హసీనాపై ఒత్తిడి వద్దు- అమెరికాకు ఇండియా విజ్ఞప్తి!


బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని భారత అధికారులు అమెరికన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారని ‘బిజినెస్ టుడే’ పత్రిక వెల్లడి చేసింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోవటానికి సంవత్సరం ముందు నుండే ఇండియా, హసీనా పట్ల తేలికగా వ్యవహరించాలని, అమెరికాను కోరిందని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికను ఉటంకిస్తూ బిజినెస్ టుడే పత్రిక వెల్లడి చేసింది.

బంగ్లాదేశ్ లోని హసీనా ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కును, ఇతర మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నదని అమెరికా మొదటి నుండి ఆరోపిస్తూ వచ్చింది. అసలు మానవ హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగబద్ధ వ్యవస్థ, రూల్స్ బేస్డ్ పరిపాలన ఇలాంటి ప్రజల హక్కుల గురించి కనీసం ఉచ్చరించే నైతిక హక్కు కూడా అమెరికాకు లేదు అన్నది ఒక నిజం. అయినప్పటికీ తాను ఏ మాత్రం గౌరవించని హక్కులను ఇతర దేశాల పాలకులు గౌరవించడం లేదని ఆరోపించేందుకు అమెరికా ఏ మాత్రం సిగ్గుపడదు.

అమెరికాకు నైతిక హక్కు లేదంటే అర్ధం వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రజల పౌర, మానవ హక్కులను గౌరవించాల్సిన అవసరం లేదని కాదు. కనుక షేక్ హసీనా ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా అమలు చేసిన నియంతృత్వ విధానాలను, ప్రతిపక్ష రాజకీయ నాయకులతో సహా ప్రజల హక్కులను, స్వేచ్ఛను, హరించి వేసిన సంగతి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిందే.

అలాగే హసీనా నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన ప్రజల ఆందోళనలకు పౌరుగు దేశపు పౌరులుగా భారత ప్రజలు మద్దతు ఇవ్వాలి. కానీ సదరు ఆందోళనలలోకి జొరబడి హింసాత్మక చర్యలకు పాల్పడటం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన అమెరికా దుష్ట పన్నాగాలను కూడా భారత ప్రజలు వ్యతిరేకించాలి.

అలాగే షేక్ హసీనా నియతృత్వ విధానాలను ఎన్నడూ విమర్శించకుండా కేవలం భారత కుబేరుల వ్యాపార ప్రయోజనాలను మాత్రమే పట్టించుకునే భారత ప్రభుత్వ విధానాలను కూడా భారత ప్రజలు వ్యతిరేకించాలి. ఏ ప్రయోజనాలను ఆశించి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అమెరికా కుట్ర చేసి కూల్చిందో ఆ ప్రయోజనాలు భారత ప్రజల ప్రయోజనాలకు బద్ధ విరుద్ధం అన్న సంగతి కూడా భారత ప్రజలు గమనించాలి.

బంగ్లాదేశ్ లోని అమెరికా రాయబారులు హసీనా ప్రభుత్వాన్ని బహిరంగంగానే అనేక సార్లు విమర్శించారు. హసీనా పట్ల తన వ్యతిరేకతను అమెరికా ఎన్నడూ దాచలేదు. ఓ పక్క వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ ఆసాంజేను 15 సంవత్సరాలకు పైగా, ఈక్వడార్ లండన్ ఎంబసీలో, బ్రిటన్ జైలులో మగ్గేలా ఒత్తిడి తెచ్చి జనవరి 2024 ఎన్నికలకు ముందు తన ప్రత్యర్ధులు వేల మందిని హసీనా జైళ్ళలో పెట్టిందని అమెరికా విమర్శించింది. బంగ్లాదేశ్ పోలీసు విభాగం లోని ఒక యూనిట్ పైన ఆంక్షలు విధించింది. ఈ యూనిట్ బంగ్లాదేశ్ లో న్యాయ విచారణ లేకుండా ప్రజలను, అసమ్మతి వాదులను చంపుతున్నది అని ఆరోపించింది.

