
అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది.
హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను అనుచిత చర్యల నిమిత్తం ఉపయోగించుకుంటున్నదని జనవరి 2023 లో ఆరోపించింది. ఈ ఆరోపణలతో అదాని గ్రూపు మార్కెట్ క్యాపిటల్ పెద్ద మొత్తంలో నష్టపోయింది. ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం లోని మంత్రుల సానుకూల ప్రకటనల సాయంతో కోలుకున్నప్పటికీ అప్పటి అనుమానాలు పూర్తిగా ఇంకా తొలగిపోలేదు.
హిండెన్ బర్గ్ ఆరోపణల నేపధ్యంలో అదాని కంపెనీపై ప్రతిపక్ష పార్టీలు, ఇతర ఎన్.జి.ఓ లు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశాయి. సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి), అదాని గ్రూపు కంపెనీలపై విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. హిండెన్ బర్గ్ రిపోర్టు వెలువడక ముందే అదాని కంపెనీపై సెబి విచారణ జరుపుతున్న సంగతి కొందరు వెల్లడి చేసినప్పటికీ సదరు విచారణలలో చెప్పుకోదగ్గ అంశం ఏమీ లేదని, రొటీన్ గా జరిగే విచారణే అని సెబి తేల్చిపారేసింది.
ఆగస్టు 2024లో హిండెన్ బర్గ్ రీసర్చ్ సంస్థ మరోసారి అదాని గ్రూపు కంపెనీపై దాడి ఎక్కు పెట్టింది. ఈ సారి భారత షేర్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబి పై కూడా ఆరోపణలు చేసింది. అదాని కంపెనీపై సెబి జరుపుతున్న విచారణ అత్యంత నెమ్మదిగా సాగడం వెనుక ఉద్దేశాలను ప్రశ్నించింది. అదాని కంపెనీ పట్ల సెబి తగని విధంగా ప్రేమానురాగాలు కురిపిస్తున్నదని అందుకు కారణం సెబి చైర్ పర్సన్ మాధాబి పూరి బక్ కు అదాని కంపెనీలో షేర్లు ఉన్నాయని అంతే కాకుండా ఆమె స్వయంగా వివిధ కంపెనీలను నిర్వహిస్తున్న దృష్ట్యా సెబి చైర్ పర్సన్ గా ఆమెకు ‘కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ (సెబి బాధ్యతలకు విరుద్ధమైన కంపెనీ ప్రయోజనాలు) ఉన్నదని హిండెన్ బర్గ్ రీసర్చ్ వెల్లడి చేసింది.
హిండెన్ బర్గ్ ఆరోపణలను మాధాబి పూరి బక్ ఖండిస్తూ తన కంపెనీల వివరాల గురించి సెబి బోర్డులో సభ్యురాలిగా చేరక ముందే సెబి బోర్డు ముందు ఉంచానని సెబి బోర్డు అనుమతితోనే బోర్డు సభ్యురాలిగా చేరానని ప్రకటించింది.
అయితే మాధాబి పూరి బక్ సమర్ధనలో నిజం లేనట్లు తమ పరిశోధనలో తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్థ ఈ రోజు (16/08/2024) ఒక వార్తా కధనం ప్రచురించింది. సెబి బోర్డు సభ్యురాలిగా ఉన్న 7 సంవత్సరాలలో ఆమె తన కన్సల్టెన్సీ కంపెనీల నుండి ఆదాయం పొందడం కొనసాగుతూనే ఉన్నదని, తద్వారా సెబి సంస్థ నియమ నిబంధనలను ఆమె ఉల్లంఘించారని రాయిటర్స్ తెలిపింది.
