
కలెక్టర్ సృజన గారు బిబిసి తెలుగు చానెల్ కి ఇచ్చిన సమాచారం ప్రకారం విజయవాడ లో 64 వార్డులు ఉంటే అందులో 32 వార్డులు వరద నీటిలో మునిగిపోయాయి. విజయవాడ మునకకు ఆమె మూడు కారణాలు చెప్పారు. ఒకటి: బుడమేరు వాగు పైన వెలగలేరు వద్ద లాకులు ఎత్తివేయవలసి రావటం, రెండు: ఎన్నడూ లేని విధంగా 26 సె. మీ వర్షపాతం విజయవాడలో కురవటం మూడు: కృష్ణా నది పైన 12 మీటర్ల కంటే ఎత్తున నీటి ప్రవాహం చేరడంతో 11.9 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేయవలసి రావటం.
ఈ మూడు ఒక దానితో ఒకటి సంబంధం ఉన్న కారణాలు. రాష్ట్రంలో ఒక విపత్తు సంభవించి ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయటం మాని ప్రజలను ఉపద్రవం నుండి ఎలా బైట పడేయాలి, వారికి ఎలా సహాయం చెయ్యాలి అన్నది ఆలోచించాలి.
అందుకు బదులుగా ప్రతిపక్షం, పాలకపక్షం ఒకరినొకరు దూషించుకుంటూ, విపత్తుకి కారణం మీరంటే మీరే అని విమర్శించుకోవడం బొత్తిగా తగని పని. కానీ ఆ తగని పనిలోనే తెంపు లేకుండా మునిగిపోయాయి రాజకీయ పార్టీలు. వారికి తగ్గట్టు ఇతర ప్రాంతాల జనం కూడా చెరో వైపు చేరి ఉన్నవి లేనివి చెప్పుకుంటూ అబద్ధాలు, అర్ధ సత్యాలు ప్రచారంలో పెడుతూ విపత్తులో ఉన్న జనాన్ని గాలికి వదిలేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ, దానికి చెందిన పత్రికలు, ఛానెళ్లు ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నవి లేనివీ కూడా ఆరోపణలు ఆయనకు అంటగట్టడంలో మునిగిపోయింది. పాలక పక్షమేమో అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని ప్రశ్నిస్తూ మరింత పెద్ద గొంతుతో మరిన్ని దూషణలకు దిగుతూ ప్రతిపక్ష నాయకులతో పోటీ పడుతున్నారు. సరే, ఈ దరిద్రం మనకి ఎప్పుడూ ఉండేదే. వాళ్ళ సంగతి పక్కన పెట్టి విజయవాడ ఎదుర్కొన్న ఉపద్రవం గురించి మనం మనం మాట్లాడుకుంటే కాస్తన్నా ఉపయోగం ఉంటుందేమో!
కలెక్టర్ సృజన గారు చెప్పిన కారణాలతో పాటు ఇతర కారణాలను కూడా పరిశీలిద్దాం.
ఒకటి: బుడమేరు పొంగడం.
బుడమేరు వాగు మైలవరం వద్ద కొండల్లో పుట్టి దక్షిణ దిశలో అనేక వంకలు తిరుగుతూ పాత విజయవాడకు ఉత్తరం వైపు తాకుతూ తూర్పుకి ప్రయాణం కట్టి చివరకి కొల్లేరు చెరువులో కలుస్తుంది. ఈ వాగు పొంగినప్పుడల్లా విజయవాడ నగరంతో పాటు తన దారి వెంట ఉన్న గ్రామాలకు ఎప్పుడూ వరద ముంపు పొంచి ఉండేది.
ఈ నేపధ్యంలో 1970 ప్రాంతాల్లో బుడమేరు వాగుని దారి మళ్లించి కృష్ణా నదిలో కలిసేలా చేయాలని అప్పటి ప్రభుత్వాలు, ఇంజనీర్లు ఆలోచన చేశారు. దరిమిలా వెలగలేరు వద్ద బుడమేరు సహజ ప్రవాహ దిశకు అడ్డంగా చిన్న బ్యారేజి కట్టి 11 లాకులు ఏర్పాటు చేశారు.
