సిజెఐ ఇంట్లో గణపతి పూజ: మోడీకి ఆహ్వానం!?


భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, భారీ రాజ్యాంగ సంక్షోభానికి తెర తీశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తన ఇంట్లో గణపతి పూజ జరిపిన చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారిని తన ఇంట్లో జరుగుతున్న పూజకు ఆహ్వానించారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు కారణం అయింది.

అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్, రాజ్యాంగం నిర్దేశించిన “అధికారాల సమాన విభజన” (Separation of Powers) సూత్రాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ నేతల తోటి ఎటువంటి పరిస్ధితుల్లోనూ సన్నిహితంగా మెలగరాదు. కనీసం సన్నిహితంగా మెలుగుతున్నట్లు కనిపించరాదు. రాజకీయ పార్టీ నేత, ఎగ్జిక్యూటివ్ (పాలనా వ్యవస్థ) విభాగం నాయకుడు అయిన ప్రధాన మంత్రికి చీఫ్ జస్టిస్ సన్నిహితంగా ఉన్నా, లేదా ఉన్నట్లు కనిపించినా ఆయన ఇచ్చే తీర్పులపై అనుమానపు మేఘాలు కమ్ముకోవటం అనివార్యం.

కోర్టు కేసుల్లో, తాలూకా కోర్టు, సెషన్స్ కోర్టుల నుండి సుప్రీం కోర్టు వరకూ అతి పెద్ద కక్షిదారు ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్) మాత్రమే. అతి పెద్ద కక్షిదారు అయిన ప్రభుత్వానికి నేత అయిన ప్రధాన మంత్రిని తన ఇంట్లో జరిగిన పూజకు అతిధిగా పిలవడం అంటే, చీఫ్ జస్టిస్ గారు ప్రధాన మంత్రితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారన్న అపప్రధకు తావిచ్చినట్లు అవుతుంది. ఇది రాజ్యాంగ సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.

అంతే కాకుండా భారత రాజ్యాంగం సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇస్తుంది. దేశంలో అనేక మతాలతో పాటు వివిధ ఉప శాఖల ప్రజలు నివసిస్తున్న రీత్యా సెక్యులరిజం సూత్రాలను పాటించడం, అమలు చేయడం లాంటి కర్తవ్యాలను భారత రాజ్యం యొక్క మూడు అంగాలు తమ భుజాలపై మోస్తూ ప్రజలకు సామరస్య పూర్వకమైన, మతాతీతమైన సంఘ జీవనం గడపడంలో ఆదర్శంగా నిలవాలి. ఈ విలువైన ఆదర్శాన్ని సిజెఐ డి.వై చంద్రచూడ్, ప్రధాన మంత్రిని తన గృహానికి ఆహ్వానించడం ద్వారా ఉల్లంఘించారు. సిజెఐ పదవిలో ఉన్నంత వరకు సిజెఐ ఎక్కడ నివసించినా అది అధికారిక నివాసమే అవుతుంది. కనుక భారత రాజ్యం లోని మూడు అంగాలలో రెండు అంగాల నేతలు ఒక మత పండుగ సందర్భంగా ఒక నేత ఇంటిలో కలుసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యంలో (ఆ మాటకు వస్తే ఏ దేశంలో నైనా) మూడు ప్రధాన అంగాలు ఉంటాయి.

ఒకటి: ఎగ్జిక్యూటివ్ లేదా పాలనా వ్యవస్థ లేదా ప్రభుత్వం. ఇందులో అధికార పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దాని కింద ఉన్న సమస్త పాలనా వ్యవస్థలు (సివిల్ సర్వీసులు, సెక్రటేరియట్, వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మొ.వి) ఉంటాయి. రోజు వారీ పాలనను ఇవే చూస్తాయి కాబట్టి పాలన చేసే క్రమంలో ప్రజలతో, ప్రజా సమూహాలతో, రాష్ట్రాలతో, వివిధ స్థానిక సంస్థలతో కేంద్ర ప్రభుత్వానికి వైరుధ్యాలు తలెత్తవచ్చు. వాటిని పరిష్కారం చేయటంలో ఎగ్జిక్యూటివ్ ఏకపక్షంగా వ్యవహరించినట్లయితే ప్రజలు, ఇతరులు కోర్టులను ఆశ్రయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు తమ అధికారాలను ఆర్బిట్రరీగా ఉపయోగించినప్పుడు లక్షల మంది సామాన్యులు, వ్యాపారులు, వ్యాపార సంస్థలు పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో కోర్టుల్లో దాఖలయిన అన్ని కేసుల్లోనూ ప్రభుత్వం కక్షిదారుగా అవతరిస్తుంది.

