు. ఎక్కడికక్కడ సరిహద్దు తగాదాలు, సున్నీ-షియా ఘర్షణలు, జాతుల సంఘర్షణలు, టెర్రరిస్టు దాడులు కొనసాగుతూ ఉంటేనే సదరు సామ్రాజ్యవాదులకు లాభాల పంటలు సమృద్ధిగా పండుతాయి.
ఈ నేపధ్యంలో అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల పెత్తందారీ సామ్రాజ్యవాద శిబిరానికి గట్టి పోటీ ఇస్తూ నాలుగు వర్ధమాన దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) లు బ్రిక్ కూటమిగా అవతరించటం, అనంతరం సౌత్ ఆఫ్రికాతో కలిసి ఐదు దేశాల బ్రిక్స్ కూటమిగా పరిణామం చెందటం, 2023లో మరో 5 దేశాలు (ఈజిప్టు, ఇధియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) చేరేందుకు ఆమోదించిన దరిమిలా ‘బ్రిక్స్ ప్లస్’ పేరుతో సరికొత్త కూటమిగా విస్తరించటం… ఈ పరిణామాలు పశ్చిమ దేశాల ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టే వైపుగా పురోగమిస్తున్నాయి.
అయితే ఇండియా-చైనా దేశాల మధ్య సరిహద్దు తగాదాల వలన అనేక యేళ్లుగా శత్రు సంబంధాలు నెలకొనడం తెలిసిన సంగతే. ఈ తగాదాను ఆసరా చేసుకుని, ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదిగిన చైనాకు కౌంటర్ బ్యాలన్స్ గా ఇండియాను నిలబెట్టేందుకు అమెరికా గత ఒకటిన్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నది. బిజెపి-మోడి నేతృత్వం లోని ప్రభుత్వం ఓ వైపు బ్రిక్స్ సభ్య దేశంగా ఉంటూనే, రష్యాపై రక్షణ-భద్రతల కోసం ఆధారపడి ఉంటూనే అమెరికా వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. కానీ దళారీ పాలకులకు అమెరికా నుండి ఆశించిన స్థాయిలో మద్దతు అందలేదు.
కారణం ఏదైనా కానివ్వండి, భారత పాలకులు గతంలో వలే కాకుండా అమెరికా అదుపాజ్ఞలకు కట్టుబడి ఉండడం తగ్గిపోయింది. అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన ఏక ధృవ ప్రపంచం కుప్ప కూలి బహుళ ధృవ ప్రపంచం అవతరించి దృఢతరం కావటమే దీనికి కారణం. బ్రిక్స్ కూటమి 10 దేశాల కూటమిగా విస్తరించటం, మరో 40 కి పైగా దేశాలు కూటమిలో చేరేందుకు ఆసక్తి కనపరచటంతో భారత పాలకులకు ప్రస్తుతం అమెరికా కంటే బ్రిక్స్ కూటమి లాభసాటిగా కనిపిస్తున్నది.
ఇటువంటి భౌగోళిక రాజకీయాలు నెలకొన్న నేపధ్యంలో ఉప్పు-నిప్పు గా ఇండియా-చైనా దేశాల సంబంధాలను పరిగణించిన బిజెపి / ఎన్.డి.ఏ / నరేంద్ర మోడి ప్రభుత్వం తన లెక్కలను సవరించుకుంటున్నట్లుగా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుండి చైనా అమలు చేస్తున్న ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ నూ, ‘మ్యారీటైమ్ సిల్క్ రోడ్’ నూ మోడి ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చింది. హిందూ మహా సముద్రంలో చైనా ప్రభావం పెరగటాన్ని విమర్శించింది. శ్రీలంక, మాల్దీవులు దేశాలపై ప్రభావం కోసం చైనాతో పోటీ పడింది. పాకిస్తాన్ లో చైనా నిర్మిస్తున్న CPEC – చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణాన్ని వ్యతిరేకించింది. చివరికి లడఖ్ సరిహద్దు ఎల్.ఏ.సి వెంబడి ఇరు దేశాల సైనికులు భౌతిక ఘర్షణకు తలపడే వరకు పరిస్ధితి వెళ్లింది.
కాజన్ సమావేశాలకు రెండు దేశాలకు ముందు ఇరు దేశాల మిలట్రీల మధ్య చర్చలు జరగడం, ఒప్పందం కుదిరినట్లు ఇరు పక్షాలు ప్రకటించటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పైగా బ్రిక్స్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడి, గ్జి జిన్ పింగ్ లు ప్రత్యక్షంగా చర్చలు జరపటం ఈ పరిణామాలకు మరింత విశ్వసనీయత వచ్చి చేరింది.
