ఈ వరుస హత్యా ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు?


గత కొద్ది నెలల కాలంలో వివిధ దేశాల పాలకులను హత్య చేసేందుకు వరుసగా ప్రయత్నాలు జరిగాయి. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాడు అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తో సహా, రష్యా అధ్యక్షుడు పుటిన్, స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వెనిజులా అధ్యక్షుడు రాబర్ట్ మదురో, హమాస్ పోలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హానియే, హిజ్బొల్లా కమాండర్ ఖలీల్ ఆల్-మగ్దా… ఇలా వరస బెట్టి హత్యా ప్రయత్నాలు జరిగాయి.

వీళ్ళలో ట్రంప్ కొద్ది పాటి గాయంతో బైట పడగా, ఫికో తీవ్రంగా గాయపడి మృత్యు ముఖ ద్వారం వరకూ వెళ్ళి ప్రాణాలతో బైట పడ్డాడు. రాబర్ట్ మదురోపై జరిగిన హత్యా ప్రయత్నాలకు లెక్కే లేదు. ఆయనకు ముందు వెనిజులా అధ్యక్షుడుగా పని చేసిన హ్యుగో ఛావెజ్ సిఐఏ చేతుల్లో పోలోనియం రేడియో యాక్టివ్ విష ప్రయోగానికి గురై క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. ఇస్మాయిల్ హనియే ఇరాన్ లో హత్యకు గురి కాగా, ఖలీల్ ఆల్-మక్దా లెబనాన్ లో హత్య చేయబడ్డాడు.

ఇలా వరుస హత్యా ప్రయత్నాలకు గురైన వివిధ దేశాల పాలకుల మధ్య (హమాస్, హిజ్బొల్లా నాయకులను మినహాయించి) ఒక కామన్ లక్షణం ఉన్నది. అదేమిటంటే వాళ్ళంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కి మద్దతు ఇవ్వలేదు. ఉక్రెయిన్ కి ఆయుధాల సాయం చేసేందుకు నిరాకరించారు. డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ ని తీవ్రంగా విమర్శించడమే కాకుండా తాను అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గితే ఉక్రెయిన్ కి ఆయుధ సరఫరా నిలిపేసి రష్యా-ఉక్రెయిన్ ల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించాడు. రాబర్ట్ ఫికో అక్టోబర్ 2023 ఎన్నికల్లో ప్రధాన మంత్రిగా గెలిచి అధికారం లోకి రావడం తోనే ఉక్రెయిన్ కి ఆయుధాలు పంపడం ఆపేశాడు. అమెరికా, ఐరోపా చేతుల్లో ఉన్న మీడియాపై కఠిన ఆంక్షలు అమలు చేశాడు.

ఉక్రెయిన్ కి ఆయుధ, నిధుల సహాయం చేసేందుకు నిరాకరించడం అంటే అమెరికా మాట వినేందుకు నిరాకరించడమే. ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ లపై యుద్ధానికి బయలుదేరే ముందు సీనియర్ బుష్ (1991 గల్ఫ్ యుద్ధం), జూనియర్ బుష్ (2001లో ఆఫ్ఘనిస్థాన్ పైనా, 2003లో ఇరాక్ పైనా) లు ప్రపంచ దేశాలకు ఒక ఆజ్ఞ జారీ చేశారు. “మాకు మద్దతు ఇవ్వలేదు అంటే, మా శత్రువుకు మద్దతు ఇస్తున్నట్లే” అని. అంటే అమెరికా నిర్వహించే డిక్షనరీలో ఒక యుద్ధంలో ఇరు పక్షాలకు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండడం (న్యూట్రాలిటీ) అన్న కాన్సెప్టే లేదు. అదేదో సినిమాలో “నాకు దక్కని పిల్ల ఇంకెవరికీ దక్కటానికి వీల్లేదు” అని హీరో కమ్ విలన్ డైలాగ్ ని ఈ సందర్భంగా గుర్తొస్తే తప్పు లేదు.

ఎందుకీ హత్యలు, హత్యా యత్నాలు?

పైన చెప్పుకున్న హత్యలు, హత్యా ప్రయత్నాలు అన్నింటి వెనకా అమెరికా హస్తం ఉందన్న సంగతి ఇప్పటికే పాఠకులకు అర్ధమై ఉండాలి. అయితే ఎందుకీ హత్యలు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నట్లు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకునే ముందు ఇప్పుడు ప్రపంచంలో నెలకొని ఉన్న పరిస్ధితుల గురించి టూకీగా అన్నా చెప్పుకోవాలి.

2008-09 లో అంతర్జాతీయ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం బద్దలయింది. అతి పెద్ద ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు లేమ్యాన్ బ్రదర్స్ ఇంక్, సెప్టెంబర్ 15, 2008 తేదీన తాను దివాళా తీసినట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో ప్రారంభం అయిన ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కొద్ది రోజుల్లోనే అమెరికా అంతటా విస్తరించి, ఐరోపాకు పాకి, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను కూడా చుట్టుముట్టింది. ప్రపంచ దేశాలన్నీ రిసెషన్ (ఆర్ధిక మాంద్యం) లోకి జారుకున్నాయి. షేర్ మార్కెట్లు పతనం అయ్యాయి. డబ్బు ఎక్కడికక్కడ స్తంభించిపోయి కదలడం మానేసింది. అంటే లిక్విడిటీ దాదాపు సున్నాకు చేరింది. అప్పు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ద్రవ్య-ఆర్ధిక సంక్షోభానికి కొనసాగింపుగా 2009 నుండి పశ్చిమ ఐరోపా దేశాలు ఋణ సంక్షోభంలో కూరుకుపోయాయి. అంటే ఆ దేశాల అప్పు విపరీతంగా పెరిగిపోయి తదుపరి అప్పు ముట్టని పరిస్ధితి ఏర్పడింది.

పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు అందరూ సంక్షోభం ఎందుకు వచ్చిందో అర్ధం కాక, సంక్షోభం నుండి బైటపడే దారి దొరకక ఒకరి జుట్టు మరొకరు పీక్కున్నారు. కొండొకచో తమ జుట్టు తామే పీక్కున్నారు. కొందరైతే సమస్య పరిష్కారం కోసం కారల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ గ్రంధాలను తిరగేయటం మొదలు పెట్టారు. అమెరికా ఆర్ధికవేత్త నొరియెల్ రొబిని అయితే “కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. పెట్టుబడిదారీ వ్యవస్థ తనను తానే నాశనం చేసుకుంటుంది” అని ప్రకటించాడు. 2008లో ప్రపంచ స్థాయి ఆర్ధిక సంక్షోభం రానున్నదని కొద్ది నెలల ముందుగానే నొరియెల్ రొబిని అంచనా వేయటం గమనార్హం. ఈయన అంచనా వేసినట్లుగానే జరగడంతో ఆయనను అప్పటి నుండి ‘డాక్టర్ డూమ్’ అని పిలవటం మొదలు పెట్టారు.

