
బంగ్లాదేశ్ లో రాజకీయ మరియు శాంతి భద్రతల పరిస్ధితులు ఇప్పటికీ మెరుగుపడ లేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తూ ప్రధాన పాలనా బాధ్యతలు చూస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. 15 యేళ్ళ పాటు సాగిన షేక్ హసీనా పాలన మిగిల్చిన వైరాలు, వైరుధ్యాలు, పగలు-ప్రతీకారాలు నివురు గప్పిన నిప్పులా తమ ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాయి.
బహుశా అమెరికా, చైనా, ఇండియాల ప్రత్యక్ష మరియు పరోక్ష జోక్యం లేనట్లయితే బంగ్లాదేశ్ లో పరిస్ధితి చక్కబడేందుకు అట్టే సమయం పట్టకపోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఒక వైపు, చైనా, రష్యా తదితర గ్లోబల్ సౌత్ దేశాల శిబిరం మరొక వైపు బంగ్లాదేశ్ లో పరిస్ధితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాగా ప్రాంతీయ స్థాయిలో ఇండియా, పాకిస్తాన్ లు బంగ్లాదేశ్ లో తమ నియంత్రణ కొనసాగించేందుకు ఒకరు, పునఃస్థాపించేందుకు మరొకరు కృషి చేస్తున్నాయి.
ఇక బంగ్లాదేశ్ లో అంతర్గత పరిస్ధితి గురించి చెప్పనే అవసరం లేదు. అవామీ లీగ్ పార్టీ నేత షేక్ హసీనా, సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా అధికారం నిర్వహించిన కాలంలో ఇండియాతో బలమైన స్నేహ సంబంధాలు కొనసాగించింది. దేశంలో ప్రతిపక్ష పార్టీ బంగ్లా నేషనల్ పార్టీ పైన తీవ్ర నిర్బంధం అమలు చేసింది. ఆ పార్టీ నేత ఖలేదా జియాపై అవినీతి కేసులు మోపి జైలు పాలు చేసింది.
మరో ప్రతిపక్ష పార్టీ, ఇస్లామిక్ తీవ్రవాద పార్టీగా పేరు పొందిన జమాత్-ఏ-ఇస్లామి పైన నిషేధమే విధించింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతల పైన విముక్తి ఉద్యమ కాలంలో స్వతంత్ర ఉద్యమకారులపై సాగించిన హత్యలు, అత్యాచారాలకు గాను విచారణ జరిపి కొందరిని ఉరి తీసి, మరి కొందరిని యావజ్జీవ జైలు శిక్షకు గురి చేశారు. హసీనా పాలనా కాలంలో అమలు చేసిన చర్యలన్నింటికీ బదులు తీర్చుకునేందుకు బి.ఎన్.పి, జమాత్ పార్టీల ఛోటా నాయకులు, కార్యకర్తలు ఉవ్విళ్లూరుతూ ఉన్నారు.
బంగ్లాదేశ్ లో మరో ప్రభావశీల అధికార కేంద్రంగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఉద్యోగాల కోటా వ్యవస్థ సవరణ కోసం ఉద్యమించి ప్రభుత్వం కూల్చివేతకు ప్రత్యక్ష కారణంగా నిలిచిన విద్యార్ధి ఉద్యమ నాయకులు వెలుగొందుతున్నారు. షేక్ హసీనాకు విధేయుడుగా అనుమానిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఒబైదుల్ హసన్ పైన తీవ్ర ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారు. హసీనా విధేయులతో నిండి ఉందని ఆరోపిస్తూ, న్యాయ వ్యవస్థను కింది నుండి పై వరకూ పూర్తిగా సంస్కరించాలని విద్యార్ధి ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ లో మరో అధికార కేంద్రం ఆ దేశ మిలటరీ. షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం మిలటరీ ఆమెకు మద్దతు ఇచ్చింది. కానీ అమెరికా ఒత్తిడి పై చేయిగా మారుతోందని గ్రహించిన మిలటరీ అధికారులు విద్యార్ధి ఉద్యమ సందర్భంగా తమ విధేయతను వెంటనే హసీనా నుండి విద్యార్ధుల వైపుకి మళ్లించారు. విద్యార్ధులపై నిర్బంధ చర్యలు చేపట్టాలన్న హసీనా ఆదేశాలను తిరస్కరించారు. పైకి విద్యార్ధుల పక్షం ఉన్నట్లు చెబుతున్నప్పటికీ బంగ్లా మిలటరీ వాస్తవానికి అమెరికా అనుకూల శక్తుల పక్షం (చైనా వ్యతిరేక పక్షం) లో చేరినట్లు అర్ధం చేసుకోవచ్చు.