బక్ మరియు ఆమె భర్త సింగపూర్ లో ఆగోరా పార్టనర్స్ అనే కంపెనీని, ఇండియాలో అగోరా అడ్వైజరీ అనే కంపెనీని నిర్వహిస్తున్నారని హిండెన్ బర్గ్ రీసర్చ్ వెల్లడి చేసిన సంగతిని రాయిటర్స్ గుర్తు చేస్తూ ఈ రెండు కంపెనీల నుండి ఇప్పటికీ సెబి చైర్ పర్సన్ ఆదాయం పొందడం కొనసాగుతూనే ఉన్నదని రాయిటర్స్ తెలిపింది.

సెబి బోర్డులో బక్ 2017 లో చేరింది. మార్చి 2022 లో ఆమె సెబి చైర్ పర్సన్ గా నియమితురాలయింది. ఈ 7 సంవత్సరాలలో ఆగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బక్ కు 99 శాతం షేర్ హోల్డింగ్ ఉండగా, సదరు కంపెనీ నుండి ఆమె 3.71 కోట్ల రూపాయల ($442,025) రెవిన్యూ సంపాదించిందని రాయిటర్స్ తెలిపింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలో అందరికీ అందుబాటులో ఉండే డాక్యుమెంట్ల ద్వారానే ఈ సంగతి తెలుసుకోవచ్చని తెలిపింది.
2008 నాటి సెబి నిబంధనల ప్రకారం సెబి అధికారులు ఏ కంపెనీ లో కూడా ఆదాయం పొందే ప్రయోజనాలు కలిగి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే తాను లాభాలు సంపాదించే కంపెనీకి అనుకూలంగా సెబి తరపున నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ నిబంధన విధించడం సహజమే. సెబి అధికారిగా మరే ఇతర కంపెనీ నుండి వేతనం గానీ ప్రొఫెషనల్ ఫీజు గాని పొందకూడదని సెబి నిబంధన విధిస్తుంది. ఈ నిబంధనను అగోరా అడ్వైజరీ కంపెనీ నుండి ఆదాయం పొందడం ద్వారా మాధాబి పూరి బక్ ఉల్లంఘించారని రాయిటర్స్ నిర్ధారించింది.
అయితే బక్ మాత్రం తన కన్సల్టెన్సీ కంపెనీ వివరాలను సెబికి వెల్లడి చేశానని, తన భర్త 2019 లో యూనీలివర్ నుండి రిటైర్ అయిన తర్వాత తన కన్సల్టింగ్ వ్యాపారానికి తమ రెండు కంపెనీలను వినియోగించారన్నా సంగతి కూడా సెబికి తెలియజేశానని చెబుతున్నారు. తనపై హిండెన్ బర్గ్ కంపెనీ క్యారక్టర్ ఆశాసినేషన్ కు పాల్పడుతున్నదని ఆమె ప్రత్యోరోపణ చేసింది. తన వార్తా కధనం పై బక్ మరియు సెబి ల నుండి వ్యాఖ్యానించాలని కోరినా వారి నుండి స్పందన లేదని రాయిటర్స్ చెబుతోంది.
అయితే భారత ప్రభుత్వం బ్యూరోక్రసీలో ఉన్నత పదవులు నిర్వహించి అనంతరం సెబి బోర్డు మెంబర్ గా కూడా పని చేసిన సుభాష్ చంద్ర గార్గ్, రాయిటర్స్ కధనంతో ఏకీభవించాడు. సెబి బోర్డు సభ్యురాలిగా ఉండగా ఆమె ఒక కంపెనీలో ఈక్విటీ కలిగి ఉండడం, సదరు ఈక్విటీలు వ్యాపార నిర్వహణలో కొనసాగడం అన్నది “చాలా తీవ్రమైన విషయం” అని అభివర్ణించాడు.
