కేంద్రం ఐ.టి రూల్స్ సవరణపై బొంబే హై కోర్టు మొనగాడి తీర్పు!


ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షాల నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ఐ.టి రూల్స్ 2021 చట్టానికి 2023లో తలపెట్టిన సవరణలు రాజ్యాంగ విరుద్ధం అని బొంబే హై కోర్టు నియమించిన ‘టై బ్రేకర్’ జడ్జి జస్టిస్ అతుల్ చందూర్కర్ తీర్పు ఇచ్చారు. తాజా తీర్పుతో జనవరి 2024లో ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచిలోని ఇద్దరు జడ్జిలు ఇచ్చిన విభిన్నమైన చెరొక తీర్పు (split verdict) ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా మారింది.

ఐ.టి రూల్స్ 2021 చట్టానికి మోడి ప్రభుత్వం 2023లో తలపెట్టిన సవరణల ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్^స్టాగ్రామ్ లాంటి ఇంటర్మీడియరీ సోషల్ మీడియాలో ప్రజలు, పత్రికలు, వార్తా ఛానెళ్లు, యూ ట్యూబ్ చానెళ్లు కేంద్ర ప్రభుత్వం గురించి ప్రచురించే వార్తలు తప్పుడు వార్తలా లేక నిజమైన వార్తలా అన్నది నిర్ణయించేందుకు “ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’ లను ఏర్పాటు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు తానే కట్టబెట్టుకుంది.

ఈ సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లు (ఎఫ్.సి.యు) అనునిత్యం సోషల్ మీడియాలను పర్యవేక్షిస్తాయి. ప్రధాన మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం లోని వివిధ మంత్రులు, అధికారులు, డిపార్ట్^మెంట్లు, ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ చెప్పే మాటలు, ఇచ్చే ప్రకటనలు, చేసే చట్టాల గురించిన వార్తలను ఈ యూనిట్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాయి.

అలా ప్రచురించబడిన వార్తలు నిజమా (fact), లేక బూటకమా (fake) లేక తప్పుదారి పట్టించేదా (misleading) అన్న అంశాన్ని ఈ ఎఫ్.సి.యు లు తామే నిర్ణయించేస్తాయి. ఏదైనా ఒక వార్త లేదా వార్తలు అవి ‘బూటకం’ అని భావించినట్లయితే వాటిని ఎఫ్.సి.యులు ‘బూటకం’ అన్న ట్యాగ్ తగిలిస్తాయి. అలా ట్యాగ్ తగిలించిన వార్తలను సోషల్ మీడియా కంపెనీలు తొలగించాల్సి ఉంటుంది లేదా తామే ‘ఈ వార్త బూటకం’ అని గానీ లేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గానీ ఒక ‘డిస్క్లెయిమర్) (disclaimer) జత చేయాల్సి ఉంటుంది.

అనగా డిజిటల్ వార్తా సంస్థలు, చానెళ్లు ప్రచురించే వార్తలలో తప్పొప్పులను ఎంచే హక్కును ప్రభుత్వం తనకు తానే దఖలు పరచుకుంది. కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చని వార్తలను -అవి నిజమా కదా అన్న అంశంతో సంబంధం లేకుండా- ‘బూటకం’ అని ముద్ర వేసే అవకాశాన్ని కలిగించుకుంది. ప్రధాన మంత్రులు, ఇతర మంత్రులు, అధికారులు ఎవరైనా సరే ఒక విధాన ప్రకటన చేస్తే ఆ ప్రకటన గురించి వార్తా సంస్థలు తమదైన విశ్లేషణని ప్రచురిస్తాయి. అలాంటి విశ్లేషణ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ఆ విశ్లేషణ నిజమే అయినప్పటికీ, దానిని బూటకపు వార్తగా ముద్ర వేసి వాస్తవ విశ్లేషణలను కూడా ప్రజలకు అందకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం, అవకాశం 2023 చట్ట సవరణ ద్వారా సంక్రమిస్తాయి.

