
Awami League Leader and Ousted PM Shaik Hasina
జనవరి 2024 ఎన్నికల్లో 4వ సారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఎన్నికయిన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా సోమవారం ఆగస్టు 5 తేదీన అక్కడి మిలటరీ సమకూర్చిన హెలికాప్టర్ లో ఇండియాకు పారిపోయి రావడంతో భారత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జులై 1 తేదీ నుండి బంగ్లా దేశ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ పరిస్ధితి ఇంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని భావించిన వారు చాలా తక్కువ మందే!
షేక్ హసీనా ఇండియా పారిపోవలసి రావడం ఆమె స్వయం కృతమే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అది పాక్షిక వాస్తవమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజల నిరసనలు, ఏ దేశంలో అయినా సరే, ప్రభుత్వాలు కూలిపోయే స్థాయికి చేరిన ఉదాహరణలు చరిత్రలో చాలా తక్కువ. కమ్యూనిస్టు విప్లవ తిరుగుబాట్లు జరిగిన చోట తప్ప ప్రభుత్వాలపై అసంతృప్తితో ప్రజలు నిరసన ప్రదర్శనలు జరిగిన చోట, అవి ఎంత తీవ్రంగా జరిగినప్పటికీ, ఆ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయే పరిస్ధితి రావటం అన్నది కేవలం అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల జోక్యం ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. అది ఉక్రెయిన్ కావచ్చు, జార్జియా కావచ్చు, హోండురాస్, శ్రీలంక… ఇలా ఏ దేశం చూసుకున్నా ప్రధాన మంత్రి / అధ్యక్షుడు దేశం విడిచి ప్రాణభయంతో పారిపోవడం జరిగిన ప్రతిసారీ అమెరికా, పశ్చిమ రాజ్యాల జోక్యం ఉన్నప్పుడే జరిగింది.
అమెరికా, పశ్చిమ రాజ్యాల నిధులతో పని చేసే ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) లు, బంగ్లాదేశ్ మిలటరీల మద్దతుతో బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలలో ఒకటైన జమాత్-ఏ-ఇస్లామీ దాని విద్యార్ధి విభాగం ఛత్ర శిబిర్, మరో ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బి.ఎన్.పి)… ఇవన్నీ విద్యార్ధులు ప్రారంభించిన ఆందోళనలను హింసాత్మకంగా మార్చడంలో తగిన కృషి చేశాయి. ఆగస్టు 5 తేదీన ప్రధాన మంత్రి భవనంపైకి దాడికి ఆందోళనకారులు పిలుపు ఇవ్వడంతో షేక్ హసీనా ఇండియాకు పోరిపోయి రావలసి వచ్చింది. తాను తదుపరి కార్యాచరణ రూపొందుంచుకునే వరకు ఆమెకు ఇండియాలో ఆశ్రయం ఇస్తామని భారత విదేశీ మంత్రి జై శంకర్ ప్రకటించాడు.
జమాత్-ఏ-ఇస్లామి పార్టీ ఇస్లామిక్ ఫండమెంటలిస్టు పార్టీ. ఇది పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించే పార్టీ. ఉమ్మడి పాకిస్తాన్ లో ఇది ‘జమాత్-ఏ-ఇస్లామి పాకిస్తాన్’ పేరుతో ఉండేది. 1971 లో బంగ్లా దేశ్ విముక్తి పోరాటంలో ఈ పార్టీ అత్యంత విద్రోహకర, పాకిస్తాన్ అనుకూల పాత్ర పోషించింది. పోరాటంలో పాల్గొన్న అనేక మంది ప్రజలను ఈ పార్టీ ఊచకోత కోసింది.
1971 నాటి పాక్ వ్యతిరేక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షేక్ హసీనా తండ్రి ముజిబూర్ రెహ్మాన్ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి చెందిన అనంతరం ఆ దేశ ప్రధానిగా జపాన్-ఏ-ఇస్లామి పాకిస్తాన్ పార్టీ పై నిషేధం విధించాడు. అయితే 1975లో జరిగిన మిలటరీ కుట్రలో ముజిబూర్ రెహ్మాన్ హత్యకు గురయ్యాడు. బంగ్లా మిలటరీ పాలకులు నిషేధం ఎత్తివేయడంతో జమాత్-ఏ-ఇస్లామి బంగ్లాదేశ్ గా ఆ పార్టీ తిరిగి తన కార్యకలాపాలు ప్రారంభించింది. బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు 1 ఆగస్టు 2013 తేదీన జమాత్-ఏ-ఇస్లామి బంగ్లాదేశ్, ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలలో పాల్గొనే అర్హత లేదని తీర్పు ఇస్తూ ఆ పార్టీ లైసెన్స్ ను రద్దు చేసింది. కానీ ఇస్లామిక్ సంస్థగా దాని ఉనికి కొనసాగింది. ఆ తర్వాత మొన్న 1 ఆగస్టు 2024 తేదీన షేక్ హసీనా ప్రభుత్వం సంస్థపై పూర్తిగా నిషేధం విధించింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో జమాత్ పార్టీ తిరిగి తన కార్యాలయాలను తెరిచే పనిలో నిమగ్నం అయింది.
