
ఆగస్టు 1 తేదీన భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు, ఎస్.సి కులాల జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చని తీర్పు ప్రకటించింది. గతంలో ఇ.వి.చిన్నయ్య తీర్పులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును 7 గురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తప్పు పట్టింది. వివిధ కులాల అబివృద్ధి మరియు సామాజిక స్థాయిల గురించి వివరాలను క్రమ పద్ధతిలో సేకరించి, అలా సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా మాత్రమే ఎస్.సి కేటగిరీలో ఉప వర్గీకరణ ను ప్రవేశ పెట్టవచ్చని తీర్పు చెప్పింది.
సుప్రీం కోర్టు తీర్పు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోని మాదిగ కులానికి చెందిన ప్రజల్లో ఆనందోత్సాహలను నింపింది. సుప్రీం కోర్టు తీర్పుని వారు ఇరు రాష్ట్రాలలోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాలకు పూలమాలలు వేసి నినాదాలతో, డప్పులు వాయిస్తూ ఆనందం ప్రకటిస్తున్నారు.
గత పాతికేళ్లుగా మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) ఎస్.సి వర్గీకరణ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం లోనూ, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల లోనూ ఏర్పడిన ప్రభుత్వాలు ఏర్పరిచిన ప్రతి పార్టీతోనూ ఎం.ఆర్.పి.ఎస్ సంస్థ ఎన్నికల సమయంలో అవగాహన కుదుర్చుకుని సహకరించడం ద్వారా వర్గీకరణ సుసాధ్యం చేసుకోవచ్చన్న ఆశతో వ్యవహరించింది.
2024 లోక్ సభ ఎన్నికల ముందు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో టి.డి.పి-బి.జె.పి-జనసేన కూటమితోనూ, తెలంగాణలో బి.జె.పి తోనూ ఎం.ఆర్.పి.ఎస్ అవగాహన ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎం.ఆర్.పి.ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నుండి రికార్డు చేసిన ఎన్నికల సందేశాలు మొబైల్ ఫోన్ల ద్వారా అందాయి. ఈ సందేశంలో వర్గీకరణ సాధన కోసం బిజెపి కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. సుప్రీం కోర్టు ముందు జరిగిన వాదనలలో కూడా గత బి.జె.పి కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో వర్గీకరణకు మద్దతుగా వాదనలు వినిపించింది.
ఇలాంటి ఎన్నికల ఎత్తుగడలు వర్గీకరణ ప్రయోజనాల దృష్టిలో కాకుండా మొత్తంగా భారత దేశ శ్రామిక ప్రజల సంక్షేమం దృష్టి కోణంలో చూసినప్పుడు వివాదాస్పదంగా మారాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో, ఎం.ఆర్.పి.ఎస్ అనుసరించిన ఎత్తుగడలకు ఆమోద ముద్ర పడినట్లయింది. లేదా తాను పాటించిన విధానాల వల్లనే వర్గీకరణ సాధ్యమైందని చెప్పుకునే అవకాశం ఎం.ఆర్.పి.ఎస్ నాయకుడు కృష్ణ మాదిగకు వచ్చింది.
ఎస్.సి కులాల వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వం లోని ఎం.ఆర్.పి.ఎస్ చేసిన ఆందోళనకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వవలసిందే. అందులో అనుమానం లేదు. ఎస్.సి కేటగిరీకి చెందిన కులాలను వర్గీకరించాలన్న డిమాండ్ ను ప్రధాన రాజకీయ అజెండాలో ఒక భాగంగా చేయడంలో మంద కృష్ట నాయకత్వం లోని ఎం.ఆర్.పి.ఎస్ కు ఖచ్చితంగా తగిన క్రెడిట్ ఇచ్చి తీరవలసిందే.
అయితే, సుప్రీం కోర్టు తీర్పును వివిధ రాజకీయ పార్టీలతో అవగాహనకు రావటం, అన్న హ్రస్వ దృష్టితో పరిశీలించడం అంటే సుప్రీం కోర్టు తీర్పును చిన్న బుచ్చడమే అవుతుంది. అంతే కాకుండా ఎస్.సి వర్గీకరణకు అనుకూలంగా 7గురు జడ్జిల ధర్మాసనం 6-1 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో మెజారిటీ ఆరుగురు జడ్జిలు ఒకే తీర్పును ప్రకటించలేదు. ఆరుగురు జడ్జిలు వేరు వేరుగా ఆరు తీర్పులు వెలువరించారు. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ఈ తీర్పులను ‘కాంకరెంట్ (concurrent)’ (ఒకదానితో మరొకటి ఏకీభవించే) తీర్పులుగా చెప్పారు.
