
St. Martin Island in North-Eastern Bay of Bengal
విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలు, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థల హింసాత్మక ఆందోళనల ఫలితంగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు వేడిన మాజీ ప్రధాని షేక్ హసీనా, అసలు గుట్టును బట్టబయలు చేసిందని రష్యా టుడే పత్రిక తెలియజేసింది. బంగ్లాదేశ్ ద్వీపాన్ని సైనిక స్థావరం నిర్మించేందుకు లీజుకు ఇచ్చేందుకు నిరాకరించినందు వల్లనే అమెరికా ఇప్పుడు తనపై ప్రతీకారం తీర్చుకుందని షేక్ హసీనా కుండ బద్దలు కొట్టింది.
తన పదవీచ్యుతిలో అమెరికా పాత్ర ఉన్నదని ఆమె స్పష్టం చేసినట్లు రష్యా టుడే పత్రిక వెల్లడి చేసింది. బంగ్లాదేశ్ లో అమెరికా మిలటరీ బేస్ నెలకొల్పేందుకు తాను అంగీకారం ఇచ్చినట్లయితే ఇప్పటికీ తాను అధికారంలో కొనసాగుతూ ఉండేదాన్నని షేక్ హసీనా వెల్లడించారు.
“విగత దేహాలు ఊరేగింపుగా వెళ్ళడం చూడకుండా ఉండేందుకే నేను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశాను. విద్యార్ధుల శవాల మీదుగా అధికారం లోకి రావాలని వారు భావించారు. కానీ నేను దానిని అనుమతించలేను. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశాను” అని షేక్ హసీనా చెప్పారు.
“సెయింట్ మార్టెన్ ద్వీపంపై సార్వభౌమాధికారాన్ని వదులుకుని అక్కడ అమెరికా సైనిక స్థావరం నెలకొల్పేందుకు అంగీకరించి బంగాళాఖాతంపై సంపూర్ణ ఆధిపత్యం, పెత్తనం సాగించే అవకాశం నేను ఇచ్చినట్లయితే నేను అధికారంలో కొనసాగుతూ ఉండేదాన్ని. ర్యాడికల్స్ చేతుల్లో మోసపోవద్దని నేను నా జన్మభూమి లోని ప్రజలను నేను వేడుకొంటున్నాను” అని మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ లో ఆందోళనలకు నాయకత్వం వహించిన విద్యార్ధులకు విజ్ఞప్తి చేశారు.
బంగాళాఖాతంలో ఈశాన్య మూలన ఉన్న పగడాల దిబ్బ (కోరల్ రీఫ్) ను బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఉద్దేశించి మాట్లాడుతున్న సంగతి ఇక్కడ గమనించాలి. ఈ ద్వీపాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా అనేక యేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ద్వీపాన్ని తమకు లీజ్ కు ఇవ్వాలని అమెరికా అనేకసార్లు ప్రతిపాదన చేసిందని, కానీ బంగ్లా ప్రభుత్వం అందుకు నిరాకరించిందని అనేక మంది బంగ్లాదేశ్ అధికారులు గతంలో అనేకసార్లు వెల్లడి చేశారని రష్యా టుడే పత్రిక తెలిపింది.
షేక్ హసీనా ‘తెల్లజాతి వ్యక్తులు జనవరి 2024 ఎన్నికలకు ముందు తనను కలిశారని, సెయింట్ మార్టిన్ లో అమెరికా సైనిక స్థావరం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని తనను కోరారని’ ఎకనమిక్ టైమ్స్ పత్రిక చెప్పిన సంగతిని కూడా రష్యా టుడే ప్రస్తావించింది. షేక్ హసీనా చెప్పిన తెల్ల వ్యక్తులు అమెరికన్ అధికారులే అని రష్యా టుడే నిర్ధారించింది.
షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేసిన ఆందోళనలలో జమాత్, ఛాత్ర శిబిర్ లాంటి ఇస్లామిక్ సంస్థలతో పాటు అమెరికన్ బిలియనీర్ జార్జి సోరోస్ నిధులతో నడిచే ఎన్.జి.ఓ సంస్థల కార్యకర్తలు జొరబడి రక్తపాతం సృష్టించడంతో 400 మందికి పైగా ఆందోళనకారులు మరణించారు. ఈ మరణాలలో పోలీసులు కూడా ఉన్నారు. ఆందోళనకారుల రూపంలో ఉన్న ఎన్.జి.ఓ కార్యకర్తలు, జమాత్ కార్యకర్తలు ఆధునిక ఆయుధాలతో పోలీసులతో తలపడడంతో పోలీసులు కూడా అనేక మంది మరణించారు.
బంగ్లాదేశ్ ఇంటలిజెన్స్ సంస్థలు ఇలాంటి ఆయుధాలను జమాత్ కార్యకర్తలకు అందజేశారని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజేద్ జాయ్ ఇంటలిజెన్స్ సహాయం లేకుండా పోలీసులపై ఆయుధం ఎత్తే సాహసం ఎవరూ చేయబోరని ఆయన వ్యాఖ్యానించాడు. తన తల్లి షేక్ హసీనా కూడా కొన్ని తప్పులు చేసినట్లుగా జాయ్ అంగీకరించడం విశేషం. అయితే పరిస్ధితికి పూర్తి బాధ్యతను కేవలం తన తల్లి పైనే వేయడం న్యాయం కాదని ఆయన వ్యాఖ్యానించాడు.
ప్రతిపక్షాలు, జమాత్ సంస్థలు, కొన్ని విదేశీ సంస్థలు సంయుక్తంగా కుట్ర పన్ని ఇంతమంది చావుకు కారణం అయ్యారని నజీబ్ జాయ్ చెప్పాడు. వీలైనంత త్వరలో ఎన్నికలు జరపక పోతే దేశంలో అల్లకల్లోలం చెలరేగుతుందని, దేశం మళ్ళీ మిలటరీ చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని, అలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని నజీబ్ జాయ్ ప్రతిపాదించాడు.