వెలగలేరు వద్ద ఏర్పాటు చేసింది లాకులా, గేట్లా అన్న వాదోపవాదాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆర్ టి.వి తో మాట్లాడిన ఇంజనీర్ ప్రకారం నది, కాలువ, వాగు… ఇలా ప్రవాహాన్ని బట్టి ఆయా పేర్లు పెడతారని తెలుస్తున్నది. పెద్ద ప్రవాహం అయితే గేట్లు అనీ, దానికంటే చిన్న ప్రవాహం అయితే లాకులు అనీ, ఇంకా చిన్న ప్రవాహం అయితే స్ల్యూయిజ్ (Sluice) అంటారు. వెలగలేరు వద్ద బుడమేరుపై నిర్మించినవి లాకులే అని ఆ ఇంజనీర్ చెప్పాడు.
గేట్లు అంటే అవసరాన్ని బట్టి ఎత్తడం దించడం చేస్తారు. లాకులు అనేవి దాదాపు పర్మినెంట్ అనుకోవచ్చు. అనుకోని ఉపద్రవం వస్తే తప్ప లాకుల్ని తెరవరు. అవి నీటిని నిలిపి ఉంచటానికో లేదా మళ్లించడానికి మాత్రమే ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది. బుడమేరు వాగుపై ఉన్న లాకుల్ని గత 40 యేళ్లలో ఇంతవరకు తెరవలేదని ఇప్పుడే తెరిచారని ఒక ఇంజనీర్ ఆర్ టి.వితో మాట్లాడుతూ చెబితే 2005లో పాక్షికంగా ఒకసారి తెరిచారని మరో ఇంజనీర్ డి.ఇ మాదవ్ నాయక్ సాక్షి టి.వీటో మాట్లాడుతూ చెప్పాడు. కానీ వాళ్లిద్దరు ఖచ్చితంగా తెలిసినట్లు కాకుండా ‘అనుకుంటా’ అని చెప్పారు.

Velagaleru regulator
అయితే వెలగలేరు లాకులు ఎందుకు తెరిచారు? మొదట నేపధ్యం గురించి కొంత చూడాలి. వెలగలేరు లాకుల్ని బుడమేరు ప్రవాహాన్ని విజయవాడ మీదకి రాకుండా దారి మళ్లించి ప్రకాశం బ్యారేజికి ఎగువన ఇబ్రాహీం పట్నం వద్ద కృష్ణా నదిలో కలిసేలా చేసేందుకు నిర్మించారు. కృష్ణాలో కలిసే చోటుని పవిత్ర సంగమం అని ఇప్పుడు పిలుస్తున్నారు. వెలగలేరు లాకుల లక్ష్యం బుడమేరు వాగు నీరు విజయవాడ నగరం మీదికి రాకుండా దారిమళ్ళించడం మాత్రమే. ఈ దారిమళ్లించిన కాలవని బిడిసి (బుడమేరు డైవర్షన్ కెనాల్) అంటారు.
ఆ తర్వాత జల యజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టుకి పునాది పడింది. ఎగువ ప్రాజెక్టుల వలన విజయవాడ వద్ద కృష్ణాకి నీటి రాక తగ్గింది. అప్పటికి తెలంగాణ డిమాండ్ ఉధృతం అవుతోంది. తెలంగాణ ఏర్పాటుని రాజశేఖర్ రెడ్డి అప్పటి వరకు నిలుపుదల చేసినప్పటికీ తదుపరి ఎన్నికల నాటికి తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని రాజశేఖర్ రెడ్డి గారే తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించి ఉన్నారు. తెలంగాణ వస్తే గనక పైన నిర్మించే ప్రాజెక్టుల వల్ల నీరు మరింత తగ్గవచ్చని అంచనా వేశారు. మరో పక్క కృష్ణా నదిలో నీళ్ళు తగ్గుతున్నందున గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేయాలని కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దరిమిలా కృష్ణా గోదావరి నదుల్ని పోలవరం ద్వారా అనుసంధానం చేసే పనికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది.