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని 1978లో బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ స్థాపించాడు. ఈయన కూడా బంగ్లా విముక్తి పోరాటంలో బంగ్లా బలగాలకు కమాండర్ గా పని చేశాడు. ముజిబూర్ రెహ్మాన్ ను మిలట్రీలోని ఒక వర్గం హత్య చేసి అధికారానికి రాగా ఆ వర్గంపై జరిగిన కౌంటర్ మిలటరీ కుట్రకు జియావుర్ రెహ్మాన్ నాయకత్వం వహించాడు. (పాక్-ఇండియాల మధ్య జరిగిన రెండవ కాశ్మీర్ యుద్ధంలో ఈయన కమాండర్ గా పని చేసి పాక్ ప్రభుత్వం నుండి హిలాల్-ఏ-జుర్రత్ అవార్డు పొందాడు.) ఆ విధంగా ముజిబూర్ రెహమాన్ హత్య తర్వాత జియావుర్ 1977లో రెహ్మాన్ డి ఫాక్టో అధ్యక్షుడు అయ్యాడు. మిలటరీ పాలకునిగా బంగ్లా నేషనల్ పార్టీ స్థాపించాడు. ఆయన భార్య ఖలేదా జియా ఇప్పుడు బి.ఎన్.పి పార్టీకి నేత.
జియావుర్ రెహమాన్ బహుళ పార్టీ వ్యవస్థను తిరిగి స్థాపించాడు. పత్రికా స్వేఛ్ఛకు, భావ ప్రకటనా స్వేఛ్ఛకు మద్దతు ఇచ్చాడు. ఉమ్మడి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి కార్యక్రమం, సామాజిక సంక్షేమ పధకాలు అమలు చేశాడు. 1985లో ఏర్పడిన సార్క్ కూటమిలో భాగం పంచుకున్నాడు. పశ్చిమ దేశాలు, చైనా దేశాలతో సంబంధాలు నెలకొల్పాడు. ఇండియాతో స్నేహ సంబంధాలకు స్వస్తి పలికాడు. తన అధ్యక్షరికంలో 21 సార్లు మిలట్రీ కుట్రలు ఎదుర్కొన్నాడు. చివరికి 30 మే 1981 తేదీన జరిగిన మిలటరీ కుట్రలో చనిపోయాడు. అనంతరం అధికారం చేపట్టిన అబ్దుస్ సత్తార్ ప్రభుత్వాన్ని జనరల్ ఎర్షాద్ రక్తరహిత కుట్రతో కూల్చి తానే అధ్యక్ష పీఠం ఎక్కాడు. 1990 వరకు అమెరికా మద్దతుతో ఎర్షాద్ మిలటరీ పాలన కొనసాగింది. ఖలేదా జియా, షేక్ హసీనాల నాయకత్వంలో ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఆందోళనల ఫలితంగా ఎర్షాద్ రాజీనామా చేశాడు.
ఈ విధంగా బంగ్లాదేశ్ చరిత్ర మొత్తం హత్యలు, తిరుగుబాట్లు, మిలట్రీ కుట్రలతో నిండిపోయింది. అమెరికా- సోవియట్ రష్యాల మధ్య సాగిన ప్రచ్చన్న యుద్ధం బంగ్లాదేశ్ పరిణామాలలో అనివార్యంగా పాత్ర పోషించాయి. ఇప్పుడు ఏక ధృవ ప్రపంచ పునః ష్టాపన కోసం అమెరికా, యూరోపియన్ యూనియన్ (నాటో కూటమి) ఒకవైపు, బహుళ ధృవ ప్రపంచ స్థాపన కోసం రష్యా, చైనాలు మరొకవైపు నిలబడి ఘర్షణ పడుతున్న నేపధ్యంలో ఈ ఘర్షణ వివిధ దేశాల ప్రభుత్వాల తలరాతలను నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం
బంగ్లాదేశ్ లో తాజా సంక్షోభం 1971 నాటి విముక్తి పోరాట యోధుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రకటించడంతో మొదలయింది. వివిధ కేటగిరీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్ కోటా కింద చేరడం విద్యార్ధులలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. ఇందులో 30 శాతం రిజర్వేషన్లు బంగ్లా విముక్తి పోరాట సైనికుల మనుమలకు, మనుమరాండ్లకు కేటాయిస్తున్నట్లు జనవరి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన అనంతరం హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్ వ్యవస్థను సమీక్షించి సవరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధులు జులై 1 నుండి ఆందోళన ప్రారంభించారు. ముఖ్యంగా విముక్తి పోరాట సైనికుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, అది కూడా నిరంతరాయంగా ఇది కొనసాగేలా చట్టం చేయడం పూర్తి అన్యాయంగా విద్యార్ధులు భావించారు. మిగిలిన చాలా తక్కువ ఉద్యోగాలకు ఇతర విద్యార్ధులు పోటీ పడ వలసి రావటాన్ని వారికి మింగుడు పడలేదు.

