
155mm Shells
భారత దేశ ప్రభుత్వ ఆయుధ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలను ఉక్రెయిన్, రష్యాపై యుద్ధంలో ప్రయోగిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడి చేసింది. భారత ప్రభుత్వ కంపెనీల తయారీ ఆయుధాలు తమపై ప్రయోగించేందుకు ఇండియా అనుమతి ఇవ్వడం పట్ల రష్యా ఇప్పటికే రెండు సార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.
ఇండియా నేరుగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయటం లేదు. వివిధ ట్యాంకులు, మర ఫిరంగులు ఉపయోగించే మందుగుండు సామాగ్రిని ఇండియా ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఉక్రెయిన్ కు ఆయుధాలను ప్రధానంగా సరఫరా చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలే. ఇండియా నుండి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలను ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కు తరలిస్తున్నట్లు రాయిటర్స్ పరిశోధనలో తేలింది.
ఇండియా తాను తయారు చేసే ఆయుధాలను ఏ దేశానికైతే అమ్ముతుందో ఆ దేశం మాత్రమే వినియోగించాలని, మరో దేశానికి వాటిని మళ్లించకూడదని, సదరు అమ్మకం కాంట్రాక్టుకు సంబంధించిన ఒప్పందంలో ఇండియా షరతు విధిస్తుంది. కానీ ఒప్పందం లోని ఈ షరతును ఉపయోగించి ఐరోపా దేశాలు తన ఆయుధాలను ఉక్రెయిన్ కు తరలించటం పైన ఇండియా ఇంతవరకు అభ్యంతరం చెప్పలేదు.
ప్రపంచ దేశాల్లో ఇండియాయే అతి పెద్ద ఆయుధాల దిగుమతిదారు. ఇండియా ఆయుధ దిగుమతుల్లో 60 శాతం రష్యాయే తీరుస్తున్నది. అయినప్పటికీ రష్యా అసంతృప్తిని పక్కనబెట్టి ఐరోపా దేశాలకు మందుగుండు ఎగుమతులను కొనసాగిస్తున్నది.
కస్టమ్స్ విభాగాలు చట్టబద్ధంగా వెల్లడించే డేటా ప్రకారం, రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్, ఇండియా ఆయుధాలను సంవత్సరం పైగా కాలం నుండి వినియోగిస్తున్నది. ఇండియా ఆయుధ ఎగుమతికి విధించే షరతుల ప్రకారం తన ఆయుధాలను మూడో దేశానికి మళ్లించినట్లయితే భవిష్యత్తు అమ్మకాలు ఆగిపోవాల్సి ఉంటుంది. కానీ ఈ షరతును ఇండియా అమలు చేయటం లేదు.
ఇండియా ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగించడం గురించి కనీసం రెండు సందర్భాలలో రష్యా, ఇండియన్ అధికారులతో చర్చిస్తూ తన అభ్యంతరాలను తెలియజేసింది. గత జులై నెలలో రష్యన్ విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్, భారత విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ ల మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని లావరోవ్ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తున్నది. అయితే జైశంకర్, రష్యా అభ్యంతరాలకు ఏం సమాధానం ఇచ్చిందీ వివరాలు అందలేదు. రాయిటర్స్ సంస్థ విదేశీ మంత్రిత్వ కార్యాలయాన్ని సంప్రదించినప్పటికీ వారి నుండి సమాధానం రాలేదు.
ఈ అంశం గురించి రష్యా, ఇండియాలకు చెందిన విదేశీ మంత్రిత్వ శాఖలు, రక్షణ మంత్రిత్వ శాఖలు వివరాలు చెప్పేందుకు నిరాకరించాయి. అయితే ఇండియా విదేశీ మంత్రిత్వ శాక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాత్రం ‘ఇండియా ఉక్రెయిన్ కు నేరుగా ఎలాంటి ఆర్టిలరీ మందుగుండు అమ్మలేదు’ అని మాత్రమే చెప్పాడు.