అయితే భారత ప్రభుత్వం అమెరికా ఆరోపణలను అంగీకరిస్తూనే తదుపరి పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం అంశాన్ని “ప్రజాస్వామ్య అమలు స్థాయి” అన్న కోణంలో అమెరికా పరిశీలించినప్పటికీ హసీనా ప్రభుత్వం కూలిపోతే తదనంతర పరిణామాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అమెరికాతో తన ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి పరిణామాలు ఇండియాకు తీవ్ర ప్రమాదం కాగలవని భారత ప్రభుత్వం అమెరికాకు విన్నవించుకుంది. “ఏదో ఒక విధమైన వ్యూహాత్మక ఏకాభిప్రాయం లేనట్లయితే తమ దేశాన్ని (ఇండియాను) వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా తీసుకోజాలదు” అని భారత అధికారి ఒకరు చెప్పినట్లు ద వాషింగ్టన్ పత్రిక వెల్లడి చేసింది. ఈ అధికారి చెప్పిన మాటలకు అర్ధం ఏమిటంటే ఇండియాను వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా స్వీకరించిన సంగతి అమెరికాకు గుర్తు చేస్తూ అలాంటి వ్యూహాత్మక భాగస్వామ్యం ఆచరణలోకి రావాలంటే ఇండియా వ్యూహాత్మక ప్రయోజనాలతో అమెరికాకు కూడా ఏకీభావం ఉండాలి అని.

అమెరికాకు భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కొనసాగాలి అంటే ఇండియాకు దక్షిణాసియా ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలను గౌరవించాలి అని ఇండియా పై వాదన ద్వారా అమెరికాకు ‘షేక్ హసీనా పట్ల కఠిన వైఖరిలో పదును తగ్గించాలి’ అన్న సందేశాన్ని భారత ప్రభుత్వం అందజేసింది. అప్పటి నుండి బంగ్లాదేశ్ పట్ల అమెరికా విమర్శలలో తీవ్రతా స్థాయి తగ్గిందని వాషింగ్టన్ పత్రిక విశ్లేషించింది. అయితే, ఇండియా ఒత్తిడి వల్ల షేక్ హసీనా పట్ల తన వైఖరి మెత్తగా మార్చుకున్నామన్న అవగాహన నిజం కాదని అమెరికా అధికారులు స్పష్టం చేయటం విశేషం. తన మిత్ర రాజ్యం అని చెప్పే ఇండియా ఒత్తిడిని ఆమోదించామని అంగీకరించడం కూడా అమెరికాకు ఇష్టం లేదన్న మాట!

బంగ్లాదేశ్ లో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు అధికారం లోకి వస్తే, బంగ్లాదేశ్, తీవ్రవాద ఇస్లామిక్ గ్రూపులకు నిలయంగా మారుతుందని, ఫలితంగా భారత జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని భారత అధికారులు అమెరికా అధికారులతో జరిపిన అనేక సమావేశాల్లో వాదించారు. “మీ అప్రోచ్ ప్రజాస్వామ్యం అన్న స్థాయిలో ఉన్నది. కానీ మాకయితే సమస్యలు చాలా చాలా తీవ్రమైనవి. ఇండియా స్థిరత్వానికి సంబంధించినవి” అని వారు వాదించారు. ఈ సందర్భంగానే భారత అధికారులు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, వ్యూహాత్మక ఏకీభావంల గురించి అమెరికాతో వాదించారు. అమెరికా హసీనా ప్రభుత్వంపై విమర్శల వాడిని తగ్గించాక బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలు నిరుత్సాహానికి గురైనట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక చెప్పింది.