విద్యార్ధుల ఆందోళన ఆరంభంలో శాంతియుతంగా జరిగింది. ఆందోళన ఎంతకీ చల్లబడక పోవడంతో షేక్ హసీనా ప్రభుత్వం 30 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే విద్యార్ధుల ఉద్యమం హైజాక్ కి గురయింది. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్ నేతృత్వం లోని ఓపెన్ సొసైటీస్, తదితర ఎన్.జి.ఓ సంస్థల నేతృత్వంలో బంగ్లాదేశ్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక ఎన్.జి.ఓ లు అప్పటికే ఉద్యమంలోకి చొరబడ్డారు. మరోపక్క ఖలేదా జియా పార్టీకి చెందిన బంగ్లా నేషనల్ పార్టీ కార్యకర్తలు, పాకిస్తాన్ మిలటరీ గూఢచార సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేసే సంస్థలు, ఐఎస్ఐ మద్దతు ఉన్న జమాత్ అనుబంధ విద్యార్ధి సంస్థ ఛాత్ర శిబిర్ కార్యకర్తలు… వీళ్ళంతా ఉద్యమంలోకి చొరబడ్డారు. ఈ సంస్థలన్నింటినీ అమెరికన్ ఎన్.జి.ఓ లు ఒక్కటిగా ఆర్గనైజ్ చేశాయి.
ఫలితంగా రిజర్వేషన్ లను రద్దు చేసినట్లు హసీనా ప్రకటించినప్పటికీ ఆందోళన కొనసాగింది. తలవని తలంపుగా హై కోర్టు డివిజన్ బెంచీ ఒకటి ప్రధాని హసీనా రద్దు చేసిన రిజర్వేషన్లను పునరుద్ధరించింది. పునరుద్ధరణకు వ్యతిరేకంగా మళ్ళీ ప్రధాని హసీనాయే సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టు రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గిస్తూ తీర్పు ప్రకటించింది. కానీ ప్రజాందోళనలు చల్లారలేదు. సుప్రీం కోర్టును హసీనా మద్దతుదారుగా ఆందోళనకారులు పరిగణించారు.
ఆందోళన తీవ్రం కావటంతో వారిపై గట్టి చర్య తీసుకోవాలని ప్రధాని హసీనా మిలటరీని, పోలీసులను కోరింది. అయితే అప్పటికే మిలటరీ విధేయత నిర్ణయం అయిపోయింది. ఆందోళనకారులపై చర్యలకు మిలటరీ నిరాకరించింది. పైగా “మేము ఎప్పుడూ ప్రజల పక్షమే” అని ప్రకటించింది. అప్పటికే పోలీసులకు, ఆందోళనకారుల మధ్య రోజుల తరబడి సాగిన హింసాత్మక దాడుల్లో వందల మంది చనిపోయారు. పోలీసులు కూడా చనిపోయినవారిలో ఉన్నారని తెలుస్తోంది.
ఆందోళనకారులు గుంపులు గుంపులుగా వీధుల్లో తిరుగుతూ అవామీ లీగ్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మంత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, ఇళ్ళు, ఆస్తులు తగలబెట్టడం, కాల్పులు జరిపి చంపడం… యధేచ్చగా కొనసాగించారు.
అల్లర్ల వెనుక పాకిస్తాన్, చైనా పాత్ర ఉన్నదని కొన్ని పత్రికలు ఊహాగానాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ పాత్ర ఉన్న సంగతి స్పష్టమే. బంగ్లా విముక్తి అనంతరం పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో నిరంతరం అండర్ గ్రౌండ్ కార్యకలాపాలు కొనసాగించింది. ముఖ్యంగా జమాత్-ఏ-ఇస్లామి సంస్థ కార్యకలాపాలకు సంపూర్ణ మద్దతు అందజేస్తూ ఇండియా వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొట్టింది. బంగ్లా విముక్తిలో ఇండియా ప్రధాన పాత్ర ఉన్నప్పటికీ అది బంగ్లాదేశ్ ప్రజల జ్ఞాపకాల నుండి క్రమక్రమంగా అంతర్ధానమై దాని స్థానంలో ఇండియా విద్వేషం ఆక్రమిస్తూ వచ్చింది. గత మూడు విడతలుగా ఎన్నికల్లో నెగ్గి, జనవరి 2024 లో మళ్ళీ విజయం సాధించిన షేక్ హసీనా ఇండియాకు అనుకూలంగా వ్యవహరించడం చాలా మందికి నచ్చలేదు.