2008-09 ఆర్ధిక సంక్షోభం నుండి రెండే రెండు దేశాలు సాపేక్షికంగా తక్కువ నష్టంతో బైట పడ్డాయి. అవి చైనా, ఇండియా. ఎందుకంటే అప్పటికి చైనా, ఇండియా దేశాల్లో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్లు, ప్రావిడెంట్ ఫండ్లు లాంటి ద్రవ్య సంస్థలు (Financial Institutions) ప్రధానంగా ప్రభుత్వ రంగం లోనే ఉన్నాయి. చైనా ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్య సంస్థలతో పాటు అనేక మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కూడా ఇప్పటికీ ప్రభుత్వరంగం లోనే కొనసాగుతున్నాయి.

ఇండియాలో అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ కంపెనీలను అత్యంత వేగంగా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. పేరుకు అదాని, అంబానీ, టాటా లాంటి స్వదేశీ కంపెనీల పేర్లు ఉన్నప్పటికీ వాస్తవంలో ఈ స్వదేశీ కంపెనీలు విదేశీ బహుళజాతి ద్రవ్య కంపెనీల నుండి అప్పులు తీసుకుని ఆ అప్పును ప్రైవేటీకరిస్తున్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. అంటే ప్రైవేటీకరణ అంటే వాస్తవ అర్ధం భారత ప్రభుత్వ కంపెనీలను విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగించడమే.

Slovakia PM Robert Fico after recovery from assassination attempt

ప్రపంచం మొత్తం, దేశాల ప్రభుత్వాలతో సహా అప్పుల తోనే నడుస్తున్నాయి. అంటే అప్పులు ఇచ్చే కంపెనీలే వివిధ దేశాల విధానాలను శాసించే స్థాయిలో ఉన్నాయి. వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్), ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ), కబుటోచో (జపాన్) లలోని బడా బడా ద్రవ్య కంపెనీలే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. యుద్ధాలు, కలర్ విప్లవాలు, దేశాల పాలకుల హత్యలు, సో-కాల్డ్ ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేతలు, మిలటరీ కుట్రలు… ఇత్యాదివి అన్నీ ఈ ద్రవ్య కంపెనీల ఆదేశానుసారం, వారి ప్రయోజనాల కోసమే జరుగుతాయి. ఈ అంశం గురించి -అరబ్ వసంతం పేరుతో అరబ్ దేశాల్లో (ట్యునీషియా, లిబియా, ఈజిప్టు, బహ్రెయిన్, సిరియా మొ.) జరిగిన విప్లవాలు మరియు కూల్చివేతలు, మాలి-నైజర్-బర్కినాఫాసో దేశాల్లో ప్రభుత్వాల కూల్చివేత, బంగ్లాదేశ్-శ్రీలంక లలో ప్రభుత్వాల కూల్చివేత మరియు కొత్త ప్రభుత్వాల నియామకం)…. ఇలాంటి ఉదాహరణల ద్వారా ఈ బ్లాగ్ లో ఆర్టికల్స్ ద్వారా చర్చించుకున్నాం.

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 1991లో ఈ బ్లాగర్, తన బెటర్ హాఫ్ తో సహా వయోజన విద్య నేర్పే లక్ష్యంతో ఒక సముద్ర తీర గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో పల్లెకారుల వృత్తి సముద్రంలో చేపలు పట్టడం. సముద్రంలోకి వెళ్ళి రోజుల పాటు సముద్రంలోనే గడిపి తమ వలలకు చిక్కిన చేపల్ని ఒడ్డుకు తెస్తారు. ఆ గ్రామంలో ఒక అర డజను మంది పల్లెకారులకు అప్పులు ఇస్తూ అప్పులపై వచ్చే వడ్డీ ఆదాయంతోనే గడుపుతారు. ఆ గ్రామం మొత్తం ఈ అర డజను మంది నియంత్రణలో ఉండడం ఈ బ్లాగర్ గమనించాడు. పల్లెకారుల వేట ముగిసి చేపలు తెచ్చాక వాటన్నింటినీ ఈ రుణదాతలు చెప్పిన రేటుకి మారు మాట్లాడకుండా ఇచ్చేస్తారు. రుణదాతలు చెప్పిందే రేటు. పల్లెకారులు తాము తెచ్చిన చేపల్ని తామే మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకునే అవకాశం ఈ రుణదాతలు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చే అప్పు పైన మిగిలిన కుటుంబాలు అంతలా ఆధారపడి ఉంటాయి.

రుణదాతలు చెప్పిన రేటుకి చేపలు ఇచ్చేస్తే వాళ్ళ రుణంలో కొంత తీరుతుంది. ఇల్లు గడవటానికి మళ్ళీ వాళ్ళ దగ్గరే అప్పు తీసుకుంటారు. ఇంకా ఘోరం ఏమిటంటే ఋణ గ్రహీతల కుటుంబాల ఆడ పిల్లలని రుణదాతలు (మగ వెధవలు) ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇంట్లోకి పిలుస్తారు. (ఎందుకు అన్నది మీరే ఊహించండి.) ఈ బ్లాగర్ అక్కడ ఉండగానే ఋణ దాత ఒకడు ఋణ గ్రహీత ఇంట్లోకి జొరబడి వాళ్ళ అమ్మాయి ఇంటి బైట ఉంటే కేకలు వేసి పిలిపించుకున్నాడు. ఆ అమ్మాయి అన్న, అమ్మ, నాన్న అక్కడే ఉన్నా కిక్కురుమనలేదు. ఎందుకని నేను అడిగినా వాళ్ళు బదులివ్వలేదు. అదంతా మామూలే అన్నట్లుగా అక్కడ వాతావరణం ఉన్నది. రుణం అన్నది దాని సొంతదారునికి ఇచ్చే అధికారం/పెత్తనం/చెల్లుబాటు ఆ స్థాయిలో ఉంటుంది.