అయితే ఆరుగురు జడ్జిలు ఇచ్చిన తీర్పులలో అనేక అభ్యంతరకర అంశాలు ఉండటాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎస్.సి కులాల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు, వర్గీకరణ పేరుతో అసలు మొత్తంగా రిజర్వేషన్లను క్రమ క్రమంగా ఎత్తివేసే దిశలో ఇచ్చిన తీర్పులుగా సదరు తీర్పులలోని వివిధ అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను వర్గీకరణకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ఆందోళనలు నిర్వహించిన కులాల ప్రజలు అందరూ కలిసి సంయుక్తంగా వ్యతిరేకించవలసిన అవసరాన్ని ఏర్పరిచాయి.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రతి పది సంవత్సరాలకు రిజర్వేషన్ల అమలును సమీక్షించాలని ప్రతిపాదించారు. (అయిదేళ్లకు ఒకసారి అని చెప్పారన్న వాదన కూడా ప్రచారంలో ఉన్నది). కానీ ఈ అభిప్రాయం అగ్ర కులాల ప్రజల నాల్కల మీదికి వచ్చేసరికి “అంబేద్కర్ కూడా పదేళ్ళలో (లేదా ఐదేళ్లలో) రిజర్వేషన్లు ఎత్తివేయాలని చెప్పారు” అన్న ప్రచారంగా మారిపోయింది. ఆరుగురు జడ్జిలు వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులో పేర్కొన్న కొన్ని అభిప్రాయాలు, పరిశీలనలు అగ్ర కులాల ప్రజలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలను బలపరిచేవిగా, అంబేద్కర్ అభిప్రాయాన్ని మార్చిన విధంగానే, జడ్జిల వాదనలను కూడా తమకు మద్దతుగా తెచ్చుకునేందుకు అనుకూలంగా ఉన్నాయి.
సుప్రీం కోర్టు తీర్పులోని వివిధ అంశాలను వివిధ జడ్జిలు వెలువరించిన ఆందోళనకర అభిప్రాయాలను క్లుప్తంగానైనా చూడటం శ్రేయస్కరం. (కింద పాఠ్యంలో ఎర్ర రంగులోని వాక్యాలను రిజర్వేషన్ల ఎత్తివేతకు దారితీసే అభిప్రాయాలుగా పరిగణించవచ్చు.)
చీఫ్ జస్టిస్ డి.వై.చంద్ర చూడ్ ప్రకారం ఆరుగురు జడ్జిలు, 2004 లో ఇ.వి.చిన్నయ్య కేసులో ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును, తిరగదోడారు (overruled). ఎస్.సి కేటగిరీ కులాలలో మరింత వెనుకబడిన కులాలకు ప్రత్యేక కోటాలు ఇవ్వడం అనుమతించదగ్గదే అని తమ తమ తీర్పులలో ప్రకటించారు. “ఉప-వర్గీకరణ చేస్తున్నపుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒకే ఉప-తరగతికి ఎస్.సి లకు కేటాయించిన కోటాలో 100 శాతం పూర్తిగా కేటాయించడం తగదు. కేవలం ఎంపిరికల్ డేటా ఆధారంగా మాత్రమే ఉప-వర్గీకరణ చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం (ఆర్బిట్రరీగా) చేయరాదు” అని వర్గీకరణ అనుకూల తీర్పులు తీర్మానించాయి.
7 జడ్జిల ధర్మాసనం ప్రధానంగా రెండు అంశాల గురించిన వాదనలను పరిగణనలోకి తీసుకుంది. 1. రిజర్వడ్ కులాలను ఉప-వర్గీకరణ చేయడం అనుమతించవచ్చా లేదా? 2. ఇ.వి.చెన్నయ్య వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, (2005) 1 ఎస్.సి.సి 394 కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో “ఆర్టికల్ 341 కింద నోటిఫై చేసిన షెడ్యూల్డ్ కులాలు ఏకీకృత గ్రూపుగా పేర్కొనబడింది గనుక, ఆ తర్వాత ఆ కులాలను ఉప-వర్గీకరణ చేయడం కుదరదు” అని పేర్కొనడంలో వాస్తవికత (correctness) ఉన్నదా?
చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టీసెస్ బి.ఆర్.గవాయ్, విక్రమ్ నాధ్, బెలా ఎం త్రివేది, పంకజ్ మిట్టల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఫిబ్రవరి 2024 నెలలో మూడు రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న పిమ్మట తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఈ రోజు ఆగస్టు 1, 2024 తేదీన సుప్రీం కోర్టు వెలువరించింది.