విచిత్రం ఏమిటంటే ఈ సవరణలు ప్రింట్ మీడియాకు వర్తించవు. ప్రింట్ మీడియా ఇప్పుడు వార్తలను పేపర్ పత్రికలో ముద్రించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా సదరు వార్తలోని ప్రధాన అంశాన్ని గానీ లేదా మొత్తంగా గానీ ప్రచురిస్తున్నాయి. అలాగే తామే డిజిటల్ వార్తా సంస్థగా అవతరించి పూర్తి వార్తలను ప్రచురిస్తూ సబ్^స్క్రిప్షన్ కూడా కట్టిస్తున్నాయి. ఒక పత్రిక, ఉదాహరణకి ‘ద హిందూ’ పత్రిక, ప్రింట్ లో ముద్రించిన వార్తను డిజిటల్ మీడియాలో కూడా ప్రచురిస్తుంది. అలాగే ఫేస్ బుక్, ఇన్^స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) లలో వార్త సారాంశంతో పాటు వార్తకు లింక్ ప్రచురిస్తుంది.

ఆ వార్త కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎఫ్.సి.యు అభ్యంతరకరంగా ఉన్నదని భావిస్తే దానికి ‘బూటకం’ అని ట్యాగ్ తగిలిస్తుంది. అప్పుడు అది తన వెబ్ సైట్ నుండి, ఫేస్ బుక్ నుండి, ఎక్స్ నుండి, ఇన్^స్టా నుండి తొలగించాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రభుత్వం, వార్తను తొలగించని సోషల్ మీడియా పైన చర్యలు తీసుకుంటుంది. ఆ వార్తను షేర్ చేసిన, లేదా కునాల్ కమ్రా లాంటి వాళ్ళు వార్తపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన వ్యక్తులు, సంస్థల పైన కూడా చర్య తీసుకుంటుంది. ప్రభుత్వ చర్య నుండి తప్పించుకునేందుకు ఇంటర్మీడియరీలకు, వార్తా సంస్థలకు, వ్యక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం కోర్టులో పిటిషన్ వేయడమే.

ప్రతి రోజూ వందల కొద్దీ వార్తలు ప్రచురితం అవుతాయి. ప్రతి రోజూ ఎఫ్.సి.యు లు వాటికి ట్యాగ్ లు తగిలిస్తూ పోతాయి. ఇక ప్రచురణకర్తలు తమ వార్తా సేకరణ, ప్రచురణ వృత్తిని వదిలేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా ఘోరం ఏమిటంటే ఎఫ్.సి.యు లు ఏయే వార్తలకు తగిన ట్యాగ్ లు తగిలించాలన్న విషయంలో ఎలాంటి మార్గదర్శక సూత్రాలనూ కేంద్ర ప్రభుత్వం తన సవరణలో ప్రతిపాదించలేదు. వార్తా ప్రచురణ, షేరింగ్, విశ్లేషణ, అభిప్రాయ ప్రకటన ఇత్యాది కార్యకలాపాలు అన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వానికి అవధులు లేని అధికారం వచ్చేస్తుంది.

ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధం అనీ, తనకు లేని అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు కట్టబెట్టుకున్నదనీ, ఈ సవరణల ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేసేందుకు ప్రభుత్వం మార్గం వేసుకున్నదని, తనకు నచ్చని వార్తలను ‘బూటకం’గా ముద్ర వేసే అధికారాన్ని కట్టబెట్టుకున్నదనీ వాదిస్తూ ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్స్, న్యూస్ బ్రాడ్^కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ లు బొంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. సవరణలను పూర్తిగా కొట్టివేయాలని కోరాయి.

పోలిటికల్ సెటైరిస్టు కునాల్ కమ్రా తన కంటెంట్ ప్రచురణకు పూర్తిగా సోషల్ మీడియా పైనే ఆధారపడతారు. కేంద్రం తెచ్చిన సవరణలు తన కంటెంట్ పై సహేతుక కారణం లేకుండా ఆర్బిట్రరీగా సెన్సార్షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి సంక్రమిస్తుందని, తన కంటెంట్ ను బ్లాక్ చెయ్యడమో, తొలగించడమో లేదా తన సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చెయ్యడం గానీ పూర్తిగా రద్దు చేయటం గానీ చేయవచ్చని తన పిటిషన్ లో భయాలు వ్యక్తం చేశారు.

కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వానికి చెందిన వ్యవహారాల గురించి నమ్మకమైన, అధికారికమైన సమాచారం ప్రజలకు అందించడం ప్రజల ప్రయోజనాల కోసమే అనీ, ఆ పనిని ప్రభుత్వం నియమించిన ఎఫ్.సి.యు ఏజన్సీలు చేస్తాయనీ, తద్వారా దేశ ప్రజలకు జరిగే హానిని ఎఫ్.సి.యు నివారిస్తుందని వాదించింది. తమ ప్లాట్ ఫార్మ్ లో ప్రచురించిన కంటెంట్ ‘బూటకం’ లేదా ‘తప్పు’ లేదా ‘తప్పుదారి పట్టించేలా ఉన్నది (మిస్ లీడింగ్)’ అన్న ఫ్లాగ్ తగిలించాక ఫేస్ బుక్, ఎక్స్, ఇన్^స్టా లాంటి ఇంటర్మీడియరీలు ఏమీ స్పందన లేకుండా మిన్నకుండే స్వేచ్ఛ/హక్కు లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఫ్లాగ్ అంటూ తగిలించాక ప్రభుత్వం తీసుకునే చర్యకు వ్యతిరేకంగా అవి తమ నిర్ణయాన్ని కోర్టులో సమర్ధించుకోవలసి ఉంటుందని స్పష్టం చేశాడు.

కునాల్ కమ్రా తరపున వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సెల్ సీర్వాయ్, తమ కంటెంట్ ను బూటకం/తప్పు/మిస్ లీడింగ్ అని ప్రభుత్వం నియమించిన ఎఫ్.సి.యు ఫ్లాగ్ తగిలిస్తే యూజర్స్ కు పరిష్కార మార్గాలేవీ సవరణలు అందుబాటులో ఉంచలేదని, వారికి ఉన్న ఒకే ఒక మార్గం కోర్టులో రిట్ పిటిషన్ వేయటమే అనీ వాదించారు. ప్రభుత్వ వార్తా సంస్థ అయిన ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ తప్పుడు వార్తలు ప్రచురించినందుకు అనేకసార్లు అభిశంషణకు గురైన ఉదాహరణలను ఆయన కోర్టు ముందు ఉంచారు. తద్వారా ప్రభుత్వం అన్ని సమయాల్లో సరైన, నిజమైన సమాచారాన్నే అందిస్తుందన్న గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు.

“ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే నిజాలను అది తొక్కి పెడుతుంది” అని సీనియర్ కౌన్సెల్ సోదాహరణంగా నిరూపించారు. “ఉదాహరణకి WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ వలన దేశంలో 50 లక్షల మంది చనిపోయారని ప్రకటించింది అనుకుందాం. ఇండియా కేవలం 5 లక్షల మంది చనిపోయారని ప్రకటించింది అనుకుంటే, ఎఫ్.సి.యు రంగం లోకి దిగి WHO తప్పుడు వార్త ప్రకటించింది అని తేల్చేస్తుంది. ప్రభుత్వం వాస్తవాల నుండి ఎలా రక్షించబడుతుందో చూడండి!?” అని కోర్టుకు వివరించారు.

పిటిషన్ దారులు వేసిన పిటిషన్ పైన బొంబే హై కోర్టు ద్విసభ్య బెంచి పలు వారాల పాటు వాద, ప్రతివాదనలు విని జనవరి 2024లో తీర్పు ప్రకటించింది. ద్విసభ్య బెంచిలో జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే లు సభ్యులుగా ఉన్నారు. వీరిలో జస్టిస్ గౌతమ్ పటేల్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2023 నాటి సవరణలు రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ప్రకటించారు. కానీ జస్టిస్ నీలా గోఖలే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణలలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని తీర్పు ఇచ్చారు.

జస్టిస్ పటేల్ తీర్పు ప్రకటిస్తూ ఐటి రూల్స్ 2021 కు ప్రతిపాదించిన సవరణలు-2023 కింద ప్రతిపాదించిన ఎఫ్.సి.యులు రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1)(g) కింద ప్రజలకు సంక్రమించిన ప్రాధమిక హక్కులను నేరుగా ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రింట్ మీడియా లోని అంశాలను, ఆన్ లైన్ మీడియా లోని అంశాలను సమాన ప్రాతిపదికన కాకుండా వేరు వేరుగా చూస్తున్నందున ఈ ఉల్లంఘన జరుగుతోందని తీర్మానించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1)(g), ఒకరి వృత్తిని లేదా వ్యాపారాన్ని స్వేచ్ఛగా అనుసరించేందుకు హక్కు ఉన్నదనీ, ఆర్టికల్ 19(6), అలాంటి స్వేచ్చ పైన ఎలాంటి పరిమితులు విధించవచ్చో పరిగణిస్తుందని చెప్పారు. ఈ రెండు ఆర్టికల్స్ తో ఎఫ్.సి.యు ల ఏర్పాటు విభేదిస్తున్నదని జస్టిస్ పటేల్ స్పష్టం చేశారు.

