లడ్డు గొడవ జగన్ అరెస్టు కోసమా?


తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపిన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ‘గాలివానగా మారిపోయింది’ అని కూడా అనవచ్చునేమో? ఒక సాధారణ తినుబండారానికి దైవత్వం ఆపాదించి భగవంతుడు స్వయంగా ఆశీర్వదించి ప్రసాదించిన ప్రసాదంగా మార్చివేశాక, ఆ తినుబండారం కేంద్రంగా ఇక ఎన్ని రాజకీయాలు చేయవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు.

సెప్టెంబర్ 18 తేదీన అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్.డి.ఏ శాసనసభా పక్ష సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తాను ఎలా అభివృద్ధి చేయబోతున్నానో చెబుతూ పనిలో పనిగా తిరుపతి లడ్డు, టిటిడి అన్నదానం కార్యక్రమాల నిర్వహణ విషయంలో గత వై.ఎస్.ఆర్ పార్టీ ప్రభుత్వం పైన సంచలనం కలిగించే ఆరోపణలు చేశారు. సదరు కార్యక్రమాల్లో స్వఛ్చమైన నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుని ఉపయోగించారని, తాము మాత్రం ఎలాగైనా సరే స్వఛ్చమైన నెయ్యి మాత్రమే సఫరఫరా చేయాలని ఆదేశించామని ప్రకటించారు.

ఇక మిగతా పనిని పత్రికలు అందుకున్నాయి. భారతదేశం అంతటా తిరుపతి వేంకటేశ్వర స్వామి వారికి పెద్ద సంఖ్యలో భక్తులున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు వీలు కుదిరినప్పుడల్లా తిరుపతి వచ్చి తిరుమలలో పొర్లు దండాలు పెట్టుకునేవారు. అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ నటులు లాంటి సెలబ్రిటీలు, చివరికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తో సహా ఇతర న్యాయ మూర్తులతో సహా… ఇంకా అనేకమంది ప్రముఖులు తిరుపతి వచ్చి దర్శనం చేసుకుని, పత్రికల ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళడం ఒక ఆనవాయితీ అయింది. అలాంటి తిరుపతి లడ్డు తయారీ పైన వివాదం రేపితే అది ఎంత దూరం అయినా వెళ్తుంది మరి!

ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలో బిజెపి పార్టీ 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది లగాయితు, ప్రతి చిన్న దానికీ ఆరోపణలు చేస్తూ, ఆగ్రహిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బిజెపి, ఆర్ఎస్ఎస్, వి.హెచ్.పి, భజరంగ్ దళ్ లాంటి సంస్థలు తీవ్ర స్థాయిలో ఆరోపణలకు, దాడులకు, అల్లర్లకు దిగడం జరుగుతూ వస్తున్నది. చిన్న సంఘటన కూడా భారీ స్థాయి అల్లర్లకు, హత్యలకు దారి తీసి చివరికి ఎన్నికల్లో బిజెపి లాభపడటం వరకు (కొండొకచో లాభం చేకూరని సందర్భాలూ ఉన్నాయి) వెళ్ళిన ఉదాహరణలు ఉన్నాయి. బిజెపితో కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిడిపి నేత ఏ పాఠం అయితే బిజెపి నుండి నేర్చుకోకూడదో అదే పాఠం నేర్చుకున్నారా అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తున్నది.

చిత్రం ఏమిటి అంటే పైన చెప్పిన శాసనసభా పక్ష సమావేశం లోనే ముఖ్యమంత్రి తన పార్టీ ఎంఎల్ఏ లకు, నాయకులకు ఒక వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు అన్నది ఆ వార్నింగ్ సారాంశం. ఈ వార్నింగ్ కి నిజమైన అర్ధం ఏమిటి అన్నది తిరుపతి లడ్డు గొడవ దరిమిలా అనుమానం కలుగుతోంది. (అదేదో సినిమాలో హీరో “నాకిలా జరిగిందని ఊరేగింపు తీస్తారా ఏమిటి? అది మాత్రం చేయొద్దు” అని చెప్పి కాలేజీ పిల్లలు ఊరేగింపు తీసేలా ప్రేరేపిస్తాడు.)

