
జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి పదవి చేపట్టిన షేక్ హసీనా మరో 6 నెలల్లోనే పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు కోరవలసి వచ్చింది. 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్య వాసనలు లేకుండా దాదాపు డిక్టేటర్ తరహాలో బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా ప్రస్తుత పరిస్ధితి స్వయంకృతాపరాధమే అని ది హిందూ లాంటి పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ పరిశీలనలో కొంత నిజం ఉన్నప్పటికీ అదే పూర్తి నిజం కాదు.
బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో కోటా సిస్టమ్ పట్ల విద్యార్ధులు అనేక యేళ్లుగా వ్యతిరేకతతో ఉన్నారు. దాన్ని సమీక్షించి సవరించాలని వారు ఎన్నాళ్లుగానో కోరుతున్నారు. వారు కోరింది కోటా సిస్టమ్ ను పూర్తిగా రద్దు చేయమని కాదు. కోటా ద్వారా పాలక పార్టీ అవామీ లీగ్ పార్టీ సన్నిహితులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. పాలక పార్టీ విధేయులు లబ్ది పొందకుండా చూడటం, మెరిట్ ప్రాతిపదికన కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వడం తదితర చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోర్టుల జోక్యంతో ఈ సమస్య మరింత జఠిలం కావడమే కాక విద్యార్ధుల ఆందోళన మొదలు కావటానికి దారి తీసింది. కోటా గురించిన వివరాలు తెలుసుకోవటం ఉపయోగంగా ఉంటుంది.
సివిల్ సర్వీస్ కోటా వ్యవస్థ
1971లో బంగ్లా, పాక్ ల యుద్ధం జరగడం, బంగ్లాదేశ్ తరపున ఆ దేశ విముక్తి కోసం ఇండియా చురుకుగా పాల్గొనడంతో పాకిస్తాన్ ధనికవర్గాల అణచివేత మరియు సవతితల్లి తరహా పాలన నుండి బంగ్లాదేశ్ విముక్తి చెందింది. విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ తరపున యుద్ధంలో పాల్గొన్న రజాకార్లు అత్యంత హింసాత్మకంగా వ్యవహరించారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై అత్యాచారాలు జరిపి తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. బంగ్లా ప్రజలను ఊచకోత కోశారు. వేలాది మందిని జైళ్ళలో కుక్కి తీవ్ర నిర్బంధం అమలు చేశారు. అనేక మందిని రాత్రికి రాత్రే మాయం చేసేవారు.
ఈ నేపధ్యంలో విముక్తి అనంతరం మొట్ట మొదటి ప్రధాన మంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన షేక్ ముజిబూర్ రెహమాన్ దేశంలో గతం కంటే భిన్నమైన పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. పాక్ సైనికులు, రజాకార్లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్న కుటుంబాలకు (ఫ్రీడం ఫైటర్స్) బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ లో 30 శాతం ఉద్యోగాలను కేటాయించాడు. 10 శాతం ఉద్యోగాలను విముక్తి ఉద్యమంలో పాల్గొని రజాకార్ల చేతుల్లో హింసకు గురయిన మహిళలకు కేటాయించాడు. దేశం లోని వివిధ జిల్లాలలకు 40 శాతం ఉద్యోగాలు కేటాయించాడు. ఇక మెరిట్ ప్రాతిపదికన నియామకాలకు 20 శాతం మాత్రమే ఉద్యోగాలు మిగిలాయి.
