
హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఒక మాయగా కనిపిస్తున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ప్రతి ఒక్క సంస్థా ఎలాంటి అనుమానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తీరుతుందని ఢంకా బజాయించాయి. తీరా ఫలితాలు చూస్తే సరిగ్గా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలకు పూర్తి భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉండటం ఒక అర్ధం కానీ వ్యవహారంగా ఉండిపోయింది.
సాయంత్రం 4 గంటల 4 నిమిషాల సమయానికి బిజెపి 17 స్థానాలు గెలుచుకోగా 33 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో గెలవగా 20 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. ఇతరులు రెండు స్థానాలు గెలవగా 3 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఈ ఫలితాలు యధాతధంగా కొనసాగితే బిజెపి పార్టీకి సౌకర్యవంతమైన మెజారిటీ లభించనుంది.
2019తో పోల్చితే బిజెపి 40 సీట్ల నుండి 50 సీట్లకు బలాన్ని పెంచుకున్నది. కాంగ్రెస్ పార్టీ 31 నుండి 35 సీట్లకు బలం పెంచుకున్నది. జన నాయక జనతా పార్టీ (జెజెపి) 10 సీట్ల నుండి 0 కు దిగజారింది. ఐ.ఎన్.ఎల్.డి పార్టీ కూడా 1 సీటు నుండి 2 సీట్లకు బలం పెంచుకున్నది. ఇండిపెండెంట్ల బలం 7 నుండి 3 కి పడిపోయింది. 2019 ఎన్నికల నాటి జెజెపి నుండి 10 సీట్లు, ఇండిపెండెంట్ల నుండి 4 సీట్లు, హెచ్.ఎల్.పి నుండి 1 సీటు (మొత్తం 15 సీట్లు) 2024 ఎన్నికలలో ఇతర పార్టీలకు తరలిపోయాయి. ఈ 15 సీట్లలో 10 బిజెపికి, 4 కాంగ్రెస్ పార్టీకి, ఒకటి ఐ.ఎన్.ఎల్.డి పార్టీకి తరలి వెళ్ళాయి.
చివరికి తేలింది ఏమిటంటే జెజెపి, ఇండిపెండెంట్లు, హెచ్.ఎల్.పి లు నష్టపోగా, వారు నష్టపోయిన సీట్లను బిజెపి, కాంగ్రెస్, ఐ.ఎన్.ఎల్.డి లు పంచుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ బిజెపి పైన వ్యక్తమైన వ్యతిరేకత ఓట్ల రూపంలో ఎందుకు వ్యక్తం కాలేదు అన్నదే అర్ధం కాని విషయం.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు గత సాధారణ ఎన్నికలకు మల్లేనే ఈ సారీ ఘోరంగా ఉన్నాయి. ఇక నుండి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సరిగ్గా భిన్నంగా ఫలితాలు ఉంటాయని ప్రజలు ఖాయంగా నమ్మే పరిస్ధితిని ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు కల్పించారు. అసలు వారు అనుసరిస్తున్న మోడల్ ఏమిటో, ఎందుకు ఇలా తమ అంచనాలు దెబ్బ తింటున్నాయో వారు ఎప్పుడూ సమీక్ష చేసుకుంటున్న జాడలు లేవు.
అంతే కాకుండా బిజెపి ఓటమిని అంచనా వేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికల ముందు బిజెపి ప్రతిష్ట కోల్పోయే అనేక సంఘటనలు జరిగాయి. బిజెపి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, బ్రిజ్ భూషణ్ అనే బిజెపి ఎంపి కుస్తీ పోటీల శిక్షణకు వచ్చిన అమ్మాయిలపై లైంగిక అత్యాచారాలకు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు, ఆరోపణలు వచ్చినప్పటికీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు లేకపోవటం, కుస్తీ పోటీల పట్ల హర్యానా ప్రజల్లో ఉన్న ఆదరణ, ఒలింపిక్ పతక విజేతలు స్వయంగా కాంగ్రెస్ తరపున పోటీలోకి దిగటం, కుస్తీ శిక్షణలో ఉన్న అమ్మాయిలు కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేయటం, దళితులపై జరిగిన దాడులు… ఇవన్నీ బిజెపి కి వ్యతిరేకంగా పని చేయవలసి ఉండగా అలా జరగలేదు.
ప్రజలకు వస్తున్న మరో అనుమానం ఏమిటంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమేమో, ఈవిఎం లను మ్యానిపులేట్ చేసి బిజెపికి అనుకూలంగా ఫలితాలు రాబట్టారేమో అని. ఎన్నికల ముందు హర్యానా ప్రజల అభిప్రాయాలు అనేక చానెళ్లు, ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లు, స్వతంత్ర చానెళ్లు ప్రసారం చేశాయి. ఇలా ప్రసారం అయిన అభిప్రాయాలూ అన్నీ, హర్యానా ప్రజలు బిజెపి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలియజేశాయి. కానీ ఇవేవీ ఎన్నికల ఫలితాలలో ప్రతిబింబించక పోవటమే ప్రజల్లో అనుమానాలకు దారి తీస్తున్నది. ఎవరు ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారో కూడా అర్ధం కానీ పరిస్ధితి నెలకొని ఉండడం బూర్జువా ప్రజాస్వామ్యానికి కూడా క్షేమకరం కాదు.
కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, పార్టీల కూటమిలు కూడా అనేక యేళ్లుగా ఈవిఎంల లెక్కింపు పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. వారి అనుమానాలను, అభ్యంతరాలను అటు కోర్టులు, ఎన్నికల కమిషన్ తో పాటు మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు.
ప్రధాని నరేంద్ర మోడి గానీ ఇతర బిజెపి నేతలు గానీ ఈవిఎం లపై వ్యక్తం అయిన అనుమానాలను అవహేళన చేసారే తప్ప సదరు అనుమానాలను పోగొట్టటానికి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ఎన్నికల కమిషన్ ఒకటి రెండు సార్లు ఒక ఈవిఎం తెచ్చి ఎవరైనా పరీక్షించుకోవచ్చని సవాలు చేయటం వరకు జరిగింది.
కానీ సమస్య కేవలం ఒక ఈవిఎం ది కాదు. ఒక ఈవిఎం ని తెచ్చి పరీక్ష చేసుకొమ్మంటే అందులో లోపం ఉండకపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అనుమానాలు పోవాలంటే వాస్తవంగా చేయవలసింది నిజంగా జరిగిన ఎన్నికల్లో వివిఫ్యాట్ స్లిప్ లను కూడా లెక్కించి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫలితాలతో బేరీజు వేసి చూడాలి. అప్పుడే నిజమైన పరీక్ష జరిగినట్లు. అది కూడా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముందస్తు సూచనలు, సమాచారం ఎవరికీ ఇవ్వకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్ తరహాలో ఊహించని చోట, ఊహించని విధంగా తనిఖీలు జరగాలి. అప్పుడు మాత్రమే ఈవిఎం ల విశ్వసనీయత రుజువవుతుంది తప్ప మరొక విధంగా కాదు.
సుప్రీం కోర్టు కూడా ఈవిఎంల తనిఖీకి, ఎన్నికల ఫలితాల అనంతరం వివిఫ్యాట్ స్లిప్ లతో పోల్చేందుకు సుముఖంగా ఎందుకు ఉండటం లేదో అర్ధం కాని విషయం. ప్రతి ఎన్నికలో ఓడిపోయిన పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఈవిఎం లలో మతలబు జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రజల అనుమానాలు తొలగించేందుకైనా ఎన్నికల ఫలితాల అనంతరం వివిప్యాట్ స్లిప్ లను లెక్కించి ఫలితాలతో సరిపోల్చవలసిన అవసరం ఉన్నది.
జమ్ము & కాశ్మీర్
జమ్ము & కాశ్మీర్ ఎన్నికలు మాత్రం కాస్త అటు ఇటుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తున్నది. కానీ అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ కి వాస్తవ ఫలితాలకు తేడా, హర్యానా అంత కాకపోయినా గణనీయంగానే ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ జమ్ము కాశ్మీర్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా వేస్తే అసలు ఫలితాలేమో జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఏకంగా 42 సీట్లు (39 + 3) వస్తుండగా దాని మిత్రపక్షం అయిన కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. కనుక కాంగ్రెస్, ఎన్.సి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి.
బిజెపి కి 29 (27 + 2) సీట్లు రావటం తక్కువ విషయం ఏమీ కాదు. ఆర్టికల్ 370 రద్దు పట్ల జమ్ము, లడఖ్ ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా బిజెపి వాగ్దానం చేసిన మేరకు తమ ప్రాంతాలకు ఎలాంటి లబ్ది సమకూరలేదని లడఖ్, జమ్ము ప్రజలు ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ ఓటింగ్ కు వచ్చేసరికి వారి వ్యతిరేకత ప్రతిబింబించడం లేదు. సాధారణంగా అయితే ఈ ఫలితాన్ని బట్టి బిజెపి పట్ల వ్యతిరేకత కంటే సానుకూలతే జమ్ము ఏరియాలో ఎక్కువగా ఉన్నదని చెప్పాల్సి ఉంటుంది.
కానీ భారత దేశంలో ఎన్నికలు ఏ నాడూ ప్రాజాభిప్రాయాలను ప్రతిబింబించాయా అన్నది ఒక అనుమానం. ఎందుకంటే డబ్బు పంచకుండా, మద్యం తాగించకుండా, వస్తువుల పంపిణీ చేయకుండా, ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించకుండా వివిధ రాజకీయ పార్టీలు కేవలం తమ సిద్ధాంతాలు చెప్పి, తాము ప్రజలకు ఏమి చేయబోతున్నామో చెప్పి, ప్రజలను మెప్పించటం ద్వారా ఎన్నికల్లో గెలిచిన ఉదాహరణ గత 75 యేళ్ళ భారత చరిత్రలో ఎన్నడూ లేదు. అందుకే భారత దేశ ఎన్నికల ఫలితాలపై ఎడతెగని అనుమానం కొనసాగుతూనే ఉంటుంది.