
Venezuelan Aircraft Seized and Stationed in Florida
అమెరికా బలహీన పడే కొద్దీ దాని చర్యలు పామరులకు కూడా అర్ధం అయేంతగా హద్దు మీరుతున్నాయి. అంతర్జాతీయ సూత్రాల ఆధారిత వ్యవస్థ (International Rules Based Order) అంటూ పదే పదే సొల్లు కబుర్లు చెబుతూనే ఏ సూత్రానికీ, నిబంధనకూ తన దుష్ట ప్రవర్తన కట్టుబడి ఉండదని చాటి చెబుతున్నది. తాజాగా వెనిజులా దేశాధ్యక్షుడి విమానాన్ని సీజ్ చేయటమే కాకుండా “ఆకుకు అందని పోకకు పొందని” కబుర్లతో తన అమర్యాదకర (చాలా చిన్న పదం) ప్రవర్తనను సమర్ధించుకుంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో జులై 28 తేదీన జరిగిన ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. అమెరికా చమురు కంపెనీలకు వెనిజులా చమురు వెలితీతకు అవకాశం ఇవ్వనందుకు ఆ దేశం పైన రెండు దశాబ్దాలుగా కక్ష కట్టిన అమెరికా, మదురో మరోసారి అధ్యక్షుడుగా ఎన్నికవ్వటం జీర్ణించుకోలేక పోతున్నది. “అవినీతి పద్ధతుల్లో ఎన్నికయిన మదురో ఎన్నిక చెల్లదు” అంటూ ఏక పక్షంగా ప్రకటించేసింది. ఎన్నికల రికార్డులు తనకు అప్పజెప్పాలని డిమాండ్ చేసింది. ఎన్నికల రికార్డులు అప్పగిస్తే మదురో ఎన్నిక చెల్లుతుందో లేదో తేల్చి చెబుతామని అమెరికా అధికారులు వెర్రి మొర్రి ప్రకటనలు జారీ చేస్తున్నారు.
వెనిజులా ఒక స్వతంత్ర దేశమనీ, ఐరాస చట్టాల ప్రకారం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చే అధికారం, అవకాశం తనకు ఏ విధంగానూ లేదన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆ దేశంలో వేలు పెట్టే అవకాశం ఇవ్వనందుకు అధ్యక్షుడు మదురో పైన నేరారోపణలు చేస్తున్నది.
ఫ్లోరిడా లోని విమాన తయారీ కంపెనీ నుండి వెనిజులా ప్రభుత్వం దస్సాల్ట్ ఫాల్కన్ 900EX విమానాన్ని 13 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఏప్రిల్ 2023 లో కొనుగోలు చేసి కరీబియన్ దేశాల ద్వారా తమ దేశానికి తీసుకెళ్లింది. అప్పటి నుండి విదేశీ ప్రయాణాలకు ఆ విమానాన్ని వెనిజులా అధ్యక్షుడు వినియోగిస్తున్నాడు. ఇటీవల మెయింటెనెన్స్ నిమిత్తం విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్ దేశానికి పంపారు.
ఇదే అవకాశంగా తలచిన అమెరికా, విమానాన్ని తమ దేశంలోనే కదల్చకుండా ఉంచాలని (immobilize) డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పేరుకి “కోరాము” అంటారు గానీ అది అమెరికా నుండి వచ్చిన కోరిక కనుక ఆటోమేటిక్ గా “ఆదేశం” గా స్వీకరించాలి. లేకుంటే అమెరికా సాధింపులకు తట్టుకోగల శక్తి డొమినికన్ రిపబ్లిక్ లాంటి చిన్న దేశానికి ఉండదు. అమెరికా ఆదేశాల మేరకు విమానాన్ని అమెరికాకు అప్పజెప్పటం, సెప్టెంబర్ 2 తేదీన ఫ్లోరిడా తరలించుకెళ్లడం జరిగిపోయింది.