యుద్ధం ఆరంభం నుండి ఉక్రెయిన్ ఉపయోగించిన మందుగుండులో ఇండియా సరఫరా చేసిన మందుగుండు కేవలం 1 శాతం మాత్రమే ఉంటుందని ఢిల్లీలోని సంబంధిత అధికారులు ఇద్దరు చెప్పినట్లు రాయిటర్స్ చెబుతున్నది. ఐరోపా దేశాలు ఇండియా మందుగుండును ఉక్రెయిన్ కు డొనేట్ చేశాయా లేక అమ్మకం చేశాయా అన్నది తెలియదు. పరిమాణం బట్టి చూస్తే ఐరోపా దేశాలు ఇండియా నుండి వచ్చిన ఆర్టిలరీ షెల్స్ ను డొనేట్ చేసి ఉండేందుకే ఎక్కువ ఆస్కారం ఉన్నది.
ఇండియా నుండి వచ్చిన ఆయుధ సామాగ్రి ఉక్రెయిన్ ప్రయోగించిన ఆయుధాల్లో 1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయాల్లో అది పెను ప్రభావం కలిగిస్తుంది. ఐరోపా దేశాలకు అభ్యంతరం చెప్పకుండా మిన్నకుండడం ద్వారా ఇండియా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో తాను ఉక్రెయిన్ పక్షమే అని పరోక్షంగా చెబుతున్నట్లు అర్ధం వస్తుంది. అధికారికంగా ఇండియా, తాను ఎవరి పక్షమూ కాదు, శాంతి పక్షం అని చెబుతున్నప్పటికీ వాస్తవంగా ఆచరణలో ఇండియా ఏం చేస్తుందో అదే లెక్కలోకి వస్తుంది తప్ప అది ఏమి చెబుతున్నది అన్నది పరిగణనలోకి రాదు.
అమెరికా, రష్యాపై విధించిన అనేక దౌత్య, వాణిజ్య, రవాణా, ఆర్ధిక ఆంక్షలను అమలు చేసేందుకు ఇండియా నిరాకరించినప్పటికీ అమెరికా ఎందుకు మౌనంగా ఉన్నదో తాజా వెల్లడి ద్వారా తెలుస్తున్నది. ఉక్రెయిన్ కు ఇండియా ఆయుధ సామాగ్రి అందుంతున్న సంగతి వెల్లడి కావటం ఇదే మొదటిసారి. రాయిటర్స్ వెల్లడి చేసిన వివరాల ప్రభావం ఇండియా-రష్యా మరియు ఇండియా-అమెరికా మధ్య సంబంధాలపై ఎంతో కొంత ప్రభావం చూపించకుండా ఉండదు. వివాదం బహిర్గతమైన దృష్ట్యా రష్యా, ఇండియాపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నామని భారత అధికారులు చెబుతున్నారు. కానీ ఐరోపా దేశాలకు ఇండియా అభ్యంతరం చెప్పినట్లు మాత్రం ఎవరూ చెప్పటం లేదు.

ఇండియా తన ఆయుధాలను ప్రధానంగా ఇటలీ, స్పెయిన్, చెక్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఈ మూడు దేశాలూ ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ఇండియాకు చెందిన ప్రభుత్వ కంపెనీ ‘యంత్ర ఇండియా’ ఆర్టిలరీ షెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ షెల్స్ ను ఐరోపా దేశాలు దిగుమతి చేసుకుని వాటిలో పేలుడు మందుగుండు నింపి ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి. షెల్స్ ని తయారు చేసే పరిజ్ఞానం కానీ, ఫ్యాక్టరీలు కానీ ఐరోపా దేశాలకు లేనట్లు తెలుస్తున్నది. ఒక వేళ ఉన్నా ఉక్రెయిన్ యుద్ధం రీత్యా తలెత్తుతున్న డిమాండు భారీగా ఉండడంతో ఒకే దేశం ఆ డిమాండ్ ను భర్తీ చేయగల సామర్ధ్యం కలిగి ఉండడం అసంభవం.
కేవలం రష్యా మాత్రమే భారీ స్ధాయిలో అనేక రకాల ఆయుధాలను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగి ఉన్నది. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఈ సామర్ధ్యాన్ని రష్యా అనేక రెట్లు పెంచుకున్నది. అటువంటి రష్యా కూడా డ్రోన్ విమానాలను, ఆర్టిలరీ మందుగుండు సామాగ్రిని ఇరాన్, నార్త్ కొరియా దేశాల నుండి కొంత మేరకు దిగుమతి చేసుకుంటున్నది. అంతే కాకుండా ఇరాన్ తో కలిసి ఉమ్మడి కంపెనీలను కూడా ఇరాన్ లో నెలకొల్పి అవసరమైన డ్రోన్ లు, ఆర్టిలరీ మందుగుండు ఉత్పత్తి చేస్తూ యుద్ధంలో వినియోగిస్తున్నది.
