
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను ఇండియాకు తీసుకోస్తానని నరేంద్ర మోడి మొదటిసారి ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతూ ప్రజలకు వాగ్దానం చేశారు. స్విస్ బ్యాంకుల నుండి నల్ల డబ్బును ఇండియాకు తెచ్చి ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని ఆయన వాగ్దానం చేసినట్లు కూడా అనేక మంది రాజకీయ నాయకులు, సామాన్యులు చెబుతూ ఉంటారు.
15 లక్షల రూపాయలు జమ చేయవలసిన కర్తవ్యం ఇప్పుడు వద్దులే కానీ, చేతికి అందివచ్చిన అవకాశాన్ని జార విడవద్దని మాత్రం ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేయటంలో తప్పు లేదు.
ఎందుకంటే స్విట్జర్లాండ్ ప్రభుత్వమే భారత పారిశ్రామిక వేత్త, ప్రధాన మంత్రి వెంట దాదాపు ప్రతి వ్యాపార సంబంధిత విదేశీ పర్యటన లోనూ వెంట ఉండే గౌతమ్ అదాని కి ఫ్రంట్ గా (బినామీగా) వ్యవహరిస్తున్న వ్యక్తి 6 స్విట్జర్లాండ్ ఖాతాలను కలిగి ఉన్నాడనీ, అందులో 310 మిలియన్ డాలర్ల డబ్బు (దాదాపు రు 2570 కోట్లకు సమానం) ఉన్నదనీ ఆరోపిస్తూ సదరు ఖాతాలు అన్నింటినీ స్తంభింపజేసింది.
ఈ సంగతిని, స్విట్జర్లాండ్ ప్రభుత్వం మరియు ఆ దేశ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ని ఉటంకిస్తూ హిండెన్ బర్గ్ రీసర్చ్ సంస్థ X లో వెల్లడి చేసింది. 2023 లోనే హిండెన్ బర్గ్ రీసర్చ్ కంపెనీ అదాని కంపెనీల షేర్లను షార్ట్ చేస్తూ, అదాని గ్రూపు కంపెనీలు పీకల్దాకా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయనీ, అక్రమ పద్ధతుల ద్వారా, అనైతిక వ్యాపార చర్యల ద్వారా అదాని ఆస్తులు కూడబెట్టాడనీ ఆరోపించింది. అప్పట్లో అదాని గ్రూపు కంపెనీల షేర్లు తీవ్రంగా పతనం కావటంతో లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ని అదాని గ్రూపు కంపెనీలు కోల్పోయాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల మద్దతుతో, సెబి సానుకూల చర్యలతో అదాని గ్రూపు కంపెనీలు మెల్లగా కోలుకున్నాయి. నష్టపోయిన మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని పూర్తిగా పొందలేనప్పటికీ గణనీయ స్థాయిలోనే కోలుకుందని చెప్పవచ్చు.
ఇంతలోనే గత నెలలో (ఆగస్టు 2024) హిండెన్ బర్గ్ రీసర్చ్ కంపెనీ మరో బాంబు పేల్చింది. దాని సారాంశం ఏమిటంటే సెబి ఛైర్మన్ మాదాబి పూరి బచ్, అదాని కంపెనీలలో షేర్లు కలిగి ఉన్నారనీ, ఓ పక్క సెబి లో పూర్తి కాలపు సభ్యురాలిగా ఉంటూనే ఆమె స్వయంగా సింగపూర్ లో రెండు కంపెనీలను నిర్వహిస్తున్నారనీ తద్వారా సెబి నియమాలను ఉల్లంఘించారని ఆరోపించింది.
అంతటితో ఆగకుండా అదాని గ్రూపు కంపెనీల అనైతిక వ్యాపార కార్యకలాపాల పైన నామమాత్ర విచారణ చేస్తూ అదాని కంపెనీకి మేలు చేసేలా విచారణ నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తూ పలు సంస్థలు, కంపెనీలు ప్రకటనలు విడుదల చేశాయి. దానితో తాజా ఆరోపణలకు భారతీయ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. మాదాబి పూరి, సెబి సంస్థ హిండెన్ బర్గ్ సంస్థకు నోటీసులు పంపించగా, వాటికి సమాధానం ఇవ్వకుండా తనపై క్యారక్టర్ అసాసినేషన్ కు పాల్పడుతూ అబద్ధాలతో నిందలు వేస్తున్నదని ప్రత్యారోపణ చేశారు.
ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 12 తేదీన హిండెన్ బర్గ్ రీసర్చ్ కంపెనీ స్విస్ బ్యాంకుల్లో అదాని బినామీ ఖాతాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్తంభింపజేసిన సంగతి వెల్లడి చేసింది.
అయితే అదాని బినామీ ఖాతాలపై స్విట్జర్లాండ్ ప్రభుత్వం, హిండెన్ బర్గ్ రీసర్చ్ కంపెనీ 2023 లో ఆరోపణలు చేయటానికి చాలా ముందునుండే విచారణ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాబట్టి తాజా ఆరోపణలు హిండెన్ బర్గ్ కంపెనీ చేస్తున్నవి కావు. స్విట్జర్లాండ్ ప్రభుత్వమే ఈ ఆరోపణలు చేసింది. ఆరోపణ చేయడమే కాకుండా విచారణ కూడా చేపట్టింది. అయితే విచారణ నిర్వహిస్తున్న సంగతిని బహిరంగం చేయలేదు. హిండెన్ బర్గ్ రీసర్చ్ – అదాని గ్రూపు కంపెనీల వివాదం నేపధ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం విచారణ చేస్తున్న సంగతి బైటికి పొక్కడంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వ అటార్నీ జనరల్ అదాని కేసును తన చేతుల్లోకి తీసుకున్నారు. అంటే కేసు విచారణ సీరియస్ గా సాగనున్నట్లు భావించవచ్చు.