BNP leader Begum Khaleda Zia released from house arrest
జనవరి 2024 ఎన్నికల్లో కేవలం 40 శాతం మంది ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. దీనిని ఎత్తి చూపిస్తూ అమెరికా, పశ్చిమ దేశాలు షేక్ హసీనా ఎన్నిక చెల్లదు అని ప్రకటనలు గుప్పించాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించాయి. (యూరోపియన్ కమిషన్ కు జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ నుండి కేవలం 32 శాతం ఓటర్లు మాత్రమే పాల్గొనడం గమనార్హం. పశ్చిమ దేశాల దృష్టిలో బ్రిటన్ ఇయు ఎన్నికలకు ఒక కొలమానం, బంగ్లాదేశ్ ఎన్నికలకు మరొక కొలమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు.) నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బి.ఎన్.పి పాల్గొనకుండా బహిష్కరించింది. బి.ఎన్.పి నాయకురాలు బేగమ్ ఖలేదా జియా పై అవినీతి ఆరోపణలు నిరూపణ కావడంతో 2018లో ఆమెకు 17 సం.ల జైలు శిక్ష విధించారు. అయితే ఆమెను జైలుకు తరలించటానికి బదులు హౌస్ అరెస్ట్ చేసింది హసీనా ప్రభుత్వం. షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియా పారిపోయిన అనంతరం అధికారం చేతుల్లోకి తీసుకున్న మహమ్మద్ షహాబుద్దీన్ నేతృత్వం లోని మిలట్రీ ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్య బేగమ్ ఖలేదా జియాను విడుదల చేయటం! (ఖలేదా జియా 1991-1996 వరకు ఒకసారి, 2001-2006 వరకు మరొకసారి బంగ్లా ప్రధానిగా పని చేశారు. ఆమె పాలన అవినీతి ఆరోపణలతో చెడ్డ పేరు తెచ్చుకుంది.)
ఇండియా సలహా
షేక్ హసీనా ఇండియాతో సంపూర్ణ స్నేహ సంబంధాలు నెలకొల్పుకుంది. ఆమె హయాంలో ఇండియాకు చెందిన దళారీ పెట్టుబడిదారులు బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ఒక అంచనా ప్రకారం భారత్-బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్యం 17 బిలియన్ డాలర్ల వరకు ఉన్నది. ఈ నేపధ్యంలో షేక్ హసీనా రాజీనామా చేసి నేరుగా ఇండియాలో శరణు వేడటంలో ఆశ్చర్యం లేదు.
బంగ్లాదేశ్ లో ఆందోళనలు కొనసాగినంత కాలం ఇండియా ఆ దేశ అధ్యక్షురాలితో నిరంతరం సంప్రతింపులు జరుపుతూ వచ్చింది. ఆందోళనకారులపై విచక్షణా రహితంగా పోలీసు కాల్పులు జరిపించడం, విద్యార్ధులతో వీధి యుద్ధాలకు తలపడడం లాంటి వాటిని తగ్గించాలని షేక్ హసీనాకు సలహా ఇచ్కినట్లుగా ఇండియా విదేశీ మంత్రి జై శంకర్ చెబుతున్నారు. ఆగస్టు 6 తేదీన భారత విదేశాంగ మంత్రి పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇండియా ఇచ్చిన సలహాలను షేక్ హసీనా పెడ చెవిన పెడుతూ వచ్చిందని ఆయన పార్లమెంటులో చెప్పారు.
తీవ్ర స్థాయి నిర్బంధం అమలు చేయకుండా సంయమనం పాటించాలన్న ఇండియా సలహాను ఆమె పట్టించుకోలేదని చెప్పారు. “ఈ కాలం అంతటా సంయమనం పాటించాలని, చర్చల ద్వారా ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నించాలని మనం సలహా ఇచ్చాము” అని జై శంకర్ పార్లమెంటులో చెప్పారు. “తదనంతరం తీసుకున్న వివిధ చర్యలు, నిర్ణయాలు పరిస్ధితిని మరింత క్లిష్టం చేశాయి” అని చెప్పారు. ప్రభుత్వం, ఆందోళనకారులు ఇరువురూ కఠిన వైఖరి అవలంబించడంతో పరిస్ధితి ఇంకా క్షీణించి ప్రధాని పదవీచ్యుతికి దారితీసింది అని జై శంకర్ వివరించారు.
ఆందోళనకారులపై సీరియస్ నిబంధం ప్రయోగించాలని హసీనా సీనియర్ మిలటరీ అధికారులను, పోలీసు అధికారులను పదే పదే కోరినప్పటికీ వారు నిరాకరించారు. దానితో ఆమె ఇండియాకు వర్తమానం పంపడం, ఆర్మీ హెలికాప్టర్ లో ఆమె ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ లో దిగడం జరిగిపోయింది. “తన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది” అని జై శంకర్ పార్లమెంటుకు చెప్పారు.
