
బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన ‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’ ఇండియాకు హెచ్చరిక జారీ చేసింది. “మా శత్రువు (షేక్ హసీనా) కు సహాయం చేస్తే మీతో సహకారం కొనసాగించడం కష్టం అవుతుంది” అని బి.ఎన్.పి పార్టీ ఇండియాను గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు బి.ఎన్.పి పార్టీ ప్రతినిధి మరియు బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్, హెచ్చరించాడు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఇండియాలో రక్షణ కల్పించడం ఆ దేశ ప్రతిపక్ష పార్టీ బి.ఎన్.పి కి సుతారాము నచ్చలేదని బి.ఎన్.పి ప్రకటన ద్వారా తెలుస్తున్నది. షేక్ హసీనా ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా పాలిస్తున్నారు. జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో సైతం షేక్ హసీనా నాయకత్వం లోని అవామీ లీగ్ పార్టీయే విజయం సాధించిందని, షేక్ హసీనా నాలుగవ సారి ప్రధాన మంత్రిగా కొనసాగనుందని బంగ్లా పత్రికలు తెలిపాయి.
బి.ఎన్.పి ప్రతినిధి గయేశ్వర్ చంద్ర రాయ్, ఇండియా, షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడం పట్ల ఆందోళన ప్రకటిస్తూ ఇలా పేర్కొన్నాడు, “బంగ్లాదేశ్, ఇండియాలు పరస్పర సహకారం కలిగి ఉండాలని బి.ఎన్.పి భావిస్తున్నది. పరస్పర సహకార స్ఫూర్తికి అనుగుణంగానే భారత ప్రభుత్వం తగిన అవగాహనతో వ్యవహరించ వలసి ఉంటుంది. కానీ మీరు మా శత్రువుకు సహాయం చేస్తే ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకారాన్ని గౌరవించడం కష్టం అవుతుంది. గత ఎన్నికలకు ముందు హసీనా ప్రభుత్వం లోని విదేశీ మంత్రి షేక్ హసీనా తిరిగి అధికారానికి వచ్చేందుకు ఇండియా సహాయం చేస్తుందని ఇక్కడ ప్రకటించాడు. షేక్ హసీనా నేర భారాన్ని ఇండియాయే మోస్తున్నది… భారత, బంగ్లాదేశ్ ప్రజల మధ్య ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఇండియా బంగ్లాదేశ్ దేశానికి మొత్తంగా కాకుండా కేవలం ఒకే పార్టీకి ప్రోత్సాహం అందిస్తుందా?” అని ప్రశ్నించాడాయన (ఎకనమిక్ టైమ్స్, ఆగస్టు 09, 2024).
బి.ఎన్.పి హిందూ వ్యతిరేక పార్టీ అన్న అభిప్రాయంలో నిజం లేదు. ఆ అభిప్రాయాన్ని పనిగట్టుకుని సృష్టించారు. బి.ఎన్.పి పార్టీలో అన్నీ మతాల వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ హయాంలో నేను అత్యున్నత పదవుల్లో ఉన్నాను. బి.ఎన్.పి జాతీయ పార్టీయే కానీ అన్నీ మతాల ప్రజల వ్యక్తిగత హక్కులను పార్టీ గౌరవిస్తుంది. 1991లో నేను మంత్రిగా ఉన్నపుడు దుర్గా పూజకు డొనేషన్లు ఇచ్చే వ్యవస్థను ప్రారంభించాను. ఏ ప్రభుత్వమూ దీనిని ఆపలేదు. ఇంకా కొనసాగుతోంది. దీనిని తెచ్చింది మా పార్టీయే” అని బి.ఎన్.పి ప్రతినిధి వివరించాడు.
“కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా బి.ఎన్.పి టెర్రరిస్టులకు మద్దతు ఇవ్వడం నిజం కాదు. మా స్వతంత్రంలో ఇండియా సహాయం చేసింది. కాబట్టి ఇండియాకు వ్యతిరేకంగా మేము ఉండే ప్రసక్తే ఏర్పడదు. మాది చిన్న దేశం. వైద్య సౌకర్యాలతో సహా మా ప్రజలకు కావలసిన అనేక సరుకుల కోసం మాకు ఇండియా కావాలి. వీటి ద్వారా ఇండియాకు వచ్చే రెవిన్యూ తక్కువేమీ కాదు” అని ప్రతినిధి గయేశ్వర్ రాయ్ స్పష్టం చేశాడు.
