ఓ అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం!


ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం

ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు

బాబాలు సైన్స్ బోధిస్తారు

ఇతిహాసకులు చరిత్రను రాస్తారు

సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు

ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు

ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు

నేరగాళ్ళు విలువలను బోధిస్తారు

రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు

దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు

పై పాఠ్యం వాట్సప్ మెసేజ్ గా నా మిత్రుడొకరు పంపారు. పాఠ్యాన్ని ప్రముఖ భావవాద కవి, “పుష్ప విలాపం” అనే పద్య మాలికకు రచయిత అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినట్లు మెసేజ్ లో వచ్చింది కానీ అది నిజం కాదని నా అనుమానం. (మేఘ సందేశం సినిమాలోని ‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై’ అన్న పాటను కూడా ఆయనే రాశారు.)

పై పాఠ్యంలో ఉన్న అంశాలు హేతువాద ఆలోచనా ధారకు సంబంధించినవి. కానీ దేవులపల్లి వారు హేతువాది కారు. పైగా పాఠ్యం లోని వివిధ అంశాలు సమకాలీన పరిణామాలను వివరిస్తున్నాయి తప్ప ఆయన జీవించిన కాలం (1 నవంబరు 1897 నుండి 24 ఫిబ్రవరి 1980 వరకు) నాటి పరిస్ధితులను సూచిస్తున్నట్లుగా లేవు. అందుకే నా అనుమానం.

4 thoughts on “ఓ అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం!

  1. విశేఖర్ గారూ.. మీరు మళ్లీ రెగ్యులర్ గా బ్లాగ్ రాస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభినందనలు.

    ఈ పాఠ్యం రాసినవారు దేవులపల్లి కృష్ణ శాస్త్రే. అయితే ‘ఆకులో ఆకునై ’ రాసిన భావ కవి దేవులపల్లి కృష్ణశాస్ర్తి మాత్రం కాదు. స్వయానా ఆయన మనవడు. ప్రముఖ కార్టూనిస్టు, చిత్రకారుడైన బుజ్జాయి (ఇటీవలే కన్నుమూశారు) కొడుకు.

    ఇంగ్లిష్ భాషలో తన ఫేస్ బుక్ అకౌంటులో జనవరి 13న ఈ పాఠ్యం పోస్టు చేశారు. చాలామంది దీన్ని తెలుగులోకి మార్చి మరీ విస్తృతంగా షేర్లు చేశారు. అలా మీకు చేరింది.

    ”Lovely place we live in.

    Scientists talk of astrology.

    Godmen teach you science.

    Mythologists write history.

    Actors endorse devotion.

    Billionaires give you lessons on simple living.

    NRIs show us how to love our country.

    Criminals teach us values.

    Politicians talk of god.

    God remains silent.”

  2. వేణు గారు, కానీ ‘ఆకులో ఆకునై’ పాట రేడియోలో వచ్చినప్పుడల్లా రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే చెప్పేవారు. psusheela.com వెబ్ సైట్ లో కూడా అలాగే ఉంది.

    అయితే ఆ పాఠ్యం రాసింది కృష్ణ శాస్త్రి గారే అన్నమాట! ఆయన రాసే ధోరణికి కాస్త భిన్నంగా రాశారు. కవిత్వం లాగా కాకుండా ఒక సత్యాన్ని నిందా స్తుతిగా చెప్పినట్లున్నారు.

  3. నా వ్యాఖ్య హడావుడిగా చూశారనుకుంటాను. ఇంకా వివరంగా చెప్తాను.

    1) ‘ ఆకులో ఆకునై ’ గీతం రాసింది భావ కవి దేవులపల్లి కృష్ణ శాస్ర్తి గారే. దాంట్లో సందేహమే లేదు. ఈ పాట ‘మేఘ సందేశం’లో వాడుకున్నారు. ఆ సినిమా రాకముందే రాసిన గీతం అది.

    2) ఇప్పడు మీరు పోస్టు చేసిన పాఠ్యం (ఇంగ్లిష్ లో) రాసింది – ఆయన మనవడు. అంటే తాత గారి పేరే మనవడికీ పెట్టారన్నమాట.

    3) ఈ కొత్త తరం కృష్ణ శాస్ర్తి గారి FB పోస్టులు సంప్రదాయ పరంగా కాకుండా అభ్యుదయకరంగా, వ్యంగ్య భరితంగా, విమర్శనాత్మకంగా ఉంటాయి. మొదటి నుంచీ ఆయన ధోరణే అది.

    అన్నట్టు- ‘పుష్ప విలాపం’ రాసిన కవి – కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తి.

వ్యాఖ్యానించండి