ఆఫ్ట్రాల్ ఒక చిన్న పల్లెలో వందలు, వేల రూపాయల రుణాలు, ఋణ దాతలకు ఇంత పెత్తనం ఇస్తుంటే వందల బిలియన్ల డాలర్ల ఫైనాన్సింగ్ చేసే బహుళజాతి కంపెనీలకు మూడో ప్రపంచ దేశాలపై ఎంత పెత్తనం, ఆధిపత్యం, అధికారం వస్తుందో అర్ధం చేసుకోవాలి. కేవలం పెత్తనం చేసే లక్ష్యంతోనే, ఆర్ధిక వ్యవస్థలను నియంత్రించే లక్ష్యంతోనే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డవలప్ మెంట్ బ్యాంక్ లాంటి సంస్థలను ఉపయోగించుకుని రుణాలు మంజూరు చేసే అమెరికా, పశ్చిమ ఐరోపాలకు ముఖ్యంగా అమెరికాకు ఎంత ఆధిపత్యం వచ్చి చేరుతుందో అర్ధం చేసుకునేందుకు పల్లెకారు గ్రామం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇండియాలో ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు మంత్రులను నియమించే అంశం పైన కూడా అమెరికా పెత్తనం చేస్తున్న సంగతి వికీ లీక్స్ డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడి అయిన సంగతి తెలిసిందే కదా!

కనుక ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం అమెరికా, పశ్చిమ ఐరోపా, జపాన్ దేశాలకు చెందిన ప్రైవేటు బహుళజాతి కంపెనీల ఆధిపత్యం, నియంత్రణ ఉన్న దేశాలను చుట్టుముట్టి నాశనం చేసింది. పశ్చిమ బహుళజాతి కంపెనీల ఆధిపత్యం లేని చోట, బలహీనంగా ఉన్న చోట మాత్రం ఈ సంక్షోభం పెద్దగా ప్రభావితం చేయలేదని మనం అర్ధం చేసుకోవాలి. ఇది ఒక అంశం.

ఇంకో అంశం ఏమిటంటే ఆఫ్ఘన్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, ఇంకా ఇతర అనేక దేశాల్లో భారీ సైనిక స్ధావరాల నిర్వహణ… ఇవన్నీ అమెరికా ఆర్ధిక శక్తిని, అమెరికాను అంటిపెట్టుకుని ఉండే పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్థలను బలహీన పరచగా, సంక్షోభం తాకిడిని ఎదుర్కొనని చైనా ఆర్ధిక శక్తి నానాటికీ ఇనుమడిస్తూ వచ్చింది. అప్పటికే అమెరికాతో జరిపిన వాణిజ్యంలో రెండు దశాబ్దాలుగా చైనా ప్రతి యేటా బిలియన్ల కొద్దీ డాలర్ల మేర వాణిజ్య మిగులు కూడబెడుతూ వచ్చింది. ఒక్క అమెరికాయే కాదు, పశ్చిమ ఐరోపా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా ఇలా అన్ని దేశాల వాణిజ్యాలలో చైనా దేశమే వాణిజ్య మిగులు సాధించింది. మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఒక పెద్ద రాకాసిగా చైనా అవతరించింది. ఇంకా చెప్పాలంటే 2008-09 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఒక నీడ రూపంలో ఐనా బైటపడింది అంటే అది చైనా ఆర్ధిక వ్యవస్థ చలవే. చైనా ఇప్పుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ‘గ్రోత్ ఇంజన్’ గా వెలుగొందుతోంది.

ఇంకో పక్క రష్యా మెల్ల మెల్లగా, హంగూ ఆర్భాటం లేకుండా, ఆయుధ శక్తిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. 2010లో మొదటిసారి సిరియాకు సైన్యాన్ని పంపి ఐసిస్, ఆల్-ఖైదాల ద్వారా సిరియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా-పశ్చిమ ఐరోపాలు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టింది. సిరియాలో బషర్ అస్సాద్ నాయకత్వం లోని సెక్యులరిస్టు ప్రభుత్వం బ్రతికి బట్టకట్టింది అంటే అందులో రష్యా సహాయం ఎంతో ఉన్నది. ఆఫ్ కోర్స్! సిరియా ప్రజలు అత్యంత ధైర్య సాహసాలతో ఓ పక్క అమెరికా పశ్చిమ ఐరోపాల వైమానిక దాడులను, మరో పక్క ఆల్-ఖైదా-ఐసిస్ టెర్రరిస్టు దాడులను ఎదుర్కొని నిలబడకపోతే రష్యా సైనిక తోడ్పాటు వల్ల ఉపయోగం ఉండేది కాదన్న మాట నిజమే. అమెరికా ఆధిపత్య వ్యతిరేక ప్రపంచ భౌగోళిక రాజకీయాల పరిశీలకులు అందరూ “ఇక బషర్ అస్సాద్ పని అయిపోయినట్లే, ఆయన్ని అమెరికా ఎప్పుడు మట్టుబెడుతుంది అన్నదే ఇక మిగిలి ఉంది” అని ఆశలు వదులుకున్న పరిస్ధితిలో రష్యా సైన్యం సిరియాలో అడుగు పెట్టి పరిస్ధితిని తలకిందులు చేయగలిగింది. సిరియా, అమెరికా చేతుల్లోకి వెళ్తే మధ్యధరా సముద్రంలో రష్యా సైనిక ఉనికి రద్దై ఉండేది; రష్యాకు కూడా పెను ప్రమాదం ముంచుకొచ్చి ఉండేది. అంటే సిరియాకు సహాయం చేయడం వెనుక రష్యా ప్రయోజనాలు ఉన్నాయి. చైనా కూడా పైకి కనపడకుండా, వివిధ పరోక్ష పద్ధతుల్లో సిరియాకు సహకారం అందజేసింది.

ఇదే పద్ధతిలో రష్యా లిబియాలో అమెరికా శిబిరంలో ఉన్న లిబియా ప్రభుత్వంపై పోరాడుతున్న జనరల్ హఫ్తార్ నేతృత్వం లోని సైన్యానికి ఆయుధ, సైనిక సాయం అందిస్తోంది. ఇప్పుడు అక్కడ హఫ్తార్ దే పై చేయిగా ఉంది. అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల ముఖ్యంగా ఫ్రాన్స్ శక్తి బలహీన పడుతున్న సంగతి గమనించిన ఆఫ్రికా దేశాలు కొన్ని ఫ్రాన్స్, అమెరికా సైన్యాలను తమ దేశాల నుండి ఖాళీ చేయించి రష్యా ప్రైవేటు సైన్యం (వాగ్నర్) కు తమ రక్షణ బాధ్యతను అప్పగించాయి. సహేల్ రీజియన్ లో అనేక దేశాల్లో ఇప్పుడు రష్యా సైన్యాలు భద్రత కల్పిస్తున్నాయి.

ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో అనేక దేశాలకు చైనా షరతులు లేని రుణాలు ఇవ్వడం బాగా పెరిగింది. దానితో అమెరికా మాట వినడం తగ్గిపోతూ చైనా మాట వినడం పెరుగుతోంది. ఆఫ్రికాలో చైనా పెద్ద ఎత్తున భూములను కొంటూ ముడి ఖనిజాల తవ్వకాలను ఫైనాన్స్ చేస్తూ ఆ ముడి ఖనిజాలను తానే కొంటున్నది. డజన్ల కొద్దీ దేశాల నుండి చైనా ఇనుప ఖనిజం దిగుమతి చేసుకుంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బి.ఆర్.ఐ) లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు, హై వేలు, నిర్మిస్తున్నది. శ్రీలంక లో హంబన్ తోట అంతర్జాతీయ డీప్ వాటర్ పోర్టు నిర్మించి ఇచ్చిన చైనాకు, ఆ అప్పు శ్రీలంక తీర్చలేక ఆ పోర్టుని చైనాకు చెందిన చైనా మర్చెంట్స్ పోర్ట్స్ కంపెనీకి 99 సంవత్సరాలకు లీజ్ కు ఇచ్చేసింది. ఎర్ర సముద్రం తీరాన ఉన్న గ్జిబౌటిలో అమెరికా, రష్యా సైనిక స్థావరాలతో పాటు చైనా కూడా భారీ సైనిక స్థావరాన్ని నిర్మించింది. ఆస్ట్రేలియా సమీపంలోని సాల్మన్ ఐలాండ్స్ లో ఒక ద్వీపంలో ఇంకో సైనిక స్థావరం నిర్మిస్తోంది.

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం మధ్యప్రాచ్యం లేదా పశ్చిమాసియా. Middle East and North Africa (MENA) దేశాలు ప్రపంచాధిపత్యం నెరపదంలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనవి. ఇక్కడ కూడా అమెరికా ప్రభావం తగ్గిపోతూ చైనా, రష్యాల ప్రభావం పెరుగుతూ వస్తోంది. పెట్రో డాలర్ అమెరికా ఆర్ధిక శక్తికి ప్రధాన భూమిక. పెట్రో డాలర్ అంటే పెట్రోలు అమ్మగా వచ్చే డాలర్ అని అర్ధం. 1970లో అమెరికా బంగారం-డాలర్ మధ్య సంబంధాన్ని రద్దు చేసి పెట్రోలు అమ్మకం డాలర్ల లోనే జరపాలని సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది. ఇతర చమురు దేశాలు అనివార్యంగా అమెరికా మాట వింటున్నాయి. పెట్రోలు (మరియు గ్యాస్) ఇంధనం కనుక, శక్తి ఇంధనం నుండే పుడుతుంది కనుక అది అన్ని దేశాలకూ కావాలి. అంటే పెట్రోలు కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలూ డాలర్లు నిలవ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా డాలర్ అంతర్జాతీయ కరెన్సీ అయింది. ఈ పెట్రోలు-డాలర్ సంబంధం బలహీనపడితే లేదా రద్దయితే ఇక అమెరికా పెత్తనం సాగదు. సద్దాం హుస్సేన్ తమ పెట్రోలు, గ్యాస్ లను డాలర్ బదులు యూరోలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. అందుకే అమెరికా ఇరాక్ పై దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి సద్దాం హుసేన్ ను పట్టుకుని ఉరి తీసింది. పెట్రో డాలర్ పైన అమెరికా శక్తి అంతగా ఆధార పడి ఉన్నది.

MENA Region

ఇప్పుడు చైనా, రష్యాలతో పాటు ఇతర బ్రిక్స్ దేశాలు (ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా) కూడా తమ వాణిజ్యాన్ని సొంత కరెన్సీలలో చేస్తున్నాయి. ఇటీవల 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి. అవి కూడా డాలర్ బదులు సొంత కరెన్సీలో వాణిజ్యం మొదలు పెడితే డాలర్ వాణిజ్యం మరికొంత తగ్గుతుంది. సౌదీ అరేబియా, చైనాకు సరఫరా చేసే పెట్రోలియంకు యువాన్ లు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. చైనా మధ్యవర్తిత్వంలో బద్ధ శత్రువులైన సౌదీ అరేబియా – ఇరాన్ ల మధ్య కూడా శాంతి ఒప్పందం కుదిరింది. చైనా ఆర్ధిక వ్యవస్థ పెద్దది కనుక, దానికి పెట్రోలియం కూడా భారీగా కావాలి. ఆ మేరకు పెట్రో డాలర్ వాణిజ్యం మరికొంత తగ్గుతుంది. ఇంత జరిగినా కూడా పెట్రో డాలర్ ఆధిపత్యానికి ఇంకా తగిన మొత్తంలో ప్రమాదం రాలేదు. ఆ ప్రమాదం రాకుండా అమెరికా వివిధ చర్యలకు ఉపక్రమించింది. కొత్త సైనిక కూటములు ఏర్పాటు చేస్తున్నది. కొత్త ఆర్ధిక గ్రూపులను నిర్మిస్తున్నది. కానీ అమెరికా ఆర్ధిక శక్తి బలహీనపడినందున ఈ కూటములు కూడా ఆచరణలో ప్రభావం కలిగించలేకపోతున్నాయి.

మరొక అంశం ఏమిటంటే వివిధ దేశాలు అమెరికా ఉడుం పట్టు నుండి బైట పడేందుకు కాస్త ధైర్యం ప్రదర్శిస్తున్నాయి. అందుకు చైనా, రష్యా లతో వాణిజ్య, సాంస్కృతిక, రాయబార సంబంధాలను ఉపయోగిస్తున్నాయి. ఆఫ్రికాలోని సహేల్ దేశాల గురించి పైన చూశాం.

