
గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మదుపుదారులను చైనా పెద్ద ఎత్తున ఊరిస్తున్న నేపధ్యంలో ఇండియా స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్.ఐ.ఐ (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్) లు ఇండియన్ స్టాక్ ల నుండి దాదాపు రు. 37,000 కోట్లు ఉపసంహరించు కున్నట్లు తెలుస్తున్నది. (ఎకనమిక్ టైమ్స్, అక్టోబర్ 7, 2024). విశ్లేషకుల విశ్లేషణ నిజమే అన్నట్లుగా సోమవారం (అక్టోబర్ 7, 2024) సెన్సెక్స్ 638 పాయింట్లు కోల్పోయి 81,050 వద్ద ముగియగా నిఫ్టీ 219 పాయింట్లు నష్టపోయి 24,796 వద్ద క్లోజ్ అయింది.
ఎఫ్.ఐ.ఐ ల పెట్టుబడులని ‘హాట్ మనీ’ అని కూడా పిలుస్తారు. ఎఫ్.ఐ.ఐ లకి ఒక పద్ధతి పాడు ఉండదు. ప్రభుత్వాల నియమ నిబంధనలకి కట్టుబడటం వాటికి ఇష్టం ఉండదు. వాటి కోరికకు తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా, భారత ప్రభుత్వంతో సహా ఎఫ్.ఐ.ఐ లపైన గట్టి నియమ నిబంధనలు విధించకుండా మిన్నకుండి పోతాయి. అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాలు ఎఫ్.ఐ.ఐ లపై సాపేక్షికంగా కఠినంగా వ్యవహరిస్తే ఇండియా లాంటి దేశాలు ఎఫ్.ఐ.ఐ లని బొట్టు పెట్టి రమ్మని బతిమాలుతూ ఉంటాయి.
ఎఫ్.ఐ.ఐ లకి పెట్టుబడికి సంబంధించిన కమిట్మెంట్ ఏమీ ఉండదు. ఎక్కడ ఎక్కువ లాభం కనిపిస్తే అక్కడికి ఎగిరి పోయేందుకు రెక్కలు ఎత్తుకుని సిద్ధంగా ఉంటాయి. అందుకే ఎఫ్.ఐ.ఐ లను ‘హాట్ మనీ’ అని పిలవటం! ఈ ఎఫ్.ఐ.ఐ లు విచక్షణారహితంగా వ్యవహరించడం వల్లనే 1997-98 లో ఆసియా టైగర్ (సౌత్ కొరియా, తైవాన్, హాంగ్ కాంగ్, సింగపూర్, ధాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా) దేశాలు ఒక్క ఉదుటున తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ హాట్ మనీ ప్రధానంగా అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన ఫైనాన్స్ పెట్టుబడి అని వేరే చెప్పనవసరం లేదు.
హాంగ్ కాంగ్ నుండి పని చేసే బ్రిటిష్-హాంగ్ కాంగ్ గ్లోబల్ బ్రోకరేజి సంస్థ సి.ఎల్.ఎస్.ఏ (క్రెడిట్ లియోన్నీస్ సెక్యూరిటీస్ ఆసియా) ప్రకారం ఇండియా ఈక్విటీలు ప్రధానంగా మూడు బండ రాళ్లను మోస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అవి: ఒకటి: చమురు ధరలు. రెండు: ఐపిఓ బూమ్. మూడు: రిటైల్ ఇన్వెస్టర్ల జీర్ణశక్తి క్షీణత. (సి.ఎల్.ఎస్.ఏ ను 2013లో చైనాకు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘CITIC సెక్యూరిటీస్’ కొనుగోలు చేసింది.) ఈ సంస్థ ఇండియా మార్కెట్లపై అంచనాలు తగ్గించి చైనా మార్కెట్లపై అంచనాలు పెంచడంతో ఎఫ్.ఐ.ఐ లు ఇండియా మార్కెట్ల నుంచి వరద కట్టాయి. (సి.ఎల్.ఎస్.ఏ చైనా కంపెనీ కనుక ఇండియాకు వ్యతిరేకంగా అంచనాలు వేసింది అని భావిస్తే తప్పులో కాలేసినట్లే. గ్లోబల్ ఎం.ఎన్.సి ఫైనాన్స్ కంపెనీలకు అలాంటి సెంటిమెంట్లు ఉండవు. సెంటిమెంట్లు తగిలించుకుంటే అవి గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్లో మనజాలవు.
