తూర్పు లడఖ్: చైనా, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం!


10 దేశాల బ్రిక్స్ కూటమి సమావేశాలు రష్యన్ నగరం కాజన్ లో ప్రారంభం కావటానికి రెండు రోజుల ముందు తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మాట నిజమేనని ఈ రోజు (అక్టోబర్ 22) చైనా ధృవీకరించింది. ఒప్పందం కుదిరిన సంగతిని సోమవారమే (అక్టోబర్ 21) ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రకటనను చైనా ఈ రోజు ధృవీకరించింది.

లడఖ్ ప్రాంతంలో చైనా, ఇండియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) అంటారు. ఇది ఇరు దేశాలూ అంగీకరించిన సరిహద్దు కాదు. చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతం నిజానికి తమ భూభాగమే అని ఇండియా వాదిస్తుంది. ఈ వాదనను చైనా అంగీకరించదు. దానితో వాస్తవాధీన రేఖను ఆక్సాయ్ చిన్ లో వీలైనంత లోపలకి జరపటానికి ఇండియా సైనికులు ప్రయత్నాలు చేస్తుంటారు. తరచుగా సరిహద్దు రేఖ దాటి పెట్రోలింగ్ జరుపుతూ ఉంటారు. అలాగే చైనా సైనికులు కూడా తరచుగా ఎల్.ఏ.సి ని దాటి వచ్చి పెట్రోలింగ్ చేస్తుంటారు.

దానితో ఇరు వైపులా మోహరించిన సైనికుల మధ్య ఘర్షణలు తరచుగా జరుగుతున్నాయి. బిజెపి 2014 లో మోడి నేతృత్వంలో అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ ఎల్.ఏ.సి ని ఆక్సాయ్ చిన్ లోపలికి జరిపేందుకు ప్రయత్నాలు పెరగడంతో ఘర్షణలు కూడా పెరిగాయి. అయితే ఈ ఘర్షణలు ఆయుధాలతో కాకుండా చేతులు, కాళ్ళు ఉపయోగించి చేస్తుంటారు. దానికి కారణం “ఘర్షణ జరిగితే ఆయుధాలు ఉపయోగించరాదు” అని గతంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగటమే. ఆయుధాలు వినియోగిస్తే అది దాదాపు యుద్ధ ప్రకటన కిందికి వస్తుంది.

జూన్ 2020 లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గాల్వన్ వ్యాలీ లోని చాంగ్ చెన్మో నదీ లోయలో హాట్ స్ప్రింగ్స్ వద్ద ఇండియా, చైనా సైనికుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇరు సేనలు నదిలోకి దిగి పిడి గుద్దులు గుద్దుకుంటూ ఒకరినొకరు నీళ్ళలో ముంచేస్తూ భారీ స్థాయిలో ఘర్షణకు దిగారు. అప్పటికే ఎల్.ఏ.సి ని దాటి వచ్చి చైనా సైనికులు గుడారాలు వేయటం, ఇండియా సైనికులు ఎల్.ఏ.సి దాటి వెళ్ళి పెట్రోలింగ్ చెయ్యటం లాంటి ఘటనల నేపధ్యంలో ఉద్రిక్తతలు ఏర్పడి ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు జూన్ 17, 2020 తేదీన తారాస్థాయికి చేరి ఇరు పక్షాలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళాయి.

ఘర్షణ అనంతరం ఇండియా సైనికులు ముగ్గురు చనిపోయారని, చైనా సైనికులు 40 మందికి పైగా మరణించారని ఇండియా ప్రకటించింది. తర్వాత రోజు ఘర్షణలో గాయపడిన మరో 17 మంది సైనికులు చనిపోయారని ఇండియా ప్రకటించింది. చైనా మాత్రం తమ సైనికులు ఎంతమంది చనిపోయినదీ ఇప్పటికీ చెప్పలేదు. ఎలాంటి ఆయుధాలు లేకుండా సైనికులు ఎలా చనిపోయారన్న ప్రశ్నకు ఇరు పక్షాల్లో ఎవరూ చెప్పలేదు. ఘర్షణలో ఇరు పక్షాలు రాళ్ళు, లాఠీలు ఉపయోగించారని అనధికార వార్తల ద్వారా తెలిసింది.