ఈ నేపధ్యంలో బిడిసి కాస్తా పోలవరం కుడి కాలవగా మారింది. వెలగలేరు లాకుల వద్ద పోలవరం కుడి కాలువ బిడిసిలో కలిపే ఏర్పాటు 2005 లో చేశారు. 1970 నుండి వెలగలేరు లాకుల వద్ద బుడమేరు నీరు ఆగిపోవడంతో లాకులకు దిగువన బుడమేరు మార్గం ఎండిపోయింది. దానితో అక్కడి నుండి విజయవాడ వరకు ఫ్లడ్ ప్లెయిన్స్ లో ఆక్రమణలు మొదలయ్యాయి. చిన్నా, పెద్దా అందరూ ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు. ఆక్రమితులకి పట్టాలు ఇవ్వాలని సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు ఆందోళనలు చేశాయి. ఆ విధంగా రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, దేవి నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరి పేట, ఫ్రేసర్ పేట తదితర కాలనీలు వెలియడం, వారికి పట్టాలు ఇవ్వటం జరిగిపోయింది.
ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలను గమనంలో ఉంచుకోవాలి.
ఒకటి: బిడిసి కాలువ డిశ్చార్జ్ సామర్ధ్యం 11,000 క్యూసెక్కులు మాత్రమే. పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ అయ్యాక దాని సామర్ధ్యం 16,000 క్యూసెక్కులకు పెంచారు.
రెండు కృష్ణా బ్యారేజికి కూడా పరిమిత సామర్ధ్యమే ఉన్నది. బుడమేరు కలిసే పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో 12 మీటర్లు, అంతకు లోపల మాత్రమే నీరు ప్రవహిస్తున్నప్పుడే బుడమేరు నుండి వచ్చే వరద నీరు కృష్ణాలో ఎలాంటి సమస్య లేకుండా కలిసిపోయి ప్రవహిస్తుంది. కానీ కృష్ణాలో నీటి మట్టం 12 మీటర్లకు మించితే గనక బుడమేరు వరదనీరు కృష్ణాలో కలవడం సాధ్యం కాదు. ఎందుకంటే బుడమేరు నీటి మట్టం కంటే మించి కృష్ణా నీటి మట్టం ఎత్తులో ఉంటుంది గనక.
ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏమిటంటే కృష్ణాలో ప్రవాహం 12 మీటర్లు దాటితే గనక కృష్ణాలో నీళ్లే బుడమేరు లోకి వెనక్కి తన్నేస్తాయి. బుడమేరు నీళ్ళు కృష్ణాలో కలవటానికి బదులు కృష్ణా నీళ్లే బుడమేరు లోకి బలంగా వెళ్తాయి.
ఆగస్టు 31 తేదీన 30, 31 తేదీల్లో ఏం జరిగి ఉంటుంది. సాక్షి టి.వి తో మాట్లాడిన డి.ఇ మాధవ్ నాయక్ ప్రకారం శనివారం మధ్యాహ్నం వరకు వెలగలేరు లాకుల వద్ద నీటి ప్రవాహం పెద్దగా లేదు. కానీ నీటి ప్రవాహం మెల్లగా పెరుతుండటాన్ని ఆయన గమనించాడు. దానితో ఆయన సాయంత్రానికల్లా వెలగలేరు లాకులు తెరవాల్సి వస్తుందేమో అని పై అధికారులకి సమాచారం ఇచ్చారు. ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ కి కూడా చెప్పినట్లు ఆయన చెప్పారు.
శనివారం సాయంత్రానికి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున నీరు వచ్చి పడిందని, దాదాపు 40 నుండి 45 వేల క్యూసెక్కుల వరకు ఆ ప్రవాహం ఉండవచ్చని మాధవ్ నాయక్ చెప్పారు. దానితో ఆయన లాకుల్ని తెరిచేశారు. సెప్టెంబర్ 4 తేదీన నాయక్ గారితో సాక్షి టి.వి విలేఖరి వెలగలేరు లాకుల వద్ద మాట్లాడాడు. అప్పటికి లాకుల్ని మూసేశారు. అయినప్పటికీ లీకేజిల నుండి నీరు కాస్త ఉధృతంగానే వస్తున్నట్లు నాయక్ గారి వెనుక దృశ్యంలో లాకుల వద్ద కనిపిస్తున్నది.