రెండు: లెజిస్లేచర్. అనగా చట్ట సభలు. లేదా పార్లమెంటు. ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ బిల్లులను పార్లమెంటులోని ఉభయ సభలు చర్చిస్తాయి. లెజిస్లేచర్ లో పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రతిపక్ష పార్టీలో అధిక స్థానాలు పొందిన రాజకీయ పార్టీ యొక్క లెజిస్లేచర్ విభాగం ఎన్నుకున్న నాయకుడు మొత్తం ప్రతిపక్ష విభాగానికి నాయకుడుగా ఉంటారు. కేంద్ర స్థాయిలో ప్రధాన రాజ్యాంగ సంస్థల (సివిసి, లోక్ పాల్, కాగ్ మొ.వి) అధిపతులను ఎన్నుకోవటంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉంటుంది. ఆయా నియామకాల్లో ప్రతిపక్ష నేతను పాలకపక్షం తప్పనిసరిగా సంప్రదించాలి.

అలాగే లోక్ సభ, రాజ్య సభలు ఏర్పాటు చేసే కమిటీలలో ప్రతిపక్ష పార్టీల నుండి తప్పనిసరిగా కొందరిని నియమించాలి. వీరందరినీ ప్రతిపాదించి నియమించే బాధ్యత ప్రతిపక్ష పార్టీ నేతపై ఉంటుంది. పార్లమెంటులో ప్రతిపక్షం చేసే విమర్శలు, అడిగే ప్రశ్నలు పాలక పక్షం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా చట్ట సభలు ఆమోదించే బిల్లులు, చట్టాలుగా రూపొందడంలో ఎలాంటి లొసుగులు లేకుండా ఉంటాయని రాజ్యాంగ రచయితలు, రాజ్యాంగ సభ భావించాయి. వారు భావించటం మాత్రమే కాదు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి తొలితరం ప్రజాస్వామ్య దేశాల అనుభవాల నుండి లభించిన పాఠాలనే రాజ్యాంగ రచయితలు, రాజ్యాంగ సభ భారత రాజ్యాంగంలో వినియోగించుకున్నారు.

మూడు: జ్యుడీషియరీ లేదా కోర్టులు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జ్యుడిషియరీ విభాగం నేతగా వ్యవహరిస్తారు. ముందు చెప్పినట్లు తాలూకా కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులూ న్యాయ వ్యవస్థలో భాగమే. కానీ ఈ కోర్టుకు ఆ కోర్టు స్వతంత్రంగానే వ్యవహరించాలి. ఒక కోర్టు తీర్పు విషయంలో అది కింది కోర్టు అయినా సరే పై కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీలు లేదు. కింది కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కక్షిదారు పై కోర్టును ఆశ్రయించినప్పుడు మాత్రమే, అది కూడా చట్టాలను అనుసరించి మాత్రమే పై కోర్టు కింది కోర్టు తీర్పులను కొట్టివేయటమో, ఆమోదించడమో చేయవలసి ఉంటుంది. పార్లమెంటు చేసిన చట్టాలను, రాజ్యాంగం లోని వివిధ సెక్షన్లకు భాష్యం చెప్పవలసిన (interpretation) భారం న్యాయ వ్యవస్థ పైన ఉంటుంది.