ఇండియా కూడా అమెరికా ఆశించినంతగా ప్రపంచాధిపత్య వ్యూహంలో అమెరికాకు సహకారం ఇవ్వటం లేదు. “స్ట్రేటజిక్ యాంబిగ్యుటీ” (వ్యూహాత్మక సందిగ్ధత) ను (ఎవరి పక్షమూ చేరనట్లు కనిపిస్తూ రెండు పక్షాలతోనూ స్నేహం చేస్తూ ఇరు పక్షాల నుండి అప్పులు, నిధులు, పెట్టుబడులు పొందటం) పాటించడంలో భారత పాలకులకు మంచి పేరు ప్రతిష్టలే ఉన్నాయి. కాంగ్రెస్ పాటించిన ఈ ఎత్తుగడనే బిజెపి/ఎన్.డి.ఏ మరింత దూకుడుగా (ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్ధితుల రీత్యా) అవలంబిస్తున్నది. దానితో అమెరికా వివిధ చర్యల ద్వారా ఇండియాకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడి సన్నిహితుడు అదాని గ్రూపు మార్కెట్ క్యాపిటల్ దెబ్బ తినేలా హిండెన్ బర్గ్ రీసర్చ్ కంపెనీ నుండి రెండుసార్లు వెలువడిన ప్రతికూల రిపోర్టులు, క్వాడ్ కూటమి సభ్య దేశం అయిన ఇండియాతో సంబంధం లేకుండానే ఆకస్ (AUKUS – ఆస్ట్రేలియా, యుకె, యుఎస్) కూటమి ఏర్పాటు చెయ్యటం, తాను హామీ ఇచ్చినట్లుగా టెక్నాలజీ బదలాయింపు చెయ్యకపోవటం, ఇండియాకు అతి సన్నిహితమైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ లో కూల్చివేయటం, మాల్దీవ్స్ నుండి భారత సైన్యాన్ని ఖాళీ చేయించడం, శ్రీలంక – ఇండియాల మధ్య తగవు పెట్టే ప్రయత్నాలు చెయ్యటం, నేపాల్ ప్రభుత్వాలను అస్థిరమొనర్చటం… ఇవన్నీ ఇండియాకు అమెరికా నుండి అందుతున్న హెచ్చరికలు గానే చూడాలి.

***** ***** *****

ఇప్పుడు ప్రధాన అంశం లోకి వద్దాం. పైన చేసిన విశ్లేషణ బట్టి మనకు ఏమి అర్ధం అవుతున్నది? ప్రపంచ దేశాల మధ్య సమాన సంబంధాలు లేకపోగా అసమాన సంబంధాలు ఉన్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల ఆర్ధిక, సైనిక బలిమి ప్రధానంగా ఈ అసమాన సంబంధాల ద్వారా సమకూర్చుకున్నదే. అంటే రుణాల రూపంలో మూడో ప్రపంచ దేశాలకు ఫైనాన్స్ అందజేసి, ఫైనాన్స్ తో పాటు విషమ షరతులు అమలు చేస్తూ వివిధ దేశాల లోని సామాజిక-ఆర్ధిక-రాజకీయ వ్యవస్థలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చి వడ్డీల రూపంలో, లాభాలు పొందడమే కాకుండా ఆ లాభాలను శాశ్వతం చేసేందుకు వీలుగా అక్కడి ఆర్ధిక వ్యవస్థలను అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు అనుబంధంగా చేసుకుంటున్నాయి.

పైకి రుణాలు, సహాయం, ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకు అప్పుల రూపంలో అమెరికా, పశ్చిమ ఐరోపాల నుండి మూడో ప్రపంచ దేశాలకు డబ్బు ఇస్తున్నట్లు/వస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా ఆ దేశాల లోని ముడి ఖనిజాలను, ముడి వనరులను, అక్కడి ప్రజల శ్రమలను అతి చౌకగా కొట్టేసి వాటితో తయారు చేసిన సరుకులను అమ్ముకోవటానికి తిరిగి మూడో ప్రపంచ దేశాలనే సొంత మార్కెట్లుగా మార్చుకోవటం అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు చేస్తున్నాయి. అందుకే అమెరికా, పశ్చిమ ఐరోపాల నుండి మూడో ప్రపంచ దేశాలకు వచ్చే మొత్తం కంటే మూడో ప్రపంచ దేశాల నుండి పశ్చిమ దేశాలకు వెళ్ళేదే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ప్రతి యేటా భారత బడ్జెట్ లో దాదాపు పావు భాగం రుణాలకు వడ్డీలుగా ఇండియా అమెరికా పశ్చిమ ఐరోపా దేశాలకు చెల్లిస్తుంది. దానితో పాటు అమెరికా నాయకత్వం లోని పెట్టుబడిదారీ ఆర్ధిక క్రమశిక్షణ సూత్రాలు నిర్దేశించినట్లుగా ఫిస్కల్ లోటు తగ్గించుకునేందుకు ప్రజలకు ఇచ్చే సంక్షేమ పధకాలను ప్రభుత్వాలు తగ్గించేస్తున్నాయి. ‘ఆదాయ పన్నులో చిన్న మార్పు చేసి రు12,500 పన్ను తగ్గించి ఇక నుండి మధ్యతరగతి ప్రజల జేబుల్లో మరింత డబ్బు చేరబోతోంది. వాళ్ళు మరిన్ని అవసరాలు తీర్చుకోవచ్చు’ అని ప్రధాని ప్రకటించాడు అంటే ఇక్కడ వెర్రి వెంగళప్పలు ఎవరని అర్ధం చేసుకోవాలి?

“కంపెనీలు నడపటానికి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు” అని సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించేశాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా దాన్ని ప్రయివేటీకరణ చేసి తీరవలసిందే అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వాల్లాగా బిజెపి ప్రభుత్వం తన ఉద్దేశాలను ఏమీ దాచుకోవటం లేదు. ప్రజల అవసరాలను తీర్చేందుకు, ఫార్మల్ ఉపాధి కల్పన చేసేందుకు, ప్రభుత్వ విధుల నిర్వహణకు అవసరమైన డబ్బు సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీలను నిర్వహిస్తుంది తప్ప వ్యాపారం చేసేందుకు కాదు. ఇంత చిన్న విషయం ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రిలకు తెలియక కాదు. వాళ్ళ విధేయత ప్రజలకు కాకుండా ఇంకెవరి కాళ్ళ వద్దనో ఉన్నది కనుకనే ఇలాంటి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు.

ఇండియా లాంటి 140 కోట్ల ప్రజలు నివసించే దేశం పరిస్ధితి ఇలా ఉంటే చిన్న దేశాల పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ఇలాంటి విధానాలతో ప్రపంచ దేశాల ఆర్ధిక వనరులను దోచుకు తిన్న అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు చైనా, రష్యా, ల నుండే కాక ఇరాన్ నేతృత్వం లోని ప్రతిఘటన దేశాల కూటమి (ఇరాన్, సిరియా, పాలస్తీనా, లెబనాన్, యెమెన్, ఇరాక్) నుండి వెనిజులా, కొలంబియా, ఈక్వడార్, మెక్సికో, నికరాగువా లాంటి లాటిన్ అమెరికా దేశాలతో కూడిన బొలివారన్ కూటమి నుండి గట్టి సవాళ్ళు ఎదురవుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక రాజకీయాలు పక్కాగా అమెరికా పక్షం వహించడం నుండి ఫ్లూయిడ్ సంబంధాలుగా మారాయి. అంటే ఈ ప్రాంతంలో దేశాలు అమెరికాతో మాట్లాడుతూనే ఆచరణలో చైనా, రష్యాల వైపు మొగ్గు చూపుతున్నాయి. మరో పక్క ఒకప్పుడు (మొదటి ప్రపంచ యుద్ధం వరకు) ఒట్టోమాన్ సామ్రాజ్యం నిర్వహించిన టర్కీ తన సొంతగా ఒక ప్రభావిత ప్రాంతం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఆగ్నేయాసియాలో వియత్నాం, ఇండోనేషియాలు అమెరికా ఆదేశాలకు కట్టుబడి ఉండడం తగ్గిపోయింది.