ఆగస్టు 15,1975లో కొంతమంది ఆర్మీ అధికారులు తిరుగుబాటు చేసి షేక్ ముజిబూర్ రెహమాన్ ను హత్య చేశారు. ఈ ఘాతుకంలో షేక్ హసీనా తప్ప (ఆమె విదేశాల్లో చదువుతున్నందున బ్రతికిపోయింది) మిగిలిన వారందరూ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ లో అనేక మార్లు మిలటరీ కుట్రలు, కౌంటర్ కుట్రలు జరిగాయి. 1976 లో కోటా పద్ధతిలో స్వల్ప మార్పులు చేశారు. జిల్లాలకు కేటాయించిన 40 శాతం రిజర్వేషన్ ను 20 శాతానికి తగ్గించారు. తద్వారా మెరిట్ ప్రాతిపదికన జరిగే నియామకాలను 40 శాతానికి పెంచారు. ఫ్రీడం ఫైటర్స్ కు 30 శాతం రిజర్వేషన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
1985లో రిజర్వేషన్ కోటా పద్ధతిలో మరోసారి మార్పులు చేశారు. యుద్ధం వల్ల బాధితులైన మహిళలకు కేటాయించిన 10 శాతం కోటాను మహిళలందరికీ రిజర్వేషన్ గా మార్చారు. ఈ సారి కూడా ఫ్రీడం ఫైటర్స్ కోసం కేటాయించిన రిజర్వేషన్లలో మార్పులు చేయకుండా 30 శాతం అలాగే కొనసాగించారు. జిల్లాల కోసం కేటాయించిన రిజర్వేషన్లను మరోసారి సవరించి దానిని 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించారు. స్థానిక జాతులకు (indigenous) కొత్తగా 5 శాతం రిజర్వేషన్ కేటాయించారు. మెరిట్ ప్రాతిపదికన నియామకాలకు మరో 5 శాతం జతచేసి 45 శాతానికి పెంచారు. ఈసారి కూడా ఫ్రీడం ఫైటర్స్ కోటా 30 శాతాన్ని ముట్టుకోలేదు.
1997 వచ్చింది. అప్పటికి యుద్ధంలో నేరుగా పాల్గొన్న ఫ్రీడం ఫైటర్స్ లో ఇక ఉద్యోగార్హులు లేరు. అంటే ఉద్యోగంలో కొత్తగా చేరే వయసులో ఉన్న ఫ్రీడం ఫైటర్స్ ఇక లేరు. కానీ 30 శాతం రిజర్వేషన్ అలాగే కొనసాగించి ఈసారి వాటిని ఫ్రీడం ఫైటర్స్ పిల్లలకు కేటాయించారు. మరో 13 యేళ్ళు గడిచాక 2010 సం.లో షేక్ హసీనా హయాంలో 30 శాతం రిజర్వేషన్ లను ఫ్రీడం ఫైటర్స్ మనుమలకు కేటాయించారు.
2012లో కోటా వ్యవస్థలో మరికొన్ని మార్పులు చేశారు. 1 శాతం కోటాను వికలాంగులకు కేటాయించారు. ఈ సవరణతో మొత్తం రిజర్వేషన్ కోటా 55 నుండి 56 శాతానికి పెరగగా, మెరిట్ ప్రాతిపదికన జరిగే కేటాయింపులకు 45 శాతం నుండి 44 శాతానికి తగ్గింది.
ఓపెన్ కేటగిరీ కేటాయింపులకు ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో ప్రజల్లో ముఖ్యంగా విద్యార్ధుల్లో మెల్లగా అసంతృప్తి బయలుదేరింది. మొదటితరం ఫ్రీడం ఫైటర్లు యుద్ధం ముగిశాక సైనిక విధులు లేవు గనక ఉద్యోగ రహితంగా మిగలకుండా వారికి రిజర్వేషన్ కల్పించడం దేశభక్తిలో భాగంగా చూశారు. వారి తరం ముగిశాక వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కొనసాగించడం కూడా అసంతృప్తితోనే సహించారు. 2010లో కోటాను ఫ్రీడం ఫైటర్స్ మనుమలకు కూడా విస్తరించడంతో విద్యార్ధులు చిన్న చిన్న ఉద్యమాలతో వ్యతిరేకత వ్యక్తం చేయడం ప్రారంభించారు.
