పుటిన్ హెచ్చరిక, బైడెన్ వెనకడుగు!


Joe Biden with Kier Starmer

రష్యా లోలోపలి నగరాల పైన, వివిధ టార్గెట్ ల పైన పశ్చిమ దేశాలు సరఫరా చేసే లాంగ్-రేంజ్ మిసైళ్లతో దాడి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అనేక రోజులుగా అమెరికా, యుకె, ఇయు లకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

బ్రిటన్ సరఫరా చేసే స్టార్మ్ షాడో మిసైళ్ళు, అమెరికా సరఫరా చేసే ఎం‌జి‌ఎం-140 ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ATACMS) మిసైళ్ళు లాంగ్ రేంజ్ మిసైళ్ళ కిందికి వస్తాయి. రష్యా భూభాగం లోని టార్గెట్ లపై వీటిని ప్రయోగించరాదన్న షరతుతో అమెరికా, బ్రిటన్ లు వీటిని ఉక్రెయిన్ కు సరఫరా చేశాయి.

అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గత అనేక నెలలుగా అమెరికా, పశ్చిమ దేశాలకు అదే పనిగా విజ్ఞప్తులు మీద విజ్ఞప్తులు చేస్తున్నాడు. లాంగ్ రేంజ్ మిసైళ్లను రష్యా లోపలి టార్గెట్ లను చేదించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఒక్కోసారి డిమాండ్ కూడా చేస్తున్నాడు. కానీ జెలెన్ స్కీ కోరిన అనుమతి ఇస్తే జరిగే పరిణామాలు ఏమిటో తెలిసిన అమెరికా అందుకు నిరాకరిస్తోంది.

గత మూడు నాలుగు రోజులుగా లాంగ్ రేంజ్ మిసైళ్లను రష్యా లోపలి లక్ష్యాల చెదనకు ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పశ్చిమ పత్రికలు అదే పనిగా ఊదర గొడుతున్నాయి.

కాగా బ్రిటన్ లో అధికారం నెరిపిన గత కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలలో డిఫెన్స్ సెక్రటరీలుగా పని చేసిన గ్రాంట్ షాప్స్, బెన్ వాలెస్, గవిన్ విలియమ్సన్, పెన్నీ మొర్దాంట్, లియామ్ ఫాక్స్ లతో పాటు మాజీ ప్రధాని బొర్స్ జాన్సన్ లు లాంగ్ రేంజ్ మిసైళ్ళ ప్రయోగానికి అనుమతి ఇవ్వాలని, ఇక ఎంత మాత్రం ఆలస్యం చేసినా పుటిన్ కు మరింత ధైర్యం వస్తుందని బ్రిటిష్ ప్రధాన మంత్రికి ఫోన్ చేసి గట్టిగా కోరారు. అమెరికా అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా సరే బ్రిటన్ మాత్రం అనుమతి ఇవ్వాల్సిందేనని వారు బ్రిటిష్ ప్రధానికి సలహా ఇచ్చారు.

బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ జెలెన్ స్కీ కోరుతున్న అనుమతి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాడని పశ్చిమ పత్రికలు చెబుతున్న నేపధ్యంలో స్టార్మర్ ప్రత్యేకంగా ఈ విషయం పైన చర్చించేందుకు అమెరికా వెళ్ళి అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చలు జరిపాడు.

ఈ లోపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ అమెరికా, పశ్చిమ దేశాలకు గట్టిగానే బహిరంగ హెచ్చరికలు జారీ చేశాడు. “అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ఇస్తున్న లాంగ్ రేంజ్ మిసైళ్ళను ప్రయోగించే నైపుణ్యం ఉక్రెయిన్ సైనికుల వద్ద లేదు. కనుక వాటిని పశ్చిమ దేశాల సైన్యమే స్వయంగా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టార్గెట్ కు గుర్తించేందుకు అమెరికాకు చెందిన శాటిలైట్ సిగ్నల్స్ నే ఉపయోగించాలి. కనుక పశ్చిమ దేశాల సైనికుల సంపూర్ణ సహకారంతో పాటు వాళ్ళు స్వయంగా పాల్గొంటే తప్ప లాంగ్ రేంజ్ మిసైళ్లను ఉపయోగించే పరిస్ధితి ఉక్రెయిన్ కు లేదు.”