ఏక ధృవ – ద్వి ధృవ – ఏక ధృవ – ?

రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం పైన బ్రిటన్ పెత్తనం సాగింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం దాని కింద ఉన్న డజన్ల దేశాలు స్వతంత్రం కానీ స్వతంత్రం సంపాదించటం వల్ల అప్పటి వరకు సాగిన బ్రిటన్ పెత్తనం ముగిసింది. పెత్తనం బాధ్యతలను ఇష్ట పూర్వకంగానే అమెరికాకు అప్పగించింది. కానీ రెండవ వరల్డ్ వార్ లో జర్మనీని మట్టి కరిపించింది ప్రధానంగా రష్యాయే. జపాన్ ను చైనా మట్టి కరిపించింది. సోషలిస్టు రష్యాలో స్టాలిన్ మరణానంతరం అనతికాలం లోనే సోషలిస్టు నిర్మాణాన్ని పక్కన పెట్టి అమెరికాకు పోటీగా ఆర్ధిక, సైనిక శక్తి అభివృద్ధి చేసుకుని ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో పాటీ పడింది. అనగా రెండవ ప్రపంచ యుద్ధం వరకు బ్రిటన్ ప్రధాన పెత్తందారుగా ఏక ధృవ ప్రపంచం ఉండగా, అప్పటి నుండి ఒక పక్క అమెరికా, మరో పక్క సోవియట్ రష్యా రెండు ధృవాలుగా ఏర్పడి ప్రపంచ పెత్తనం కోసం పోటీ సాగించాయి.

1990 లో ఆఫ్ఘన్ యుద్ధ భారాన్ని మోయలేక పెట్టుబడిదారీ సోవియట్ రష్యా కూలిపోయి, విచ్ఛిన్నం అయింది. ఫలితంగా 1990 నుండి 2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం లేదా ‘ద గ్రేట్ రిసెషన్’ వరకు అమెరికా ఒక్కటే పెత్తందారీ దేశంగా మళ్ళీ ఏక ధృవ ప్రపంచం ఏర్పడింది. 2008-09 నుండి ముందు చెప్పుకున్నట్లు అమెరికా ఆర్ధిక శక్తి సన్నగిల్లి చైనా ఆర్ధిక శక్తిగా, రష్యా మిలటరీ శక్తిగా ఎదిగాయి. అమెరికా పెత్తనాన్ని తిరస్కరించి, ధిక్కరించి సొంత ప్రయోజనాలే లక్ష్యంగా మూడవ ప్రపంచ దేశాలను ఒకటి (చైనా) ఋణ దాతగా, రెండవది (రష్యా) సెక్యూరిటీ ప్రదాతగా తమ ప్రభావం లోకి తెచ్చుకుంటున్నాయి.

అనగా ప్రపంచం ఇప్పుడు అమెరికా పెత్తనం నుండి తప్పించుకుంటూ బహుళ ధృవ ప్రపంచంగా మారుతోంది. ఈ బహుళ ధృవ ప్రపంచంలో అమెరికా ఆర్ధిక-మిలటరీ శక్తి మిగతా దేశాల కంటే ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నప్పటికీ అది బహుళధ్రువ ప్రపంచంలో ఒక ధృవంగా మాత్రమే ఉండగలుగుతోంది. చైనా ఒక ధృవంగా; రష్యా ఇంకో ధృవంగా; ఇరాన్ మరో చిన్న ధృవంగా; టర్కీ ఒక ప్రాంతీయ శక్తిగా; జపాన్ ఆసియాలో పరిమిత ధృవంగా; ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా, నైజీరియా లాంటి దేశాలు, లాటిన్ అమెరికాలో వెనిజులా-క్యూబా నాయకత్వంలో మరో చిన్న ధృవం ఎక్కడికక్కడ తమ సొంత ప్రయోజనాలు లేదా సార్వభౌమత్వాన్ని పదిలపరచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

యుద్ధాలు, తిరుగుబాట్లు రెచ్చగొట్టడం, తాను పెంచి పోషించే టెర్రరిస్టు సంస్థలను ప్రయోగించి దేశాలను అస్థిరం పాలు చేయటం, ప్రపంచ పెత్తనం సాగించే సామ్రాజ్యవాద దేశాలు ఒక అవసరంగా చేస్తాయి. మహా మేధావి వ్లాదిమిర్ లెనిన్ బోధించినట్లు “సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం” కాగా ప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ పేర్కొన్నట్లు “యుద్ధానికి యుద్ధానికి మధ్య విరామమే శాంతి”. చైనా ఇందుకు భిన్నంగా కేవలం వాణిజ్యమే ప్రధాన ఆయుధంగా ప్రపంచ దేశాలతో వ్యవహారాలు చక్కపెట్టుకుంటోంది. ఆర్ధిక, వాణిజ్య ప్రయోజనాల కోసం, తన ఎగుమతి సరుకులను రవాణా చేసే నౌకలకు రక్షణగా మాత్రమే గ్జిబౌటి, సాల్మన్ ఐలాండ్స్ లలో సైనిక స్థావరాలు నెలకొల్పింది. అయితే చైనా ఎల్లకాలం ఇలాగే వాణిజ్య ప్రయోజనాల వరకే కట్టుబడి ఉంటుందన్న గ్యారంటీ లేదు. తన సరుకులకు మార్కెట్ కాపాడుకోవాలంటే మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ను మేపటం అవసరంగా చైనా ముందు నిలుస్తుంది. ఉక్రెయిన్ ను ఓడించాక రష్యా నిలదొక్కుకుంటే తానూ ఒక ప్రభావశీలమైన శక్తిగా తనను తాను నిలబెట్టుకునే అవసరం దాని ముందు నిలుస్తుంది.

