సాక్షాలు నాశనం చేశారు: కోల్కతా సీనియర్ డాక్టర్లు


ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు చేసిన నాలుగు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సెపెంబర్ 16 తేదీన, సోమవారం మరోసారి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు ఈ రోజు (16 సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా గం 6:30 ని.లకు ప్రారంభం అయినట్లు తెలుస్తున్నది.

కాగా అత్యాచారం ఘటన జరిగిన చోట సాక్షాలు నాశనం చేసేందుకు, తారుమారు చేసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నాలు జరిగాయని ఆర్ జి కార్ ఆసుపత్రిలో పని చేస్తున్న సీనియర్ డాక్టర్లు ఈ రోజు జరిపిన పత్రికా సమావేశంలో ఆరోపించారు. “ఇలాంటి హేయమైన నేరాలు అన్నింటినీ మేము గట్టిగా ఖండిస్తున్నాము. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు ఆరోగ్య విభాగం (హెల్త్ డిపార్ట్ మెంట్) అధికారుల మధ్య ఉన్న అపవిత్ర సంబంధం ఫలితంగానే ఈ దుర్ఘటన జరిగింది” అని సీనియర్ డాక్టర్లు ఆరోపించటం గమనార్హం.

కాగా చర్చలు పారదర్శకంగా జరపాలన్న అంశం లోనే విభేదాలు తలెత్తాయని, అందుకే చర్చలు నాలుగు సార్లూ విఫలం అయ్యాయని డాక్టర్లు తెలిపారు. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్ చేయగా ప్రభుత్వం అందుకు నిరాకరించింది. ఈ డిమాండ్ నుండి కాస్త తగ్గి చర్చలను వీడియో రికార్డింగ్ చేసి, సదరు రికార్డింగ్ కాపీ ఒకదానిని తమకు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. దానికి కూడా మమత ప్రభుత్వం అంగీకరించలేదు. చివరికి చర్చల సమావేశం మినిట్స్ ను ఇరు పక్షాలు రికార్డు చేసి ఇరువురి కాపీలను పరస్పరం మార్చుకోవాలన్న ప్రతిపాదనకు ఇరు పక్షాలు అంగీకరించటంతో ఈ రోజు, సెప్టెంబర్ 16 సాయంత్రం, చర్చలు ప్రారంభం అయ్యాయి.

సీనియర్ డాక్టర్లు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అధికారులు, సి.బి.ఐ, మరియు సుప్రీం కోర్టు లు విచారణ, పరిశోధనలను వేగవంతం చేయాలని, ఆలస్యం కాకుండా నేరస్ధులను శిక్షించాలని వారు తమ ప్రకటనలో కోరారు.

కోల్ కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను, తన పాలనా వైఫల్యానికి గాను, సాక్షాలను తారుమారు చేయటాన్ని నిరోధించనందుకు గాను ఆ పదవి నుండి తొలగించాలని సీనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. అధికార నిర్వహణలో సామర్ధ్యరహితంగా వ్యవహరించినందుకు గాను, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపినందుకు గాను డిప్యుటీ కమిషనర్ (నార్త్) పైన చర్య తీసుకోవాలని కోరారు. క్రైమ్ సీన్ లోపల దాగిన వ్యక్తి గుర్తింపు వెల్లడి చేసేందుకు నిరాకరించి, నేరస్ధుడిని దాచి పెట్టేందుకు ప్రయత్నించిన డిప్యుటీ కమిషనర్ (సెంట్రల్) పైన క్రమశిక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్ని ఆసుపత్రులలో, ప్రభుత్వ వైద్య సేవా కేంద్రాలలో సరైన భద్రతా సౌకర్యాలు కల్పించాలని, ప్రాధమిక వసతులు కల్పించాలని డాక్టర్లు కోరారు. ప్రభుత్వ వైద్య సేవా కేంద్రాలలో ప్రభుత్వ డాక్టర్లను బెదిరించే సంస్కృతికి చరమగీతం పాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ డాక్టర్లు కోరారు.

తమ ఉద్యమాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ తాము అందుకు తావు ఇవ్వకుండా దృఢంగా ఉన్నామని వారు తెలియజేశారు. తమ ఉద్యమం గురించి అనేక తప్పుడు కధలు, పుకార్లు వ్యాపింపజేసినా అవేవీ తమ కర్తవ్య స్ఫూర్తిని నీరుగార్చలేదని స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు, బెదిరింపులు ఎదురైనా ఉద్యమాన్ని విరమించ లేదని చెప్పారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ట్రైనీ, జూనియర్, సీనియర్ డాక్టర్లు గత ఆరు రోజులుగా ప్రభుత్వ ఆరోగ్య విభాగం అయిన స్వాస్థ్యో భవన్ ముందు దీక్ష చేస్తున్నారు.