సాక్షి విలేఖరి, మాధవ్ నాయక్ గారి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా ఉన్నది. పై అధికారులకి లాకులు తెరవ నునున్నట్లు ఎప్పుడు చెప్పారు అనడిగితే ఆయన శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం అన్నారు. ఎప్పుడు తెరిచారు అని అడిగితే శనివారం సాయంత్రం అన్నారు. విజయవాడకి ఆ నీళ్ళు ఎప్పుడు చేరుకుని ఉంటాయి అని అడిగితే తర్వాత రోజు ఉదయానికల్లా చేరుకుని ఉంటాయి అని చెప్పారు ఇంజనీర్ గారు.
ఇక తెరపైకి పూర్తిగా సాక్షి విలేఖరి వచ్చేశాడు. “అంటే లాకులు తెరవబోతున్నానని ఇంజనీర్ పై అధికారులకి చెప్పాక 7 లేదా 8 గంటల సమయం అధికారులకి ఉన్నది” అని విలేఖరి అంటూనే ఆ అంకెని 15, 16 గంటలకి పెంచేశాడు. మళ్ళీ వెంటనే 20 గంటల సమయం ఉన్నది అన్నాడు. అర నిమిషంలో మూడు అంకెలు చెప్పాడు. ఆ 20 గంటల అంకె దగ్గర స్ధిరపడి, “అధికారులకి 20 గంటల సమయం ఉన్నా విజయవాడ ప్రజలని అధికారులు హెచ్చరించలేదు. వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించడం చేయలేదు. కాబట్టి విజయవాడ మునిగిపోవటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడుగారి ప్రభుత్వమే” అని చెప్పడం మొదలు పెట్టాడు.
సాక్షి విలేఖరి ఆసక్తి వాస్తవాలు వెలికి తీయడం కాకుండా ప్రభుత్వాన్ని ప్రభుత్వ నేతను తప్పు పట్టే అవకాశం దొరకబుచ్చుకోవడమే అని ఈ వ్యవహారం ద్వారా అర్ధం అవుతున్నది. సరే, సాక్షి విలేఖరి ఆసక్తి గురించి మనకు అనవసరం. ఆ సంగతి ఇంతటితో వదిలి ముందుకు వెళ్దాం.
మాధవ్ నాయక్ చెప్పిన అంశాల ప్రకారం “వాగుల్లో వరద ఎప్పుడూ అకస్మాత్తుగానే వస్తుంది.” ముందస్తు సూచనలేవీ ఉండవు. వెలగలేరు, మైలవరం పైన ఉన్న ఖమ్మ జిల్లాలో ఉధృతంగా వర్షాలు పడి అనేక చెరువులు తెగి ఆ నీరంతా ఒక్కసారిగా బుడమేరు లోకి వచ్చేసిందని మాధవ్ నాయక్ అంచనా వేశారు.
రెండు కృష్ణా నది పొంగడం
ఆర్ టి.వి స్టూడియోకు ఒక ఇంజనీర్ ని పిలిచి ఆయన ద్వారా ఏం జరిగింది ఉంటుంది అన్న విశ్లేషణ చేశారు. సదరు ఇంజనీర్ ఊహిస్తున్నది ఏమిటి అంటే కేవలం ఖమ్మం నుండి వచ్చి పడ్డ నీళ్లే కాకుండా కృష్ణా నదిలో కూడా ఉధృతంగా నీటి ప్రవాహం పెరిగి 12 మీటర్లు దాటడంతో కృష్ణా ప్రవాహంలో నీరు బుడమేరు లోకి వెనక్కి తన్ని వెలగలేరు లాకుల దాకా వచ్చి ఉంటుందని ఖమ్మం నుండి వచ్చిన నీళ్ళు, కృష్ణా నుండి ఎగదన్నిన నీళ్ళు కలిసి 40 నుండి 45 వేల క్యూసెక్కుల వరకు పెరిగి ఉండవచ్చని ఆయన అంచనా. లేకపోతే 40-45 వేల క్యూసెక్కుల నీళ్ళు అకస్మాత్తుగా వచ్చేంత పరిస్ధితి ఎప్పుడూ జరగలేదని ఆయన చెప్పారు.