నికోలస్ మదురో వెనిజులా దేశానికి రాజ్యాధినేత (Head of the State). వెనిజులా ప్రజలకు ప్రత్యక్ష ప్రతినిధి. ఒక దేశ రాజ్యాధినేత తన విధి నిర్వహణలో భాగంగా ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాల కోసం, భద్రతా సంబంధాల కోసం, ప్రపంచ స్థాయి రాజకీయ సంబంధాల కోసం వినియోగించేందుకు అమెరికాకు చెందిన ఒక కంపెనీ నుండి జెట్ విమానాన్ని కొనుగోలు చేసి వినియోగిస్తున్నాడు. ఆ విమానం నికోలస్ మదురో స్వంత ఆస్తి కాదు. వెనిజులా దేశ ప్రజల ఆస్తి. వెనిజులా దేశ సార్వభౌమాధికారం లో భాగంగా విమానం పైన వెనిజులా ప్రజల అధికారం ఉంటుంది. వెనిజులా ప్రజల అధికారాన్ని ఉల్లంఘించి అమెరికా వారి సొంత విమానాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనాన్ని సమర్ధించే ఏ చట్టమూ ఈ భూ ప్రపంచం పైన లేదు.
విమానం సీజ్ చేయటాన్ని సమర్ధిస్తూ అమెరికా అధికారులు సిఎన్ఎన్ వార్తా సంస్థతో ఏమని కూశారో చూడండి! “ఈ చర్య మొత్తంగా పై స్థాయి వరకూ ఒక సందేశాన్ని పంపుతుంది. నేరపూరిత చర్యల విషయంలో ఒక దేశ రాజ్యాధినేత విమానాన్ని స్వాధీనం చేసుకోవటం అన్నది ఇంతవరకు ఎవరూ విని ఉండరు. ఎవరూ చట్టానికి అతీతులు కాదని ఈ చర్య స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది. అమెరికా ఆంక్షలకు ఏ ఒక్కరూ అతీతులు కాదు మరి!” అని అమెరికాకు చెందిన అనాగరిక అధికారులు వాకృచ్చారు.
వెనిజులా దేశం పైన అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించి అమెరికా కంపెనీ తయారు చేసిన విమానాన్ని అక్రమంగా కొనుగోలు చేశారని అందుకే విమానాన్ని స్వాధీనం చేసుకున్నామనీ ఆ మందమతి అధికారులు చెబుతున్నారు. వారికి తగ్గట్టు డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు లూయిస్ అబినాదర్ కూడా “విమానం వెనిజులా ప్రభుత్వం పేరుతో రిజిస్టర్ కాలేదు. ఒక ప్రైవేటు వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయి ఉంది” అని చెబుతున్నాడు. అయితే మాత్రం ఏమిటిట? మెయింటెనెన్స్ కోసం వాళ్ళకు ఎవరు ఇచ్చారో వారికే విమానాన్ని తిరిగి ఇచ్చెయ్యాలి. దానికి బదులు ఒక రౌడీ వెధవ వచ్చి దబాయిస్తే ఒకరి సొమ్ము మరొకరికి ఇచ్చేస్తారా? ఇలాంటి వాణిజ్య సూత్రం ఎక్కడైనా ఉంటుందా? ఆ చెప్పే కారణం ఏదో కాస్త నమ్మబుద్ది అయే విధంగా అయినా చెప్పాలి కదా? పోనీ అమెరికా ఆంక్షలని ఉల్లంఘించే దమ్ము మాకు లేదు అనైనా ఒప్పుకుని ఉండాల్సింది.
మరో ప్రైవేటు వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయితే గనక అసలు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించింది వెనిజులా అధ్యక్షుడి పైనే తప్ప ఆ ప్రైవేటు వ్యక్తి పైన కాదు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే అమెరికా విమానాలు కొనుక్కోవచ్చు. అదేమీ చట్ట విరుద్ధం కాదు. డబ్బున్న వాడు విమానం కొనుక్కున్నాడు. వాడి నుండి వెనిజులా మారు బేరానికి కొనుక్కుంది. ఇందులో అమెరికా ఆంక్షలు ఉల్లంఘించింది ఎక్కడ? అసలు అమెరికా, ఐరోపా దేశాలు విధించే ఆంక్షలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెల్లవు. ఐరాస అలాంటి ఆంక్షలను గుర్తించదు. కాబట్టి అమెరికా ప్రకటించిన ఆంక్షలే అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అవుతాయి తప్ప విమానం కొనుగోలు చట్ట విరుద్ధం కానే కాదు.