2018లో కోటా వ్యవస్థను సవరించాలన్న డిమాండ్ తో దేశవ్యాపితంగా ఆందోళనలు చెలరేగాయి. దానితో ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ ఉద్యోగాలకు రిజర్వేషన్ కోటాలను రద్దు చేసింది. ఈ రద్దును వ్యతిరేకిస్తూ ఫ్రీడం ఫైటర్స్ వారసులు హై కోర్టులో పిటిషన్ వేశారు. హై కోర్టు పిటిషన్ ను విచారించి జూన్ 2024లో తీర్పు ప్రకటించింది. 2018 ఆదేశాల ద్వారా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉద్యోగాలకు రిజర్వేషన్ రద్దు చేయడం చట్ట విరుద్ధం అని హై కోర్టు తీర్పు ఇచ్చింది. రద్దు చేసిన రిజర్వేషన్లను పునరుద్ధరించింది. పాత కోటా పద్ధతి కొనసాగాలని చెప్పింది.
ఈ హై కోర్టు తీర్పుతో విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం చెందారు. ఆందోళన ప్రారంభించారు. ఎక్కడో ఒక చోట చిన్నగా ప్రదర్శన రూపంలో ఈ ఆందోళన ప్రారంభం అయింది. రోజులు గడిచే కొద్దీ అది విస్తరించింది. ప్రభుత్వం హై కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. అయితే అప్పటికే హై కోర్టు తీర్పు తీవ్ర స్థాయి నిరసనలను, ఆందోళనలను ప్రేరేపించింది.
పాలక పార్టీ విధేయులకు లబ్ది
విద్యార్ధుల ఆందోళన కారణరహితం కాదు. సంవత్సరాలు గడిచే కొద్దీ కోటా వ్యవస్థ ఫలితాలు అనుభవించగల ఫ్రీడం ఫైటర్ల సంఖ్య సహజంగానే తగ్గుతూ వచ్చింది. అందువలన కోటా కోసం నిర్దేశించిన ఉద్యోగాల ఖాళీలు పూర్తిగా భర్తీ కాకుండా మిగిలిపోవడం పెరుగుతూ వచ్చింది. ఇలా మిగిలిన ఖాళీలను అధికారంలో ఉన్నవాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతూ వచ్చాయి. ఫ్రీడం ఫైటర్లు యౌవనంలో ఉండి ఉద్యోగం కొరకు చూస్తున్న పరిస్ధితుల్లో వారికి రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమే కానీ వారి తరం ముగిసి మరో తరం, ఇంకో తరం వచ్చాక కూడా ఆ కోటాను యధావిధిగా కొనసాగించడం, పిల్లలకు, మనుమలకు కూడా రిజర్వేషన్లు అంటూ మభ్య పెట్టడం వెనుక ఏదో మతలబు ఉందని విమర్శలు మొదలైనాయి.
ముఖ్యంగా ఫ్రీడం ఫైటర్ల పిల్లలు, మనుమలతో భర్తీ కాకుండా మిగిలిన ఉద్యోగాలను పాలక అవామీ లీగ్ పార్టీ సభ్యులకు ఇస్తున్నారన్న అనుమానాలు అంతకంతకూ తీవ్రం అయ్యాయి. అదీకాక అవామీ లీగ్ పార్టీ సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉండడం వల్ల రాజ్యం లోని వివిధ అంగాలు ఆ పార్టీ చేతుల్లో కొనసాగేందుకు వీలుగా వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలను అవామీ లీగ్ పార్టీ విధేయులతో నింపేస్తున్నారన్న అనుమానాలు బయలుదేరాయి. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాత్-ఏ-ఇస్లామీ లు ఈ అనుమానాలను మరింత రెట్టింపు చేస్తూ ప్రచారం సాగించాయి.