2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం లేదా, ద గ్రేట్ రిసెషన్ నేపధ్యంలో జి20 గ్రూపు దేశాలు వరుస సమావేశాలు నిర్వహించి స్విట్జర్లాండ్ లాంటి టాక్స్ హెవెన్ దేశాల్లో (స్వదేశాల్లో పన్నులు ఎగవేసి నల్ల డబ్బు తమ బ్యాంకుల్లో దాచుకునే వెసులుబాటు కల్పించే బ్యాంకులు ఉన్న దేశాలు) పన్నుల ఎగవేతను ప్రోత్సహించే కార్యకలాపాలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. సదరు నిర్ణయం మేరకు స్విట్జర్లాండ్ బ్యాంకులు, ప్రభుత్వం అమెరికాతో పాటు వివిధ దేశాలకు పెనాల్టీ రూపంలో డబ్బు కట్టవలసి వచ్చింది. అమెరికా అయితే ముక్కు పిండి బిలియన్ల డాలర్లు స్విట్జర్లాండ్ నుండి వసూలు చేసింది.
ఈ నేపధ్యంలో అక్రమ డబ్బును తమ దేశానికి తరలించి బినామీ పేర్లతో తెరిచే ఖాతాలపై స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్వయంగా నిఘా పెట్టడం మొదలు పెట్టింది. ఈ నిఘా లో భాగంగానే అదాని బినామీ ఖాతాలు 6 ఉన్నట్లు కనిపెట్టి, వాటన్నింటిని స్తంబింపజేసింది. స్తంభింపజేయడంతో ఆగకుండా విచారణ కూడా ప్రాంభించింది. ఈ సంగతి బైటికి పొక్కడంతో దేశ అత్యున్నత ప్రాసిక్యూటర్ అయిన అటార్నీ జనరల్ స్వయంగా విచారణ చేస్తున్నట్లు ప్రకటించాడు.
అదాని బినామీ ఖాతాలను మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టం కింద విచారణ చేస్తున్నట్లు తెలుస్తున్నది. హిండెన్ బర్గ్ రీసర్చ్ మొట్టమొదట 2023 జనవరిలో అదాని గ్రూపు కంపెనీపై షేర్ల విలువను మ్యానిపులేట్ చేస్తూ అక్రమ ఆర్జన చేస్తున్నదని ఆరోపించగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం అదాని బినామీ ఖాతాలపై 2021 నుండే విచారణ చేస్తున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన గోతం సిటీ పత్రిక తెలియజేసింది (హిందూస్థాన్ టైమ్స్, సెప్టెంబర్ 13, 2024 12:28 IST).
మనీ లాండరింగ్ ఆరోపణతో పాటు సెక్యూరిటీలను ఫోర్జరీ చేసిన ఆరోపణ కూడా స్విస్ ప్రభుత్వం అదాని గ్రూపు పైన మోపి విచారణ జరుపుతున్నట్లు గోతం సిటీ పత్రిక తెలిపింది. స్విస్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు రూలింగ్ ను, కేసు రికార్డులను పరిశీలించిన పిమ్మట గోతం సిటీ పత్రిక ఈ వార్తను ప్రచురించింది.
కేసు వివరాల ప్రకారం అదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బినామీ వ్యక్తి (ఫ్రంట్ మేన్) బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడా దేశాలలో ఏ మాత్రం పారదర్శకంగా లేని, అత్యంత రహస్య ఫండ్ లలో పెట్టుబడులు పెట్టాడనీ, ఈ ఫండ్ లు అన్నీ కేవలం అదాని కంపెనీల స్టాక్ లు మాత్రమే కలిగి ఉన్నాయనీ, మరే ఇతర కంపెనీల సెక్యూరిటీలు గానీ ఇతర పెట్టుబడులు గానీ ఇందులో లేవని స్విస్ ప్రభుత్వం విచారణలో తేలింది. ఈ నిధులను 6 స్విస్ బ్యాంకులలో ఉంచగా, వాటన్నింటినీ స్విస్ ప్రభుత్వ రెగ్యులేటర్ స్తంభింపజేసింది.
తాజా వివరాలను బట్టి అదాని గ్రూపు కంపెనీలు ఇక భారత దేశంలో సెబి, సిబిఐ, ఇడి సంస్థల విచారణ నుండి తప్పించుకునేందుకు వీలు లేదు. జి20 గ్రూపులో ఇండియా కూడా సభ్య దేశమే. సదరు గ్రూపు రూపొందించిన యాంటీ మనీ లాండరింగ్ మరియు నో యువర్ కస్టమర్ (AML & KYC) నిబంధనలను, అంతర్జాతీయ చట్టాలను భారత దేశం అనివార్యంగా అమలు చేయాల్సి ఉన్నది. అనగా భారత ప్రభుత్వం సెబి, సిబిఐ, ఇడి లతో అదాని బినామీ స్విస్ ఖాతాలపై స్వయంగా విచారణ చేపట్టాలి. ముఖ్యంగా యాంటీ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలి.
అదాని గ్రూపు కంపెనీల స్విస్ ఖాతాలపై విచారణకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు ఆదేశిస్తారా? ప్రతిపక్ష పార్టీల నేతలపై మోపుతున్న కేసుల వరకే ప్రధాన మంత్రి అవినీతి వ్యతిరేకత పరిమితం అవుతుందా లేక అది అదాని గ్రూపు కంపెనీల మనీ లాండరింగ్ వరకు వెళ్లగలుగుతుందా?