Venezuela President Nicolas Maduro
వెనిజులా అధ్యక్షుడి పైన అమెరికా ఇంకా అదనంగా చేస్తున్న ఆరోపణలు చదివిన ఎవరికైనా ఆ దేశం పైన అసహ్యం పుట్టకపోతే ఆశ్చర్యమే. విమానాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు ఇస్తూ డొమినికన్ రిపబ్లిక్ కి అమెరికా “చట్ట విరుద్ధ కార్యకలాపాల నిమిత్తం స్మగుల్డ్ సరుకుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ లాంటి మోసపూరిత చర్యలకు సంబంధం ఉన్న సాక్షాలు, వస్తువులు కోసం విమానాన్ని తనిఖీ చేయవలసి ఉన్నది” అని వర్తమానం పంపింది. ఆ తనిఖీ ఏదో డొమినికన్ రిపబ్లికన్ లోనే చెయ్యొచ్చు. ఫ్లోరిడా కి విమానాన్ని తీసుకెళ్ళాక విమానంలో అవి దొరికాయి, ఇవి దొరికాయి అంటూ అబద్ధాలు చెప్పేందుకు అమెరికా ఎంతమాత్రం వెనకాడదు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అమెరికాను మాదక ద్రవ్యాలతో ముంచెత్తడం, మనీ లాండరింగ్ లాంటి బూటకపు నేరాలు మోపి, బూటకపు విచారణలు జరిపి అమెరికా, తన మాట వినని లాటిన్ అమెరికా దేశాల నేతలను నిర్బంధించడం, అమెరికా లోని జైళ్ళలో కుక్కడం ఇప్పటికీ అనేకసార్లు అమెరికా చేసింది.
గ్రెనడా దేశ అధ్యక్షుడి భవనం పైన నేరుగా బాంబు దాడి చేసింది. పనామా అధ్యక్షుడు నోరీగాను అమెరికా జైలులో నిర్బంధించింది. నికరాగువా పైన దాడి చేసి ఆ దేశ ప్రజలను ఎన్ని హింసలు పెట్టాలో అన్నీ పెట్టింది. చిలీ అధ్యక్షుడు అలెండిని చంపి నియంత పినోచెట్ కి అధికారం అప్పగించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా, అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్, పాలస్తీనా పోరాట సంస్థ ఫతా నేత యాసర్ అరాఫత్ లపై పోలోనియం విష ప్రయోగం జరిపి క్యాన్సర్ జబ్బుకి గురి చేయడమో, చంపడమో చేసింది. కొలంబియా, మెక్సికో లను అమెరికా మాఫియాల కోసం గంజాయి సాగు చేసే దేశంగా మార్చింది. ఆఫ్ఘనిస్తాన్ ను దురాక్రమించి అక్కడా గంజాయి సాగు చేయించి బిలియన్ల డాలర్లు పోగేసుకుంది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరాలను లాటిన్ అమెరికా దేశాల నేతలపై అమెరికా మోపుతుంది కానీ, అసలు మాదక ద్రవ్యాలను లాటిన్ అమెరికా దేశాలలో మాఫియాలు తయారు చేసేదే అమెరికన్ మాఫియా కోసం. అమెరికాతో సహా ప్రపంచ మాదక ద్రవ్య రవాణా, వినియోగం మొత్తం సిఐఏ కనుసన్నల్లో నడుస్తుంది. సిఐఏ అనుమతి లేకుండా ఏ దేశం లోనూ మాఫియాలు డ్రగ్స్ ఉత్పత్తి, రవాణాలు చేయలేవు.