అమెరికాకు బహుళ ధృవ ప్రపంచం ఏర్పడటం అంటే తన ఆజ్ఞలను, ఆదేశాలను అమలు చేసుకోలేని బలహీన పరిస్ధితిలో పడిపోవటం. అయితే అమెరికా మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇప్పటికీ అత్యంత శక్తివంతమైనదే. కనుక బహుళ ధృవ ప్రపంచంలో అదొక పెద్ద శక్తిగా ఉంటుంది గానీ మునుపటి వలే దేశాలు తన మాట జవదాటని పరిస్ధితిని మాత్రం కలిగి ఉండదు. ఇలాంటి పరిస్ధితిని ఊహల్లో కూడా అమెరికా భరించలేదు. అందుకే తన వద్ద ఉన్న సకల మాయోపాయాలను ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్ ను 2014 నుండి రెచ్చగొట్టి, తద్వారా రష్యాను యుద్ధం లోకి దింపి, ఆఫ్ఘన్ యుద్ధ భారం వల్ల సోవియట్ రష్యా కూలినట్లే ఉక్రెయిన్ యుద్ధ భారం మోయలేక రష్యా మరోసారి బలహీనమైతే తన ప్రభావం కిందికి తెచ్చుకోవచ్చని ఆశిస్తున్నది. ఈ లక్ష్యంతో ఒక్కొక్క ఐరోపా దేశాన్ని నాటో సైనిక కూటమిలో చేర్చుకుంటూ వచ్చింది. ఉక్రెయిన్, జార్జియాలను కూడా నాటో లో చేర్చుకుంటామని ప్రకటించింది.

దానితో రష్యాకు ఉక్రెయిన్ పై దాడి అనివార్యం అయింది. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలకు మల్లెనే మెజారిటీ దేశాలు తన పక్క నిలబడతాయన్న అమెరికా ఆశలు నెరవేరలేదు. బ్రిక్స్ కూటమి పూర్తిగా, ఇండియా తప్ప, రష్యా తరపున నిలబడ్డాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఏవీ అమెరికాకు మద్దతు ఇవ్వలేదు. ఒక్క యూరోపియన్ యూనియన్ మాత్రమే అమెరికాకు మద్దతుగా వచ్చింది.

అయితే యూరోపియన్ యూనియన్ లో హంగేరీ మొదటి నుండి ఉక్రెయిన్ కి మద్దతు ఇవ్వటానికి నిరాకరిస్తూ వచ్చింది. నిధుల్ని గానీ, ఆయుధాలు గాని ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పైగా ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అమెరికా ఐరోపాను బలహీనం చేస్తున్నాడని ఆరోపించాడు. దానితో అమెరికా ఆదేశాలతో యూరోపియన్ కమిషన్ (ఐరోపా ప్రభుత్వం) హంగేరీకి ఇవ్వాల్సిన నిధులను స్తంభిపజేసింది. దానితో అప్పటి వరకు ఉక్రెయిన్ కు ఇయు సాయాన్ని, ఆయుధ సరఫరాను విమర్శిస్తూ వచ్చిన హంగేరీ ప్రధాని విక్టర్ ఒర్బన్ (మితవాద రాజకీయ వాది) తన దూకుడు తగ్గించుకోవలసి వచ్చింది.

స్లొవేకియా అక్టోబర్ 2023 వరకు ఉక్రెయిన్ కు ఉధృతంగా ఆయుధాలు సరఫరా చేసింది. అక్టోబర్ 2023 ఎన్నికల్లో ప్రధానిగా గెలిచిన రాబర్ట్ ఫికో (పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీ నేత) ఉక్రెయిన్ కు ఆయుధాలు పంపటం నిలిపేశాడు. అమెరికా అనుకూల మీడియాపై ఉక్కు పాదం మోపాడు. రష్యా వాదనలకు మద్దతు ఇచ్చాడు. ఫికో పార్టీ ఎంపి లపై అవినీతి కేసులు నడుపుతున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి రద్దు చేశాడు. రష్యాపై ఆంక్షలను దృఢంగా వ్యతిరేకించాడు. నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడలిస్తే అలాంటి నిర్ణయాన్ని తాను వీటో చేస్తానని స్పష్టం చేశాడు.

ఉక్రెయిన్ యుద్ధం రష్యా వ్యతిరేక భౌగోళిక రాజకీయాల్లో అమెరికాకు చాలా ముఖ్యమైన అడుగు. యూరోపియన్ యూనియన్ అమెరికాకు ఆల్ వెదర్ సేవకుడు. అలాంటి యూనియన్ సభ్య దేశం అయిన స్లొవేకియా ప్రధాని అమెరికా వ్యతిరేక అవగాహనతో ఉండడమే కాకుండా ఎన్నికల్లో నెగ్గి ప్రధాని కావడం, ప్రధాని కావడం తోనే ఉక్రెయిన్ కి ఆయుధ సరఫరా నిలిపివేయటం అమెరికా ఆగ్రహానికి కారణం అయింది. ఫలితమే రాబర్ట్ ఫికో పై హత్యా ప్రయత్నం.

డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని డీప్ స్టేట్ కు ఇష్టుడు కాదు. డీప్ స్టేట్ అంటే అమెరికా విధాన నిర్ణయాలను నిర్ణయించే వ్యక్తుల కలయిక. వీరి ఆజ్ఞ లేనిదే అమెరికా రాజ్యంలో ఒక్క నిర్ణయమూ జరగదు. వారి అనుజ్ఞ లేనిదే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అధ్యక్ష అభ్యర్ధులుగా నామినేషన్ లభించదు. సకల ఇంటలిజెన్స్ సంస్థలు (సిఐఏ, ఎఫ్.బి.ఐ, ఎన్.ఐ.ఏ మొ.వి), మానిటరీ విధానం, వడ్డీ రేట్లు నిర్వహించే ట్రెజరీ సెక్రటరీ, విదేశాంగ విధానాలను అమలు చేసే సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైట్ హౌస్ అధినేత అమెరికా అధ్యక్షుడు… వీళ్ళు ఎవరూ డీప్ స్టేట్ అనుమతి లేకుండా, వారి ప్రయోజనాలకు భిన్నమైన నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే వారిపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేసి కేసు పెట్టవచ్చు. ఉన్నట్లుంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు. అసలు మనిషే మాయం కావచ్చు. డీప్ స్టేట్ కు లోబడి అమెరికా రాజ్యం (కాంగ్రెస్, సెనేట్, మిలటరీ, ఇంటలిజెన్స్, ఎఫ్.బి.ఐ, రాష్ట్రాల పోలీసులు) పని చేస్తుంది.