“సరిహద్దు వద్ద శాంతి, సుస్థిరతలు నెలకొనడం ఇరు దేశాలకు ప్రధమ ప్రాధామ్యంగా ఉండాలి” అని భారత ప్రధాని మోడి చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ తో చెప్పటం, ఘర్షణ వాతావరణం నెలకొనటానికి దోహదం చేసిన కారణాల జోలికి వెళ్లకపోవటం ఒక సానుకూల పరిణామంగా భావించబడుతోంది.
మరీ ముఖ్యంగా ఇరు దేశాల విధేశీ మంత్రులు మరియు అధికారుల మధ్య చర్చలను పునః ప్రారంభించాలని ఇరు దేశాల అగ్ర నేతలు నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించి సంబంధాలు పునర్నిర్మించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు మోడి-జిన్ పింగ్ ల సమావేశం అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇది అక్కడితో ఆగలేదు. సరిహద్దు సమస్య విషయమై ఇండియా తరపు ప్రత్యేక ప్రతినిధి అయిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చైనా తరపు ప్రత్యేక ప్రతినిధి అయిన చైనా విదేశీ మంత్రి మరియు సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు వాంగ్ యీ లు సాధ్యమైనంత త్వరలో సమావేశమై సరిహద్దు తగాదా పరిష్కారానికి కృషి చేయాలని లక్ష్యం నిర్దేశించారు.
“ఇండియా-చైనా సంబంధాలు కేవలం ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత మరియు ప్రగతిలకు కూడా అత్యంత ముఖ్యమైనవని మేము భావిస్తున్నాము” అని మోడి సమావేశంలో పేర్కొనటం గమనార్హం. “సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొల్పడం మన ప్రధమ ప్రాధామ్యం కావాలి. పరస్పర నమ్మకం, పరస్పర గౌరవం మరియు పరస్పర సున్నితత్వం లు మన సంబంధాలకు పునాదిగా ఉండాలి” అని భారత ప్రధాని, చైనా అధినేతతో చెప్పాడు (ద హిందూ, అక్టోబర్ 23).
గత ఐదేళ్లలో కొన్ని సార్లు ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ శర వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల దృష్ట్యా ఇప్పటి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ గాజా లో అత్యంత అమానుషంగా పాలస్తీనా ప్రజలను సామూహిక హత్యాకాండకు గురి చేస్తున్నా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు నోరు మెదపకపోగా, బిలియన్ల డాలర్ల కొద్దీ అత్యాధునిక ప్రాణాంతక ఆయుధాలను ఇజ్రాయెల్ కు సరఫరా చేస్తుండడం, ఇజ్రాయెల్ ఒక్క గాజాకే పరిమితం కాకుండా, లెబనాన్, యెమెన్, సిరియా, వెస్ట్ బ్యాంక్, ఇరాన్ దేశాలపై సాధారణ పౌరులే లక్ష్యంగా మిసైల్, బాంబు దాడులు చేస్తున్నప్పటికీ అమెరికా అభ్యంతరం చెప్పకపోవటంతో అమెరికా, ఇజ్రాయెల్ శిబిరం ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో తీవ్రంగా దెబ్బ తిన్నది. పశ్చిమ శిబిరం ఒంటరిగా మిగిలీపోయింది.
అమెరికా ఆయుధ సరఫరా నిలిపివేసిన మరుక్షణం ఇజ్రాయెల్ మారణకాండ ఆగిపోతుందన్న వాస్తవాన్ని ప్రపంచ ప్రజలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలు ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. అరబ్బులను అనాగరికులుగా, సబ్-హ్యూమన్ లుగా, బ్రతకటానికి అర్హత లేనివారుగా ఇజ్రాయెల్ ప్రధాని, ఇతర మంత్రులు చిత్రీకరిస్తూ అమానుష దూషణలకు దిగుతుండటం గ్లోబల్ సౌత్ దేశాలకు ఎంత మాత్రం నచ్చటం లేదు. దానితో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకుంటూ ప్రతిష్ట కోల్పోయి, ఒంటరి శిబిరంగా మిగిలిపోతున్నది. తామే స్వయంగా ప్రపంచ దేశాలు బ్రిక్స్ కూటమి వెనుక ర్యాలీ కావటానికి కారణం అవుతున్నాయి.