కొత్తగా చేసిన చట్టం అయినా సరే, అది రాష్ట్రాలు చేసినా లేదా పార్లమెంటు చేసినా, ఒకసారి చట్టం అంటూ చేసిన తర్వాత వాటికి న్యాయ సూత్రాల రీత్యా భాష్యం చెప్పటం కోర్టుల పని. హై కోర్టులు, సుప్రీం కోర్టు రాజ్యాంగ కోర్టులుగా కూడా వ్యవహరిస్తాయి. రాజ్యాంగ సమస్య వచ్చినప్పుడు రాజ్యాంగ ధర్మాసనం (constitutional bench) ను అప్పటి పరిస్ధితిని బట్టి ముగ్గురు, ఐదుగురు, ఏడుగురు, తొమ్మిది మంది లేదా 11 మంది న్యాయమూర్తులతో విచారణా బెంచిని సుప్రీం కోర్టు / హై కోర్టు చీఫ్ జస్టిస్ లు నియమిస్తారు. రెండు బెంచిల తీర్పుల మధ్య తేడా ఉన్నప్పుడు ఎక్కువ మంది సభ్యులతో కూడిన బెంచి చేసిన నిర్ణయమే ఫైనల్ తీర్పుగా ఉంటుంది.

పాత తీర్పును తిరగదోడాలని లేదా సమీక్షించాలని ఒక బెంచి లేదా చీఫ్ జస్టిస్ భావించినట్లయితే గతంలో తీర్పు ఇచ్చిన బెంచిలోని సభ్యుల కంటే మరో ఇద్దరు న్యాయమూర్తులను కలిపి కొత్త బెంచిని ఏర్పాటు చేసి సమీక్ష చేయాల్సిన తీర్పును దాని ముందు ఉంచుతారు. కొత్త బెంచిలో పాత బెంచిలోని సభ్యులు ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. అది చీఫ్ జస్టిస్ ఇష్టం. అందుకే చీఫ్ జస్టిస్ ను ‘మాస్టర్ ఆఫ్ ద రోస్టర్’ అని కూడా అంటారు.

రాజ్యాంగం, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడీషియరీ లు మూడింటికీ సమాన అధికారాలు కల్పించింది. ఏ ఒక్కటీ ఇతర విభాగాల కంటే ఎక్కువ కాదు. అలాగే ఒక విభాగం విధుల్లో మరొక విభాగం జోక్యం చేసుకునేందుకు వీలు లేదు. దీనిని సాంకేతికంగా (టెక్నికల్ గా) Separation of Powers గా చెబుతారు. మూడు విభాగాలూ తమకు తాముగా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ స్వతంత్రంగా పని చేయాలి. ఈ మూడింటిని మూడు ఎస్టేట్ లుగా పిలుస్తారు.

ఈ మూడు కాకుండా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ను అనధికారికంగా ఫోర్ట్ ఎస్టేట్ గా పిలుస్తారు. మొదటి మూడు ఎస్టేట్ ల పని పైన కాపలా పెట్టి ప్రజలకు నిజాయితీగా మూడు ఎస్టేట్ ల పని గురించి తెలియజేసే బాధ్యతను మీడియా పైన ఉంచారు. మూడు ఎస్టేట్ లు రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు, మూడు ఎస్టేట్ లు గానీ లేదా ఏ రెండు ఎస్టేట్ లు గానీ కుమ్మక్కు అయినప్పుడూ అలాంటి వివరాలను ప్రజలకు తెలియజెప్పి అప్రమత్తం చెయ్యాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుంది.

అందుకనే ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకునే దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు అత్యంత గౌరవం ఇస్తున్నట్లు చెబుతుంటారు. వాస్తవంలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే పత్రికలను, ఇతర మీడియాలను ప్రభుత్వాలు వేధించడం, కేసులు పెట్టి టార్చర్ కి గురి చేయటం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఫోర్ట్ ఎస్టేట్ లోకి సోషల్ మీడియా కూడా వచ్చి చేరింది. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ కూడా వాస్తవాలు వెల్లడి చేసే పౌరుల ఖాతాలను స్తంభింపజేయమని లేదా నిషేధించాలని సోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వాల నుండి తాఖీదులు అందుకోవడం తెలిసిన విషయమే.