ఆగస్టు 6 తేదీన ప్రధాని నరేంద్ర మోడి అన్ని పార్టీలతో సమావేశం జరిపారు. ఎందుకంటే భారత దళారీ పెట్టుబడిదారుల పెట్టుబడుల జాతకాలు బంగ్లాదేశ్ తో ముడిపడి ఉన్నాయి. అంతే కాకుండా బంగ్లా సంక్షోభం పొరుగునే ఉన్న భారత సరిహద్దు రాష్ట్రాలపైన తప్పకుండా పడుతుంది. పరిస్ధితి తీవ్రతను గుర్తించకుండా కొంతమంది బిజెపి నాయకులు అప్పుడే మత దృక్కోణం నుండి ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. బంగ్లాదేశ్ నుండి అనేకమంది హిందువులు భారతదేశానికి వలస రానున్నారని ప్రకటిస్తున్నారు. తద్వారా తాము తెచ్చిన సిఏఏ చట్టం న్యాయబద్ధం అని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే జై శంకర్ చేసిన పై విశ్లేషణను మళ్ళీ పాక్షిక విశ్లేషణగా చెప్పక తప్పదు. ఎందుకంటే షేక్ హసీనాకు తాను ఎవరితో తలపడుతున్నదీ స్పష్టంగా తెలుసు. తన ప్రభుత్వానికి, తనకు ఎవరి నుండి ప్రమాదం ఎదురు కానున్నదో ఆమే కొద్ది సంవత్సరాలుగా చెబుతూనే వస్తున్నారు. ఆమె చెబుతూ వచ్చిన అంశాలు ఇప్పుడు అక్షరాలా అమలు కావటమే మనం గ్రహించాల్సిన అసలు నిజం.
ఏమిటా నిజం?
నిజం లోకి వెళ్ళే ముందు కొన్ని అంశాలు చెప్పుకోవాలి. 1971 నాటి బంగ్లా స్వతంత్రానికి నాయకత్వం వహించి, అనంతరం మిలట్రీ కుట్రలో హత్య చేయబడ్డ ముజిబూర్ రెహమాన్ (షేక్ హసీనా తండ్రి) స్మారకార్ధం పెద్ద విగ్రహం ఒకటి ఢాకాలో ప్రతిష్టించారు. ఆందోళనకారులు ఈ విగ్రహం తలవరకు ఎక్కి సుత్తితో బద్దలు కొట్టేందుకు విఫల యత్నం చేస్తున్న దృశ్యం పశ్చిమ వార్తా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. తన తండ్రి వలెనే తననూ హత్య చేయనున్నారని గ్రహించిన షేక్ హసీనా బంగ్లా దేశ్ నుండి తప్పుకున్నారు. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న నిజం అది కాదు.
జనవరి 2024 ఎన్నికలను అమెరికా, కెనడా, రష్యా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (ఓఐసి), అరబ్ లీగ్ కు చెందిన అరబ్ పార్లమెంటు.. తదితర దేశాలకు చెందిన ఎన్నికల పరిశీలకులు స్వయంగా పర్యవేక్షించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ ప్రతినిధులు అందరూ బంగ్లా ఎన్నికలు “స్వేఛ్ఛగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా జరిగాయి” అని సర్టిఫికేట్ ఇచ్చి వెళ్లారు. అయితే ఆ తర్వాత అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ముఖ్య అధికారి ఒకరు “ఎన్నికలు స్వేఛ్ఛగా, న్యాయబద్ధంగా జరగలేదు” అని ప్రకటించాడు. ఆ ప్రకటనతోనే బంగ్లాదేశ్ లో అమలుకానున్న కుతంత్రాన్ని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు ఊహించినట్లు తెలుస్తోంది.
షేక్ హసీనా ప్రభుత్వానికి అమెరికాతో ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంబంధాలు మరింతగా బలహీన పడ్డాయి. బహుశా BRICS కూటమిలో సభ్య దేశంగా ఉన్న ఇండియాతో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందున, ఆ విధంగా ఆ దేశం చైనా, రష్యాలతో కూడా సన్నిహితంగా ఉన్నట్లే అని అమెరికా భావిస్తుండవచ్చు.
జనవరి 2024 లో ఐదవ సారి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత షేక్ హసీనా ఒక షాకింగ్ ప్రకటన చేశారు. ఒక తెల్ల దేశం తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని ఆమె ప్రకటించారు. మే 2024 నెలలో ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ “మా దేశంలో ఎయిర్ బేస్ (సైనిక విమాన స్థావరం) నెలకొల్పటానికి అనుమతి ఇస్తే జనవరి 7, 2024 తేదీన జరిగే ఎన్నికల్లో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా ప్రధానిగా ఎన్నిక అయ్యేలా చూస్తాము” అని ఆ తెల్ల దేశానికి చెందిన రాయబారి తనకు ఆఫర్ ఇచ్చాడని షేక్ హసీనా డెయిలీ స్టార్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ వెల్లడి చేసింది (ఎకనమిక్ టైమ్స్, ఆగస్టు 05, 2024).