ఇరు దేశాలూ తమ తమ వైపు భూభాగాల్లో రోడ్లు, వంతెనలు నిర్మిస్తుండడంతో ఒకరిపై మరొకరు అనుమానాలు పెరుగుతూ వస్తున్నాయి. యుద్ధం జరిగే పక్షంలో సైనికులనీ, ఆయుధ సామాగ్రినీ వేగంగా తరలించటానికి ఈ రోడ్లు, బ్రిడ్జిలు అక్కరకు వస్తాయి. చైనా వైపు భారీ స్థాయిలో రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నదని ఇండియా ఆరోపించింది. అయితే ఇండియా కూడా ఎల్.ఏ.సి వెంట ఉన్న అత్యంత నిర్మానుష్య ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించింది.

కాగా ఇండియాకు చెందిన 4,000 చదరపు కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఇది దాదాపు ఢిల్లీ ఏరియాకు సమానమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించాడు. ప్రధాని మోడి మాత్రం “భారత భూభాగం లోకి ఏ ఒక్కరూ ప్రవేశించటం గానీ, భారత భూభాగం పైన పర దేశీయులు ఎవరూ ఉండటం గానీ జరగలేదు” అని ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పాడు. చైనాకు మోడి ‘క్లీన్ చిట్’ ఇస్తున్నారని, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన సంగతిని ప్రధాని దాచి పెడుతున్నారని ఆరోపించాడు.

Indian Troops Petrolling on LAC

మరో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ప్రకారం లడఖ్ లో మొత్తం 65 భారత పెట్రోలింగ్ పాయింట్లు ఉండగా వాటిలో 26 పాయింట్లను చైనా వశం చేసుకున్నది. ఈ సంగతిని బిజెపి ఎంపి తపిర్ గావ్ కూడా లోక్ సభలో ప్రశ్నించటం గమనార్హం. ఇండియాకు చెందిన ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఆక్రమించలేదు అంటూ హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించాక బిజెపి ఎంపి ఈ ప్రశ్న వేశాడు. హోమ్ మంత్రి అది వాస్తవం కాదని బదులిచ్చాడు.

సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న లడఖ్ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనది కావటంతో సాధ్యమైనంత అధిక భూభాగాన్ని నియంత్రించటానికి ఇరు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలే ఘర్షణలకు దారి తీస్తున్నాయి. నిజానికి ఇండియా, చైనాల మధ్య సరిహద్దు అన్నది ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఇరు దేశాలూ సామరస్యంగా చర్చలు జరిపి, పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటే తప్ప అసలు సరిహద్దు ఏమిటి అన్నది నిర్ణయం కాదు. ప్రపంచంలో పలు దేశాలు, తమ మధ్య సరిహద్దు రేఖలు చర్చల ద్వారానే నిర్ణయించుకున్నాయి. భారత పాలకులపై అమెరికా ప్రభావం ఉన్నంత వరకు ఇరు దేశాల మధ్య శాంతియుత సరిహద్దు చర్చలు జరిగే అవకాశం లేదు.