సాక్షి విలేఖరి మరో ప్రశ్న కూడా మాధవ్ నాయక్ కి వేశారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసం మునగకుండా ఉండేందుకే లాకుల్ని తెరిచారని అంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. దానికి మాధవ్ నాయక్ గారు అంగీకరించలేదు. “సమస్యే లేదండీ, బిడిసి కాలువ సామర్ధ్యం చాలా తక్కువ. 11 వేల క్యూసెక్కులకి ప్రవాహం మించితే లాకులు ఖచ్చితంగా తెరవాల్సిందే. అది నిబంధన. అందుకే లాకులు తెరిచాము” ఆయన స్పష్టం చేశాడు. “అదీ కాక మేము లాకులు తెరిచేదాకా నీళ్ళు ఆగలేదు. తెరుస్తుండగానే పై నుండి నీళ్ళు పాత బుడమేరు మార్గం లోకి ఉధృతంగా వెళ్ళాయి.” అని ఆయన చెప్పారు. (ఈ ఇంజనీర్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు వైసిపి శ్రేణులు చెబుతున్నాయి గానీ అదేమీ జరగలేదని తెలుస్తున్నది.)
మాధవ్ నాయక్ అంత స్పష్టంగా చెప్పినప్పటికీ తాడేపల్లిలో చంద్రబాబు నివాసం మునగ కుండా ఉండేందుకే వెలగలేరు లాకులు తెరిచారన్న ప్రచారం మాత్రం ఆగలేదు. అదింకా మిగతా జిల్లాల్ని చుట్టేస్తూనే ఉన్నది. ఇంతా చేసి ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో ఉన్నారా అంటే అదీ లేదు. ఉండే అవకాశం వరద నీళ్ళు ఇవ్వలేదు కూడా. ఆయన నివాసాన్ని కూడా నీళ్ళు చుట్టెయ్యడంతో కలెక్టర్ ఆఫీస్ లో ఉంటున్నారు. కాబట్టి పాలక, ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తున్న ఛానెల్స్, పత్రికలు చెప్పే వార్తల్ని వేటినీ విశ్వాసం లోకి తీసుకోక పోవటమే మంచిది. లేకపోతే వారు చెప్పే వార్తల్లో అసలు నిజాల్ని పసిగట్టగల తెలివినైనా కలిగి ఉండాలి.
మూడు: ఆక్రమణలు
ఒకటి ఆక్రమణలు. వెలగలేరుకు కింద పాత బుడమేరు కాలవ గట్టు వరకు ఆక్రమించి జనం ఇళ్ళు కట్టుకున్నారు. జనానికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వటం లాంటివి ప్రభుత్వాలు చేయాల్సి ఉండగా కేవలం నామ మాత్రంగానే చేస్తున్నాయి తప్ప అవసరాలకు సరిపడా ప్రజలకు నివాస వసతి కల్పించాలన్న విధానాలు ప్రభుత్వాలకు ఎప్పుడూ కలిగి లేవు.
ఆక్రమణలకి ప్రత్యక్ష కారణంగా ప్రజలు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంగా ప్రభుత్వాన్నే తప్పు పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 1970 లోనే వెలగలేరు లాకులు నిర్మించారు. ఆ తర్వాత బుడమేరు మార్గం ఎండినప్పటి నుండీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చింది. ఈ ఆక్రమణల్లో పెద్దలు కూడా ఉన్నారు. అపార్ట్ మెంట్లు నిర్మించి అమ్ముకున్న బడా తలకాయలు ఉండనే ఉన్నారు. విజయవాడ నగరం అత్యంత వేగంగా విస్తరిస్తూనే ఉన్నది. రాష్ట్రం విడిపోయాక మరింత వేగం పుంజుకుంది.
