
కంపెనీలు పాల్పడిన వివిధ అవినీతి వ్యవహారాల వలనా, చిన్నా పెద్దా మదుపుదారుల నుండి పెట్టుబడులను మోసపూరితంగా వసూలు చేయడం వలనా, సెబి విధించిన అపరాధ రుసుముల వలనా, ఇంకా అనేక ఇతర కారణాల వలనా, వసూలు కావలసిన మొత్తంలో రు 76,293 కోట్లు వసూలు కావటం ఇక కష్టమే అని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రకటించింది.
సెబి, ఇలాంటి వసూలు కావటం కష్టంగా మారే వాళ్ళ జాబితాను క్రమం తప్పకుండా యేటా తయారు చేస్తుంది. ఈ జాబితాను డి.టి.ఆర్ (డిఫికల్ట్ టు రికవర్) జాబితా అంటారు. వీటి వసూలుకు అందుబాటులో ఉన్న సకల ప్రయత్నాలు చేశాక, అవేవీ సఫలం కాకపోతే అలాంటి వాటిని మాత్రమే డి.టి.ఆర్ జాబితాలో సెబి చేర్చుతుంది.
ఈ విషయం ప్రకటిస్తూ సెబి ఒక సన్నాయి నొక్కు నొక్కింది. “డి.టి.ఆర్ డ్యూస్ పేరుతో వసూలు చేయడం కష్టమైన వాటిని ఒక జాబితాగా తయారు చేయడం పూర్తిగా పాలనాపరమైన వ్యవహారం మాత్రమే. ఈ జాబితాలో చేర్చినంత మాత్రాన ఇక అలాంటి డ్యూ లను వసూళ్ల అధికారులు (రికవరీ ఆఫీసర్లు) రికవరీ చెయ్యబోరని అర్ధం కాదు. డి.టి.ఆర్ జాబితా తయారీకి సంబంధించిన ప్రమాణాలలో ఏమన్నా మార్పులు చేసినప్పుడు వాటిని వసూలు చేసేందుకు అవకాశం ఎప్పుడూ ఉంటుంది” అని సెబి వివరణ ఇచ్చుకుంది.
సెబి వివరణలోనే అసలు సంగతి దాగి ఉంది. డి.టి.ఆర్ జాబితాలో చేర్చేందుకు కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు. ఆ ప్రమాణాలను అనుసరించి వసూలు కావలసిన మొత్తాలు ఇక వసూలు చేయడం సాధ్యం కాదు అని భావిస్తే వాటిని జాబితాలో చేర్చుతారు. అయితే ఈ జాబితా లో చేర్చిన తర్వాత కూడా వాటి వసూలుకు రికవరీ అధికారులు ప్రయత్నిస్తూనే ఉంటారని సెబి చెప్పడం లేదు. డి.టి.ఆర్ ప్రమాణాలను ఎప్పుడైనా మార్చితే సదరు మార్పుల ప్రకారం వసూళ్లు కావలసిన మొత్తాలు కొన్ని జాబితా నుండి తొలగించవలసి వస్తే అప్పుడు మాత్రమే వాటి వసూలుకు మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతారు. అంతవరకే. డి.టి.ఆర్ జాబితా లోని మొత్తాలను వసూలు చేసే పని మాత్రం ఇక రికవరీ అధికారుల బాధ్యతగా ఉండదు. జాబితా నుండి తప్పిస్తేనే అది రికవరీ అధికారుల బాధ్యతల్లో భాగంగా చేరుతుంది.
ఇలా ఐపిఓ ఇష్యూల పేరుతో మదుపుదారుల నుండి పెట్టుబడి వసూలు చేసి, వారికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించి, ఎలాంటి ఉత్పత్తి కానీ కంపెనీ స్థాపన గానీ లేదా కంపెనీ అభివృద్ధికి గానీ పూనుకోకుండా వసూలు చేసిన పెట్టుబడులను తమ స్వంతానికి వినియోగించడమో లేదా ఇంకేదో షేర్లలో పెట్టి మొత్తం పోగొట్టడమో లేదా ఎగవేసేందుకే ఇష్యూ ప్రకటించి పెట్టుబడులు వసూలు చేయడమో చేస్తే అలాంటి దగాకోరులు, మోసగాళ్లకు ప్రభుత్వం/సెబి నుండి ఈ డి.టి.ఆర్ జాబితా ఒక బహుమతిగా లభిస్తుందన్నమాట! భలే అవకాశం కదా! కావలసిందల్లా మోసం చేసే తెగువ, తెలివితేటలు ఉండడం, పెద్ద పెద్ద అధికారులు, మంత్రులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడమే.