నిజానికి తిరుపతి లడ్డుల క్వాలిటీ గురించిన గొడవ ఈనాటిది కాదు. దశాబ్దాల తరబడి ఈ గొడవ అప్పుడప్పుడూ రేగుతూ, సద్దుమణుగుతూ, మళ్ళీ రేగుతూ మళ్ళీ …గుతూ ఉండటం పరిపాటి అయింది. లడ్డు క్వాలిటీ గురించి భక్తులు ఫిర్యాదులు చెయ్యటం, అన్నదానం పైన అసంతృప్తి వ్యక్తం చేయటం మామూలుగా జరుగుతుంటుంది. భారీ యెత్తున జరిగే కార్యక్రమాలు కనుక లోపాలు జరగకుండా ఉండటం అసాధ్యం. వేలమంది వస్తుంటారు గనక అందరినీ ఒకే రీతిలో సంతృప్తి పరచటమూ అసాధ్యమే.

అయితే ఈ సారి నేరుగా ముఖ్యమంత్రి గారే, గత ప్రభుత్వం పైన ఆరోపణ చేయటం.. అది కూడా ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా లడ్డూలలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని చెప్పటంతో రాష్ట్రంతో పాటు కేంద్రం లోని రాజకీయ నాయకులు కూడా ఉలిక్కి పడవలసి వచ్చింది. పైగా ముఖ్యమంత్రి ఆరోపణలకు టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి వంత రావటంతో ఆరోపణలకు మరింత తీవ్రత వచ్చి చేరింది. టిటిడి ఇఓ జె. శ్యామలరావు, రెండు నెలల క్రితం నెయ్యి సరఫరా చేసే కంపెనీల్లో ఒక కంపెనీ నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్నదన్న ఆరోపణతో దానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, క్రిమినల్ ఫిర్యాదు చేస్తామని చెప్పటాన్ని పత్రికలు గుర్తు చేశాయి.

సదరు కంపెనీకి 8.5 లక్షల కి.గ్రాల సరఫరాకు టెండర్ ఇచ్చారు. ఇప్పటికే 68,000 కి.గ్రాల నెయ్యి ఆ కంపెనీ సరఫరా చేసింది. అందులో 20,000 కి.గ్రాల నెయ్యి నాసిరకంగా ఉందని టిటిడి ల్యాబ్ పరీక్షలో తేలినట్లు ఇ.ఓ అప్పట్లో చెప్పారు. అది ఏ కంపెనీ అన్నది చెప్పలేదు. జంతువుల కొవ్వు కలిపింది ఆ కంపెనీయేనా అన్నది మొదట్లో పత్రికలకు తెలియదు.

ముఖ్యమంత్రి ఆరోపణకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి ప్రకటన బాధ్యతారాహిత్యం అని వ్యాఖ్యానించారు. “దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ ఆరోపణ చేశారు” అని ఆయన ప్రత్యారోపణ చేశారు. ముఖ్యమంత్రి లడ్డు పైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టిటిడి చైర్ పర్సన్లుగా పని చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, వై.వి సుబ్బా రెడ్డిలు కూడా ప్రత్యారోపణలు చేశారు. “తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా నష్టపరిచారు. ఏ వ్యక్తీ అలాంటి మాటలు మాట్లాడరు, అలాంటి ఆరోపణలు చెయ్యరు” అన్నారు. వై.వి.సుబ్బారెడ్డి గారయితే ఆరోపణలు నిరూపించండి లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కొటానికి సిద్ధం కండి అని సవాలు విసిరారు. “తిరుమల ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ వంశానికి చెందిన వ్యక్తులు తయారు చేస్తారు. అధికారులకు గానీ, టిటిడి బోర్డుకు గానీ అందులో ఎలాంటి పాత్రా ఉండదు” అని భూమన వాదించారు.

తర్వాత బిజెపి, కాంగ్రెస్ లు అందుకున్నారు. బిజెపి ప్రతినిధి జి.భానుప్రకాశ్ రెడ్డి వై.ఎస్. జగన్ ను “పచ్చి హిందూ వ్యతిరేకి” అని ప్రకటించేశాడు. పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. హిందూ సెంటిమెంట్లు అంటే జగన్ కి బొత్తిగా గౌరవం లేదని తేల్చేశాడు. టిటిడి నుండి 5,000 కోట్లు దారి మళ్లించాలని చూశాడని, పద్మావతి నిలయం కాంప్లెక్స్ ని కలెక్టరేట్ కింద మార్చాడని ఆక్షేపించాడు. ఇంకా ముందుకు వెళ్ళి నెయ్యి సరఫరా బాధ్యతను ‘కౌ బెల్ట్’ లోని ఏపి, కర్ణాటక, తమిళనాడు లకు చెందిన రైతుల కో-ఆపరేటివ్ సొసైటీలకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. కౌ బెల్ట్ కు దూరంగా ఉన్న చోట్లనుండి నెయ్యి సేకరిస్తే కల్తీ జరిగే అవకాశం ఉందని ఓ సలహా కూడా ఇచ్చారు. బిజెపి నుండి ఎలాంటి ఆరోపణలైతే వస్తాయని భావిస్తామో అదే తరహా ఆరోపణలు చేసి, తాము దారి తప్పేది లేదని చాటారు.

కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ భూపాల్ రెడ్డి, ఏకంగా సిబిఐ విచారణ చేయించాలని ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “నాయుడు గారి ఆరోపణలు తీవ్రమైన స్వభావం కలవి. కనుక సిబిఐ చేత ఆయన విచారణ చేయించాలి” అని కోరారు. రాహోల్ గాంధీ కూడా వెనకబడకుండా “కేవలం నాయుడు మాత్రమే రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని ఉపయోగించుకోగలరు” అని వ్యాఖ్యానిస్తూ, “తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్త ఆందోళనకరం. లార్డ్ బాలాజీ ప్రపంచ వ్యాపితంగా అనేకమంది పూజిస్తారు. ఈ వార్త ప్రతి భక్తుడినీ గాయపరుస్తుంది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలి. దేశవ్యాపితంగా అధికార వ్యవస్థలు ప్రార్ధనా స్థలాల పవిత్రతను సంరక్షించాలి” అని తన సాఫ్ట్ హిందూత్వ పంధాలో వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం “నేను సైతం” అంటూ ముందుకు వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి ఆగమేఘాల మీద స్పందిస్తూ లడ్డు వ్యవహారం పైన వెంటనే నివేదిక పంపించమని ముఖ్యమంత్రిని కోరారు. ఏ నివేదిక అందుబాటులో ఉంటే ఆ నివేదిక పంపమని కోరినట్లు విలేఖరులకు చెప్పారాయన. కేంద్ర ఆహార శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి సవిరమైన దర్యాప్తు చేయాలని కోరారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అసలు సంగతి పక్కన పెట్టి టిటిడిలో హిందూయేతర మతం వారికి ఉద్యోగాలు ఇవ్వటం పైన నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. వసుధైక కుటుంబం కోరేదే భారత హిందూ సంస్కృతి అనీ, భారతదేశం విశ్వ గురువు అనీ గాలితో మూటలు కట్టే బిజెపి నేతలకు అంతకంటే తక్కువకు దిగజారితే వారి ప్రతిష్ట మసకబారుతుంది కాబోలు! ఇక భోపాల్ లో బిజెపి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి తమ నాయకులకు తీసిపోము అని చాటారు.

నెయ్యిలో ఏమేం కలిశాయి?

టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి జె.శ్యామల రావు, కల్తీ గురించిన వివరాలను పత్రికలకు వెల్లడి చేశారు. గుజరాత్ లోని నేషనల్ డైరీ డవలప్ మెంట్ బోర్డ్ (ఎన్.డి.డి.బి) కి అనుబంధంగా పని చేశీ సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ (సి.ఏ.ఎల్.ఎఫ్) కు నెయ్యి శాంపిల్స్ ని జులై 23 తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అక్కడికి ఎందుకు పంపారు అంటే, లడ్డు ప్రసాదం రుచిలో మార్పు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయట. ఎవరు ఫిర్యాదు చేశారో ఎవరూ చెప్పలేదు. భక్తులు ఫిర్యాదు చేశారా లేక ఏవైనా భక్త సంస్థలు ఫిర్యాదు చేశాయా అన్న వివరం ఏ పత్రికలోనూ నివేదించబడలేదు. శాంపిల్స్ ని పరీక్షించిన సి.ఏ.ఎల్.ఎఫ్ సంస్థ తన నివేదికని జులై నెలలోనే పంపినట్లు తెలుస్తోంది.

అయితే సదరు ల్యాబ్ నివేదికని టిటిడి ఇఓ సెప్టెంబర్ 19 తేదీన, ముఖ్యమంత్రి ఆరోపణలు చేసిన తర్వాత రోజున పత్రికలకు వెల్లడి చేశారు. సదరు నివేదిక ప్రకారం తిరుపతి లడ్డు ప్రసాదంలో నెయ్యితో పాటు పంది కొవ్వు (lard), బీఫ్ కొవ్వు (tallow), చేప నూనె లు కలిసి ఉన్నాయి. నివేదిక అక్కడితో ఆగలేదు. వీటితో పాటు కూరగాయలకు సంబంధించిన కొవ్వు (నూనె) లు కూడా శాంపిల్స్ లో ఉన్నాయని నివేదిక తెలిపింది. కొబ్బరి నూనె, అవిసె విత్తనాల (linseed) నూనె, ఆవ గింజల (rapseed) నూనె, పత్తి విత్తనాల (cottonseed) నూనె లు కూడా కలిసి ఉన్నాయని తెలిపింది.