అయితే ఆమె ఆ తెల్ల దేశం పేరు వెల్లడి చేయలేదు. “నాకు ఆఫర్ ఒక తెల్ల జాతి వ్యక్తి నుండి వచ్చింది” అని చెప్పారు. “తెల్ల వ్యక్తి ఆఫర్ అంటే ఒకే ఒక దేశం దృష్టిలో పెట్టుకుని నేనీ మాట చెబుతున్నట్లు అర్ధం వస్తుంది. కానీ జరిగింది అది కాదు. వాళ్ళు అక్కడి నుండి ఇంకెక్కడికి వెళ్లాలని చూస్తున్నారో నాకు తెలుసు” అని ఆమె విస్పష్టంగా ప్రకటించారు. అందుకే తమ అవామీ లీగ్ పార్టీ ఎల్లప్పుడు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నదని హసీనా వ్యాఖ్యానించింది. “మునుముందు మరిన్ని సమస్యలు ఎదురు కానున్నాయి. కానీ వాటి గురించి చింత వద్దు” అని ఆమె పత్రికతో చెప్పారు.
వారి ఆఫర్ కి ఏమి సమాధానం ఇచ్చారు అని ప్రశ్నించగా ఆమె “2001లో మా గ్యాస్ ని ఇండియాకు అమ్ముతామని అమెరికా మాకు ఆఫర్ ఇచ్చినపుడు నేను ఏ సమాధానం ఇచ్చానో అదే సమాధానం ఇప్పుడూ ఇచ్చాను” అని ఆమె చెప్పారు. “బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబూర్ రెహమాన్ కూతురిని నేను… మా విముక్తి యుద్ధంలో విజయం సాధించాము. దేశంలోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారానో లేదా మరో దేశానికి అప్పగించడం ద్వారానో అధికారానికి రావాలని నేను కోరుకోవటం లేదు. అలాంటి అధికారం నాకు అక్కరలేదని నేను స్పష్టంగా చెప్పాను” అని షేక్ హసీనా పత్రికకు వెల్లడి చేశారు. ప్రజలు కోరుకుంటేనే తాను అధికారంలో ఉంటాను తప్ప మరొకలా కాదని చెప్పాలని వెల్లడి చేశారు.
తాను ప్రతి ఛోటా యుద్ధం చేస్తున్నానని హసీనా చెప్పడం విశేషం. దేశంలో, విదేశాల్లో కూడా యుద్ధాలు చేస్తున్నానని, బంగ్లా దేశ్ నుండి మరో కొత్త దేశాన్ని విడగొట్టటానికి “ఇప్పుడు కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి” అనీ షేక్ హసీనా వెల్లడించారు. “ఈస్ట్ తీమోర్ లాగా… మా దేశం నుండి క్రైస్తవ దేశం పేరుతో ఒక ముక్క విడగొట్టాలని చూస్తున్నారు. బంగ్లాదేశ్ లోని చత్తోగ్రామ్, మియాన్మార్ లో కొంత భాగం కలిపి బంగాళాఖాతంలో ఒక నౌకా సైనిక స్థావరం ఉండే విధంగా ఒక దేశాన్ని సృష్టించాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని హసీనా వెల్లడి చేసింది.
“మా ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయి. నా తండ్రి ఎదుర్కొన్న పరిణామాలనే నేనూ ఎదుర్కోవలసి రావచ్చు” అని ఆమె డెయిలీ స్టార్ ఇంటర్వ్యూలో చెప్పారు. షేక్ హసీనా మాట్లాడుతున్న దేశం అమెరికాయే అని ఇట్టే చెప్పవచ్చు. ఆమె చెప్పిందాని ప్రకారం తనతో మాట్లాడిన తెల్ల వ్యక్తి ఒక్క అమెరికా తరపునే కాకుండా అమెరికా నాయకత్వం లోని పశ్చిమ శిబిరం ఈ కుట్రలో ఉన్నదని అర్ధం అవుతోంది. బంగ్లాదేశ్ లో సైనిక విమాన స్థావరం ఏర్పాటు చేసుకున్నాక దాని ఆధారంగా మియాన్మార్ ను చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం జరుగుతుందని షేక్ హసీనా మాటలకు అర్ధంగా ధ్వనిస్తోంది. ఇదే హసీనా వెల్లడి చేసిన నిజం. ఇందులో ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది.
ప్రమాదంలో ఇండియా వాణిజ్యం?
చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బి.ఆర్.ఐ) లో మియాన్మార్ సంపూర్ణంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చైనా ప్రపంచ వ్యాపార అభివృద్ధిలో బి.ఆర్.ఐ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. దీనిని అడ్డుకునేందుకు, మధ్య లోనే కాటికి పంపేందుకు అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చైనా బి.ఆర్.ఐ పధకాన్ని ఎదుర్కొనే క్రమం లోనే అమెరికా ఇండియాను తన భాగస్వామిగా ఎంచుకున్నది.