నగర విస్తరణ, ఆక్రమణల ద్వారానైనా, జరగకపోతే నగర ప్రజల జీవనం సజావుగా కొనసాగదు. వ్యాపారాలు వృద్ధి చెందవు. భారీ విదేశీ కంపెనీలు షాపులు తెరవరు. నగర విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ప్రజల జీవన స్థాయి వృద్ధి, ప్రభుత్వ ఆదాయ వృద్ధి ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కేవలం ఆదాయ వనరుల వరకే పట్టించుకుని ప్రజలకు కల్పించాల్సిన కనీస వసతుల సంగతిని విస్మరిస్తే విపత్తులు తప్పనిసరిగా జనసామాన్యాన్ని ముంచెత్తుతాయి.
ఇలాంటి విశాల దృష్టి, నిజానికి ఇంతకంటే మరింత మరింత స్క్వేర్ విశాల దృష్టిని ప్రభుత్వాలు కలిగి ఉండాలి. భవిష్యత్ దర్శనం కూడా చేయగలగాలి. (విజన్ 2020 ని పాతికేళ్ళ ముందే రూపొందించిన చంద్రబాబు గారికి ఇదేమంత కష్టం కాదు) సైన్స్, టెక్నాలజీ, వాతావరణం గురించిన ముందస్తు సమాచారం మరింత మెరుగ్గా తెలుసుకోవడం లాంటివి అభివృద్ధి అయ్యాక వాటిని ప్రజల సంక్షేమం, జీవన పరిస్ధితుల మెరుగుదలకు వినియోగ పెట్టకపోతే ఇక ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్లు?
ఆస్తులు, సౌకర్యాలు, వసతులు, లాభాలు అన్నీ ధనికవర్గాలకే అప్పగిస్తే ఆ ధనిక వర్గాల బ్రతుకులు కాలు కింద పెట్టకుండా సాగేందుకు సహకరిస్తున్న పేద ప్రజలు ఎలా బ్రతుకుతారు? మునిసిపల్ వర్కర్లు, ర్యాగ్ పికర్స్, పని మనుషులు, వంట మనుషులు, కొబ్బరి బోండాల బండ్లు, ఎలక్ట్రికల్ వర్కర్లు, శానిటరీ వర్కర్లు, హౌస్ ఫిట్టింగ్ అండ్ ఫిక్సర్ వర్కర్లు వీళ్ళే కదా మురికి వాడల్లో, ఆక్రమిత స్థలాల్లో, రైలు పట్టాల వెంట, కాలవ గట్ల వెంట నివసించేది. వాళ్ళు లేకుంటే నగర జీవనం ఒక్క అంగుళమైనా ముందుకు కదలగలదా?
నాలుగు: ఖమ్మంలో కురిసిన అధిక వర్షాలు.
ఖమ్మం అధిక వర్షాల వల్ల చెరువులు తెగి, నీళ్ళు భారీ మొత్తంలో బుడమేరు లోకి ప్రవేశించడం. 45 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే శక్తి అటు బిడిసి/పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ కి గానీ ఇటు ఇలగలేరు లాకులకి గానీ లేదు. ఇక నీటికి మిగిలిన ఏకైక మార్గం ఒక్కటే. అది ఇలగలేరు బ్యారేజి పై నుండి దూకి పాత బుడమేరు ప్రవాహ మార్గాన్ని తనకు తానే పునరుద్ధరించుకోవడం. ప్రకృతికి ఉన్న శక్తి ఇలానే ఉంటుంది. ప్రకృతిని కట్టి పడేసి నియంత్రణలో ఉంచుకునేందుకు మనిషి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వాటన్నింటినీ తాను ఎలా దాటుకో గలనో అప్పుడప్పుడూ ఇలాంటి సమయాల్లో ఆచరించి చూపిస్తుంది ప్రకృతి.
