
అప్పుడప్పుడూ వాట్సప్ లో అర్ధవంతమైన మెసేజ్ లు వస్తుంటాయి. ఎవరు రాశారో తెలియదు గానీ కింది పాఠ్యం కూడా నాకు వాట్సప్ లో మేసేజ్ గా వచ్చింది. క్రింద కవిత రూపంలో ఉన్న భాగం లేదా ప్రశ్న జవాబు రూపంలో ఉన్న భాగం వరకు మెసేజ్ గా వచ్చింది.
సనాతన ధర్మం చాలా గొప్పదని చెబుతూ గత కొన్నేళ్లుగా మధ్య యుగాల నాటి అసమాన, అమానవీయ, మహిళా వ్యతిరేక, కులాల కాలకూట విషంతో నిండిన, సమాజాన్ని పునరిద్ధరించాలని బోధించడం ఎక్కువయింది. బిజెపి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల చేతుల్లోకి ప్రభుత్వాధికారం వెళ్లిపోయాక ఈ పునరుద్ధరణ కార్యక్రమం తీవ్రమయింది.
వేదాల్లోనే అన్నీ ఉన్నాయని చెప్పిన సనాతన ధర్మం, భారత ఉపఖండం ఇంత దరిద్రంగా వెనుకబాటు భావాలతో ఎందుకు నిండిపోయి ఉన్నదో మాత్రం చెప్పదు. పోనీ వేదాల్లో ఉన్న అన్నింటినీ ఉపయోగించి ఎందుకు అభివృద్ధి చెందలేకపోయిందో వివరించదు.
కానీ అదే సనాతన ధర్మం సమస్త జ్ఞానాన్ని దాచుకున్న వేదాల చదువు నుండి 90 శాతం శ్రమ జీవులను దూరంగా పెట్టిందన్న సంగతి మాత్రం మనకు స్పష్టంగా తెలుసు. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని సిద్ధాంతీకరించి స్త్రీలను మగాడికి లొంగి ఉండాలని ఆ ధర్మం శాసించింది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటూ కర్మల వలన జన్మలు సంభవిస్తాయని చెబుతూ ఏ వర్ణానికీ చెందని పంచములు ఎక్కడ నుండి వచ్చారో చెప్పకుండా మిన్నకుంది. సదరు పంచములను ఊరికి ఆవల నెట్టి, వెట్టి బానిసలుగా సేవలు చేయమని నిర్దేశించిన ధర్మం అసలు ధర్మమేనా అన్న భారీ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా కుట్ర పూరిత మౌనం పాటిస్తూ వచ్చింది.
ఈ సనాతన ధర్మం పునరుద్ధరణ భోధనలతో స్ఫూర్తి పొందిన కొందరు యువకులు సనాతన్ సంస్థ పేరుతో ఓ సంస్థని స్థాపించి మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న 82 యేళ్ళ గోవింద్ పన్సారేను ఫిబ్రవరి 16, 2015 తేదీన ఉదయాన్నే మార్నింగ్ వాకింగ్ కి వెళ్తుండగా కాల్చి చంపేశారు. ఆయన సిపిఐ పార్టీకి తల పండిన నాయకుడు కూడాను.
మహారాష్ట్రలో ప్రముఖ హేతువాది, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన ‘అంధ శ్రద్ధా నిర్మూలన సమితి’ నాయకుడు నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ ను మార్నింగ్ వాక్ కి వెళ్తుండగా 20 ఆగస్టు 2013 తేదీన అదే రీతిలో కాల్చి చంపారు. ఆయనను కూడా సనాతన్ సంస్థ సభ్యులే కాల్చి చంపారని మహారాష్ట్ర పోలీసులు తేల్చారు.
కన్నడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, కన్నడ వచన సాహిత్య పండితుడు అయిన ఎం.ఎం.ఖల్బుర్గి ని 30 ఆగస్టు 2015 తేదీన ఆయన ఇంటి గుమ్మం వద్ద ఉదయం పూట కాల్చి చంపారు. ఆయనను కూడా సనాతన్ సంస్థ సభ్యులే కాల్చి చంపారని పోలీసుల పరిశోధనలో తేలింది.
