లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్


తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్.ఐ.టి సభ్యులకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెబుతూ దానిని కొనసాగించేందుకు అభ్యంతరం లేదని చెప్పాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఎస్.ఐ.టి దర్యాప్తును సిబిఐ పర్యవేక్షణలో జరిపించవచ్చని కోర్టుకు చెప్పాడు.

సిబిఐ పర్యవేక్షణ అంటే అది అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ లోకి వెళ్లిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్.డి.ఏ కూటమిలో టిడిపి కూడా ఒక భాగం. కాదు, కాదు, ప్రధాన భాగం. టిడిపి మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. కనుక దర్యాప్తు చివరికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జోక్యానికి అనువుగా ఉండే విధంగానే సొలిసిటర్ జనరల్ (కేంద్ర ప్రభుత్వం తరపున) సలహా ఉన్నది.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పడుతుంది. ఈ సిట్ లో సిబిఐ నుండి ఇద్దరు అధికారులు ఉంటారు. వారిని సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేస్తాడు. మరో ఇద్దరు అధికారులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నుండి రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. మరొక సభ్యుడిగా ‘భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ఆధారిటీ (FSSAI – Food Safety and Standards Authority of India) కి చెందిన సీనియర్ అధికారి నియమితులు అవుతారు. ఈ అధికారి అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తే అవుతారు.

కనుక సుప్రీం కోర్టు నియమించిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఎంతవరకు స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుందన్నది అనుమానమే. ఐదుగురు సభ్యులను కేంద్రం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయి. పోనీ ఈ సిట్ విచారణ పైన సుప్రీం కోర్టు పర్యవేక్షణ ఉంటుందా అంటే అదేమీ లేదు. కేవలం సి.బి.ఐ డైరెక్టర్ మాత్రమే దర్యాప్తును పర్యవేక్షిస్తారు. కాబట్టి దర్యాప్తు ఏకపక్షంగా చేయదలచుకుంటే ఆటంకాలు ఏవీ ఉండకపోవచ్చు.

“సుప్రీం కోర్టు ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించినా అంగీకరిస్తాం” అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించటం వెనుక మతలబు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే ఊరట ఏమిటంటే కేసు విచారణ సుప్రీం కోర్టు పరిధిలోకి వెళ్ళటం. ఇప్పటి ద్విసభ్య ధర్మాసనం లోని ఇద్దరు జడ్జిలు రిటైర్ అయ్యేలోపు దర్యాప్తు ముగిస్తే కోట్లాది మంది ప్రజల ఇష్ట దైవానికి సంబంధించిన సెంటిమెంట్లతో కూడిన లడ్డూల కల్తీ కేసు రాజకీయాల మలినం అంటకుండా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని భావించవలసి వస్తున్నది.

స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తే అటువంటి దర్యాప్తు ప్రజల్లో విశ్వాసం పెంపొందింప జేసేందుకు అవకాశం ఉంటుందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సిట్ స్థానంలో పైన చెప్పిన స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తిరుమల ఆలయంలోని దైవంని కొలిచే కోట్లాది మంది భక్తుల మనోభావాలను శాంతింపజేసేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాము తప్ప రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ సభ్యుల విశ్వసనీయత పట్ల సమస్య ఉన్నదన్న అవగాహనకు తమ ఆదేశాలు తావీయరాదని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొన్నది.

అలాగే ఈ విషయంలో ఆరోపణల యోగ్యత (మెరిట్స్) మరియు అయోగ్యతలకు సంబంధించి తాము ఎలాంటి పరిశీలనలు చేయటం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. “ఈ కోర్టు రాజకీయ యుద్ధ క్షేత్రంగా వినియోగించబడేందుకు మేము అనుమతించబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాము” అని ధర్మాసనం పేర్కొన్నది.

ఈ రోజు హియరింగ్ ఆరంభంలో సొలిసిటర్ జనరల్ కేంద్రం తరపున అభిప్రాయం తెలియజేస్తూ ఆరోపణలలో ఏ కాస్తయినా నిజం ఉన్నట్లయితే గనక అది ఆమోదనీయం కాదని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులు అందరూ తగిన సమర్ధులనీ, స్వతంత్రులు కూడా అనీ చెప్పాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సిట్ చేసే దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించవచ్చని సూచన చేశాడు.