అమెరికాతో పాటు ఐరోపాలో రెండు డజన్ల దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేస్తున్నప్పటికీ రష్యా దాడులకు సరిపడా ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేయలేక పోతున్నాయి. దానితో ఉక్రెయిన్ ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నది. ఇది రష్యాకు అవకాశంగా మారటంతో తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలను సంపూర్ణంగా వశం చ్సుకునే వైపుగా త్వరిత గతిన పురోగమిస్తున్నది.
ఇండియా నుండి దిగుమతి చేస్తున్న ఆయుధాలను ఐరోపా, ఉక్రెయిన్ కు మళ్లించటం గురించి వ్యాఖ్యానించేందుకు అమెరికా నిరాకరించింది. నిజానికి అమెరికాకి కావలసిందే ఇండియా చేస్తున్నది. దానితో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తన వాణిజ్య ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు భారత ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయం దరిమిలా ఐరోపా దేశాలకు ఇండియా ఆయుధ ఎగుమతులు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక అమాంతం పెరిగిపోయింది.
గత ఆగస్టు 30 తేదీన జరిగిన ఒక సమావేశం లో గత ఆర్ధిక సం.లో ఇండియా ఆయుధ ఎగుమతులు $2.5 బిలియన్లు దాటాయని సగర్వంగా ప్రకటించాడు. 2029 నాటికి దీనిని 6 బిలియన్ డాలర్లకు పెంచుతామని లక్ష్య ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 2022 ముందు వరకు అనగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాక ముందు వరకు ఇండియాకు చెందిన ఆయుధ కంపెనీలు -యంత్ర ఇండియా, మ్యూనిషన్స్ ఇండియా, కళ్యాణి స్ట్రేటజిక్ సిస్టమ్స్- కేవలం $2.8 మిలియన్ డాలర్ల ఆయుధాలు మాత్రమే ఇటలీ, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా, స్పెయిన్ దేశాలకు ఎగుమతి చేశాయి.
అదే ఫిబ్రవరి 2022 నుండి జులై 2024 వరకు చూస్తే ఈ ఎగుమతులు ఎకాఎకిన 135.25 మిలియన్ డాలర్లకు పెరిగిపోయాయి. పూర్తి చేసిన మందుగుండు కూడా (కేవలం ఖాళీ షెల్స్ మాత్రమే కాకుండా) ఈ ఎగుమతుల్లో ఉన్నాయని కస్టమ్స్ రికార్డుల ద్వారా తెలుస్తున్నది. తన ఆయుధాల ఎగుమతులను పెంచుకోవాలని ఇండియా నిణయించుకుని, అమలు చేస్తున్నందునే ఈ స్థాయిలో ఎగుమతుల పెరుగుదల సంభవించింది.
యంత్రా ఇండియా మాజీ అధికారి ప్రకారం ఇటలీకి చెందిన డిఫెన్స్ కాంట్రాక్టర్ కంపెనీ ఎం.ఇ.ఎస్ కు ఆర్టిలరీ షెల్స్ ను ఎగుమతి చేయగా, వాటిని ఎం.ఇ.ఎస్ కంపెనీ ఉక్రెయిన్ కు తరలించింది. యంత్రా ఇండియా కంపెనీకి ఎం.ఇ.ఎస్ కంపెనీయే అతి పెద్ద కొనుగోలుదారు. ఎం.ఇ.ఎస్ కంపెనీ ఖాళీ షెల్స్ ను దిగుమతి చేసుకుని వాటిలో మందుగుండు నింపి ఉక్రెయిన్ కు తరలిస్తున్నది. ముందు చెప్పుకున్నట్లు భారీ మొత్తంలో ఖాళీ ఆర్టిలరీ షెల్స్ తయారు చేసే సామర్ధ్యం ఐరోపా దేశాల వద్ద లేదు. తమ రక్షణ అవసరాలు తీరే వరకు తాము మాత్రమే అవి ఉత్పత్తి చేయగలవు. అదీ కాక ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తన నెత్తిన వేసుకున్న దరిమిలా ఆయుధాల తయారీ గురించి పట్టించుకోవడం ఐరోపా దేశాలు బాగా తగ్గించాయి.