ఫ్రాన్స్ లాంటి దేశాలు ఉడత ఊపులు ఊపుతూ ఇజ్రాయెల్ కు నీతి బోధలు చేస్తున్నప్పటికీ ఆచరణలో ఇజ్రాయెల్ ను నిలువరించేందుకు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోగా తాము కూడా ఆయుధాలు సరఫరా చేస్తుండటం గ్లోబల్ సౌత్ దేశాలకు మింగుడు పడని వాస్తవంగా కనిపిస్తున్నది. మరో పక్క నాటో విస్తరణ ద్వారా ఉక్రెయిన్ ను రష్యా పైకి రెచ్చగొట్టి, ఉక్రెయిన్ పై దాడి చేసేలా పరిణామాలను రక్తి కట్టించటం ద్వారా 7 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ సైన్యం చనిపోవటమో, కాళ్ళు-చేతులు కోల్పోయి అంగ వికలురుగా మారటమో జరిగింది. ‘చివరి ఉక్రెయిన్ పౌరుడి వరకు యుద్ధంలో పోరాడుతాడని’ అమెరికా, పశ్చిమ దేశాలే ప్రకటించటం ద్వారా ఉక్రెయిన్ పతనాన్ని అవి ముందే రాసి పెట్టాయి.
ఆయుధాలు, ధన సహాయం చేసినందుకు ఉక్రెయిన్ లోని సమస్త వనరులను, బంగారం పండే నల్ల రేగడి నేలలను పశ్చిమ బహుళజాతి కంపెనీలు వశం చేసుకున్నాయి. గత రెండు, మూడు శతాబ్దాలుగా పశ్చిమ ఐరోపా, అమెరికాల అకృత్యాలను చూసిన గ్లోబల్ సౌత్ దేశాలు ఇక సహించలేని స్థితిలో బ్రిక్స్ కూటమి వెనుక సమీకృతం అవుతున్నాయి.
ఈ పరిణామాలు అనివార్యంగా భారత పాలకులను పునరాలోచనలో పడేసినట్లు భావించవలసి వస్తున్నది. “మన రెండు దేశాలలోని ప్రజలు, అంతర్జాతీయ సమాజం అందరూ మన సమావేశం పైన తమ దృష్టిని కేంద్రీకరించారు. ఇండియా, చైనాలు ప్రాచీన నాగరికతలతో విలసిల్లన దేశాలు. ప్రధాన వర్ధమాన దేశాలు. మరియు గ్లోబల్ సౌత్ సమాజం సభ్య దేశాలు కూడాను. కాబట్టి ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలోకి మళ్లించవలసిన అవసరం ఉన్నది. ఇరు పక్షాలు మరిన్ని సంభాషణలు, సహకారం అందజేసుకుంటూ మన విభేధాలను సరైన రీతిలో పరిష్కరించుకుంటూ పరస్పర అభివృద్ధికి పాటు పడాలి” అని సమావేశంలో చైనా నేత గ్జి జిన్ పింగ్ అన్నట్లుగా తెలుస్తున్నది.
గ్జి జిన్ పింగ్ ఉద్దేశం స్పష్టమే. పివోట్ టూ ఆసియా వ్యూహంతో అమెరికా తన దృష్టిని ఆసియా-పసిఫిక్ దేశాలపై మళ్లించిన నేపధ్యంలో అమెరికా ప్రయోజనాలకు సహకరించటం బదులు ఇండియా, చైనాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన కోరుతున్నాడు. పరస్పరం శతృత్వం వహించటానికి బదులు అభివృద్ధిలో సహకారం అందించుకోవాలని కోరుతున్నాడు. ఈ కోరటంలో ఒక్క చైనా ప్రయోజనాలనే ఆయన దృష్టిలో ఉన్నట్లయితే అలాంటి సంబంధాలు భారత ప్రజలకు అవసరం లేదు అన్నది స్పష్టమే.
రష్యా-చైనాలు కేంద్రంగా బ్రిక్స్ కూటమి మరో ప్రధాన ధృవంగా అవతరిస్తున్న సంగతి స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే అందులో భారత పాలకులు ఇండియా తన రెండు కాళ్ళను ఒక్క పడవ పైనే ఉంచుతారా లేక ఒక కాలు బ్రిక్స్ పడవ పైనా, మరో కాలు అమెరికా నాయకత్వం లోని పశ్చిమ శిబిరం పైన కూడా వేసి ఉంచుతారా అన్నది చూడవలసి ఉన్నది.