మీ ఇష్టారీతిన జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? -సుప్రీం కోర్టు


బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏఏపి ఆధ్వర్యం లోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా అభిశంచింది. (అభిశంసన అన్న పదాన్ని టెక్నికల్ అర్ధంలో రాయలేదు. పాఠకులు గమనించగలరు.)

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) కి చెందిన స్టాండింగ్ కమిటీ లో 6వ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరపాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇవ్వటాన్ని జస్టిస్ పి ఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ యాక్ట్ లోని సెక్షన్ 487 కింద తనకు తాను అధికారాలు కట్టబెట్టుకుని ఎన్నికలు జరిపించటాన్ని ధర్మాసనం వ్యతిరేకించింది.

“సెక్షన్ 487 అన్నది ఎగ్జిక్యూటివ్ అధికారాలకు సంబంధించినది. చట్టసభల (లెజిస్లేటివ్) అధికారాలలో జోక్యం చేసుకోవటానికి దానిని ఉద్దేశించలేదు. మీరు ఈ రకంగా జోక్యం చేసుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది?” అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.

మేయర్ ఆధ్వర్యంలో, మేయర్ హాజరై ఉండగా ఎన్నికలు జరగవలసి ఉండగా, మేయర్ లేని సమయంలో ఎన్నికలు జరిపించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ చేత అర్జెంటుగా ఆదేశాలు ఇప్పించుకుని బిజెపి సభ్యుడు స్టాండింగ్ కమిటీలో ఆరవ సభ్యుడిగా ఎన్నికయ్యేలా ఎత్తుగడకు బిజెపి పాల్పడింది. సెప్టెంబర్ 27 తేదీన జరిగిన ఎన్నిక చట్ట విరుద్ధం అని ఆరోపిస్తూ ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

స్టాండింగ్ కమిటీ

ఎంసిడి స్టాండింగ్ కమిటీకి విస్తృత అధికారాలు ఉంటాయి. ఎంసిడిలో నిర్ణయాలు తీసుకోగల అత్యున్నత ఎగ్జిక్యూటివ్ బాడీ ఇదే. ఇందులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. ఢిల్లీ కార్పొరేషన్ వ్యవహారాలను ఇదే చూస్తుంది. ఫైనాన్షియల్ విధులు, ప్రాజెక్టుల ఆమోదం, రాజధాని నగరం నిర్వహణకు సంబంధించిన విధానాలపై చర్చలు జరిపి ఖరారు చేసి అమలు చేసే బాధ్యతను స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంది. విద్య, పర్యావరణం, పార్కింగ్ మొదలైన అంశాల కోసం సబ్-కమిటీలను నియమించే అధికారం, నియమ నిబంధనలను రూపొందించే, సవరించే అధికారం కూడా స్టాండింగ్ కమిటీకి ఉంటాయి.

18 మందిలో 6గురు సభ్యులను ఢిల్లీ హౌస్ నేరుగా ఎన్నుకుంటుంది. మిగిలిన 12 మందిని వార్డ్ కమిటీలు ఎన్నుకుంటాయి. కమిటీకి ఒక చైర్ పర్సన్, ఒక డిప్యుటీ చైర్ పర్సన్ ఉంటారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల నుండి ఈ ఇద్దరినీ ఎన్నుకుంటారు. స్టాండింగ్ కమిటీలో ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో ఆ పార్టీ నియంత్రణ లోనే మునిసిపల్ హౌస్ విధానాలు, నిర్ణయాలు, ఆర్ధిక ఖర్చులు ఉంటాయి. ఏఏపి నియంత్రణ లోకి స్టాండింగ్ కమిటీ వెళ్ళినట్లయితే (చైర్ పర్సన్ ఎన్నుకోగల మెజారిటీ ఏఏపి కి ఉన్నట్లయితే) ఆ పార్టీయే రాజధాని నగర ప్రాంతం లోని వ్యవహారాలపై నియంత్రించ గలుగుతుంది. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఎంత మాత్రం మింగుడు పడని పరిణామం అవుతుంది.