ప్రధాన మంత్రి ఎగ్జిక్యూటివ్ విభాగానికి నేత. చీఫ్ జస్టిస్ జ్యుడిషియరీ విభాగానికి నేత. ఈ రెండు విభాగాలే ప్రజలకు ప్రధానంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పార్లమెంటు లోని రెండు చట్ట సభల కార్యకలాపాలను ప్రజలు సీరియస్ గా తీసుకోకుండా ఒక జోక్ లాగా మార్చడంలో 75 యేళ్ళ పాలనా కాలంలో రాజకీయ పార్టీలు కృతకృత్యం అయ్యాయి.

నిజంగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి పార్లమెంటు నడుస్తున్న తీరు, చట్టాలు చేస్తున్న తీరు, చట్ట సభలు నియమించే వివిధ సెలెక్ట్ కమిటీలు, పబ్లిక్ అండ్ అకౌంట్స్ కమిటీ (ఈ కమిటీకి నాయకుడి నియామకం పూర్తిగా ప్రతిపక్షం చేతుల్లో ఉంటుంది) లో ప్రభుత్వాల ఖర్చులను ఆమోదించే పద్ధతులూ, ఇవన్నీ పని చేసే తీరు ప్రజలకు అర్ధం కాకుండా, వారి అవగాహనకు దూరంగా ఉంచడంలో రాజకీయ పార్టీలు సఫలం అయ్యాయి. చట్టాలన్నీ చేసే పాలక పార్టీ, ప్రభుత్వ ఖర్చులను పరిశీలించి తప్పొప్పులను ప్రశ్నించి సరి చేయవలసిన ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీతో కుమ్మక్కు అయితే అది ప్రజా ద్రోహం అవుతుంది. కానీ గత 75 యేళ్ళ కాలంలో పార్లమెంటులోని వ్యవస్థలన్నీ లోపలి నుంచి తొలిచి గుల్ల చేసి నామమాత్రం చేసేశారు.

కనుక ప్రజలకు కనిపించేది ప్రధానంగా ప్రభుత్వమూ, న్యాయ వ్యవస్థలే. ప్రజలకు కనిపించే ఈ రెండు విభాగాల నాయకులు కూడా ఇలా బహిరంగంగా రాజ్యాంగ నిర్దేశించిన సెపరేషన్ పవర్స్ సూత్రాలకూ, సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధంగా, ఒకరి నుంచి మరొకరు దూరం ఉంటూ స్వతంత్రత పాటించాలన్న సూత్రానికి విరుద్ధంగా ఒక మత పండగ నాడు నేరుగా న్యాయ వ్యవస్థ అధినేత తన అధికార నివాసం లోనే ఎగ్జిక్యూటివ్ నేతను కలుసుకోవటం తప్పనిసరిగా తప్పుడు సంకేతాలను దేశానికి (ప్రజలకు) పంపినట్లే అవుతుంది.

సుప్రీం కోర్టులో అనునిత్యం కేంద్ర ప్రభుత్వ చర్యలకు, చట్టాలకు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అవుతున్నాయి. మరో పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల అధికారాలకు ఎక్కడికక్కడ కత్తెర వేసే జి.ఎస్.టి లాంటి చట్టాలు తెస్తూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకుండా పస్తు పెడుతున్న పరిస్ధితి. ఇటీవల పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు తమకు చట్టబద్ధంగా రావలసిన నిధుల కోసం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది.

అంతే కాకుండా సిబిఐ, ఇడి, ఇన్కమ్ టాక్స్ లాంటి విభాగాలను ప్రతిపక్ష నాయకుల పైకి, చివరికి ప్రతిపక్ష ముఖ్యమంత్రుల పైకి కూడా ఉసిగొల్పి జైళ్ల పాలు చేయటం ద్వారా ప్రతిపక్ష పార్టీలపైన పాలక ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తున్నది. ఈ కేసులన్నీ విచారించవలసింది సుప్రీం కోర్టే. ప్రధాన మంత్రిని అధికార నివాసానికి ఆహ్వానించిన చీఫ్ జస్టిస్, నిస్పాక్షికంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల కేసులను విచారిస్తారన్న నమ్మకాన్ని తాజా పరిణామం బలహీనపడేలా, కోల్పోయేలా చేస్తున్నది.