“ముస్లిం ఫండమెంటలిస్టు సంస్థ జమాత్-ఏ-ఇస్లామి తో బి.ఎన్.పి పార్టీకి ఉన్న సంబంధాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం. ఆ సంస్థతో పొత్తు కేవలం ఎత్తుగడ రీత్యా ఎన్నికల రాజకీయాల కోసం ఏర్పరచుకున్నదే” అని గాయేశ్వర్ రహస్యం విప్పడం విశేషం.
జమాత్-ఏ-ఇస్లామి, దాని అనుబంధ విద్యార్ధి సంఘం ఛాత్ర శిబిర్ లతో పాటు ఇతర ఇస్లామిక్ సంస్థలు బంగ్లాదేశ్ లోని హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులను పశ్చిమ బెంగాల్ బి.జె.పి తన ఓట్ల రాజకీయాలకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నది కూడా. ఈ నేపధ్యం లోనే జమాత్-ఏ-ఇస్లామితో తమకు ఉన్న రాజకీయ అవగాహనను తక్కువ చేసి చెప్పేందుకు బి.ఎన్.పి పార్టీ ప్రతినిధి పాటు పడుతున్నాడు.
“విద్యార్ధులు రాజకీయేతర ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. అందుకే వారు మహమ్మద్ యూనస్ ను ప్రధాన మంత్రిగా ఉండాలని కోరారు. అందుకే మేము మా పార్టీ నుండి ప్రధాన మంత్రి పదవికి ప్రతిపాటించలేదు” అని గాయేశ్వర్ వివరించాడు.

BNP Standing Committee member Gayeshwar Chandra Roy
బి.ఎన్.పి ప్రతినిధి మాటలను బట్టి తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. మహమ్మద్ యూనస్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన వెనుక మిలట్రీయే ప్రభుత్వం పైన నియంత్రణ కలిటీ ఉంటుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో మిలట్రీ ప్రభుత్వాన్ని మేము అంగీకరించేది లేదని విద్యార్ధి ఆందోళన నాయకులు స్పష్టం చేయడంతో ప్రభుత్వ నియంత్రణలో మిలట్రీ పాత్ర కనపడకుండా జాగ్రత్త పడతారు.
మహమ్మద్ యూనస్ ని మధ్యంతర ప్రభుత్వ సారధిగా నియమించడం వెనుక అమెరికా, పశ్చిమ దేశాల ఎత్తుగడ ఉందన్నది నిర్వివాదాంశం. బంగ్లాదేశ్, దాని పొరుగునే ఉన్న మియాన్మార్ లలో ఇప్పటి వరకు చైనా వాణిజ్య సంబంధాలు దండిగా కొనసాగాయి. బంగ్లాదేశ్ కు చెందిన, బంగాళాఖాతం లోని ఒక ద్వీపాన్ని తమకు లీజుకు ఇవ్వాలని అమెరికా ఎప్పటి నుండో కోరుతున్నది. అమెరికా కోరికను మహమ్మద్ యూనస్ నెరవేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అదే జరిగితే గనుక ఇండియాకు అతి సమీపంలో అమెరికా సైనిక స్థావరం స్థాపించబడే పరిస్ధితి ఏర్పడుతుంది. అంతే కాకుండా సదరు సైనిక స్థావరంకు కావలసిన అనేకానేక సౌకర్యాలు కల్పించాలని అమెరికా, ఇండియాను డిమాండ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా భారత పాలకులు రష్యా, అమెరికాల మధ్య సమానదూరం పాటిస్తున్నామన్న నటన కాస్తా గాలిలో కలిసిపోతుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశంగా రష్యా, చైనాలతో వాణిజ్య, మిలటరీ సంబంధ బాంధవ్యాలకు పెను ప్రమాదం వాటిల్లనుంది.