హౌస్ ఎన్నుకునే ఆరుగురిలో ఇప్పటి వరకు ముగ్గురు సభ్యులు ఏఏపి నుండి ఎంపిక కాగా ముగ్గురు సభ్యులు బిజెపి నుండి ఎంపికయ్యారు. బిజెపి నుండి ఎంపికయిన ముగ్గురిలో ఒకరు (కమల్జీత్ షెహ్రావత్) ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంపిగా గెలుపొందటంతో ఒక ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని తమ తమ సభ్యుడితో భర్తీ చేసుకోవాలని బిజెపి, ఏఏపి పోటీ పడుతున్నాయి. సభ్యుడి ఎంపికను అక్టోబర్ 5 తేదీకి మేయర్ వాయిదా వేయగా, ఆమె లేకుండానే ఐఏఎస్ అధికారి అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చేసి ఎన్నిక జరిపించేశాడు. ఇక చైర్ పర్సన్, డిప్యుటీ చైర్ పర్సన్ లను ఎన్నుకోవటమే మిగిలి ఉన్నది.

ఈ నేపధ్యంలో కేసు విచారణ ముగిసేవరకు చైర్ పర్సన్ ఎన్నిక జరగకుండా నివారించాలని మేయర్ తరపున హాజరయిన సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి కోరాడు. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ, ధర్మాసనం, స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ఎన్నిక జరగరాదని ఎల్.జి తరపున హాజరయిన సీనియర్ అడ్వకేట్ సంజయ్ జైన్ కు ఓరల్ ఆదేశాలు ఇచ్చింది.

వాదనలు వినిపిస్తూ ఎల్.జి లాయర్ సంజయ్ జైన్ పిటిషన్ కు అసలు నిర్వహణా సామర్ధ్యం (maintainability) లేదంటూ ప్రాధమిక అభ్యంతరం లేవనెత్తాడు. ఆరంభంలో ఆర్టికల్ 32 కింద పిటిషన్ విచారణ తగదని తామూ భావించామని కానీ ఇందులో తీవ్ర అంశాలు ఇమిడి ఉన్నందున విచారణకు స్వీకరించామని బెంచి చెప్పింది.

“ఆర్టికల్ 32 పిటిషన్ ఎందుకని మేమూ అనుకున్నాం. కానీ విషయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాక నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించాము. ముఖ్యంగా సెక్షన్ 487 కింద అధికారాలు ఉపయోగించిన పద్ధతి చూశాక విచారణకు స్వీకరించాము. మీ (ఎల్.జి) అధికారాల వినియోగం యొక్క చట్టబద్ధత మరియు చెల్లుబాటు గురించి మాకు తీవ్ర స్థాయి అనుమానాలు ఉన్నాయి” అని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 128 ని మేయర్ ఉల్లంఘించారని ఎల్.జి లాయర్ వాదించారు. నెలలోగా ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించగా మేయర్ ఆ ఆదేశాన్ని పాటించలేదని ఎత్తి చూపాడు. మేయర్ కాండక్ట్ గురించి కూడా తమకు రిజర్వేషన్లు ఉన్నాయని కానీ అంత మాత్రాన ఎల్.జి చర్యలను స్క్రూటినీ చేయాల్సిన అవసరాన్ని అది రద్దు చేయదని కోర్టు స్పష్టం చేసింది.

“సెక్షన్ 487 ని ఉపయోగించే పద్ధతి ఇది కాదు… కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి… ఉదాహరణకి ఈ రెండు అంశాలని కలిపి విచారించడం న్యాయబద్ధం కాదు. అవి రెండూ ఒకదాని నుండి మరొకటి స్వతంత్రమైనవి. వాళ్ళు రెండు స్వతంత్ర పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంది. కాజ్ ఆఫ్ యాక్షన్ ఆగస్టు 25 తేదీనే తలెత్తింది. మీరు ఇప్పటిదాకా వేచి ఉన్నారు. కొన్ని అప్రస్తుతాలు, కొన్ని రాజకీయాలను మేము చూడగలిగాము. కానీ సెక్షన్ 487 వినియోగానికి సంబంధించినంత వరకూ ఇది పూర్తిగా తప్పు” అని జస్టిస్ నరసింహ అన్నారు.