ప్రధాన మంత్రి చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళి పూజలో పాల్గొని వెంటనే వెళ్ళిపోయారు కదా? దీనికే ఇంత రాద్ధాంతమా అని ప్రశ్నించే వాళ్ళు ఉండవచ్చు. ప్రధాని ఎంతసేపు చీఫ్ జస్టిస్ ఇంట్లో గడిపారు లేక అక్కడ ఆయన ఏం చేశారు అన్నది సమస్య కాదు. అలా ఒక రాజ్యాంగ విభాగం నేత, మరో రాజ్యాంగ విభాగం నేతతో సన్నిహితంగా మెలిగారన్న అభిప్రాయాన్ని దేశ ప్రజలకు కలిగించకూడదు. దేశ ప్రజలకు ఇవన్నీ పట్టించుకునే తీరిక ఉందా అన్న అసందర్భ ప్రశ్నలకు ఇక్కడ తావు లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, లాయర్లు, హై కోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టులు, మేజిస్ట్రేట్ లు, వివిధ ట్రిబ్యునళ్ళు ఇవన్నీ, వీళ్ళందరూ చీఫ్ జస్టిస్ నడత, పోకడలను నిశితంగా గమనిస్తారు. చీఫ్ జస్టిస్ పోకడలను అనివార్యంగా కింది కోర్టులు అనుసరిస్తాయి. ఎవరికి వారు సేఫ్ గా భద్రంగా ఉండాలనుకుంటారు గనుక న్యాయం పక్షం కాకుండా ఎవరిది ఆధిపత్యం అయితే వారిని అనుసరించే వైఖరి మెజారిటీ పక్షాల్లో ఉంటుంది. కనుకనే చీఫ్ జస్టిస్ యొక్క ప్రతి చర్యా స్క్రూటినీకి గురవుతుంది. తప్పటడుగు పడిన వెంటనే విమర్శలు, హెచ్చరికలు, తప్పుడు లేదా ఒప్పుడు భాష్యాలు వెల్లువెత్తుతాయి.

ప్రధాన మంత్రికి చీఫ్ జస్టిస్ అందజేసిన ఆహ్వానం ఇప్పుడు అనేక విమర్శలకు గురవుతూ ఉన్నది. ఈ విమర్శలు సరైనవే కూడా. అందునా అత్యంత ఆదర్శవంతమైన ఆచరణ కలిగి ఉన్నాడనీ, రాజ్యాంగ సూత్రాలను ఆపోసన పట్టిన నిస్పక్షపాతమైన న్యాయమూర్తిగా పలువురు పరిగణిస్తున్న జస్టిస్ డివై చంద్రచూడ్ నుండి ఈ పరిణామం ఎవ్వరూ ఊహించనిది. కనుకనే అనేక మంది చీఫ్ జస్టిస్ చర్యను చూసి దాదాపు షాక్ కి గురయ్యారు. షాక్ నుండి తేరుకుని చేయవలసిన విమర్శలు చేస్తున్నారు.

ప్రఖ్యాత లాయర్లు, రాజకీయ నాయకులు విమర్శకులలో ఉన్నారు. అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి ఒకప్పుడు సుప్రీం కోర్టు నుండి కూడా ప్రశంసలు పొందిన ప్రశాంత్ భూషణ్, ప్రఖ్యాత మహిళా సుప్రీం కోర్టు అడ్వకేట్ ఇందిరా జైసింగ్, శివసేన (యూ‌బి‌టి) నాయకుడు సంజయ్ రావత్ ఈ విమర్శకుల్లో ఉన్నారు.

ఇందిరా జైసింగ్ చీఫ్ జస్టిస్ ను విమర్శిస్తూ “ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడీషియరీ ల మధ్య ఉన్న విడి విడి స్వతంత్ర అధికారాలను చీఫ్ జస్టిస్ రాజీకి గురి చేశారు. సిజెఐ స్వతంత్రత పట్ల ఉన్న నమ్మకం అంతా నేను కోల్పోయాను. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, ఇలా బహిరంగంగా సిజెఐ, ఎగ్జిక్యూటివ్ ల మధ్య వ్యక్తమైన రాజీ ధోరణిని గట్టిగా ఖండింఛాలి” అని ఎక్స్ లో రాశారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ కు ప్రస్తుతం కపిల్ సిబాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి స్వతంత్రంగా ఉన్నారు.