ఈ సమయంలో టిటిడి తరపున హాజరయిన సిద్ధార్థ్ లూథ్రా ను ఉద్దేశిస్తూ కోర్టు ఆదేశించే ఎలాంటి దర్యాప్తుకైనా తనకు అభ్యంతరం లేదంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారని పత్రికల్లో వచ్చిన వార్త గురించి జస్టిస్ గవాయ్ అడిగారు. వార్తా పత్రికల నివేదికల ఆధారంగా ఎలాంటి నిర్ణయం చేయవద్దని, టిటిడి ఇ.ఓ చేసిన ప్రకటనల విషయంలో కూడా పత్రికలు తప్పుదారి పట్టించేలా వార్తలు ప్రచురించాయని సిద్దార్థ్ లూథ్రా కోరాడు. రాష్ట్ర ప్రభుత్వ సిట్ ని కొనసాగిస్తూ అవసరం అనుకుంటే కోర్టు ఎంపిక చేసిన అధికారిని సిట్ లో భాగం చేయవచ్చని కోర్టుకు చెప్పాడు.

రాజ్యసభ సభ్యుడు, టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపున హాజరయిన కపిల్ సిబాల్ స్వతంత్ర దర్యాప్తు అత్యంత అవసరమని నొక్కి చెప్పాడు. ఆంధ్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేసిన ప్రకటనలను బట్టి చూస్తే రాష్ట్రం నియమించిన సిట్ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని భావించలేమని ధర్మాసనానికి విన్నవించాడు. “కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించటమే సరైన చర్య కాగలదు. సి.ఎం నిన్న కూడా ఒక ప్రకటన చేశారు. సిఎం ఆ ప్రకటనలు చేయనట్లయితే అది వేరే సంగతి. ఆయన ప్రకటన ప్రభావం ఇప్పటికే ఉన్నది” అని కపిల్ సిబాల్ వాదించాడు. (లైవ్ లా, 04/10/2024).

“ఆరోపణలు చాలా తీవ్రమైనవి” అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తూ నేషనల్ డైరీ దవలప్మెంట్ బోర్డ్ (ఎన్.డి.డి.బి) నివేదిక గత జులైలోనే వచ్చిందనీ, ముఖ్యమంత్రి ఆ నివేదిక ఆధారంగానే ప్రకటన చేశారని చెప్పాడు. “పందికొవ్వు కలిసి ఉన్నట్లు ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి” అని రోహత్గీ వాదించాడు. కపిల్ సిబాల్ వెంటనే “పంది కొవ్వు (lard) వినియోగించారని ఆయనకు ఎలా తెలిసింది? ఏ నివేదిక ఆ సంగతి చెప్పింది?” అని ప్రశ్నించారు. రోహత్గీ సమాధానం ఇస్తూ ల్యాబ్ నివేదికలోనే ఆ విషయం ఉన్నదని చెప్పాడు. రోహత్గీ సమాధానాన్ని కపిల్ సిబాల్ వ్యతిరేకిస్తూ “నివేదిక కేవలం కూరగాయల నూనెల (vegetable fats) గురించి మాత్రమే చెప్పింది తప్ప జంతువుల కొవ్వు గురించి కానే కాదు. అందుకే కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలి” అని ప్రతివాదన చేశారు.

కపిల్ సిబాల్ చేసిన ప్రతివాదన ముఖ్యంగా గమనించదగ్గది. ఇంతవరకూ పత్రికల వార్తలను బట్టి ఏఆర్ డైరీ ఫుడ్ కంపెనీ సరఫరా చేసిన నాలుగు లారీల నెయ్యిలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు కలిసి ఉన్నట్లు ఎన్.డి.డి.బి ల్యాబ్ నివేదిక నిర్ధారించినట్లుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో పాటు ఈ వార్తలు ఫాలో అవుతున్న భారత దేశ ప్రజలు (బహుశా విదేశాల్లోని భారతీయులు కూడా) భావిస్తున్నారు. కానీ ల్యాబ్ సమర్పించిన నివేదిక కేవలం వెజిటబుల్ ఫాట్స్ గురించి చెప్పింది తప్ప అందులో జంతువుల కొవ్వు కలిసిన సంగతి లేదని కపిల్ సిబాల్ వాదన ద్వారా అర్ధం అవుతున్నది. సిబాల్ వాదన నిజమే అయితే ఏపి ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ అత్యంత బాధ్యతారాహిత్యం అవుతుంది. అబద్ధం చెప్పినట్లు కూడా అవుతుంది.