అందుకే ప్రకృతిని తక్కువ అంచనా వేయటం, చిన్న చూపు చూడటం చేయకూడదు. ప్రకృతిని వినియోగించుకుంటూనే ఆ ప్రకృతికి మనిషి విధేయుడై ఉండాల్సిందే. ప్రకృతికి విధేయంగా ఎలా ఉండాలో అనాగరికులు, నిరక్షర కుక్షులు, అమాయకులు అని నాగరిక ప్రపంచం ఈసడించుకునే గిరిజన తెగల ప్రజల్ని అడిగితే తెలుస్తుంది. గిరిజనులే లేకపోతే ఈ పాటికి అడవులు, కొండలు, గుట్టలు అన్నీ సర్వనాశనం చేసేది ప్రకృతి విలయ తాండవాన్ని నాగరిక జనాభా ఎప్పుడో చవి చూసి ఉండేవాళ్లు. అడవి, కొండ, గుట్ట, చెట్టు, చెమ, పొద, గడ్డి, పురుగు, చీమ, ఈగ, లేడి, మొసలి, పులి, సింహం, ఏనుగు…. ఇవన్నీ ప్రకృతే. వాటి బ్రతుకులను ఆటంకపరిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే అనేక ఉదాహరణలతో తెలియజేసినా మనిషి, ముఖ్యంగా నాగరికుడు కళ్ళు తెరవడం లేదు. స్వయంగా విలయాన్ని ఆహ్వానిస్తున్నాడు.
కృష్ణా నది విషయానికి వస్తే ప్రకాశం బ్యారేజికి ఎగువన కృష్ణా నది – బుడమేరు వాగు సంగమం కెపాసిటీ 12 మీటర్లు. ప్రకాశం బ్యారేజి వద్ద పూర్తి స్థాయి నది లోతు 17.2 మీటర్లు. బ్యారేజి వద్ద నీటి ప్రవాహం దాదాపు బ్యారేజి కింది అంచుని తాకుతూ ప్రవహించిందని పత్రికల ద్వారా తెలుస్తున్నది. కనుక కృష్ణా నీరు పవిత్ర సంగమం వద్ద 12 మీటర్లు దాటిపోయింది. దానితో కృష్ణా నీరు కూడా పవిత్ర సంగమం వద్ద బుడమేరులోకి అనివార్యంగా వెనక్కి తన్ని ప్రవహించింది. ఈ ఎగదన్నడం అన్నది ఆర్ టి.వి తో మాట్లాడిన ఇంజనీర్ ధృవీకరించనప్పటికీ ఇది వాస్తవమే అన్న సంగతి ప్రజలకు తేలికగా అర్ధం అవుతూనే ఉన్నది. అనేక చోట్ల నిపుణులు, పరిశీలకులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా దీనిని గుర్తిస్తున్నారు.
ఇది కాకుండా ఇబ్రాహీం పట్నం వద్ద విజయవాడ ధర్మల్ పవర్ సెంటర్ ఉన్నది. ఈ ఫ్యాక్టరీని చల్లార్చటానికి నిరంతరం నీటిని వినియోగిస్తారు. ఇలా వినియోగించిన నీటిని బైటికి పంపేందుకు మరో కాలవ నిర్మించి దానిని గతంలో బిడిసిలోకి ఆ తర్వాత పోలవరం రైట్ మెయిన్ కెనాల్ లోకి కలిపారు. ఇది విటిపిఎస్ కాలువ. ఈ కాలువ నీరు కూడా బిడిసి లేదా పోలవరం రైట్ కెనాల్ లో కాలుస్తున్న సంగతి గమనంలో ఉంచుకోవాలి.
ఐదు: ప్రభుత్వ నిర్లక్ష్యం
మాధవ్ నాయక్ గారు చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు 31 మధ్యాహ్నం పై అధికారులకి లాకులు తెరవక తప్పని పరిస్ధితి ఏర్పడుతున్నట్లు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం అంటే 2 పి ఎం అనుకుంటే మరుసరి రోజు ఉదయం 7 గంటల వరకు ప్రభుత్వానికి సమయం చిక్కింది. దాదాపు 17 గంటల సమయం వారికి ఉన్నది. ఐడియల్ గా చూసినప్పుడు ఇది తక్కువ సమయమే అయినా జనానికి సమాచారం ఇవ్వగల టెక్నాలజీ (మొబైల్ ఫోన్లు, టి.వి చానెళ్లు, ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ మొ.వి) అందుబాటులో ఉంది గనుక ప్రజలకు హెచ్చరించగల సమయం ఉన్నట్లే భావించాలి. ఇది ఎందుకు జరగలేదు. ఇది ఇప్పటికీ శేష ప్రశ్నే.
ఆరవ కారణం?