ఏ మాఫియా నేత అయినా సిఐఏ తో నిమిత్తం లేకుండా సొంత మాఫియా సామ్రాజ్యం నిర్మించుకున్నా, నిర్మించుకోవాలని ప్రయత్నించినా వాళ్ళను అంతం చేసేదాకా అమెరికా, సిఐఏ నిద్రపోవు. అమెరికా వాల్ స్ట్రీట్ లోని అనేక ద్రవ్య సంస్థలు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు వివిధ దేశాల్లోని మాఫియాల ఆదాయం పైన ఆధారపడి నడుస్తున్నాయని, ఆ ఆదాయం లేకపోతే చాలా బ్యాంకులు, ద్రవ్య సంస్థలు మూత పడతాయని తెలిస్తే ఎవరైనా షాక్ తినక తప్పదు. కానీ అది నిజం.
అందాకా ఎందుకు? వెనిజులా మాజీ అధ్యక్షుడు, అక్కడి ప్రజలు దేవుడిలా భావించే హ్యూగో చావేజ్ పైన కూడా అమెరికా పోలోనియం విష ప్రయోగం జరిపి క్యాన్సర్ సోకేలా చేసింది. ఛావేజ్ కు సోకిన క్యాన్సర్ కు క్యూబా డాక్టర్లు ఓసారి వైద్యం చేసి ఆయన జీవితాన్ని పొడిగించారు. కానీ క్యాన్సర్ మళ్ళీ తలెత్తడంతో ఛావేజ్ చనిపోయాడు. తన చావు తప్పదని తెలిసిన ఛావేజ్ నికోలస్ మదురోను తన వారసుడుగా ప్రకటించాడు. అందుకే వెనిజులా ప్రజలు మళ్ళీ మళ్ళీ మదురోకు పట్టం కడుతున్నారు.
1998లో మొదటి సారి అధ్యక్ష పదవి చేపట్టిన హ్యూగో ఛావెజ్ సూపర్ ధనికులకు అనుకూలంగా ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి బొలివారన్ రివొల్యూషన్ సూత్రాల పేరుతో చమురు ఆదాయంలో మెరుగైన భాగం ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టే విధంగా కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టాడు. క్రమంగా ఛావేజ్ విధానాలు అమెరికాకు సేవ చేసే సూపర్ ధనిక వర్గాలకు వ్యాపార అవకాశాలు లేకుండా చేయటం, అమెరికా చమురు కంపెనీలకు అత్యధిక ఆదాయం కట్టబెట్టే కాంట్రాక్టులు రద్దు చేయడంతో అమెరికా, ఏప్రిల్ 11 2002 తేదీన మిలటరీ కుట్ర జరిపించి ఛావెజ్ ను అరెస్ట్ చేయించింది.
కానీ వెనిజులా ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడంతో, అమెరికా అండతో అధ్యక్షుడుగా ప్రకటించుకున్న పెడ్రో కార్మోనా రాజీనామా చేసి ఛావేజ్ ను విడుదల చేయాల్సి వచ్చింది. కుట్ర జరిగిన మూడు రోజులకే ఏప్రిల్ 14, 2002 తేదీన ఛావెజ్ తిరిగి అధ్యక్షుడిగా ప్రజలే నిలబెట్టుకున్నారు. ఆ విధంగా వెనిజులా ప్రజలే అమెరికా దిమ్మ తిరిగేలా చావు దెబ్బ కొట్టారు. దానితో అమెరికా తెరచాటు కుట్రలు చేసి ఛావేజ్ సన్నిహితులను చేరదీసి తన కుట్ర విఫలమైన 13 యేళ్ళ తర్వాత ఆయనను క్యాన్సర్ తో చంపించింది. “అమెరికా వద్ద టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ సాయంతో ఎప్పుడైనా నిన్ను చంపే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు” అని క్యూబా దివంగత నేత ఫెడల్ కాస్ట్రో, హ్యూగో ఛావేజ్ కు చేసిన హెచ్చరిక ఆ విధంగా నిజం అయింది. హ్యూగో ఛావెజ్ చనిపోయిన రోజున ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రగతి కాముకులు మౌనంగానే అయినా దుఃఖ సముద్రంలో మునిగారంటే అతిశయోక్తి కాదు.