జస్టిస్ నరసింహ: “అసలు అంత త్వర త్వరగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటి? తొందర ఎందుకు?… ఇక నామినేషన్ అంశం విషయంలో కూడా సమస్యలు ఉన్నాయి… అవి ఇంకా ఘోరం (much worse)… మేయర్ సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉన్నది… సెక్షన్ 487 కింద ఈ వ్యవహారాన్ని అంతటినీ నిషేధించే అధికారం మీకు (ఎల్.జి) ఎలా వస్తుంది? సెక్షన్ 487 ఎగ్జిక్యూటివ్ పవర్ కి సంబంధించినది. లెజిస్లేటివ్ వీధుల్లో జోక్యం చేసుకునే అధికారం సెక్షన్ 487 మీకు ఇవ్వలేదు. అది ఒక సభ్యుడి ఎన్నికకు సంబంధించినది. మీరు ఇలా జోక్యం చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?”

సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలోకి దిగుతూ చైర్ పర్సన్ ఎన్నిక జరపకుండా నిలిపివేయాలని కోరాడు. జస్టిస్ నరసింహ మాట్లాడుతూ “మేము మీకు చెబుతున్నాము. ఎన్నికలను జరపొద్దు” అని ఎల్.జి లాయర్ కు చెప్పాడు.

స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు తేదీ, సమయం, వేదిక నిర్ణయించే అధికారం కేవలం మేయర్ కి మాత్రమే ఉంటుంది. కాగా ఆగస్టు 5 తేదీన జరిగిన విచారణలో నెల లోపు ఎన్నిక జరపాలని కోర్టు ఆదేశించింది. కానీ మేయర్ అక్టోబర్ 5 తేదీకి ఎన్నిక వాయిదా వేసింది. ఇదే అవకాశంగా ఎల్.జి రంగం లోకి దిగి లేని అధికారాలను కట్టబెట్టుకుని సెప్టెంబర్ 27 తేదీన, మేయర్ లేకుండానే ఎన్నిక జరిపించాడు. ప్రజలు ఎన్నుకున్న మేయర్ కు బదులు ఒక ఐఏఎస్ అధికారి, ప్రజా ప్రతినిధి అధికారాలను వశం చేసుకోవడం చట్ట విరుద్ధం.

సెపరేషన్ ఆఫ్ పవర్స్

ఈ విషయం ప్రజా ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్థ గురించి ఏ కాస్త అవగాహన ఉన్నవారికైనా తెలిసి ఉంటుంది. ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సివిల్ అధికారులు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూల్లో తమ ప్రతిభ కనబరిచి అధికారులుగా నియమించబడతారు. కాబట్టి వీళ్ళు ఎన్నటికీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేరు. సివిల్స్ అధికారులు చట్టబద్ధంగా తమకు అప్పగించబడిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. చట్టాల రూపకల్పన ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులకు మాత్రమే అప్పగించబడింది.

పరీక్షలు రాసి ఉద్యోగాల్లో చేరిన సివిల్స్ అధికారులు శాసన అధికారాలు చెలాయించటం మొదలు పెడితే అది అంతిమంగా నిరంకుశత్వానికి దారి తీస్తుంది. వాళ్ళకు నియమ నిబంధనలు (రూల్స్ అండ్ రెగ్యులేషన్స్) మాత్రమే తెలుసు తప్ప ప్రజల దైనందిన జీవన వ్యవహారాల గురించిన పట్టింపు గానీ, అవగాహన గానీ ఉండదు. పైగా వారు ప్రజలకు జవాబుదారీ కాదు. అందుకే సివిల్స్ అధికారులు అనివార్యంగా రాజకీయ ప్రతినిధుల చెప్పుచేతల్లో ఉండాలి. ఒక్క సివిల్స్ అధికారులే కాదు, మిలట్రీ, పోలీసులు, న్యాయమూర్తులు కూడా ఏదో ఒక రూపంలో శాసన వ్యవస్థకు లోబడి పని చేసేలా ఏర్పాటు చేశారు.