గౌరీ లంకేష్, కర్ణాటకలో ప్రముఖ జర్నలిస్టు. తాము హిందువులం కామని, తమది ప్రత్యేక మతం అని, తమను అలాగే గుర్తించాలని కోరుతున్న లింగాయత్ లకు మద్దతు ఇచ్చారామె. బసవన్న అనుచరులు కూడా హిందువులు కాదని ఆమె పేర్కొన్నారు. “లంకేష్ పత్రికే” పేరుతో సొంతగా ఒక అభ్యుదయ పత్రిక నడిపారు. ముస్లింలపై, హిందూత్వ సంస్థల దాడులను తన పత్రికలో తెగనాడింది. 5 సెప్టెంబరు 2017 తేదీన ఉదయాన్నే ఇంటికి వచ్చిన గౌరి పైన ముగ్గురు ఆగంతుకులు కాల్పులు జరిపి చంపేశారు.
ఆమె హత్యకు నిరసనగా, నిందితులను పట్టుకుని శిక్షించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, పట్టు విడవకుండా తనకు తోచిన రీతిలో పోరాడాడు. బిజెపికి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డారు కూడా. 2019 ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుండి లోక్ సభకు పోటీ చేసి 28,900 ఓట్లు మాత్రమే పొందగలిగారు.
గౌరీ లంకేష్ ను చంపింది కూడా సనాతన్ సంస్థ సభ్యులే అని విచారణలో తేలింది.
కనుక సనాతన ధర్మం అంటే కుల-మత అసమానతలు, బాల్య వివాహాలు, సతీసహగమనం, అంటరానితనం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, ఒకే కులానికి వేదాధ్యయనంలో రిజర్వేషన్లు, మూఢ నమ్మకాలు, స్త్రీ-పురుష అసమానత్వం, స్త్రీలు-దళితులు-మైనారిటీల అణచివేత… ఇంకా చాలానూ…! సనాతన ధర్మాన్ని ఇంకా అభివృద్ధి చేసి లవ్ జీహాద్, ఓట్ జీహాద్, యు.పి.ఎస్.సి జీహాద్, జర్నలిజం జీహాద్, వాట్సప్ జీహాద్, ట్విట్టర్ జీహాద్…. ఇలా సృజనాత్మక జీహాద్ లను కనిపెట్టి వాటిపై పోరాడే కర్తవ్యాన్ని కూడా నెత్తికి ఎత్తుకున్నారు నేటి సనాతన్ ధర్మ అనుసరణీయులు!
సనాతన ధర్మం అంటే ఏంటమ్మా?
………………………………………………………..
సనాతన ధర్మం అంటే
అష్ట వర్షాత్ భవేత్ కన్య అంటే నీకు ఎనిమిదేళ్లు వస్తే పెళ్లి చేయాలి.
సనాతన ధర్మం అంటే
న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి స్త్రీలు స్వాతంత్యానికి అర్హులు కారు
సనాతన ధర్మం అంటే
భర్త చనిపోతే భార్యను చితి మీద సహగమనంతో చంపాలి
సనాతన ధర్మం అంటే
భర్త చనిపోతే భార్యకు గుండు గీసి తెల్లచీర కట్టాలి
సనాతన ధర్మమంటే
మగవాళ్ళు పంచ కట్టి పిలక పెట్టాలి
సనాతన ధర్మమంటే
అస్పృశ్యతను పాటించాలి
సనాతన ధర్మం అంటే
దళితులను ఆలయాల్లోకి రానివ్వకూడదు
సనాతన ధర్మమంటే
శూద్రులు చదువుకోరాదు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి
సనాతన ధర్మమంటే
మహిళల్ని అన్నింటా అణిచివేసే పితృస్వామ్యం
సనాతనధర్మం అంటే
పుచ్చి పోయిన మనువాదం
సనాతన ధర్మం అంటే
రాజ్యాంగ వ్యతిరేకం
సనాతన ధర్మం అంటే
చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ
సనాతనధర్మం అంటే
లౌకికత్వం లేని మత వ్యవస్ధ
సనాతనధర్మం అంటే
వెయ్యేళ్ళ వెనుక ప్రయాణం.
అమ్మా నేను నేను వెనక్కి మళ్ళను
ముందుకే నడుస్తాను.
****************************