“కనుక రష్యా పైన లాంగ్ రేంజ్ మిసైళ్లను ప్రయోగిస్తే కనుక నాటో కూటమి స్వయంగా రష్యాతో యుద్ధానికి దిగినట్లు మేము పరిగణిస్తాము. నాటో తో యుద్ధానికి సన్నద్ధం అవటం అంటే అది ఇక పూర్తిగా వేరే కధ. మేము సమస్త రీతిలో సంపూర్ణంగా సర్వ సన్నద్ధం అవుతాము. దాని అర్ధం ఏమిటో అమెరికా, ఇయులకు తెలుసు” అని పుటిన్ హెచ్చరించాడు. “నాటో, రష్యాల యుద్ధం అంటే అది అనివార్యంగా మూడవ ప్రపంచ యుద్ధం అవుతుంది” అని పుటిన్ స్పష్టం చేశాడు.

పుటిన్ హెచ్చరిక ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టమే. లాంగ్ రేంజ్ మిసైళ్లను రష్యా లోపలికి ప్రయోగిస్తే కనుక అది నాటో-రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని, అటువంటి పరిస్ధితి వచ్చినపుడు రష్యా అనివార్యంగా అణ్వాయుధాలను ప్రయోగించక తప్పని పరిస్ధితి ఏర్పడుతుందని పుటిన్ పరోక్షంగా హెచ్చరించాడు.

పుటిన్ హెచ్చరిక నేపధ్యంలో బైడెన్, స్టార్మర్ ల మధ్య సమావేశం జరిగింది. లాంగ్ రేంజ్ మిసైళ్ళ ప్రయోగానికి ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చే విషయంలో ఈ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బిబిసి చెప్పింది. కాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ అసలు సంగతి చెప్పాడు, “అమెరికా తయారీ ఆయుధాలపై విధించిన పరిమితులలో మార్పులు చేసేందుకు అమెరికా వద్ద ఎలాంటి పధకమూ లేదు. బ్రిటిష్ లేదా ఫ్రెంచి ప్రభుత్వాల గురించి నేనేమీ చెప్పలేను. కానీ రష్యా లోపల టార్గెట్ చేసే సామర్ధ్యాల గురించి ఎలాంటి ప్రకటనా నేను చేయటం లేదు. ముఖ్యంగా అమెరికా నుండి ఎలాంటి ప్రకటనా లేదు” అని జాన్ కిర్బీ చెప్పాడు. దీని అర్ధం ఏమిటంటే జెలెన్ స్కీ కోరిన అనుమతి ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాకరించాడు అని.

బిబిసి ప్రకారం బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ లాంగ్ రేంజ్ మిసైళ్ళ ప్రయోగానికి అనుమతి ఇవ్వాలన్న అభిప్రాయాన్ని అమెరికా అధ్యక్షుడితో గట్టిగానే వినిపించాడు. అయితే అమెరికా, బ్రిటన్ ల లాంగ్ రేంజ్ ఆయుధాల ప్రయోగానికి అనుమతి ఇవ్వటం వల్ల ఉక్రెయిన్ ప్రత్యేకంగా సాధించేది ఏమీ ఉండదని వైట్ హౌస్ లోని అనేక మంది అధికారులు అభిప్రాయ పడుతున్నారు. స్టార్మ్ షాడో మిసైళ్ళ రేంజి 250 కి.మీ కాగా, ఆటాకేమ్స్ మిసైళ్ళ రేంజి 300 కి.మీ. ఈ రేంజి లోపల ఉన్న మిలట్రీ వ్యవస్థలను రష్యా ఇప్పటికే దూరంగా తరలించి ఉంటుందని, కనుక ఉక్రెయిన్ కొత్తగా సాధించేది ఏమీ ఉండదని, పైగా అలాంటి అనుమతి వల్ల రష్యా అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించటమే కాకుండా యుద్ధాన్ని మరింత విస్తృతం చేసేందుకు పుటిన్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే జెలెన్ స్కీ కోరిన అనుమతి ఇచ్చేందుకు అమెరికా, బ్రిటన్ లు నిరాకరించాయని తెలుస్తున్నది.