జస్టిస్ నిలా గోఖలే కేంద్రం ప్రతిపాదించిన సవరణ ‘రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు’ అని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం నియమించిన వ్యక్తులతో నిండిన ఎఫ్.సి.యు, ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పక్షపాతంగా వ్యవహరిస్తుందంటూ పిటిషన్ వ్యక్తం చేసిన భయాలకు ప్రతిపాదిత సవరణలలో అవకాశం లేదని, “భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం” కలగజేసే విధంగా పరిమితులు కూడా సవరణలలో లేవనీ, సవరణల పర్యవసానంగా ఒక యూజర్ శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుందన్న సూచనలు కూడా సవరణలలో తనకు కనపడలేదని తీర్పు చెప్పారు.

ఈ విధంగా డివిజన్ బెంచి లోని ఇద్దరు జడ్జిలు పరస్పర విరుద్ధమైన తీర్పు ఇచ్చినపుడు చీఫ్ జస్టిస్ తీర్పును ఫైనలైజ్ చేసేందుకు టై బ్రేకర్ జడ్జిని నియమించడం నియమం. సదరు నియమం ప్రకారం బొంబే హై కోర్టు చీఫ్ జస్టిస్ ఫిబ్రవరి 2024లో జస్టిస్ అతుల్ చందూర్కర్ ను ‘టై బ్రేకర్’ జడ్జిగా నియమించారు. ఆయన ఈ రోజు తీర్పు ప్రకటిస్తూ జస్టిస్ పటేల్ ప్రకటించిన తీర్పుతో దాదాపు సంపూర్ణంగా ఏకీభవించారు (లైవ్ లా, 20-09-2024).

రాజ్యాంగం ప్రకారం భారత దేశ పౌరులకు కేవలం స్వేచ్ఛగా మాట్లాడేందుకు, భావ ప్రకటన చేసేందుకు మాత్రమే హక్కు ఉన్నది తప్ప ‘నిజం మాత్రమే తెలుసుకునే హక్కు’ అనేది ఏమీ లేదని జస్టిస్ అతుల్ చందూర్కర్ తన తీర్పులో స్పష్టం చేశారు. కాబట్టి పౌరులు కేవలం నిజాలు మాత్రమే తెలుసుకునేలా చూసే బాధ్యత, బూటకం లేదా తప్పుడు వార్తలు వారికి అందకుండా చూడాలన్న బాధ్యత ప్రభుత్వం పైన లేవని కుండ బద్దలు కొట్టారు. తద్వారా రాజ్యాంగంలో లేని బాధ్యతను కేంద్ర ప్రభుత్వం పౌరుల తరపున తనకు తానే వేసుకుందని చెప్పకనే చెప్పారు.

తనకు లేని బాధ్యతను కట్టబెట్టుకుని తద్వారా తనకు నచ్చిన వార్తలను, సమాచారాన్ని మాత్రమే ప్రజలకు అందేలా సమాచార ప్రవాహం పైన నిబంధనలు, పరిమితులు విధించేందుకు ప్రభుత్వం తెగబడిందని ప్రజలు ఇక్కడ గ్రహించాల్సిన విషయం.

పశ్చిమ దేశాలలో కార్పొరేట్ పత్రికా సంస్థల అధిపతులే ప్రభుత్వాన్ని నడిపే రాజ్యంలో భాగంగా అయిపోవటం ద్వారా ప్రజలకు తమకు నచ్చిన, తమకు అనుకూలమైన వార్తలు అందేలా చూస్తున్నాయి తప్ప భారత ప్రభుత్వం తరహాలో తామే వార్తల్లో తప్పొప్పులను ఎంచే పనికి ఇంత నగ్నంగా పూనుకోలేదు. అయితే సోషల్ మీడియా ప్రజలందరికీ, ప్రభుత్వ వ్యతిరేక సంస్థలకు, స్వతంత్ర మీడియా సంస్థలకు అందుబాటులోకి రావటంతో పశ్చిమ దేశాలు కూడా సోషల్ మీడియాపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించి విఫలం అవుతున్నాయి.