“ఒక న్యాయ మూర్తి తన ఆఫీసు గౌరవానికి తగ్గట్టుగా ప్రత్యేకతను కనబరచాలి. తాను ఆక్రమించిన ఉన్నతమైన కార్యాలయ గౌరవానికి భంగకరంగా, ఆ కార్యాలయం ప్రజల నుండి పొందే అత్యున్నత నమ్మకానికి భిన్నంగా ఆ వ్యక్తి ఎలాంటి చర్యకు గానీ, విస్మరణకు గానీ పాల్పడరాదు” అని సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఇది న్యాయమూర్తులకు విధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగం అని ఆయన చెప్పారు.

శివ సేన నేత సంజయ్ రావత్ మరింత కఠినంగా వ్యాఖ్యానించారు. “శివసేన (ధాకరే) శివసేన (షిండే) పార్టీలలో ఎవరిది నిజమైన శివసేన అన్నది తేల్చ వలసిన విషయంలో మహారాష్ట్ర స్పీకర్ చేసిన నిర్ణయాన్ని సవాలు చేసిన కేసు సుప్రీం కోర్టులో ఉన్నది. కానీ ఈ రోజుతో చీఫ్ జస్టిస్ నిస్పాక్షిత పైన అనుమానాలు తలెత్తాయి. రాజ్యాంగానికి కాపలా కాయవలసిన వాళ్ళు ఈ విధంగా రాజకీయ నాయకులను కలవడం జరిగినట్లయితే సహజంగానే ప్రజలకు అనుమానాలు ఏర్పడతాయి” అని సంజయ్ రావత్ వ్యాఖ్యానించాడు.

శివసేన పార్టీని చీల్చి మెజారిటీ అసెంబ్లీ సభ్యులతో షిండే వర్గం బిజెపికి మద్దతు ఇవ్వటంతో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్.సి.పి పార్టీల నాయకత్వం లోని ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్.సి.పి నుండి శరద్ పవార్ తమ్ముడి కొడుకు అజిత్ పవార్ చీలిపోయి బిజెపి తో చేతులు కలిపాడు. అజిత్ పవార్ పైన 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణం గురించిన కేసులు నడుస్తుండగా, శివసేన లోని అనేక మంది సభ్యులపై ఇడి, సిబిఐ కేసులు మోపుతున్నారని, కేసులు ఎదుర్కొనే బదులు బిజెపి తో చేతులు కలపడం మేలనీ గతం లోనే శివసేన ఎం.ఎల్.ఏ లు ఉద్ధవ్ ధాకరే ను డిమాండ్ చేసిన సంగతిని పత్రికలు వెల్లడి చేశాయి. అజిత్ పవార్ నేతృత్వం లోని ఎన్.సి.పి, షిండే నేతృత్వం లోని శివసేన లే అసలు పార్టీలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇవ్వటంతో ఆ రెండు కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్నాయి. ఈ కేసుల్లో చీఫ్ జస్టిస్ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారా అని సంజయ్ రావత్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు.

సాధారణంగా విమర్శలకు సమాధానం ఇచ్చే సౌకర్యం న్యాయమూర్తులకు ఉండదు. సమాధానం ఇస్తే అది కూడా వివాదం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నుండి సమాధానం లేదా వివరణ వెలువడటం అనేది జరగదు. ఏదైనా న్యాయశాస్త్రం లోని అంశం పైన సభ జరిగితే ఆ సభకు అతిధిగా, ప్రసంగీకునిగా చీఫ్ జస్టిస్ ని పిలిస్తే అలాంటి సభలో పరోక్షంగా వివరణ ఇచ్చుకునే అవకాశం ఉండవచ్చు.

వ్యాఖ్యానించండి