
ఎద్దు ఈనింది అంటే దూడని దొడ్లో కట్టేయమన్నాడట వెనకటికొకరు! పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపిలోకి దూకిన టర్న్ కోట్ సువేందు అధికారి చేసిన ప్రకటన ఇలాగే ఏడ్చింది!
పత్రికల వార్తల ప్రకారం సువేందు అధికారి “సిద్ధంగా ఉండండి. బంగ్లాదేశ్ నుండి కోటి మంది హిందువులు (పశ్చిమ) బెంగాల్ కు వలస రాబోతున్నారు” అని ప్రకటించాడు.
సువేందు అధికారి అంతటితో ఆగలేదు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల గురించి హోమ్ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశాడు. ఈ దాడుల నేపధ్యంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రాముఖ్యతను హోమ్ మంత్రికి గుర్తు చేశాడు (లైవ్ మింట్, 7 ఆగస్టు 2024).
పి.టి.ఐ వార్తా సంస్థ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నదని హోమ్ మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి హామీ ఇచ్చాడు.
అయితే త్రిపురలో బిజెపి పార్టీ మిత్ర పక్ష పార్టీ సీనియర్ నాయకుడు ప్రద్యుత్ దేబ్ బర్మ ఇందుకు భిన్నంగా స్పందించాడు. బంగ్లాదేశ్ నుండి త్రిపురకు రానున్న వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్న గట్టి హామీని ఆయన కేంద్ర ప్రభుత్వం నుండి కోరాడు. పొరుగు దేశంలో ఇండియా వ్యతిరేక సెంటిమెంట్లు బలంగా మారుతున్న దృష్ట్యా త్రిపుర, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం రాష్ట్రాలు దాని ఫలితాలు ఎదుర్కొంటాయని కనుక సరిహద్దు వెంట రక్షణ పటిష్టం చేయాలని తీప్ర మోతా పార్టీ నాయకుడు కూడా అయిన దేబ్ బర్మ కోరాడు.
2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో ప్రస్తుతం 13.1 మిలియన్ల మంది లేదా 1.31 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. వారిలో కోటి మంది ఇండియా వచ్చేస్తారని సువేందు అధికారి భావిస్తున్నాడని ఆయన ప్రకటన తెలియజేస్తున్నది.
బంగ్లాదేశ్ నుండి హిందువులు లెక్కకు మిక్కిలిగా ఇండియాకు, అది కూడా పశ్చిమ బెంగాల్ కు తరలి రావాలని, వారందరికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద భారతదేశ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం ఇవ్వాలని, అట్లా ఇస్తే గనక ఆ కోటి మంది బిజెపి పార్టీకి, సిఏఏ చట్టం అమలు చేసినందుకు కృతజ్ఞతగా, గంపగుత్తగా ఓట్లు గుద్దేస్తారని, తద్వారా తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కావటం తధ్యం అనీ సువేందు అధికారి భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
1951 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా మొత్తం జనాభాలో 22 శాతంగా ఉండేవారు. ఇప్పుడు ఆ నిష్పత్తి 8 శాతానికి పడిపోయింది. ఈ తగ్గుదలను హిందూత్వ సంస్థలు, బిజెపి పార్టీ తమ ముస్లిం వ్యతిరేక ప్రచారానికి మద్దతుగా తెచ్చుకుంటాయి.
అమెరికా లోని హిందూ మితవాద సంస్థ హిందూ అమెరికన్ ఫౌండేషన్, బంగ్లాదేశ్ లో హిందువులను వేధించడం వలన 1964-2013 మధ్య 11 మిలియన్ల మంది (1.1) కోట్ల మంది ఇండియాకు వలస వచ్చారని చెబుతుంది. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో 1.182 కోట్ల మంది హిందువులు ఉండగా వారి సంఖ్య 2022 జనాభా లెక్కల నాటికి 1.31 కోట్లకు పెరగడం విశేషం.