అయితే ఇండియా నుండి అమెరికా కోరుకున్న స్థాయిలో సహకారం అమెరికాకు అందడం లేదు. ఎందుకంటే భారత దళారీ పాలకులు గత 70 యేళ్ళ కాలంలో సామ్రాజ్యవాద శిబిరాల మధ్య తగవును ఎలా ఉపయోగించుకోవాలన్న విషయంలో మెళకువలు బాగా నేర్చారు. అమెరికా శిబిరంలో ఉంటూనే రష్యా సహకారాన్ని పొందడం, రష్యా ఆయుధ పాటవాన్ని ఉపయోగించుకుంటూనే అమెరికాతో అత్యంత కీలక మిలటరీ ఒప్పందాలు చేసుకోవటం భారత దళారీ పాలకులకే చెల్లింది. చైనాతో పోటీలో ఇండియా ప్రాముఖ్యతను గుర్తించడం వల్లనే భారత పాలకుల వ్యవహార సరళిని అమెరికా ఓపికగా సహిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక్కడ మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ, విదేశీ విధానం, ఎగుమతి-దిగుమతి విధానం అమెరికా నియంత్రణ లోకి వెళితే అది భారత దేశానికి తీవ్ర నష్టకరంగా పరిణమిస్తుంది. కొంత మేరకు ఆర్ధిక వృద్ధిలో లోటును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్ధితి రాకుండా ఉండేందుకు భారత పాలకులు ఒకటి రెండు అడుగులు దిగి, అమెరికా శిబిరంతో మరింత సర్దుబాటుకు అంగీకరించినా ఆశ్చర్యం లేదు.
వాషింగ్టన్ నుండి పని చేసే విల్సన్ సెంటర్ లో భాగమైన సౌత్ ఆసియా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మేన్ “బంగ్లాదేశ్ లో స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికలు జరపడం కోసం అమెరికా, బంగ్లాదేశ్ పైన తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అనేక యేళ్లపాటు కేరట్ మరియు స్టిక్స్ (ఆశలు చూపడం, లొంగకపోతే ఒత్తిడి తేవడం) ప్రయోగించినా ఫలితం దక్కలేదు” అని బ్లూమ్ బర్గ్ పత్రికతో “జనవరి” మాట్లాడుతూ చెప్పాడు. “అందు వలన అమెరికా ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ తో కఠినంగా వ్యవహరించవచ్చు” అని కుండబద్దలు కొట్టాడు. “ఆ చర్యలు బంగ్లాదేశ్ కు ఎక్కడ కొడితే బలంగా తగులుతుందో అక్కడే తగిలే విధంగా శిక్షించే చర్యలు కావచ్చు” అని కుగెల్మేన్ చెప్పాడు.
కుగెల్మేన్ మాటలు చూస్తే అమెరికా, బంగ్లాదేశ్ లో ప్రజాస్వామిక ఎన్నికల కోసం ఎంతో ఆందోళనతో ఉన్నట్లుగా ధ్వనిస్తాయి. కానీ ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, మానవ హక్కులు, నియంతృత్వం, సామూహిక హనన మారణాయుధాలు, స్త్రీ స్వేఛ్ఛ, మహిళల సమాన హక్కులు… ఇలాంటివన్నీ అమెరికా వేసుకునే ముసుగులు మాత్రమే. ఈ ముసుగు కింద దాగి ఉండే అమెరికా అసలు లక్ష్యం సామ్రాజ్యవాద ప్రపంచాధిపత్య రాజకీయాలు మాత్రమే. నిజంగా ప్రజాస్వామ్యమే కోరితే చిలీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గిన సాల్వదార్ అలెండిని ఎందుకు చంపినట్లు? హొండురాస్ అధ్యక్షుడు హెర్నాండెజ్ ను పదవీచ్యుతుడిని చేసి ఒక అమెరికా జడ్జి డ్రగ్స్ రవాణా ఆరోపణలతో ఆయనకు 45 యేళ్ళు శిక్ష విధించడం అసలు న్యాయబద్ధమేనా?
ప్రపంచ వ్యాపితంగా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్నది అమెరికాయే కదా? ఆఘానిస్తాన్ ను 20 యేళ్ళు దురాక్రమించి అక్కడ గంజాయిని పెద్ద ఎత్తున సాగు చేసిన అమెరికా లోకానికి ఎలా సుద్దులు చెప్పగలదు? తమ దేశంలో మారిజువానాను చట్టబద్ధం చేసిన అమెరికా పనామా అధ్యక్షుడు జనరల్ నోరిగాను కూడా అమెరికా జైలులో ఎలా పెడుతుంది? గ్రెనడా అధ్యక్షుడిని చంపేందుకు నేరుగా ఆ దేశ అధ్యక్షుడి భవనం పైనే అమెరికా బాంబులు వేస్తే అది ప్రజాస్వామ్యమా? అతి చిన్న దేశం క్యూబా ను అష్ట దిగ్బంధనం చేసి వాణిజ్యం జరగకుండా ఆంక్షలు విధించడం 60 సార్లకు పైగా క్యూబా అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రో పై హత్యా ప్రయత్నాలు చేయడం ఎక్కడి ప్రజాస్వామ్యం? ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా దేశాలపై దురాక్రమణ దాడులు చేసి అత్యంత అభివృద్ధి చెందిన ఇరాక్, లిబియా, సిరియా లను మధ్య యుగాల స్థాయికి చేర్చిన ఘనత అమెరికాదే కదా?