“మన ముఖ్యమంత్రితో ఫలప్రదమైన చర్చల కోసం కృషి చేస్తున్నాం. కానీ పారదర్శకత అంశం పై విభేదాలు ఏర్పడడంతో రెండు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మా ఐదు డిమాండ్ల గురించి, ప్రస్తుత పరిస్ధితి గురించి మేము రాష్ట్రపతి కి కూడా మెయిల్ పంపాము. సెప్టెంబర్ 17 తేదీన జరగనున్న తదుపరి హియరింగ్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాము. మానవత్వాన్ని పునరుద్ధరించేందుకు దేశం మొత్తం మా ఆందోళనలో కదిలి రావాలని మేము కోరుతున్నాము” అని వారు పత్రికా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం, హత్య జరగడం వెనుక ఆసుపత్రి (మాజీ) ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ దే ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది. ఆసుపత్రిలో వైద్య పరికరాల వృధాల రీసైక్లింగ్ తో పాటు, అక్కడ చనిపోయే శవాల అమ్మకం, శవాల నుండి అవయవాలను దొంగిలించి అమ్ముకోవడం, కాంట్రాక్టులలో విస్తృతమైన అవినీతి.. లాంటి సకల నేరాలకు ఆయన కేంద్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేరాలలో కొన్ని హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కంటబడటం, కొన్ని దృశ్యాలను తన మొబైల్ ఫోన్ లో బంధించడం చేసిందనీ, అందుకే ఆమెను హత్య చేశారని పలువురు అనుమానిస్తున్నారు. హత్యలో భాగంగా ఆమెపై దారుణమైన రీతిలో అత్యాచారం చేశారని అనుమానిస్తున్నారు.

సందీప్ ఘోష్ నిర్వహించిన నేరాలకు ప్రభుత్వం నుండి, వివిధ భద్రతా సంస్థల నుండి మద్దతు లేనిదే అవి కొనసాగడం కష్టం. బహుశా తమ పాత్ర బైటపడకుండా ఉండేందుకే సందీప్ ఘోష్ ని రక్షించడానికి పోలీసు విభాగం, ఆరోగ్య శాఖ తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, కుమార్తె శవాన్ని చూడనివ్వకుండా 3 గంటల పాటు వారిని నిలువరించడం, వారికి డబ్బు ఇవ్వజూపడం… ఇవన్నీ ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.

ఒక్క పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అవినీతికీ, మాఫియా ముఠాలతో అవినాభావ సంబంధాలకూ అతీతంగా లేవు. ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్ దేశాల సరిహద్దులలో ఉన్న రాష్ట్రాల్లో నైతే అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో కూడా ప్రభుత్వాలలోని పెద్దలకు సంబంధాలు ఉంటాయి. (సంబంధాలకు నిరాకరించిన ప్రభుత్వాలు కూలిపోతాయి. లిక్కర్ లాబీ డబ్బు వెదజల్లిన ఫలితంగా సీనియర్ ఎన్.టి.ఆర్ అంతటి వారి ప్రభుత్వమే కూలిపోయిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.)

ఈ నేపధ్యంలో సరిహద్దుకు కాపలా కాస్తున్న వివిధ భద్రతా బలగాల అధికారుల పైన నేరాలకు సహకరించాలని తీవ్ర స్థాయి ఒత్తిళ్ళు వస్తాయి. కొందరు భద్రతా బలగాల అధికారులు ఒత్తిడి అవసరం లేకుండానే నేర సామ్రాజ్యంలో పావులుగా మారిపోతుంటారు, లేదా తామే ఏదో ఒక స్థాయిలో నేర సామ్రాజ్యాలకు అధిపతులుగా మారిపోతుంటారు. అమలులో ఉన్న అవినీతి-నేర వ్యవస్థలతో చేతులు కలపడమా లేక పెట్టే బేడా సర్దుకుని ఉద్యోగాలు వదులుకుని ఇంటి ముఖం పట్టడమా అన్న పరిస్ధితిని వారు ఎదుర్కొంటారు.

కనుక ఒక సందీప్ ఘోష్ నేరం రుజువై శిక్ష పడినా, ఇంకా అనేక మంది సందీప్ ఘోష్ లు పెద్ద ఆసుపత్రులతో పాటు, పోలీసు విభాగంలో, ఇతర భద్రతా బలగాల విభాగాలలో కొనసాగుతూనే ఉంటారు. దొరికిన నాడు దొంగ అవుతారు, దొరకనంత కాలం దొరలుగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ప్రస్తుత వ్యవస్థలు కొనసాగినంత కాలం దీనికి అంతం అనేది ఉండదు.

వ్యాఖ్యానించండి