అయితే చైనా మార్కెట్లపై అంచనాలు ఎందుకు పెరిగినట్లు? చైనా షేర్ మార్కెట్లు గత యేడాదిగా బలహీనంగా ఉన్నాయి. హౌసింగ్ మార్కెట్ లో బబుల్ గా మారటం, చైనా లోపల (మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, డొమెస్టిక్ బ్యాంకులు మొ.వి) రుణభారం తడిసి మోపెడు అవటం ఇవన్నీ చైనా ఆర్ధిక వ్యవస్థ ఓవర్ హీట్ కావటానికి దారితీశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొనే సైక్లికల్ సిస్టమ్ (విస్తరణ-expansion, ఉన్నత దశ – peak, సంకోచం – Contraction, పతనం – Trough) చైనాలో కూడా అనివార్యంగా పని చేస్తున్నందున చైనా మార్కెట్లు ఇటీవలి వరకు నష్టాల బాటలో ఉన్నాయి.
ఈక్విటీల ధరలు పడిపోయిన అనంతర పరిస్ధితుల్లో మదుపరులు పడిపోయిన ధరల ప్రకారం ఇన్వెస్ట్ చేసేందుకు బారులు తీరుతారు. తద్వారా లాభాలు పోగేసుకునేందుకు ఉన్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు అడుగులు వేస్తారు. సరిగ్గా ఈ అవకాశమే చైనా షేర్ మార్కెట్లు కల్పిస్తున్నాయని సి.ఎల్.ఎస్.ఏ అంచనా వేసింది. ఇలాంటి అవకాశాన్ని మొట్టమొదట అందిపుచ్చుకునేది ఎఫ్.ఐ.ఐ లే. ఈ నేపధ్యం లోనే ఇండియా మార్కెట్ల నుండి హాట్ మనీ తరలిపోతున్నది. వారం రోజుల సెలవుల అనంతరం తెరుచుకోనున్న చైనా ఈక్విటీలలో మదుపు చేసేందుకు కాచుకున్నాయి.
“ఇండియా ఇప్పటి వరకు శక్తివంతంగా ప్రదర్శన కనపరిచింది. మేము ఇప్పుడు ఇతర మార్కెట్ల వైపు చూస్తున్నాము. చైనా, ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) దేశాలు అంచనాలు అధిగమించే అవకాశం నిజంగానే ఉన్నది. ఇండియా వాస్తవానికి దేశీయ లిక్విడిటీ మార్కెట్ గా భావిస్తున్నాము” అని సింగపూర్ కి చెందిన బహుళజాతి బ్యాంకు డిబిఎస్ గ్రూపు చైర్మన్స్ జొవానె స్యూ చిన్ వ్యాఖ్యానించటం గమనార్హం. “చైనాను ఇండియా మార్కెట్లు 210% అధిగమించిన దరిమిలా ఇండియా వాల్యుయేషన్లు వాస్తవ విలువని మించిపోయాయి. అయినప్పటికీ ఇండియా, ఏమర్జింగ్ మార్కెట్ల గ్రోత్ స్టోరీలో ఇంకా శక్తివంతంగానే ఉందని మా అభిప్రాయం” అని సి.ఎల్.ఎస్.ఏ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించాడు. ఓ వైపు గిల్లుతూనే మరో వైపు జో కొట్టడం ఫైనాన్స్ సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య. నిజానికి వారికి అది ఒక ఆట కూడా. ‘పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం’ తరహాలో!
చమురు ధరలు
ఇజ్రాయెల్ వరస పెట్టి గాజా, లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్ లపై మిసైళ్లతో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 31 తేదీన హమాస్ రాజకీయ నేత హనీయేను ఇరాన్ లో హత్య చేసిన ఇరాన్, సెప్టెంబర్ 27 తేదీన లెబనాన్ లోని దహియేలో బంకర్ లో సమావేశంలో ఉన్న హిజ్బొల్లా సుప్రీం నేత హాసన్ నాసరల్లా ను 2000 పౌండ్ల బాంబులను 15 వరకు ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఒకే చోట ప్రయోగించి చంపేసింది.
దానితో హమాస్ (పాలస్తీనా), హిజ్బొల్లా (లెబనాన్), బాత్ పార్టీ (సిరియా), పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (ఇరాక్), ఆన్సర్ అల్లా (యెమెన్) లతో కూడిన ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ కు దర్శకత్వం, నాయకత్వం వహిస్తున్న ఇరాన్ కు స్పందించక తప్పని పరిస్ధితి ఏర్పడింది. రష్యాను సంప్రదించి ఇజ్రాయెల్ పైన తన పాత అమ్ముల పొదిలోని బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించి ఇజ్రాయెల్ పై దాడి చేసింది. 200 కు పైగా మిసైళ్ళ తో కలిపి ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్ళు నేరుగా ఇజ్రాయెల్ రాజధాని టెల్-అవీవ్ లోని మోసాద్ హెడ్ క్వార్టర్స్ ను, అమెరికా సరఫరా చేసిన ప్రతిష్టాత్మక ఎఫ్-35 జెట్ విమానాలను నిలిపి ఉంచిన వైమానిక స్థావరాన్ని, ఇంకా ఇతర కీలక స్థావరాల పైన దాడి చేసింది.