అయితే ఫేస్ బుక్, గూగుల్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా సంస్థలు తమకు అనుకూలురైన రాజకీయ నాయకులకు, పార్టీలకు ప్రచారం చేసి పెట్టే విధంగా తమ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసే వరకు వెళ్ళాయి. అక్కడ సోషల్ మీడియా అధిపతులు కూడా రాజ్యంలో భాగమే. కనుక అక్కడ ప్రజలను ప్రభుత్వాలు, కార్పొరేట్ మీడియా విజయవంతంగా ప్రజల అభిప్రాయాలను, ఓటింగ్ విధేయతను నిర్దేశించి నియంత్రించగలుగుతున్నాయి. అక్కడికి ఇండియాకు ఉన్న తేడా భారత రాజ్యానికి (ప్రభుత్వానికి కాదు) వంత పలికే స్వతంత్ర మీడియా అన్నదే లేదు. భారత పత్రికలు, మీడియా పశ్చిమ కార్పొరేట్ మీడియా సంస్థల నుండే వార్తలను అరువు తెచ్చుకుంటాయి తప్ప స్వతంత్రత అనేది వారు ఎరుగరు. ఈ అంశం ఇంకా విస్తృతమైనది కనుక ఈ చర్చను ఇంతటితో ఆపి అసలు విషయానికి వద్దాం.

ఐటి రూల్స్ 2021 కు 2023 లో చేసిన సవరణలపై మరీ ముఖ్యంగా కునాల్ కమ్రా సవాలు చేసిన ఎఫ్.సి.యు లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం సంక్రమింపజేసిన రూల్ 3(1)(b)(v) పైన జస్టిస్ అతుల్ చందూర్కర్ తన అభిప్రాయాన్ని ప్రకటించారు. జస్టిస్ పటేల్ అభిప్రాయాలతో ఏకీభవించారు. జస్టిస్ గోఖలే అభిప్రాయాలతో విభేదించారు. ప్రభుత్వం చేసిన సవరణ ఆర్టికల్ 14 (సమానత్వం) మరియు ఆర్టికల్ 19(1)(a) (స్వేచ్ఛగా మాట్లాడే హక్కు) లకు అల్ట్రా వైరస్ (పూర్తి విరుద్ధం లేదా తనకు లేని అధికారాన్ని కట్టబెట్టుకోవటం) అని తన తీర్పులో పేర్కొన్నారు.

“మాట్లాడే హక్కు మరియు భావ ప్రకటనా స్వేచ్చా హక్కు కు పొడిగింపుగా “నిజం తెలుసుకునే హక్కు’ అనేది లేదు. అలాగే పౌరులు ఎఫ్.సి.యు గుర్తించిన విధంగా బూటకం కానటువంటి, లేదా తప్పు కానటువంటి ‘సమాచారం’ మాత్రమే పౌరులు తెలుసుకునేలా చేసే బాధ్యత రాజ్యం పైన లేదన్న జస్టిస్ పటేల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. రూల్ 3(1)(b)(v) అన్నది ఆర్టికల్ 19(1)(a) గ్యారంటీ చేసిన హక్కు పైన పరిమితులు విధిస్తున్నది. అది కూడా రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(2) లో పొందుపరచ బడిన అంశాలకు అనుగుణంగా ఈ పరిమితులు లేవు” అని జస్టిస్ చందూర్కర్ నిర్ధారించారు.

కేంద్రం సవరణ ‘నచ్చిన వృత్తి చేసుకునే హక్కు’ కు వ్యతిరేకం అని ఆయన అన్నారు. 2021 నాటి రూల్స్ లోని రూల్ 3(1)(b)(v) యొక్క కఠినత్వానికి ప్రింట్ మీడియా లోని ఒక సమాచారానికి గురి చేయకుండా, అదే సమాచారం డిజిటల్ రూపంలో ఉన్నపుడు గురి చేస్తున్నారని జస్టిస్ చందూర్కర్ పేర్కొన్నారు. “కేంద్రం ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఏదేని సమాచారం డిజిటల్ రూపంలో ఉన్నప్పుడు అది బూటకం లేదా తప్పు లేదా మిస్ లీడింగ్ అని ముద్ర వేస్తూ, అదే సమాచారం ప్రింట్ మీడియా రూపంలో ఉన్నప్పుడు అదే రకమైన ముద్ర వేసే ప్రక్రియకు పూనుకోకుండా ఉంటున్న ప్రభుత్వ ప్రక్రియకు ఎలాంటి ఆధారం/పునాది గానీ లేదా హేతుబద్ధత గానీ లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ సవరణ ప్రింట్ మీడియాకు వర్తించకుండా డిజిటల్ మీడియాకు మాత్రమే వర్తిస్తున్నందున అది ‘సమానత్వ హక్కు’ కు కూడా విరుద్ధంగా ఉన్నదని తన 99 పేజీల తీర్పులో జస్టిస్ చందూర్కర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన కేసులో తానే ఆర్బిటర్ గా వ్యవహరించటాన్ని విమర్శించారు. ఎఫ్.సి.యు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్త తప్పా లేక బూటకమా లేక మిస్ లీడింగా అన్నది నిర్ధారిస్తుండగా అందులో కేంద్ర ప్రభుత్వమే బాధితురాలుగా ఉంటున్నది. అదే బాధిత కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎఫ్.సి.యు ప్రభుత్వానికి చెందిన వార్త బూటకం/తప్పు/మీస్ లీడింగ్ అన్నది నిర్ధారించడం అంటే తన కేసులో తానే ఆర్బిటర్ గా ప్రభుత్వం నియమించుకోవటమే అని ఆయన విమర్శించారు.