యంత్ర ఇండియా, ఎం.ఇ.ఎస్ కంపెనీల మధ్య భారత ఆయుధాలు/ మందుగుండు ఎగుమతికి 2022-23 లో ఒప్పందం కుదిరినట్లు అప్పటి వార్షిక నివేదికలో యంత్ర కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ఫిబ్రవరి 2022, జులై 2024 మధ్య 35 మిలియన్ డాలర్ల విలువ చేసే 155mm ఖాళీ షెల్స్ ని ఎగుమతి చేసింది. కాగా యుకె కి చెందిన డిన్స్ హిల్ కంపెనీ ఇటలీ నుండి ఉక్రెయిన్ కు ఒక్క ఫిబ్రవరి 2024 లోనే 6.7 మిలియన్ డాలర్ల మందుగుండు ఎగుమతి చేసింది. ఇందులో 155mm షెల్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ కోసం ఎం.ఇ.ఎస్ కంపెనీ వీటిని ఉత్పత్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
స్పెయిన్ రవాణా మంత్రి గత మే నెలలో ఒక సమాచారం వెల్లడి చేశాడు. దాని ప్రకారం చెక్ రక్షణ అధికారులతో తాము ఒక ఒప్పందం చేసుకున్నామని దాని మేరకు ఇండియాకు చెందిన మ్యూనిషన్స్ ఇండియా కంపెనీ నుండి 120mm మరియు 125mm ఆర్టిలరీ షెల్స్ ను ‘చెక్ డిఫెన్స్ సిస్టమ్స్’ అనే కంపెనీకి రవాణా చేస్తుందని చెప్పాడు.

125mm Shells
ఇండియాలో తయారైన ఆయుధాలను మోసుకెళ్తున్న బోర్కం అనే ఓడ స్పెయిన్ పోర్ట్ లో లంగరు వేసి ఉన్నదనీ, ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ కు సరఫరా చేస్తున్నారని పాలస్తీనా అనుకూల కార్యకర్తలు కొద్ది నెలల క్రితం ఆరోపించారు. అయితే ఈ ఓడ లో ఉన్న ఆయుధాలు వాస్తవానికి ఉక్రెయిన్ కు సరఫరా చేసేందుకు ఉద్దేశించినవని స్పానిష్ వార్తా పత్రిక ఎల్ ముండో గత మే నెలలో నివేదించింది. మ్యూనిషన్స్ ఇండియా కంపెనీ 120mm, 125mm ఆర్టిలరీ షెల్స్ 10,000 రౌండ్లు (9 మిలియన్ డాలర్ల విలువ) ను చెన్నై నుండి చెక్ కంపెనీ సి.డి.ఎస్ కు గత మార్చి నెలలో ఎగుమతి చేసింది.
కజఖ్ స్తాన్ లో ఇండియా విదేశీ మంత్రి జైశంకర్, రష్యా విధేశీ మంత్రి లావరోవ్ ల మధ్య మరొక సమావేశం జరిగింది. ఇండియా మందుగుండు ఉక్రెయిన్ కు సరఫరా అవుతున్నాయని, ప్రభుత్వ కంపెనీలే స్వయంగా వీటిని సరఫరా చేస్తున్నదని లావరోవ్ ఈ సమావేశంలో భారత మంత్రికి ఫిర్యాదు చేశాడు. ఈ సంగతి భారత అధికారే రాయిటర్స్ విలేఖరికి చెప్పినప్పటికీ లావరోవ్ కు జైశంకర్ చెప్పిన సమాధానం మాత్రం వెల్లడి చేయలేదు.
ఇండియా నిర్ణయాలను ప్రభావితం చేయగల శక్తి రష్యాకు లేదని రాయిటర్స్ పత్రిక చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదు. ఇండియా రక్షణ అవసరాలను 60 శాతం తీర్చుతున్న రష్యా అభ్యంతరాలను విస్మరించడం ఇండియాకు ఏమంత సానుకూలం కాదు. రష్యా నుండి వచ్చే ఆయుధాలతో సరిపోలగల ఆయుధాలను అమెరికా, పశ్చిమ దేశాల నుండి దిగుమతి చేసుకోవాలంటే ఇండియాకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అమెరికా ఆయుధాల ఖరీదు ఐరోపా దేశాలే మోయలేకున్నాయి. ఇక ఇండియా ఎలా భరించగలదు?