డొనాల్డ్ ట్రంప్, తన మొదటి అధ్యక్షరికంలో డీప్ స్టేట్ డిమాండ్లకు లొంగలేదు. రష్యాతో, పుతిన్ తో స్నేహం చేస్తానని ప్రకటించాడు. కానీ డీప్ స్టేట్ శక్తి ముందు ట్రంప్ శక్తి చాల లేదు. అయిష్టంతో నైనా రష్యాపై ఆంక్షలు విధించాడు. చైనాను ప్రధమ శత్రువుగా ప్రకటించాడు. కానీ అమెరికన్ డీప్ స్టేట్ కు చైనాతో వాణిజ్యం కావాలి. ఎందుకంటే వారి కంపెనీలు చైనాలో చౌక శ్రమశక్తిని కొల్లగొట్టి అమితమైన లాభాలు సాధిస్తున్నాయి. చైనాలో ఉన్న అమెరికా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు అమెరికాకు తిరిగి రావాలని ట్రంప్ పిలుపిచ్చాడు. డీప్ స్టేట్ కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టే వివిధ ప్రపంచ గ్రూపుల (నాఫ్తా, ప్యారిస్ క్లైమెట్ గ్రూప్, ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్, యునెస్కో, ఐరాస హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇరాన్ తో కుదుర్చుకున్న జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్) నుండి అమెరికాను తప్పించాడు. తన షరతుల ప్రకారం వీటిలో కొన్ని ఒప్పందాలను పునరుద్ధరిస్తానన్నాడు.

పై చర్యలన్నీ అమెరికా డీప్ స్టేట్ ఫైనాన్స్ ప్రయోజనాలకు విరుద్ధం. డొనాల్డ్ ట్రంప్ ప్రకారం డీప్ స్టేట్ విధానాల వలన చైనా, ఇండియా లాంటి దేశాలు లబ్ది పొందాయి తప్ప అమెరికాకు ప్రయోజనం జరగలేదు. పర్యావరణ ఒప్పందం ప్యారిస్ క్లైమెట్ గ్రూప్ ను అమెరికాపై రుద్దారు గానీ చైనా, ఇండియాలకు పర్యావరణ లక్ష్యాలు తగినంతగా నిర్దేశించలేదని ఆరోపించాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని పిలుపిచ్చాడు. తమ విధానాలు అన్నింటినీ వ్యతిరేకిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావటం డీప్ స్టేట్ యాక్టర్లకు ఇష్టం లేదు. కానీ అభిప్రాయ సేకరణలు అన్నింటిలో ట్రంప్ దే పై చేయిగా ఉంది. డిమెన్షియా తో బాధపడుతూ ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ, తన చుట్టూ ఉండే అధికారుల పేర్లు కూడా మర్చిపోతున్న జో బైడెన్ రేటింగ్ నానాటికీ పడిపోతున్నది. బైడెన్ మళ్ళీ గెలవాలంటే ట్రంప్ సీన్ లో నుండి మాయం కావాలని డీప్ స్టేట్ భావించింది. ఫలితమే ట్రంప్ పై హత్యా ప్రయత్నం. స్నైపర్ ను ట్రంప్ పైకి పది రౌండ్లు కాల్పులు జరపనిచ్చి ఆ తర్వాత మాత్రమే సీక్రెట్ సర్వీస్ స్నైపర్ ఆగంతుకుడిపై కాల్పులు జరిపి చంపేశాడు.

అమెరికాకు పెద్ద సమస్యగా మారిన పుతిన్ పైన ఉక్రెయిన్ కి చెందిన రెక్కీ గ్రూపులు అనేకసార్లు టెర్రరిస్టు దాడులకు పాల్పడి ఆయన్ని చంపడంలో విఫలం అయ్యారని ఉక్రెయిన్ మిలటరీ ఇంటలిజెన్స్ (GUR) అధిపతి బుడనోవ్ చెప్పాడు. రష్యన్ ఫిలాసఫర్ అలెగ్జాండర్ డగిన్ ప్రకారం డెమోక్రటిక్ పార్టీలో డీప్ స్టేట్ లో భాగంగా ఉన్న ఒబామా, విదేశీ మంత్రి బ్లింకెన్, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్, ఇప్పటి అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ లు ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన వారిలో ఉన్నారు. అయితే ట్రంప్ పై హత్యా యత్నం విఫలం కావటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బైడెన్ ను తప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసి సఫలం అయ్యారు. బైడెన్, అధ్యక్ష పోటీ నుండి తప్పుకోవాలని మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, బారక్ ఒబామా లు ప్రముఖంగా కోరిన సంగతి గమనించాల్సిన విషయం. జో బైడెన్ అయితే ఓ ప్రసంగంలో “ప్రజాస్వామ్యం కంటే స్వేచ్ఛ చాలా గొప్పది” అని స్పష్టం చేశాడు. ఇక నుండి డీప్ స్టేట్ కి వ్యతిరేకులైన వారిని చంపేందుకు ఉండే స్వేచ్ఛ ముందు ప్రజాస్వామ్యం దిగదుడుపే అన్నదే బైడెన్ అర్ధం అని అలెగ్జాండర్ డగిన్ తన బ్లాగ్ (ద పోస్టిల్) లో వివరించాడు.

ట్రంప్ విధానాలు అమెరికా ఏకైక ధృవంగా కాకుండా బహుళ ధృవాల్లో ఒకటిగానే ఉండేందుకు దారి తీస్తుందని తమ పెత్తనం ముగిసిపోతుందని డీప్ స్టేట్ పెద్దలు భావించి ట్రంప్ హత్యకు తెగించారని డగిన్ తో పాటు పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బహుళ ధృవ ప్రపంచం నిలదొక్కుకోకుండా నిలువరించి అమెరికా ఏకైక ధృవంగా కొనసాగే లక్ష్యానికి ఆటంకంగా ఉన్న అమెరికా, ఐరోపా నాయకులను హత్య చేసేందుకు డీప్ స్టేట్ సిద్ధపడిందని, మునుముందు మరిన్ని దుష్ట చర్యలకు వీరు పూనుకోవచ్చని డగిన్ తో పాటు ఇతర భౌగోళిక రాజకీయాల విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

2 thoughts on “ఈ వరుస హత్యా ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు?

  1. అతివాద, మితవాద రాజకీయాలు ప్రతి పోలిటికల్ స్ట్రీమ్ లో ఉంటాయి. ఎన్నికల రాజకీయాల్లో, మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాల్లో, రివిజనిస్టు రాజకీయాల్లో ఎలా ప్రతి స్ట్రీమ్ లోనూ అతివాద, మితవాద రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. కనుక అలాంటి జనరల్ విశ్లేషణ నేను ఎప్పుడూ చేయలేదు.

వ్యాఖ్యానించండి