అయితే ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కేవలం కూరగాయల నూనెల ఉనికికే వర్తిస్తుందా లేక పంది కొవ్వు, బీఫ్ కొవ్వుల ఉనికికి కూడా వర్తిస్తుందా అన్నది తెలియలేదు.

వై.ఎస్.ఆర్ పార్టీ ప్రభుత్వం నెయ్యి సరఫరా కాంట్రాక్టును కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) కు చెందిన నందిని బ్రాండ్ కి బదులు తమిళనాడు లోని ఏఆర్ డైరీ ఫుడ్ కి అప్పజెప్పింది. ఈ కంపెనీ అప్పటికే సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ స్క్రూటినీ కింద ఉన్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చెబుతోంది. ఏఆర్ డైరీ కి కాంట్రాక్టు అప్పగించాక లడ్డు క్వాలిటీ పైన ఫిర్యాదులు అనేక వచ్చాయట.

జూన్ నెలలో అధికారం చేపట్టిన టిడిపి కూటమి ప్రభుత్వం ఆ నెలలోనే టిటిడి ఇ.ఓ గా జె శ్యామల రావు ని నియమించింది. ఫిర్యాదులపైన విచారణకు ఆదేశించారు. టిటిడి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. డాక్టర్ బి సురేంద్రనాధ్ (నేషనల్ డైరీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, విజయవాడ లో మాజీ ప్రిన్సిపల్ సైంటిస్టు), భాస్కర్ రెడ్డి (డైరీ నిపుణుడు), ప్రొఫెసర్ బి మహదేవన్ (ఐఐఎం-బెంగుళూరు), డాక్టర్ జి స్వర్ణలత (తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ) లు ఈ కమిటీలో సభ్యులు. ఈ కమిటీయే నెయ్యి శాంపిల్స్ ని ఎన్.డి.డి.బి కి పంపింది. జులై లోనే అక్కడి నుండి రిపోర్ట్ లు వచ్చాయి.

నివేదిక నేపధ్యంలో ఏ ఆర్ డైరీ ఫుడ్స్ (దిండిగల్) పంపిన నెయ్యి స్టాక్ లని తిప్పి పంపేసి, కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కెఎంఎఫ్ కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం వినిపిస్తున్న మరో వాదన ఏమిటంటే నందిని బ్రాండు నెయ్యి కి.గ్రా ఖరీదు రు 475 కాగా, ఏ ఆర్ డైరీ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి కి.గ్రా ఖరీదు రు 320 మాత్రమే. సాధారణంగా అవినీతికి పాల్పడాలని భావిస్తే ఎక్కువ ధరకు టెండర్ ని ఓకె చేస్తారు. తద్వారా ధరలో కొంత భాగం అవినీతిపరుల ఖాతాలకు చేరే అవకాశం ఉంటుంది. ధర ఏకంగా రు 155 లు మేర తక్కువకు ఇచ్చినపుడు కూడా అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. తక్కువ ధరలో సరఫరా చేసేటప్పుడు నాసిరకం నెయ్యిని సరఫరా చేసి అటు అవినీతి అధికారులను సంతృప్తిపరుస్తూనే తమ లాభాలకు గండి పడకుండా కంపెనీలు జాగ్రత్త వహిస్తాయి. కాబట్టి కల్తీ జరిగే అవకాశం తక్కువ ధర నెయ్యి సరఫరాతో పాటు ఎక్కువ ధర నెయ్యి సరఫరాలో కూడా ఉన్నది. కాకపోతే తక్కువ ధరలో నాసిరకం నెయ్యి ద్వారా అవినీతి జరిగితే, ఎక్కువ ధరలో అసలు ధరకంటే ఎక్కువ ధర చెల్లించటం ద్వారా అవినీతి జరగవచ్చు. ఎంత పవిత్ర తిరుపతి-తిరుమల అయినా సరే అక్కడ అసలు అవినీతి జరగనే జరగదు అని చెప్పగల దమ్ము ఏ భక్తుడికైనా ఉన్నదా?