సెబి, డి.టి.ఆర్ జాబితా నిర్వహించినట్లే బ్యాంకులు కూడా నిరర్ధక ఆస్తులు/ మొండి బకాయిలు (నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ -ఎన్.పి.ఏ) పేరుతో కొన్ని అప్పులను ఒక జాబితాలో చేర్చుతారు. ఈ ఎన్.పి.ఏ లను కొన్నాళ్ళ తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు, రైట్-ఆఫ్ చేసేస్తారు. ఇక్కడ కూడా ప్రభుత్వం లేదా బ్యాంకులు కొన్ని సనాయి నొక్కులు నొక్కుతారు. ఎన్.పి.ఏ లను రైట్-ఆఫ్ చేసినంత మాత్రాన వాటిని వసూలు చేసేందుకు దృష్టి పెట్టబోము అని అర్ధం కాదనీ, ఎన్.పి.ఏ రుణాల వసూలుకు ప్రయత్నిస్తూనే ఉంటామనీ ప్రభుత్వాలు, మంత్రులు, బ్యాంకు అధికారులు చెబుతూ ఉంటారు.
కానీ ఆచరణలో చూస్తే రైట్-ఆఫ్ చేసిన రుణాలను వసూలు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాలకు, బ్యాంకులకు లేదు. మహా అయితే కొన్ని పదుల కోట్లను వసూలు చేసినట్లు చూపగలరేమో. కొన్ని పదుల లక్షల కోట్లను రైట్-ఆఫ్ చేసి వాటిలో ఇసుక రేణువంత వసూలు అయినప్పుడు చంకలు గుద్దుకోవడం… ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అసలు నిరర్ధక ఆస్తులు ఏటికేడూ పెరుగుతూ పోతున్నప్పుడు, రెగ్యులర్ గా ఎన్.పి.ఏ లను రైట్-ఆఫ్ చేస్తూ పోతున్నప్పుడు అలాంటి అప్పులు ఎందుకు, ఎలా ఇస్తున్నారో అన్న అంశం పైన విచారణ జరిపిన చరిత్ర మన ప్రభుత్వాలకు లేకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? బడా దొంగలతో ప్రభుత్వ పెద్దలు కూడా కుమ్మక్కు అవుతున్నారు అని తప్ప?
మార్చి 31, 2024 నాటికి 807 కేసులను డి.టి.ఆర్ గా సెబి గుర్తించింది. వాటి మొత్తం రు 76,293 కోట్లు. గత యేడు కేసుల సంఖ్య 692 కాగా వాటి మొత్తం రు 73,287 కోట్లు. అంటే దాదాపు 4.1 శాతం వృద్ధి. ఈ 807లో 36 కేసులు పి.ఐ.డి కోర్టులు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ లలో ప్రొసీడింగ్స్ జరుగుతున్న కేసులు, వీటి మొత్తం రు 12,199 కోట్లు. 60 కేసులు కోర్టు నియమించిన కమిటీల ముందు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఉన్న మొత్తం రు 59,970 కోట్లు.
ఈ రెండు తరగతుల కేసుల్లో ఇమిడి ఉన్న మొత్తం, రికవరీ కావలసిన మొత్తంలో 95 శాతం ఉండడం గమనార్హం. ఆచూకీ దొరకని కేటగిరీ కింద 140 కేసులు ఉండగా 131 కేసులు వ్యక్తులకు సంబంధించినవి. ఈ రెండు కేటగిరీల్లో రు 13.3 కోట్లు ఇమిడి ఉన్నది. 9 కేసులు కంపెనీలకు సంబంధించినవి కాగా వాటిలో రు 15.7 కోట్ల మొత్తం ఇమిడి ఉన్నదని సెబి పేర్కొంది. 2021-22 నుండి ఈ జాబితాను ప్రతి యేటా ప్రకటిస్తున్న సెబి, పారదర్శకత కోసం ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు చెబుతోంది.
డి.టి.ఆర్ లతో పాటు ఇతర వసూలు కావలసిన మొత్తాలను కూడా కలుపుకుంటే సెబికి రావలసిన డ్యూల మొత్తం రు 1.03 లక్షల కోట్లు అని తెలుస్తోంది. అపరాధ రుసుము గా కంపెనీ ల నుండి వసూలు కావలసింది, మదుపుదారులకు తిరిగి చెల్లించవలసిన మొత్తం, ఫీజులు చెల్లించలేక పేరుకుపోయిన బకాయిలు… మొ.వి సెబికి వసూలు కావలసిన డ్యూలలో కలిసి ఉన్నాయి.
2023-24 లో సెక్యూరిటీల చట్టాల ఉల్లంఘన జరిగిన 342 కేసులను సెబి విచారణ కోసం చేపట్టింది. అందులో 197 కేసులపై విచారణ పూర్తయిందని సెబి చెప్పింది. అలాగే 174 కేసులు ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించినవిగా సెబి తెలిపింది. 160 కేసులు మార్కెట్ ను మ్యానిపులేట్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులు, సంస్థలపైనా మరియు ధరల రిగ్గింగ్ చేసినందుకు పెట్టిన కేసులు.
ఈ కేసుల్లో హిండెన్ బర్గ్ రీసర్చ్ కంపెనీ పరిశోధన ఫలితంగా ఆదాని గ్రూపు కంపెనీలపై నమోదు చేసిన కేసులు ఉన్నాయా లేదా అన్నది సెబి చెప్పలేదు.