“బోర్డులో ఆమె చేరిన తర్వాత కూడా ఒక కంపెనీకి యజమానిగా కొనసాగగల అవకాశం సెబిలో లేదు. తన కంపెనీల గురించి సెబికి చెప్పిన తర్వాత కూడా ఆమెను సభ్యురాలిగా కొనసాగించడం సెబి అనుమతించదు” అని సుభాష్ చంద్ర స్పష్టం చేశాడు. “ఈ అంశం నిజం అయినట్లయితే సెబి చైర్ పర్సన్ గా ఆమె కొనసాగడం ఎంత మాత్రం వీలు లేదు” అని ఆయన చెప్పాడు.
తన కంపెనీల గురించి సెబికి వెల్లడి చేసినట్లు బక్ చెప్పారు తప్ప, తాను తన కంపెనీల నుండి ఆదాయం పొందడానికి సెబి అనుమతించిందా లేదా అన్నది బక్ చెప్పలేదు. దీని గురించి రాయిటర్స్ ఆమె నుండి వివరణ కోరినప్పటికీ ఆమె స్పందించలేదని తెలుస్తోంది.
కానీ బక్, తన వ్యాపార ప్రయోజనాల గురించి ఆమె గానీ లేదా ఇతర అధికారులు గానీ సెబి బోర్డుకు ఎన్నడూ చెప్పలేదని సుభాష్ చంద్ర గార్గ్, పేరు చెప్పటానికి ఇష్టపడని మరో బోర్డు సభ్యులు చెప్పారని రాయిటర్స్ వెల్లడించడం విశేషం. “వార్షిక ప్రాతిపదికన బోర్డు సభ్యులు తమ వ్యాపార లేదా ప్రయోజనాలను వెల్లడి చేయాలన్న నియమం ఉన్నది. కానీ బోర్డు సభ్యుల ‘వెల్లడి’ లను సమాచార నిమిత్తం గానీ, స్క్రూటినీ నిమిత్తం గానీ బోర్డు ముందు ఉంచడం ఎన్నడూ జరగలేదు” అని వారు తెలియజేశారు. “అప్పటి చైర్ పర్సన్ అజయ్ త్యాగి ముందు వెల్లడి చేసారేమో నాకు తెలియదు” అని గార్గ్ వివరించాడు.
హిండెన్ బర్గ్ రీసర్చ్ సంస్థ రెండో సారి భారత షేర్ మార్కెట్ వ్యవహారాల గురించి చేసిన ప్రకటనలు, ఆరోపణలపై ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. సెబి చైర్ పర్సన్ పదవి నుండి మాధాబి బక్ వెంటనే తప్పుకోవాలని అవి డిమాండ్ చేశాయి. బిజెపి నాయకులు మాత్రం హిండెన్ బర్గ్ ఆరోపణలు ‘ఆధార రహితం’ అని కొట్టిపారేస్తున్నారు.
సెబి చైర్ పర్సన్ అవకతవకలపై జెపిసి విచారణ జరపాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశాడు. ఈ అంశం పై దేశ వ్యాపిత ఆందోళన కాంగ్రెస్ త్వరలో చేపడుతుందని ఆయన ప్రకటించాడు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల టార్గెట్ మాధాబి బక్ గా పైకి కనిపిస్తున్నప్పటికీ వారి అసలు లక్ష్యం బక్ కు మద్దతుగా వస్తున్న బిజెపి అన్నది స్పష్టమే. ఆందోళన ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి – అదాని గ్రూప్ కంపెనీల మధ్య సంబంధాలను ప్రజల దృష్టికి తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
నరేంద్ర మోడి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత అదాని ఆస్తులు అత్యంత వేగంగా పెరిగిపోవడం అచిర కాలంలోనే ప్రపంచ కుబేరులలో మూడవ స్థానానికి చేరుకోవడం కాకతాళీయంగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే భారత షేర్ మార్కెట్ లో కేవలం 2 శాతం భారత ప్రజలు మాత్రమే పాల్గొంటున్న నేపధ్యంలో కాంగ్రెస్ ప్రచారం ఎంతమంది ప్రజలను ఆకర్షిస్తుంది అన్నది ప్రశ్నార్ధకం.