భారత పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ పరిణామాలను వివరిస్తూ పుటిన్ భయం బ్రిటన్ ను వెంటాడుతున్నదని, అందుకే మాజీ డిఫెన్స్ సెక్రటరీలు ఐదుగురు, పుటిన్ ఇంకా రెచ్చిపోక ముందే వెంటనే లాంగ్ రేంజ్ మిసైళ్ల ప్రయోగానికి అనుమతి ఇవ్వమని కోరారని చెబుతూ వార్త ప్రచురించింది.

పుటిన్ హెచ్చరిక గురించి ప్రశ్నించగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ “నేను వ్లాదిమిర్ పుటిన్ గురించి ఎక్కువగా ఆలోచించను” అని సమాధానం ఇచ్చాడు. ఇది ఎంత అబద్ధమో పత్రికా విలేఖరులు అందరికీ తెలుసు. ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో అసలు పుటిన్ గురించి మాట్లాడుకోకుండా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు ఒక్క రోజూ గడవదు. పుటిన్ ను రష్యా పాలన నుండి తప్పించాలని 20 యేళ్లుగా అమెరికా, ఐరోపాలు శ్రమిస్తున్నా వాటి వల్ల కాలేదు. రష్యా ప్రాబల్యం తగ్గించటానికి ఎన్ని రకాల ఎత్తుగడలు రచించినప్పటికీ పుటిన్ ప్రతి వ్యూహాల ముందు అవి ఒట్టి పోయాయి.

తాజాగా అమెరికా లాంగ్ రేంజ్ మిసైళ్ళ ప్రయోగానికి అనుమతించడం వలన ఉక్రెయిన్ కు ఎలాంటి ఉపయోగం ఉండదని, ఒక వేళ ఉన్నా పరిమితంగానే ఉంటాయనీ అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నాడు. ఉక్రెయిన్ కి ఉపయోగం లేకపోగా తన ఆయుధాగారంలో లాంగ్ రేంజ్ మిసైళ్ళ నిల్వలు తగ్గిపోతాయని అమెరికా ఆందోళన చెందుతోందని ఎకనమిక్ టైమ్స్ పత్రిక విశ్లేషించింది.

ఇండియాకు అమెరికా విన్నపం

రష్యన్ వార్తా సంస్థ రష్యా టుడే ప్రసారాలను తమ దేశం నుండి నిషేధించాలని అమెరికా తాజాగా ఇండియాను కోరింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ ఈ మేరకు ఇండియాకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు కట్టుబడిన దేశంగా పత్రికా స్వేచ్ఛకు అమిత విలువ ఇస్తామని చెప్పుకునే అమెరికా, తన దేశంలో రష్యా పత్రికలు, ఛానెళ్లు ఏవీ లేకుండా నిషేధం విధించింది. డెమోక్రసీకి పుట్టిల్లుగా చెప్పుకునే బ్రిటన్ తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా అమెరికాను అనుసరించాయి. ఇప్పుడు ఇండియాను కూడా రష్యా టుడే పత్రికను బహిష్కరించాలని అమెరికా కోరుతోంది. ఈ విషయంలో ఇండియా ఇప్పటి వరకు స్పందించలేదు.

లాంగ్ రేంజ్ మిసైళ్ళ ప్రయోగానికి అనుమతి ఇవ్వనందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా, పశ్చిమ దేశాల పైన విరుచుకు పడ్డాడు. అమెరికా, యుకె దేశాలు కూడా రష్యా, పుటిన్ లను చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశాడు.

వ్యాఖ్యానించండి