ఇది ప్రజల అంచనాలకి అందని, త్వరగా మింగుడు పడని, బహుశా ఇప్పటికైతే అర్ధం చేసుకోలేనిది. అదేమిటి అంటే ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఉన్న అసమాన, ఆధిపత్య వ్యవస్థ. ఈ వ్యవస్థను నడుపుతున్న రాజ్యం (ప్రభుత్వం వరకే పరిమితమై ఈ మాట చెప్పటం లేదు) ప్రజల గురించి నిజాయితీగా ఆలోచించేది కాదు. అది ప్రజల కోసం పని చేసేది కూడా కాదు.
భారత రాజ్యంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యం అమలు చేస్తున్నది ప్రజాస్వామ్యం కాదు, ధనిక స్వామ్యం. భారతీయ భూస్వాములు, పెట్టుబడిదారులతో కలిసి అది అమెరికా, పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులకు మాత్రమే సేవ చేస్తుంది తప్ప ప్రజల బాగోగులు వారికి ఎప్పుడూ సమస్య కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చేందుకు మాత్రమే వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తారు. ఒకసారి అధికారం ఇచ్చాక వారి ప్రాధామ్యాలు సమస్తం ధనికవర్గాలకు సేవ చేయటమే. పోలీసులు, సైన్యం, కోర్టులు, పంచాయితీలు, మునిసిపాలిటీలు సమస్తం ధనిక పెత్తందార్లకు సేవ చేయటంలోనే నిమగ్నం అయి ఉంటాయి.
అందుకే సామాన్యుల ఫిర్యాదులను పోలీసులు తీసుకోరు. అడవిలో గిరిజనుల పైనా ఈశాన్య భారత్ లో ఆదిమ తెగల పైనే సైన్యం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం సహాయంతో, ఉపా లాంటి నల్ల చట్టాల సహాయంతో అణచివేత అమలు చేస్తుంది. గిరిజనులు, భూమి లేని పేదలు లక్షలాదిగా ష్యూరిటీ ఇచ్చే తాహతు లేక జైళ్ళలో జీవితాలు ముగించేస్తూ ఉంటారు. బడా ధనిక వర్గాల కేసులను వినేందుకు రాత్రికి రాత్రే తలుపులు తెరిచే కోర్టులు పేదల కేసుల్ని సంవత్సరాల తరబడి వాయిదా వేస్తూనే ఉంటాయి. వందేళ్ల నుంచి అనుభవిస్తున్న భూమి పైన పట్టా కోసం రెవిన్యూ ఆఫీసుల గడప తొక్కితే మెడపట్టి బైటికి గెంటేస్తారు.
విజయవాడలో ఇళ్ళు మునిగిపోయిన ప్రజలకు, బుడమేరు ఒడ్డున ఒక సెంటు ఆక్రమించి నీడ కల్పించుకున్న వర్కర్ కీ, కృష్ణా కాలువల ఒడ్డున గుడిసె వేసుకుని కాలం వెళ్ళబుచ్చే మునిసిపల్ స్వీపర్ కీ, యేటా పన్ను కడుతూ లంచం ఇచ్చి ఇంటి పట్టా పొందిన అజిత్ సింగ్ నగర్ మధ్యతరగతి ఉద్యోగికీ… అందరికీ ఈ ఎగుడు దిగుడుల సమాజమే అసలు సమస్య. ఈ సమస్య పరిష్కారం ఒకరోజులో సాధ్యం అయ్యేది కాదు. విజయవాడ మునకకు శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూనే ఎగుడు దిగుడుల సమాజాన్ని మొదలంటా తవ్వి, దమ్ము చేసి, సరికొత్త సామాజిక పంటను పండించే కర్తవ్యాన్ని ప్రజలు నిర్వర్తిస్తే తప్ప వారి సమస్త సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదు.
చాలా బాగా రాశారు. సమగ్రంగా, సవివరంగా, విశ్లేషణాత్మకంగా వుంది. Congratulations.
మీ విషయాసక్తికి ధన్యవాదాలండీ. మాతృకలో మీ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. మీ ప్రత్యేక శైలి చదువరులకు ఆసక్తిగా ఉంటుంది.