బంగ్లాదేశ్ పరిస్ధితిని సరిగ్గానే డీల్ చేసామా లేదా అన్న అంశాన్ని ఇండియా, అమెరికా లు ప్రస్తుతం సమీక్షించుకునే పనిలో ఉన్నాయని వాషింగ్టన్ పత్రిక చెబుతోంది. జనవరి 2024 ఎన్నికలకు ముందు అమెరికా విదేశాంగ శాఖలో బంగ్లాదేశ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని కొందరు అధికారులు వాదించగా హసీనాను దూరం చేసుకోవటం ద్వారా బంగ్లాదేశ్ లో అమెరికా రాయబారుల భద్రతను ప్రమాదంలో పడవేయటం తప్ప అమెరికా సాధించేది ఏమీ ఉండబోదని మరి కొందరు అధికారులు వాదించారు. ఇంకొందరు అధికారులయితే హసీనా ప్రభుత్వాన్ని కూల్చితే ఇండియా కూడా అమెరికాకు వ్యతిరేకంగా మారవచ్చని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తాజా విశ్లేషణ ద్వారా బంగ్లాదేశ్ ఆందోళనకారులు అమెరికా ఆదేశాలతో సంబంధం లేకుండానే హసీనా అధికార నివాసంపైకి దండు వెళ్లారని, హసీనా ఇండియాకు పారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్న సంగతి అమెరికా ఊహించలేదని ఒక సరికొత్త విశ్లేషణను ప్రపంచం ముందు ఉంచటానికి ప్రయత్నాలు చేస్తున్నది. హసీనా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారి హసీనా దేశం విడిచి పోరిపోవటంలో అమెరికా పాత్ర ఏమీ లేదని చెప్పేందుకు ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక శ్రమిస్తున్నది.

కానీ అమెరికాకు తెలియకుండా ఆందోళనకారులు హింసాత్మకంగా హసీనా ప్రభుత్వం పై తిరగబడ్డారని ద వాషింగ్టన్ పత్రిక చెబుతున్న కధనం నమ్మశక్యం కాదు. ప్రపంచంలో అనేక దేశాల్లోని అనేక ప్రభుత్వాలను హింసాత్మకంగా కూలదోసిన చరిత్ర అమెరికాకు కొత్త కాదు. అసలు అమెరికా ప్రభోధించే ప్రజాస్వామిక సూత్రాలు విలువల పట్ల అమెరికాకి ఎన్నడూ గౌరవం గానీ నిబద్ధత గానీ లేవు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం చరిత్ర పొడవునా అందుకు అనేక తార్కాణాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక అమెరికా పాత్ర లేదని చెప్పబోవడం “ఒక పరిణామం జరిగాక” చెప్పుకునే కాకమ్మ కధలు మాత్రమే. ఈ కాకమ్మ కధలు అమెరికా, ఇండియాల లోని ప్రజలకు నచ్చజెప్పేందుకు ఉద్దేశినవి మాత్రమే.

ఇండియా ఈ మధ్య కాలంలో అమెరికా ఆదేశాలను అమెరికా కోరుకున్నంత స్థాయిలో పాటించడం లేదని అమెరికా భావిస్తున్నది. రష్యా వ్యతిరేక ఆంక్షలలో ఇండియా పాల్గొనకపోవడం, బ్రిక్స్ కూటమిలో గతం కంటే కాస్త ఎక్కువగా చురుకుగా ఇండియా వ్యవహరించడం… తదితర కారణాల వలన ఇండియా పట్ల అమెరికా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక హిండెన్ బర్గ్ రీసర్చ్ సంస్థ ద్వారా ప్రధాని నరేంద్ర మోడి సన్నిహితుడు అదాని గ్రూపు కంపెనీలపై దాడి చేయటం మరోవైపు ఇండియా పౌరుగు దేశాల్లో ఇండియా వ్యతిరేక ఆందోళనలకు, ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికా ఇండియాకు, ముఖ్యంగా నరేంద్ర మోడికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. తాము కోరుకున్న స్థాయిలో దారికి రానట్లయితే ఇలాంటివే మరిన్ని ఎదుర్కోవలసి ఉంటుందని, తమకు ఇంకా అలాంటి సామర్ధ్యం ఉన్నదని అమెరికా, ఇండియాకు చెప్పదలచిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అసలు విషయం ఏమిటి అన్నది మునుముందు జరిగే పరిణామాల ద్వారా తెలియకుండా పోదు.

వ్యాఖ్యానించండి