కనుక చైనా వాణిజ్యాన్ని, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసి, రష్యాలోని గ్యాస్, చమురు వనరులను ఇంకా అనేకానేక విలువైన ఖనిజ వనరులను కొల్లగొట్టేందుకే లక్ష్యంగా, తన ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకునే లక్ష్యంలో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్, మియాన్మార్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, వియత్నాం మొదలైన, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలను తన గుప్పెట్లో బంధించేందుకు అమెరికా చేస్తున్న కుట్రలలో భాగంగానే బంగ్లాదేశ్ లో అమెరికన్ ఎన్.జి.ఓ లు స్థానిక విద్యార్ధుల వ్యతిరేకతను, జమాత్ సానుకూలతను, హసీనా-ఖలేదా వైరుధ్యాలను ఉపయోగించుకుని ఆ దేశంలో అల్లర్లను రెచ్చగొట్టిన సంగతిని విస్మరించరాదు. ఈ సంగతి భారత పాలకులకు తెలియనిది కాదు. వారు హసీనాకు ఇచ్చిన సలహాలు, కేవలం బంగ్లాదేశ్ సంక్షోభం తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్దేశించినవి తప్ప బంగ్లాదేశ్ ప్రజల క్షేమం పట్ల ఆందోళన రీత్యా ఉద్దేశించినవి అని నమ్మడం కష్టం. కానయితే బంగ్లాదేశ్ సంక్షోభం ఫలితంగా అమెరికా ముందు ఇండియా పాలకుల ప్రాబల్యం బలహీనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మహమ్మద్ యూనస్ కి పగ్గాలు
బంగ్లా విద్యార్ధులు దేశం మళ్ళీ మిలట్రీ పాలకుల చేతుల్లోకి వెళ్ళడం తమకు ఇష్టం లేదని ప్రకటించారు. ఆర్మీ నాయకత్వం లోని ఎలాంటి ప్రభుత్వాన్ని తాము ఒప్పుకునేది లేదని వారు ప్రకటించారు. చిన్న మొత్తాల పొదుపును బంగ్లా ప్రజల్లో ప్రోత్సహించడం ద్వారా, గ్రామీణ బ్యాంకు స్థాపించి మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్ లకు ప్రాచుర్యం కల్పించి అందుకు నోబెల్ బహుమతి కూడా పొందిన మహమ్మద్ యూనస్ ను మధ్యంతర ప్రధానిగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి మిలట్రీ మహమ్మద్ యూనస్ ని మధ్యంతర ప్రధానిగా మిలట్రీ నేత, అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ నియమించాడు. ఆర్మీ చీఫ్, ఆందోళనకారుల నాయకులకు మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. పార్లమెంటును రద్దు చేసినట్లు అధ్యక్షుడు ప్రకటించాడు.

నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్
అయితే మహమ్మద్ యూనస్ ను మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా మాత్రమే నియమించారని ఇతర పత్రికలు చెబుతున్నాయి. హసీనా వీసాను అమెరికా రద్దు చేయడంతో ఆమె యునైటెడ్ కింగ్డమ్ (యుకె) వెళ్లవచ్చని తెలుస్తున్నది. 2009 నుండి ప్రధాని పదవిలో ఉన్న హసీనాకు ఇప్పుడు 76 సం.లు. ఇప్పుడు ఆమెకు మిలట్రీ, బి.ఎన్.పి, జమాత్, ఛాత్ర శిబిర్ లతో తలపడే శక్తి కూడా లేకపోవచ్చు.
మహమ్మద్ యూనస్, అమెరికా మరియు పశ్చిమ ఐరోపా దేశాలకు ఇష్టుడు. పశ్చిమ దేశాల ఆర్ధిక విధానాలకు మద్దతుదారు కానివారికి నోబెల్ బహుమతి దుర్లభం. అత్యంత పేద ప్రజల నుండి కూడా పెట్టుబడి సేకరించవచ్చని, అలా సేకరించిన సొమ్ము తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చని పశ్చిమ ఫైనాన్స్ కంపెనీలకు మహమ్మద్ యూనస్ ద్వారానే తెలిసి వచ్చింది. పైగా యూనస్ కూ, షేక్ హసీనాకు మధ్య ఉప్పు-నిప్పు సంబంధం నెలకొని ఉన్నది. హసీనా ప్రభుత్వం ఆయనపై వందకు పైగా అవినీతి కేసులు మోపింది. ఏ నేపధ్యంలో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ని కొంతకాలం పాలించి ఆందోళనకారులను చల్లబరిచి వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చేందుకు సహజంగానే మొదటి ఛాయిస్ అయినాడు. కానీ బంగ్లాదేశ్ ప్రజలు మోసానికి గురికానున్నారు.
బంగ్లా సంక్షోభం ద్వారా అమెరికా దక్షిణాసియాలోని మరో దేశంలో కాలు మోపిందని భావించవచ్చు. ఇప్పటికే శ్రీలంకను ఐ.ఏం.ఎఫ్ అప్పు ద్వారా దారిలోకి తెచ్చుకున్న అమెరికా తదుపరి లక్ష్యం ఏ దేశం అన్నది చూడాల్సి ఉన్నది.