తాను తలచుకుంటే ఇజ్రాయెల్ ను మట్టి కరిపించటం ఒక లెక్క కాదని ఈ దాడితో ఇజ్రాయెల్ కు తెలిసి వచ్చేలా చేసింది. మధ్యధరా సముద్రంలో మోహరించిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ల యుద్ధ నౌకల నుండి యాంటీ మిసైల్ వ్యవస్థలు, ఇజ్రాయెల్ నిర్మించుకున్న మూడంచెల మిసైల్ నిరోధక వ్యవస్థలు (డేవిడ్ స్లింగ్, యారో, ఐరన్ డోమ్) ఇవేవీ ఇరాన్ మిసైళ్ళు టెల్-అవీవ్ ను తాకకుండా అడ్డుకోలేకపోయాయి. ఇరాన్ దాడికి సమాధానం ఇస్తానని ఇజ్రాయెల్ బింకంగా ప్రకటించినప్పటికీ ఇరాన్ దాడి చేసే ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిచ్చి పట్టినట్లు పుటిన్ కు ఫోన్ల మీద ఫోన్లు చేసినప్పటికీ పుటిన్ ఫోన్ ఎత్తలేదు. పుటిన్ చేత చెప్పిస్తే ఇరాన్ దాడి చేయకుండా నివారించవచ్చని నెతన్యాహు భావించినా అది పనిచేయలేదు.
ఈ నేపధ్యంలో చమురు ధరలు బ్యారల్ కు 80 డాలర్ల ధరకు సమీపించింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ 80 డాలర్లు చేరటం అంటే అది ఇండియాకు అత్యంత చేదు వార్త. అతిపెద్ద చమురు దిగుమతి దేశం అయిన ఇండియాకు చమురు ధర పెరగటం అంటే వస్తువుల ధరలన్నీ పెరగటమే. అంటే ఓ వైపు చమురు చెల్లింపులకు విదేశీ మారకద్రవ్యం నిల్వలు తరిగిపోతాయి. మరోవైపు ధరల పెరుగుదల వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎకనామిక్ ఫండమెంటల్స్ లో విదేశీ మారక ద్రవ్యం, ద్రవ్యోల్బణం ముఖ్యమైన భాగం. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే మరో ఫండమెంటల్ అయిన ‘బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్’ (బి.ఓ.పి) లో సమతూకం దెబ్బ తింటుంది. అనగా బి.ఓ.పి క్రైసిస్ కు ఇండియా చేరువ అవుతుంది. సరిగా ఇలాంటి క్రైసిస్ వల్లనే 1990లో పి.వి.నరసింహారావు – మన్మోహన్ ల ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో మునిగి ఐఏంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు జోలె పట్టి నిలబడింది. చమురు ధరలు పెరిగితే ఇంత ప్రమాదం ఉన్నది. కనుక ఎఫ్.ఐ.ఐ లు, ఎఫ్.పి.ఐ లు క్యూ కట్టి మరీ ఇండియా ఈక్విటీ మార్కెట్ నుండి వెళ్లిపోతాయి.
ఎఫ్.పి.ఐల ప్రవాహం
7 రోజుల జాతీయ సెలవు దినాల తర్వాత చైనా మార్కెట్లలో మంగళవారం ట్రేడింగ్ మొదలవుతుంది. చైనా మెయిన్ ల్యాండ్ లోని షాంఘై ఇండెక్స్ మొ.న ఈక్విటీ మార్కెట్లు గత ఒక్క నెలలోనే 23 నుండి 26 శాతం వరకు పెరిగాయి. హాంగ్ కాంగ్ షేర్ మార్కెట్ ‘హ్యాంగ్ సెంగ్’ అయితే ఒకే నెలలో 26 శాతం పెరిగింది. అక్టోబర్ నెలలో ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ లు తమ వ్యూహాలను ఒక్కసారిగా మార్చుకుని యు టర్న్ తీసుకుని భారీ అమ్మకాలకు దిగాయి. ముఖ్యంగా చైనా మార్కెట్ల లోకి తరలి పోయెందుకే ఈ అమ్మకాలు జరిగాయని గ్లోబల్ విశ్లేషణ సంస్థలు నిర్ధారించాయి. చైనా ఈక్విటీల వాల్యుయేషన్లు వాస్తవ విలువ కంటే తక్కువగా ఉన్నాయని భావిస్తున్నందున చైనా ఈక్విటీల కొనుగోలు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ కొనుగోలు భారత ఈక్విటీల అమ్మకాల ద్వారానే జరుగుతుందని కూడా భావిస్తున్నారు.