ఈ నేపధ్యంలోనే ఇండియా, చైనాల మధ్య ఎల్.ఏ.సి వద్ద పెట్రోలింగ్ జరిపే విషయంలో ఒప్పందం జరిగిందని ఇరు దేశాలు ప్రకటించటం ఒక వార్తగా మారింది. రష్యన్ నగరం కాజన్ లో అక్టోబర్ 23 నుండి బ్రిక్స్ కూటమి సమావేశాలు ప్రారంభం కావటానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ఒప్పందం జరగటంతో బ్రిక్స్ దేశాల సమావేశాలు సామరస్య వాతావరణంలో జరిగేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఒప్పందం సారాంశం ఏమిటన్నదీ ఇరువురిలో ఏ దేశమూ చెప్పలేదు. “గత కొద్ది కాలంగా చైనా, ఇండియాలు దగ్గరి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటూ వచ్చాయి. రాయబార మరియు, మిలటరీ మార్గాల ద్వారా ‘చైనా-ఇండియా సరిహద్దుకు సంబంధించి’ ఈ సంభాషణలు జరిగాయి” అని చైనా విదేశాంగ ప్రతినిధి జిన్ లియాన్ చెప్పాడు (ద హిందూ, అక్టోబర్ 22). “రానున్న రోజుల్లో ఈ ఒప్పందం అమలు చేసేందుకు ఇండియాతో కలిసి చైనా పని చేస్తుంది” అని ఆయన చెప్పాడు. వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించాడు.

బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇండియా ప్రధాని నరేంద్ర మోడి ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉన్నదని పత్రికలు భావిస్తున్నాయి. అయితే అధికార వర్గాల నుండి ఈ అంశం గురించి ఎలాంటి సమాచారం లేదు. తాజా ఒప్పందం ఫలితంగా ఇరు దేశాల మధ్య గత నాలుగు సంవత్సరాలుగా ఇరు దేశాల మిలట్రీల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇది ఎంత కాలం నిలుస్తుంది అన్నదే అసలు సంగతి.

మోడి నేతృత్వంలో ఇండియా, అమెరికా వ్యూహంలో భాగంగా, చైనాకు గట్టి సవాలు విసిరేందుకు ప్రయత్నాలు జరిగాయి. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక మోడికి ట్రంప్ హయాంలో దక్కిన స్థాయిలో గౌరవం దక్కలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో పూర్తిగా అమెరికా (ఉక్రెయిన్) పక్షం చేరి రష్యాను ఖండించేందుకు ఇండియా నిరాకరించటం, పైగా రష్యాపై అమెరికా విధించిన చమురు ఆంక్షలను అమలు చేయటం అటుంచి మరింత చమురుని రష్యా నుండి చౌక ధరకు దిగుమతి చేసుకోవటం… ఇత్యాది కారణాలతో అమెరికా, ఇండియాకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వటం తగ్గించింది.

గాజా, లిబనాన్ లలో ఇజ్రాయెల్ జరుపుతున్న అమానుష సామూహిక హత్యాకాండలకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆయుధాలను సరఫరా చేస్తుండడంతో గ్లోబల్ సౌత్ దేశాలలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పట్ల వ్యతిరేకత తీవ్రం అయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలు గ్రహిస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఇండియా పాలకులు గతంలో వలే అమెరికాకు మద్దతు ఇవ్వలేని పరిస్ధితి ఏర్పడింది.

ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో ‘క్వాడ్’ పేరుతో రక్షణ కూటమిని అమెరికా ఏర్పరిచిన సంగతి తెలిసిందే. అయితే 2023 నుండి అమెరికా, ఫిలిప్పైన్స్, జపాన్, ఆస్ట్రేలియాలతో మరో మినీలేటరల్ కూటమిని ఏర్పాటు చేసి దానిని ‘స్క్వాడ్’ పేరుతో పిలుస్తున్నారు. స్క్వాడ్ ఏర్పాటుతో క్వాడ్ సభ్య దేశం ఇండియాకు ప్రాధాన్యతను అమెరికా తగ్గించిందన్న వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఇండియాను ఇరకాటంలో పడేశాయి. “క్వాడ్ లో ఒక్క ఇండియా కు మాత్రమే అమెరికాతో ఎలాంటి ట్రీటీ లేదు. కనుక మా క్వాడ్ సభ్యత్వాన్ని ఇతర రెండు దేశాలతో సరిపోల్చరాదు” అని ఇండియా విదేశీ మంత్రి జైశంకర్ ఇటీవల కుండ బద్దలు కొట్టడంతో అమెరికా-ఇండియాల మధ్య గతంలో ఉన్నంత సామీప్యత లేదన్న అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది.

వ్యాఖ్యానించండి