న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం, పార్లమెంటు… ఈ మూడింటికి వేరు వేరు అధికారాలను అప్పగించి, ‘సెపరేషన్ ఆఫ్ పవర్స్’ అనే సిద్ధాంతాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. దీని ప్రకారం న్యాయ వ్యవస్థ చట్టాల రూపకల్పన జోలికి పోకూడదు. అయితే ఒకసారి చట్టం అంటూ చేశాక అది రాజ్యాంగబద్ధమా కాదా అన్న విచారణ చేసే అధికారం, రాజ్యాంగం వెలుగులో చట్టానికి భాష్యం చెప్పే అధికారం కోర్టుకు అప్పగించబడింది. అందుకే ప్రభుత్వానికి, కోర్టుకు మధ్య తరచుగా విబేధాలు ఏర్పడుతుంటాయి.

ముఖ్యంగా ప్రభుత్వం లోని వాళ్ళు కోర్టులు తమ చెప్పుచేతల్లో ఉండాలని భావించినపుడు వివాదం అనివార్యం. న్యాయమూర్తుల జీతభత్యాలు, నివాస సౌకర్యాలు, కోర్టు భావన నిర్మాణాలు, రిటైర్మెంట్ అనంతర నియామకాలు మొ.నవి ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, న్యాయమూర్తులు తరచుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పోకడల ప్రకారం వ్యవహరించడం జరుగుతుంటుంది.

రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ గా ఉన్నపుడు అదే సమయంలో కోర్టులు తమను అనుసరించాలని ప్రభుత్వ పెద్దలు కోరుకున్నప్పుడు అనివార్యంగా కోర్టుకు, ప్రభుత్వానికి (ఎగ్జిక్యూటివ్) వివాదం అనూహ్య స్థాయికి చేరవచ్చు. అయితే ఒక్క ఇందిరాగాంధి ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేసినప్పుడు తప్ప ఇతర అన్ని సమయాల్లో కోర్టులు, ప్రభుత్వాలు వివాద సమయాల్లో సంయమనం పాటిస్తూ వచ్చాయి.

ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభుత్వం కంటే కోర్టులే అత్యధిక సందర్భాల్లో సంయమనం పాటిస్తున్నాయి. లేకుంటే ప్రభుత్వాలు, కోర్టుల పైన ప్రజలకు నమ్మకం కోల్పోయి మొత్తం వ్యవస్థనే మార్చుకునే పనికి ప్రజలు పూనుకుంటారన్న తెలివిడి కోర్టులు, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటుల నిర్వాహకులకు ఉంటుంది. వారు పెత్తనం చేస్తున్న వ్యవస్థకు ప్రజల ఆమోదం కొనసాగటానికి వారిలో వారు సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు.

ఐడియల్ గా చూస్తే న్యాయమూర్తులు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల అధికారాలకు లోబడి పని చేయడమే సరైనది. కానీ మనం నివసిస్తున్నది ఐడియల్ సిస్టమ్ (ఆదర్శవంతమైన వ్యవస్థ) కాదు. అనేక అసమానతలు అనధికారికంగా న్యాయబద్ధం చేయబడిన వ్యవస్థలో మనం నివశిస్తున్నాం. భూములు, పరిశ్రమలు, అనేకానేక సహజ వనరులు, నీరు… వీటి పైన పెత్తనం ఉన్నవాళ్ళు, వాటి పైన యాజమాన్యం ఉన్నవాళ్ళు మాత్రమే శాసన, న్యాయ, రక్షణ (మిలట్రీ, పోలీసులు), నిరంకుశ అధికార వ్యవస్థలను సొంతం చేసుకున్న వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ నేపధ్యంలో కోర్టుల్లోని న్యాయమూర్తులు ఏ కాస్త రాజ్యాంగ నిబద్ధత, న్యాయ నిబద్ధత ఉన్నట్లు అనిపించినా వారి పైన ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని ఆశించే పరిస్ధితికి నెట్టబడ్డాము.

వ్యాఖ్యానించండి