విద్యార్ధుల కోటా వ్యతిరేక ఆందోళనలకు మార్చి 8, 2018 లో పునాది పడింది. 1970ల నుండి కొనసాగుతున్న కోటా వ్యవస్థ న్యాయబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హై కోర్టు కొట్టివేయడంతో అసంతృప్తికి బీజం పడింది. ఈ పరిస్ధితుల్లో విముక్తి ఉద్యమంలో పాల్గొన్న సైనిక యోధుల పిల్లలకు కోటా వ్యవస్థను కొనసాగిస్తానని షేక్ హసీనా ప్రకటించడం విద్యార్ధుల్లో మరింత అసంతృప్తిని రేపింది. ఈ కోటా వ్యవస్థను తన తండ్రి ప్రవేశ పెట్టడం వల్ల అది తన తండ్రి లెగసీ గా షేక్ హసీనా భావించింది. తన తండ్రి లెగసీ కొనసాగించడం తన కర్తవ్యంగా భావించింది. కానీ ఆమె చేసిన ప్రకటన విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనకు పురిగొల్పే నిప్పు రవ్వగా మారింది.
ఆందోళనల దరిమిలా షేక్ హసీనా బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ లో సమస్త కోటాలను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. అయితే ఇలా కోటాను పూర్తిగా రద్దు చెయ్యడం విద్యార్ధుల లక్ష్యం కాదు. వారు కోటా పూర్తి రద్దు కాకుండా కోటా వ్యవస్థను సమీక్షించి సంస్కరణలు చేయాలని కోరారు. కోటాలు పూర్తిగా రద్దు చేయడం ద్వారా షేక్ హసీనా “ఫ్రీడం ఫైటర్స్ వారసులకు రిజర్వేషన్ దక్కకపోతే ఇంక ఎవ్వరికీ రిజర్వేషన్ దక్క కూడదు” అని భావించినట్లుగా ఆందోళనకారులకు సందేశం ఇచ్చినట్లయింది. మరో రెండేళ్ల పాటు చర్చోపచర్చలు జరిగినా కూడా షేక్ హసీనా తన నిర్ణయం మార్చుకోలేదు. 2020లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చట్టంగా అమలు కావటం మొదలయింది.
జూన్ 2024 లో హై కోర్టు రిజర్వేషన్లను పునరుద్ధరించిన పిమ్మట దానికి వ్యతిరేకంగా హసీనా ప్రభుత్వం, విద్యార్ధుల నిరసనల నడుమ, జులై 2024లో సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. సుప్రీం కోర్టు, హై కోర్టు తీర్పును తిరస్కరించి ఫ్రీడం ఫైటర్స్ వారసులకు ఇచ్చిన రిజర్వేషన్ ను 30 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. మైనారిటీ తెగలకు, ట్రాన్స్ జెండర్లకు, వికలాంగులకు 2 శాతం కోటా కేటాయించింది. మిగిలిన 93 శాతం ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన జరిగే నియమాకాలకు అందుబాటులో ఉంచింది.
సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేనాటికి ఆందోళనలో అత్యధిక భాగం విద్యార్ధుల చేతుల నుండి ప్రతిపక్ష పార్టీ బి.ఎన్.పి, ఇస్లామిక్ సంస్థ జమాత్-ఏ-ఇస్లామి, పశ్చిమ దేశాల నిధులతో నడిచే ఎన్.జి.ఓ ల చేతుల్లోకి వెళ్లింది. జమాత్ కార్యకర్తలు హిందూ దేవాలయాలపై విధ్వంసం చేయడం మొదలు పెట్టారు. మైనారిటీ హిందువులపై ఆగడాలకు పాల్పడ్డారు. వారిని కొట్టడం, చుట్టుముట్టి వేధించడం లాంటి అల్లర్లకు పాల్పడ్డారు. తమను అరికట్టబోయిన పోలీసులపై తిరగబడి పెట్రోల్ బాంబులు విసరడం, తమకు అందిన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు.
సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా కన్ను
ఇస్లామిక్ సంస్థల ఆగడాలను గ్రహించిన విద్యార్ధి ఉద్యమ నాయకులు తమ శక్తి మేరకు వాటిని అడ్డుకునేందుకు నడుం బిగించారు. గ్రూపులుగా ఏర్పడి హిందువుల ఇళ్ళు, దేవాలయాల బైట కాపలా కాశారు. ఇస్లామిక్ శక్తుల దాడుల నుండి కొంతమేరకు మైనారిటీలకు రక్షణ కల్పించ గలిగారు. అయితే పశ్చిమ దేశాల ప్రోద్బలంతో ఉద్దేశ పూర్వకంగా విచక్షణారహితంగా హింసకు పాల్పడుతున్న వారికి వివిధ రాజకీయ లఖ్యాలు ఉన్నాయి. హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి తాము అధికారం చేపట్టడం బి.ఎన్.పి, జమాత్ ల లక్ష్యం కాగా, అమెరికా పశ్చిమ రాజ్యాల జియో పోలిటికల్ లక్ష్యాలను సాధించడం పశ్చిమ ఎన్.జి.ఓ ల లక్ష్యం.