చైనా మానిటరీ స్టిములస్
అదీ కాక చైనా సెంట్రల్ బ్యాంకు తన మానిటరీ విధానాన్ని సరళతరం చేసింది. ఓ పక్క చైనా బ్యాంకుల వద్ద నిలవ ఉంచే డబ్బు నిష్పత్తిని 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ మరో పక్క వడ్డీ రేటును మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మరో మాటలో చెప్పాలంటే చైనా అమలు చేస్తున్న ‘మానిటరీ స్టిములస్’ ఇండియా లోని ఎఫ్.ఐ.ఐ లు వ్యూహాత్మకంగా ఇండియా నుండి చైనా ఈక్విటీలలోకి ప్రవహించటానికి దోహదం చేస్తున్నది.
రాష్ట్ర ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికలు: ఇటీవల హర్యానా, జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఆబ్సల్యూట్ మెజారిటీ సాధిస్తుందని చెబుతుండగా, జమ్ము & కాశ్మీర్ లో కాంగ్రెస్ ప్లస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మెజారిటీ సాధిస్తుందని చెబుతున్నాయి. హర్యానా ఎన్నికల ప్రచారం సణ్దర్భంగా బిజెపి కి వ్యతిరేకత బలంగా వ్యక్తం అయింది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని కాంగ్రెస్, ఎన్.సి లు ఇచ్చిన హామీ కాశ్మీర్ ప్రజలకు అతి పెద్ద ఆకర్షణ కానున్నది. కనుక ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈక్విటీ మార్కెట్లకు అత్యంత వేగంగా సంస్కరణలు అమలు చేస్తూ ప్రభుత్వ రంగాన్ని కిలోల లెక్కన అమ్మే తరహాలో బేరం పెడుతున్న బిజెపి/ ఎన్.డి.ఏ ప్రభుత్వం అంటే వల్ల మాలిన అభిమానం. యుపిఏ హయాంలో కాంగ్రెస్ లోని ప్రభుత్వరంగ అనుకూల శక్తుల వలన సంస్కరణల అమలు నెమ్మదించిన సంగతిని ఈక్విటీ మార్కెట్లు మర్చిపోలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సహజంగానే ఈక్విటీ మార్కెట్లకు నీరసం తెప్పిస్తున్నది. ఈ విధంగా రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ కూటమి లు గెలుపు సాధించనున్నట్లు వచ్చిన వార్త మరొక ప్రతికూల వార్తగా భారత మార్కెట్లకు పరిణమించింది.
Q2 ఫలితాలు
రెండవ క్వార్టర్ జిడిపి గ్రోత్ లెక్కలు ఈ వారంలో వెలువడనున్నాయి. రెండవ క్వార్టర్ అంటే జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలతో కూడిన పావు సంవత్సరం. బిఎస్ఇ సెన్సెక్స్ ఇండెక్స్ కు గాను గత 1వ క్వార్టర్ తో పోల్చితే రెండవ క్వార్టర్ లో కేవలం 2.7 శాతం మాత్రమే పెరుగుతుందని కోటక్ సంస్థాగత ఈక్విటీలు అంచనా వేశాయి. అదే నిఫ్టీ లాభాలు ఒకటవ క్వార్టర్ కంటే కేవలం 2.5 శాతం మాత్రమే నమోదు అవుతాయని అంచనా వేసింది. పక్కనే ఉన్న చైనా మార్కెట్లు ఒకే నెలలో 23 నుండి 26 శాతం వృద్ధి నమోదు చేస్తే, ఇండియా మార్కెట్లు మూడు నెలలు కలిపినా సబ్ 3% వృద్ధి నమోదు చేయటం మదుపుదారులకు, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ లకు బాగా నిరుత్సాహం కలిగించే వార్త.
భౌగోళిక రాజకీయాలతో ముడిపడిన చమురు ధరలు, ఎఫ్.పి.ఐ, ఎఫ్.ఐ.ఐ ల బాహ్యముఖ ప్రవాహం, చైనా మానిటరీ స్టిములస్, రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అంచనాలు, ఈ వారం వెలువడనున్న Q2 ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయన్న అనుమానం… ఇవన్నీ కలిసి “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ బలపడేందుకు దారితీస్తున్నాయి.