హసీనా ఇండియాకు అనుకూలంగా వ్యవహరించిన నేపధ్యంలో బంగ్లా నేషనల్ పార్టీ ఇండియాకు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నది. హసీనాను వెంటనే బంగ్లాదేశ్ కు పంపించాలని, ఆమెపై అనేక కేసులు నమోదై ఉన్నందున ఇరు దేశాల మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని గౌరవించాలని కోరుతోంది. ఇరు దేశాల సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు షేక్ హసీనాను ఇండియా అప్పగించే అవకాశం లేకపోలేదు. అందుకే ఆమె మరో దేశంలో రాజకీయ శరణు కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
మరో వైపు బి.ఎన్.పి, జమాత్ సంస్థల కార్యకర్తలు హిందూ దేవాలయాలపై దాడులు చేయటం ద్వారా ఇండియాపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. నరేంద్ర మోడి నేతృత్వం లోని భారతదేశ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా సిఏఏ లాంటి చట్టాలు చేయటం, ఇండియన్ ముస్లింలపై దాడులు జరుగుతున్నప్పటికీ తగిన నివారణ చర్యలు తీసుకోకపోవటం కూడా బి.ఎన్.పి, జమాత్ సంస్థల కార్యకర్తలపై ప్రభావం చూపుతోంది.
అయితే ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ హిందువులపై దాడులను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేయటం గమనార్హం. మతంతో, రాజకీయ పార్టీల విధేయతతో నిమిత్తం లేకుండా బంగ్లాదేశ్ పౌరులందరూ సమానమన్న సంగతి గుర్తించాలని ఆయన ఇప్పటికే పలుమార్లు విద్యార్ధి నాయకులకు, ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశాడు.
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలాంగిర్, ఇటీవల ది హిందూ పత్రికతో మాట్లాడుతూ హసీనాను తమ దేశానికి అప్పజెప్పాలని కోరాడు. “మేము ఇండియాతో సంబంధాలను అత్యంత వేగంగా పునఃప్రారంభించాలని భావిస్తున్నాం. ఇండియాతో మేము ఎల్లప్పుడూ స్నేహ సంబంధాలనే కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఇండియా నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష సమాచారం, ప్రత్యక్ష సంభాషణ అందలేదు” అని విమర్శించాడు.
ఇది బిజెపి మార్కు, ఇంకా చెప్పాలంటే మోడి మార్కు రాజకీయాల ఫలితం అని భావించవచ్చు. ప్రతీకార రాజకీయాలకు మోడి ప్రభుత్వం పాల్పడే సంగతి సిబిఐ, ఇడి, ఇంకమ్ టాక్స్ సంస్థలను కేంద్రం ఉసిగొల్పడమే అందుకు తార్కాణం. అదే కాంగ్రెస్ పాలకులైతే ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడి, వాణిజ్య స్నేహ సంబంధాలకు ఆటంకం కలగకుండా చూడటంలో వేగంగా ప్రయత్నాలు చేసి ఉండేవారు.
కానీ మోడి ప్రభుత్వం రాజకీయ విధానమే మతంపై ఆధారపడి ఉన్నందున, అటువంటి విధానం ప్రభావం విదేశీ సంబంధాలపై అనివార్యంగా ఉంటుంది. బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశం కావటం, ప్రతిపక్ష బి.ఎన్.పి, ముస్లిం సంస్థ జమాత్-ఏ-ఇస్లామి సంస్థతో ఎన్నికల ఒప్పందంలో ఉండడం, జమాత్-బి.ఎన్.పి పార్టీల కార్యకర్తలు హిందువులు, వారి దేవాలయాలపై దాడులు చేయటం… ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం, బంగ్లాదేశ్ సంబంధాలలో చొరవ చూపేందుకు ఆటంకంగా పని చేస్తుండవచ్చు.
అలా పని చేస్తున్నట్లయితే విదేశీ విధానాలకు సంబంధించి రాజనీతిలో మోడి ప్రభుత్వం వెనుకబడి ఉన్నట్లే లెక్క. గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో ముస్లిం ప్రజలపై జరిగిన హత్యాకాండ దరిమిలా గుజరాత్ సందర్శించిన అప్పటి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేజీ, “ముఖ్యమంత్రి నరేంద్ర మోడి రాజధర్మం పాటించలేదు” అని విమర్శించటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ముఖ్య మంత్రి పదవి నుండి నరేంద్ర మోడిని తప్పించాలని వాజ్ పేయి ప్రయత్నించడం, ఆ ప్రయత్నానికి లాల్ కృష్ణ అద్వానీ అడ్డు పడటం, చివరికి ప్రధాన మంత్రి పదవిని అద్వానిని వరించకుండా నరేంద్ర మోడియే అడ్డు పడటం… అంతా గతం!