కానీ ఈ లడ్డు కల్తీ చర్చలో అవినీతి అంశానికి అసలు చోటే దక్కకపోవటం పరమ ఆశ్చర్యకరం. కల్తీ ఎందుకు జరుగుతుంది? కేవలం అవినీతి మార్గంలో సంపాదన చేసేందుకే జరుగుతుంది. తిరుపతి-తిరుమలలో ఇలాంటి అవినీతికి ఎవరు పాల్పడతారు అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిన విషయమే. టిటిడి ఛైర్మన్ పదవి కోసం రాజకీయ నాయకులు ఎంతగా పాకులాడతారో ప్రజలకు తెలియని విషయం ఏమీ కాదు.

కనుక లడ్డు కల్తీ వ్యవహారంలో చూడవలసింది అవినీతినే తప్ప, భక్తుల సెంటిమెంట్లను కాదు. భక్తుల సెంటిమెంట్లకే అంత విలువను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇచ్చే పనైతే టిటిడి ద్వారా ఇంకా అనేకానేక మంచి పనులు చేయించవచ్చు. (ఈ రోజు బిజెపి నేత టిటిడి బిల్డింగ్ ని కలెక్టర్ ఆఫీస్ కి ఇచ్చారని ఆందోళన ప్రకటిస్తున్నాడు గానీ, కలెక్టర్ కార్యాలయాన్ని అద్దె చెల్లించి టిటిడి భవనంలో నిర్వహిస్తే వచ్చే నష్టం ఏమిటి? టిటిడి రాష్ట్రం నిండా కళ్యాణ మండపాలు కట్టి అద్దెలు వసూలు చెయ్యటం లేదా? తిరుమలలో షాపులు అద్దెకు ఇవ్వలేదా? అలాంటిది ప్రభుత్వ ఆఫీసుకి అద్దెకు ఇస్తే వచ్చే నష్టం ఏమిటో అంతుబట్టని విషయం.)

కనుక తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ మరియు అవినీతికి సంబంధించినదే తప్ప తిరుపతి, తిరుమలను అపవిత్రం చేసే సమస్యగా గానీ, భక్తుల మనోభావాలను దెబ్బ తీసే సమస్యగా గానీ చూడటం అంటే అది అనివార్యంగా “సమస్యను రాజకీయం చెయ్యాటమే” తప్ప మరొకటి కానే కాదు. లడ్డు కల్తీ సమస్యను భక్తుల సెంటిమెంటు సమస్యగా, తిరుపతి పవిత్రత సమస్యగా మార్చటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. లేనట్లయితే జులై నెలలో వచ్చిన నివేదికను 100 రోజుల పండగ నాడు లేవనెత్తి, ఆ వెంటనే నివేదిక వెల్లడి చేయించటం లోని పరమార్ధం ఏమిటి? భక్తుల సెంటిమెంటు, తిరుపతి పవిత్రతలు జులై నెల నుండి సెప్టెంబర్ నెల వరకు ఎక్కడికి పోయినట్లు? శుభకార్యాలకు మూఢం అడ్డం వచ్చినట్లు ప్రభుత్వానికి కల్తీ వ్యవహారాన్ని వెల్లడి చేసేందుకు కూడా మూఢం ఏమన్నా ఆటంకం అయిందా?

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1970లలోనే చెప్పినట్లు “అవినీతి సర్వవ్యాపితం.” తిరుపతి-తిరుమలలో పవిత్ర కార్యాల పేరుతో సాగే పనుల్లోనూ అవినీతి చోటు చేసుకుంటున్న సంగతి పత్రికలు అనేకసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెల్లడి చేశాయి. ఇప్పుడు మాత్రమే పవిత్రత, సెంటిమెంట్ పేరుతో కధలు అల్లుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుపతిని కల్తీ లడ్డూల ద్వారా జరిగిన అపవిత్రతను ప్రక్షాళన చేయడం గురించి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ జరగడం పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ (SIT) ని నియమించబోతున్నట్లు కూడా ఆయన చెప్పారు. నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదా? సిట్ నియామకం అంతిమంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్ అరెస్టుకు దారి తీస్తుందా అన్న ప్రశ్న చాలా మందిలో ఇప్పుడు వస్తున్నది. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి రిమాండ్ లో గడిపేలా చేసినందుకు నేటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగేందుకు లడ్డూల కల్తీ వ్యవహారాన్ని ఉపయోగించుకోనున్నదా?

వ్యాఖ్యానించండి