ఇన్ని జరిగినప్పటికీ అమెరికాకు సిగ్గు రాలేదు సరికదా తన కుట్రలను మరింత ముమ్మరం చేసింది. మదురో ఎన్నికైన ప్రతిసారీ ఎన్నికల్లో అవినీతి జరిగిందనీ, రిగ్గింగ్ జరిగిందనీ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ వచ్చింది. నిజానికి వెనిజులా ఎన్నికలను అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు చెందిన ఎన్.జి.ఓ సంస్థ స్వయంగా సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసింది. ఎన్నికల అనంతరం “ప్రపంచంలో వెనిజులా దేశంలో జరుగుతున్నంత కట్టుదిట్టంగా, అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు మరే ఇతర దేశం లోనూ జరగడం లేదు” అని తిరుగు లేని విధంగా ప్రకటించాడు. ఆ విధంగా అమెరికా ఎన్నికలు సైతం వెనిజులా ఎన్నికలతో పోల్చితే దిగదుడుపే అని చెప్పకనే చెప్పాడు. 2004 అధ్యక్ష ఎన్నికల్లో జార్జి బుష్ జూనియర్ అధ్యక్ష ఎన్నిక ఎంత వివాదాస్పదంగా జరిగిందో ప్రపంచానికి తెలుసు. ఓడిపోవాల్సిన జార్జి బుష్, నెల రోజుల పాటు ఒక రాష్ట్రంలో ఎన్నిక ఫలితాలను ప్రకటించకుండా నిలిపివేయించి, ఫలితాలను తారుమారు చేసి చివరకు విజయుడుగా ప్రకటింపజేసుకున్న హీన ఎన్నికల చరిత్ర అమెరికాకి సొంతం.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవకుండా చేసేందుకు అమెరికన్ డీప్ స్టేట్ ఎన్నెన్ని కుట్రలు సాగిస్తున్నదో పూర్తి వివరాలు ఎప్పటికైనా బైట పడక మానవు. ఇప్పటికే ట్రంప్ పై ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది. అనేక కేసులను ఆయనపై మోపినప్పటికీ అవేవీ రుజువు కావటం లేదు. రాబర్ట్ కెన్నడీ, ట్రంప్ కి అనుకూలంగా ఇండిపెండెంట్ అభ్యర్దిత్వాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ ఆయన పేరు బ్యాలట్ పేపర్ల నుండి తొలగించేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. తద్వారా కెన్నడీ ఓట్లు ట్రంప్ కు బదలాయింపు జరగకుండా నిరోధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని చేసినా ట్రంప్ విజయాన్ని ఆపలేమేమో అని డెమోక్రటిక్ పార్టీ, దాని వెనుక ఉన్న ముఠా భయపడుతూనే ఉన్నారు.
ఇలాంటి అమెరికా వెనిజులా ఎన్నికల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేయటమే ఒక పెద్ద జోక్! తగుదునమ్మా అంటూ ఆ దేశ అధ్యక్షుడి విమానాన్ని స్వాధీనం చేసుకుని న్యాయబద్ధమైన వాణిజ్యం తనకు ఇష్టం లేకపోతే అన్యాయబద్ధమే అవుతుందని చాటుతూ తానే సరికొత్త వాణిజ్య సూత్రాలను రచిస్తోంది. ప్రపంచ పీడిత ప్రజలకు, పీడత జాతులకు, పీడిత దేశాలకు శనిలా తయారైన అమెరికా రాజ్య దాష్టీకాన్ని తుదముట్టించవలసిన బాధ్యత అమెరికా ప్రజలపైనే ఉండగా వాళ్ళు మాత్రం అక్కడి కార్పొరేట్ పత్రికలు రాసిన చెత్తనంతటినీ నిజంగా భ్రమిస్తూ అదో రకం మత్తులో మునిగి పోయి ఉన్నారు. కానయితే ఎప్పటికైనా వాళ్ళు మేలుకోవలసిందే.
ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత స్థిరమైనది “మార్పు” మాత్రమే.