బంగాళాఖాతం కు ముఖద్వారం ప్రదేశంలో కీలక స్థానంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపంలో సైనిక స్థావరం నెలకొల్పగలిగితే అమెరికాకు ఒక్క దెబ్బతో అనేక పిట్టలను కొట్టినట్లు అవుతుంది. అటు ఉండియా, ఇటు బంగ్లాదేశ్, మియాన్మార్ లలో పరిణామాలపై నిఘా పెట్టవచ్చు. చైనా, రష్యాల రవాణా నౌకలను నియంత్రించడం నుండి నిరోధించడం వరకు చేయవచ్చు. ముఖ్యంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ పైన బంగాళాఖాతంలో బలమైన దెబ్బ కొట్టవచ్చు.
అయితే సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ కు ప్రాణ సమానం. ఆ ద్వీపం బంగ్లాదేశ్ కు కూడా అనేక కారణాల రీత్యా కీలక భూభాగంగా ఉంటోంది. బంగ్లాదేశ్ ప్రజలు 3700 మందికి పైగా ద్వీపంలో నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు జాలరులు. ప్రధాన భూభాగం, మరియు ద్వీపం మధ్య నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. చేపల రవాణా నిత్యం జరుగుతుంది. అలాగే ద్వీపానికి జరిగే టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పర్యావరణ పరంగా అత్యంత కీలక ప్రాంతంగా ఈ ద్వీపం ఉన్నది. వైవిధ్యభరితమైన సముద్ర జీవులు ద్వీపం చుట్టూ నివాసం ఏర్పరుచుకున్నాయి. మియాన్మార్, బంగ్లాదేశ్ ల మధ్య ఈ ద్వీపమే సరిహద్దు. బంగ్లాదేశ్ ఎక్స్ క్లూజీవ్ ఎకనమిక్ జోన్ లో భాగంగా సెయింట్ మార్టిన్ ద్వీపం ఉన్నది. అలాగే ద్వీపం చుట్టూ అనేక చిన్న చిన్న పగడాల దిబ్బలు విస్తరించి అక్కడి జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం కావిస్తున్నాయి.
ఇలాంటి ద్వీపాన్ని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కానీ, బి.ఎన్.పి-జమాత్ ల ప్రభుత్వం కానీ అమెరికాకు అంత తేలికగా అప్పగించగలవా అన్నది అనుమానమే. అమెరికాకు ప్రవేశం కల్పిస్తే బంగ్లాదేశ్ ప్రజలు మిన్నకుంటారా అన్నది ఒక ప్రశ్న. తమ విలువైన ఆస్తిగా పరిగణించే సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు ఇస్తే అది బంగ్లాదేశ్ ప్రజలందరికీ ఒక ఎమోషనల్ సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. అవామీ లీగ్ పార్టీ అటువంటి చర్యను తమకు అనుకూలంగా ఉపయోగించకోకుండా ఉండదు కూడా. అలాగే అమెరికా చేతుల్లోకి సెయింట్ మార్టిన్ ద్వీపం వెళితే అది ఇండియా జియో పోలిటికల్ ప్రయోజనాలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కలకత్తా రేవులోని నావల రాకపోకలపై అమెరికా ప్రత్యక్ష నిఘా ఉండటాన్ని భారత పాలకులు అంగీకరిస్తారా? అంగీకరిస్తే వారి స్వభావం ఏమిటన్నది భారత ప్రజలకు తెలిసి వస్తుంది.