అసలు ఉన్నది ఒకే ఒక నివేదిక. ఆ ఒక్క నివేదిక లోని అంశాలనే సాక్షాత్తు సుప్రీం కోర్టు లోనే రెండు వైరి పక్షాలు ఎవరి కావలసిన అర్ధం వారు తీసుకునే అవకాశం ఎలా వచ్చిందో బొత్తిగా అంతుబట్టని విషయం. జంతువుల కొవ్వు ఉందని ఒకరు, అసలా విషయమే నివేదికలో లేదని మరొకరు వాదించగల అవకాశాన్ని ఒక ల్యాబ్ నివేదిక ఎలా ఇవ్వగలదు? ప్చ్!?

సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ జులై 4 వరకు వచ్చిన నెయ్యిని పరీక్ష చేయలేదని, జులై 6 మరియు 12 తేదీల్లో వచ్చిన నెయ్యి కలుషితం అయిందని చెప్పాడు. సిబాల్ వెంటనే “కలుషితం అయిన నెయ్యిని కొండ మీదికి వెళ్ళేందుకు ఎందుకు అనుమతించారు?” అని ప్రశ్నించాడు. “కానీ టెండర్ మీరే (గత ప్రభుత్వ నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి) ఇచ్చారు” అని లూథ్రా బదులిచ్చాడు. సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ “కోట్లాదిమంది భక్తిని రాజకీయాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి” అంటూ జోక్యం చేసుకున్నాడు. ఈ మాట సొలిసిటర్ జనరల్ అనడం ఒక విచిత్రం. కేవలం హిందూ మతం పైన మాత్రమే ఆధారపడి రాజకీయాలు చేసే బిజెపికి సొలిసిటర్ జనరల్ మెహతా అత్యంత విధేయుడు. అలాంటి వ్యక్తి ప్రజల భక్తిని రాజకీయాలు ఆక్రమించాయని వాపోవటం వింతల్లోకెల్లా వింత!

“ఇది పోలిటికల్ డ్రామాగా మారేందుకు మేము అంగీకరించం. ఇది ప్రపంచ వ్యాపితంగా ఉన్న కోట్లాదిమంది భక్తుల సెంటిమెంట్లకు సంబంధించిన వ్యవహారం. అదృష్టమో, దురదృష్టమో (మీ) ఇద్దరూ యుద్ధంలో మునిగి ఉన్న గ్రూపులే” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. (బార్ అండ్ బెంచ్, 04/10/2024)

సుప్రీం కోర్టు ధర్మాసనం క్రింది ఆర్డర్ ని జారీ చేసింది. ఇది ఆర్డర్ కాబట్టి అనువాదంలో తప్పులు దొర్లే అవకాశాన్ని నివారించేందుకు లైవ్ లా వెబ్ సైట్ ప్రచురించిన ఆర్డర్ ని యధాతధంగా ఆంగ్లంలో ఇవ్వడమైనది.

**********************

FIR has been registered alleging that the ghee supplied in two tankers on July 6 and in two tankers on July 12 by the same supplier was adulterated. It is the allegation in the FIR that the adulterated ghee was used in the manufacture of prasadam laddus. The allegation in the FIR has the potential of hurting the sentiments of crores of people residing worldwide. On the last date, we had requeted the learned Solicitor General of India Tushar Mehta to take instructions as to whether the investigation can be continued by the SIT which was appointed by the State Govt. Shri Mehta, on instructions, stated that he has pondered about the credentials of the members of the SIT and all the members of the SIT have a good reputation. He therefore stated that the investigation can be conducted by the State SIT. He however submitted that that this court can appoint an officer of the Centre to supervise the SIT.

We have not gone into the allegations and counter-allegations. We clarify that we will not permit the Court to be used as a political battleground. However, in order to assauge the feelings of crores of people, we find that the investigation must be conducted by an independent SIT by the representatives of the CBI, the State Police and the FSSAI. We further direct that it is appropriate that the investigation is carried out under the supervision of the CBI director. We clarify that our order should not be construed as any reflection on the independence or fairness of the SIT members. We are passing the order only to assuage the feelings of crores of people having faith in the deity.

The SIT appointed by the State is substituted as : 2 officers of CBI nominated by the CBI Director, 2 officers of State police nominated by the State Govt and 1 senior officer of the FSSAI.”

************************

వ్యాఖ్యానించండి