బంగ్లాదేశ్ లో హిందువులను అణచివేస్తున్నారని, అందువలన వారి సంఖ్య బాగా తగ్గిపోతున్నదనీ హిందూత్వ సంస్థలు వాదిస్తాయి. 2001-2022 మధ్య జరిగిన ఈ హిందువుల సంఖ్య పెరుగుదల హిందూత్వ వాదుల వాదనను పూర్వపక్షం చెయ్యటం గమనార్హం.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హిందూ మతం అవలంబించే ప్రజలపై వేధింపులు, దాడులు జరుగుతుండడం ఒక వాస్తవం. పాకిస్థాన్ లో అయితే ఈ వేధింపులు హత్యలు, హిందూ యువతులను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడం వరకు వెళ్ళాయని తరచుగా పత్రికలు నివేదిస్తున్నాయి. అయితే ఇండియాలో ముస్లింలపై దాడులను చూపిస్తూ పాక్-బంగ్లాలలో హిందువులపై దాడులను సమర్ధించడం, హిందువులపై దాడులు చూపిస్తూ ఇండియాలో ముస్లింలపై దాడులను సమర్ధించడం రెండూ ఇరు దేశాల సమాజాలకు నష్టకరం అన్న సంగతి ఇరు దేశాలలోని మెజారిటీ మతస్థులు గుర్తించవలసి ఉన్నది.

ఇది ఇలా ఉండగా, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియా వచ్చేసిన అనంతరం బంగ్లాదేశ్ లో అమెరికా అనుకూల బ్యూరోక్రాట్లు, గవర్నర్లు ఆ దేశాన్ని చేజిక్కించుకోవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. మిలటరీ పాలనకు మాత్రం అవకాశం లేదని అందరూ ఏకీభవిస్తున్నారు.
షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా గట్టి చర్యలు అమలు చేసింది. అయితే రానున్న అమెరికా అనుకూల ప్రభుత్వంలో జమాత్-ఏ-ఇస్లామి, చాత్ర శిబిర్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీలు చేరే అవకాశం ఉన్నందున హిందూ ప్రజలపై దాడులు పెరిగే అవకాశం లేకపోలేదు.
షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్ధుల ఆందోళనల సందర్భంగా, పలు చోట్ల హిందూ దేవాలయాలు, శిక్కు గురుద్వారాలపై అల్లరి మూకలు దాడులు, దహనాలకు పాల్పడటం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. జమాత్ సంస్థ అచ్చమైన ఇస్లామిక్ ఫండమెంటలిస్టు పార్టీ. దానికి పాకిస్థాన్ మద్దతు దండిగా ఉన్నది. అవామీ లీగ్ పార్టీ బలహీనపడిన నేపధ్యంలో జమాత్ పార్టీ నూతన జవాసత్వాలు నింపుకుని మరింత పెట్రేగిపోయే అవకాశం ఉన్నది. ఇలాంటి అల్లర్లను తమ ఆధిపత్య రాజకీయాలకు ఎలా ఉపయోగపెట్టుకోవాలో అమెరికా, పశ్చిమ రాజ్యాలకు బాగా తెలుసు.
కనుక సువేందు అధికారి ఆశించిన సంఖ్యలో కాకపోయినా నెమ్మదిగా, క్రమ క్రమంగా, హంగు ఆర్భాటాలు లేకుండా బంగ్లాదేశ్ హిందువులు కొందరు ఇండియాకు వలస వచ్చే అవకాశాలను కొట్టిపారేసేందుకు వీలు లేదు. ఎటొచ్చీ సదరు వలసలను ఇండియాలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి లేదా ఇతర చిన్నా చితకా హిందూత్వ గుంపులు విద్వేషపూరిత దాడులకు పూనుకునే అవకాశం దండిగా ఉన్నది.
హిందూత్వ మూకల ఎత్తుగడల పట్ల సాధారణ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. తద్వారా బంగ్లాదేశ్ అల్లర్లు ఇండియాలో మరో రూపంలో పాకకుండా జాగ్రత్త వహించాలి. సువేందు అధికారి లాంటి వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలి.
ముస్లిం మితవాద పార్టీలు బంగ్లాదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్న నేపధ్యంలో భారత కంపెనీలు ఆ దేశంలో నిర్మిస్తున్న వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల భవిష్యత్తు ఏమిటి అన్న ఒక ప్రశ్న భారత పాలకులను తొలుస్తున్నది. భారత్ నుండి వచ్చిన నిధులతో అమలవుతున్న ప్రాజెక్టుల పరిపూర్తి కోసమైన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ లోని నూతన ప్రభుత్వంతో, ఆ ప్రభుత్వం వెనుక ఉన్న శక్తులతో సానుకూల సంబంధాలకు శ్రమించాల్సి ఉంటుంది. ఈ సంబంధాలు అమెరికా దయపై ఆధారపడి ఉంటే గనక అంతకంటే దౌర్భాగ్యం ఉండబోదు.