“కేసు వివరాలు అన్నీ పరిశీలించాక తేలేదేమిటంటే ఎఫ్.సి.యు నిర్ణయాన్ని రాజ్యాంగ కోర్టులో సవాలు చేయవచ్చని చెప్పినంత మాత్రాన అది తగినంత రక్షణ కల్పిస్తుందని భావించలేము. ఎందుకంటే ఇలాంటి రక్షణ ఏర్పాటు వల్ల కలిగే రక్షణ ఏమీ ఉండదు. కనుక కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.సి.యు ని నియమిస్తున్నందున ప్రభుత్వం తన కేసులో తానే ఆర్బిటర్ గా వ్యవహరిస్తున్నదన్న జస్టిస్ పటేల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను” అని జస్టిస్ చందూర్కర్ తేల్చేశారు.

ఎఫ్.సి.యు కు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు నిర్దేశించక పోవటాన్ని జస్టిస్ చందూర్కర్ తప్పు పట్టారు. “రూల్స్ ని స్వార్ధానికి వినియోగించుకునేందుకు, తద్వారా ప్రాధమిక హక్కులకు భంగం కలిగించకుండా నిరోధించేందుకు ఉన్నాయని చెబుతున్నా రక్షణలు ఏమీ లేవు. బూటకపు వార్తలు, తప్పుడు వార్తలు, మిస్ లీడింగ్ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కనీస స్థాయిలో పరిమితులు విధించే పద్ధతిని మాత్రమే ఎంచుకున్నామన్న యూనియన్ ఆఫ్ ఇండియా వాదనను అంగీకరించలేము. కనుక ప్రపోర్షనాలిటీ ప్రాతిపదికన కూడా సవరణను సమర్ధించలేమన్న జస్టిస్ పటేల్ పరిశీలనతో ఏకీభవిస్తున్నాను” అని జస్టిస్ చందూర్కర్ తన తీర్పులో పేర్కొన్నారు.

జస్టిస్ చందూర్కర్ తీర్పుతో పాటు కేసు మళ్ళీ ద్విసభ్య బెంచి ముందుకు వెళుతుంది. టై బ్రేకర్ జడ్జి జస్టిస్ చందూర్కర్, డివిజన్ బెంచి సభ్యుడు జస్టిస్ పటేల్ లు ఏకీభవించిన తీర్పు అంతిమ తీర్పుగా వెలువడుతుంది.

జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ అతుల్ చందూర్కర్ లు వెలువరించిన తీర్పు మొనగాడి తీర్పుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా నరేంద్ర మోడి ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రగతి నిరోధక, ఫాసిస్టు స్వభావం గల, పౌరుల ప్రాధమిక హక్కును హరించివేయగల, ఫోర్ట్ ఎస్టేట్ అయిన పత్రికా స్వేచ్ఛకు తీవ్ర స్థాయిలో భంగకరం కాగల ఐ.టి రూల్స్ సవరణను బొంబే హైకోర్టు అడ్డంగా కొట్టివేయటం అత్యంత ప్రజానుకూల పరిణామం. ఇంతవరకు సుప్రీం కోర్టు కూడా నరేంద్ర మోడి ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఇంత సూటిగా ఎన్నడూ తప్పు పట్టలేదు, కొట్టివేయలేదు.

వ్యాఖ్యానించండి