Janmashtami in Dhaka
ఇటీవల శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా బంగ్లాదేశ్ హిందువులు పండుగ జరుపుకునేందుకు మహమ్మద్ యూనస్ గట్టి ప్రయత్నాలు చేసి వివిధ పక్షాలు సహకరించేలా చూశాడని పత్రికల ద్వారా తెలుస్తున్నది. ఆగస్టు 26 తేదీన పండగ సందర్భంగా హిందువులు ఢాకా, ఇతర నగరాల్లో భారీ ఊరేగింపులు నిర్వహించారు. అనేక చోట్ల దేవాలయాల్లో వేల మంది కీర్తనలు, గీతా యజ్ఞాలలో పాల్గొన్నారు (ది హిందూ, ఆగస్టు 26,2024). ఢాకా లోని ఢాకేశ్వరి ఆలయం, చిట్టగాంగ్, రంగ్ పూర్ తదితర చోట్ల ఆటంకాలు లేకుండా పండగ జరుపుకున్నారని తెలుస్తున్నది. అయితే తూర్పు బంగ్లాదేశ్ లో వరదలు రావటంతో అక్కడ పండగ ప్రభావం కనిపించలేదు.
భారత పత్రికలు చెబుతున్నంత స్థాయిలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగడం లేదని, భారత పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తున్నాయని, బంగ్లాదేశ్ లోని సివిల్ సొసైటీ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి వార్తల వలన బంగ్లాదేశ్ లో మైనారిటీలు మరింత ద్వేష భావాలకు గురయ్యే ప్రమాదం ఉందని అవి హెచ్చరిస్తున్నాయి.
బంగ్లాదేశ్ లో రాజకీయ ప్రతిష్టంభన, శాంతి భద్రతల పరిస్ధితి ఇలా ఉండగానే ఆ దేశంలో నారాయణ్ గంజ్ ఏరియాలోని అతి పెద్ద టైర్ల ఫ్యాక్టరీ ఆగస్టు 28 తేదీన అగ్ని ప్రమాదానికి గురైంది. శక్తివంతమైన గాజీ గ్రూపు కంపెనీలకు చెందిన ఈ ఫ్యాక్టరీ ప్రమాదం వెనుక విద్రోహ శక్తుల హస్తం ఉన్నదేమోనని అనుమానిస్తున్నారు.
కాగా హసీనా ప్రభుత్వం అన్సార్ పేరుతో ఏర్పాటు చేసిన పారామిలటరీ ఉద్యోగులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. 6 మిలియన్ల మందిని అన్సార్ ఉద్యోగులుగా హసీనా ప్రభుత్వం నియమించింది. విద్యార్ధి ఆందోళనకారులు అన్సార్ ల ఆందోళనను తమకు వ్యతిరేకంగా జరుగుతోందని భావిస్తూ వారితో ఘర్షణ పడటంతో పరిస్ధితి మరోసారి వేడెక్కింది. విద్యార్ధి ఉద్యమ నేతలు పత్రికల సమావేశం జరిపి అన్సార్ ఉద్యోగులు హసీనా ప్రభుత్వ మద్దతుదారులనీ, వారిని భారత అధికారులు, హసీనా రెచ్చగొట్టి నిరసన చేపిస్తున్నారని ఆరోపించారు.
వైరి వర్గాల ఆందోళనలను అరికట్టగల శక్తి మహమ్మద్ యూనస్ కు లేదు. ఆయన చేయగలిగింది ఆందోళనకారులకు విజ్ఞప్తులు చేయటమే. ఎవరూ నిరసనలకు పాల్పడవద్దని, వారి వారి కోరికలు, డిమాండ్లు రాత పూర్వకంగా తెలియజేస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన ప్రజలను కోరుతున్నాడు.
విద్యార్ధి ఉద్యమకారుల ఆరోపణ నిజమే అయితే బంగ్లాదేశ్ లో పరిస్ధితిని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు ఇండియా, షేక్ హసీనాలు కృషి చేస్తున్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు అలాంటి ప్రయత్నాలు చేయకపోతేనే ఆశ్చర్య పడాలి కూడా.
ప్రపంచంలో నెలకొన్న ఏక ధృవ – బహుళ ధృవ ప్రపంచాల స్థాపనలో తలెత్తిన వైరుధ్యాలు, దక్షిణాసియా ప్రాంతంలో ఆధిపత్యం కోసం ముఖ్యంగా బంగ్లాదేశ్ లో పెత్తనం కోసం ఇండియా – పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న వైరుధ్యాలు… ఇవి బంగ్లాదేశ్ లో పరిస్ధితి సద్దుమణిగేందుకు ఏ మాత్రం సహకరించకపోగా మరింత వేడెక్కిస్తాయి. అమెరికా కుట్రలకు అంతూ పొంతు అనేది ఉండదు. వారికి అనుబంధంగా ఇండియా – పాకిస్తాన్ ల వైరానికి ముగింపు అనేది ఉండదు. బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు ఉన్న పార్టీల స్థానంలో తామే ఒక సరికొత్త విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా మారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటమే మిగిలి ఉన్న పరిష్కారం.