సానుకూల, ప్రతికూల అంశాలు
సి.జె.ఐ డి.వై.చంద్రచూడ్ తన తీర్పులో షెడ్యూల్డ్ కులాలు ఏకీకృత గ్రూపుగా లేవన్న సంగతి చెప్పేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. “ఉప-వర్గీకరణ రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 పేర్కొన్న “సమానత్వ సూత్రాన్ని” ఉల్లంఘించడం లేదు. అలాగే రాజ్యాంగం ఆర్టికల్ 341(2) ను కూడా వ్యతిరేకించడం లేదు. ఆర్టికల్ 15 గానీ 16 గానీ ఒక కులాన్ని ఉప-వర్గీకరణలో భాగం చేయటాన్ని ఏ విధంగానూ నిరోధించడం లేదు. అలా నిరోధించే అంశాలు ఆర్టికల్ 15,16 లలో లేవు” అని సి.జె.ఐ తీర్పు పేర్కొంది.
“అలాగని ఇష్టారీతిన ఉప-వర్గీకరణ చేయరాదు. పరిమాణాత్మకంగానూ, నిర్ధారించి చెప్పగల ఆధారాల తోనూ న్యాయబద్ధతను దృఢపరిచాక మాత్రమే రాష్ట్రాలు సంబంధిత కులాలు తగిన రీతిలో ప్రాతినిధ్యానికి నోచుకోలేదని డేటా ఆధారంగా నిరూపణకు గురయ్యాక మాత్రమే ఉప-వర్గీకరణ చేపట్టాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం, తమ ఇష్టాయిష్టాలకు లోబడి ఉప-వర్గీకరణకు పూనుకోరాదు” అని సి.జి.ఐ తీర్పు పేర్కొన్నది. సి.జి.ఐ తన తరపున మరియు జస్టిస్ మనోజ్ మిశ్రా తరపున తీర్పు వెలువరించగా మెజారిటీలోని నలుగురు జడ్జిలు వేరు వేరు తీర్పులను, రిజర్వేషన్ల పట్ల భిన్నమైన అవగాహనలను, మొత్తంగా రిజర్వేషన్లకు ఎసరు తెచ్చే అవగాహనలను ప్రకటించారు.
“(ఎస్.సి కేటగిరీలోని) మరింత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇవ్వటం అన్నది రాజ్యం యొక్క విధిలో భాగంగా చూడాలి. ఎస్.సి/ఎస్.టి లలోని కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు. ఈ అంశంలో వాస్తవిక అంశాలను (ground realities) విస్మరించరాదు. ఎస్.సి/ఎస్.టి లలో కొన్ని కేటగిరీలు అనేక వందల సంవత్సరాలుగా మరింత అణచివేతను ఎదుర్కొంటున్న మాట వాస్తవం” అని జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఇచ్చిన తీర్పు పేర్కొన్నది.
“ఇ.వి.చిన్నయ్య కేసులోని ప్రధాన లోపం ఏమిటంటే ఆర్టికల్ 341 రిజర్వేషన్ల కల్పనకు పునాది అని ఆ తీర్పు తప్పుగా భావించటం. కానీ ఆర్టికల్ 341 అన్నది కేవలం రిజర్వేషన్ల నిమిత్తం వివిధ కులాలను గుర్తించడం వరకు మాత్రమే పరిమితం అయింది. ఒక పెద్ద గ్రూపులో భాగమైన ఒక గ్రూపు మరింత వివక్షకు (డిస్క్రిమినేషన్) గురి కావటమే ఉప-వర్గీకరణకు పునాదిగా ఉంటుంది” —-జస్టిస్ బి.ఆర్.గవాయ్ తీర్పు.
జస్టిస్ గవాయ్ తీర్పు ఇంకా ఇలా పేర్కొంది. “ఎస్.సి/ఎస్.టి కేటగిరీలలో క్రీమీ లేయర్ ను గుర్తించేందుకు రాష్ట్రాలు తగిన విధానాలను అభివృద్ధి చేయాలి. తద్వారా అభివృద్ధి సాధించిన క్రీమీ లేయర్ ను రిజర్వేషన్ పరిధి నుండి తొలగించాలి. నా దృష్టిలో రాజ్యాంగం ఆశించిన నిజమైన సమానత సాధించటానికి ఇదే సరైన, ఏకైక మార్గం.”
జస్టిస్ విక్రమ్ నాధ్ వెలువరించిన తీర్పు, జస్టిస్ గవాయ్ తీర్పు లోని పై అంశంతో ఏకీభవించింది. “ఓబిసి లకు వర్తించిన విధంగానే క్రీమీ లేయర్ విధానం ఎస్.సి లకు కూడా వర్తిస్తుంది” అని జస్టిస్ విక్రమ్ నాధ్ తీర్పు పేర్కొంది.
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వెలువరించిన తీర్పు కూడా పై అంశంతో ఏకీభవించింది. ప్రస్తుతం క్రీమీ లేయర్ ను గుర్తించే విధానం ఓబిసిలకు మాత్రమే వర్తిస్తుంది. తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన మెజారిటీ తీర్పు క్రీమీ లేయర్ విధానం ఎస్.సి లకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.
ఉప వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ప్రకటించిన ఆరుగురు జడ్జిలలో నలుగురు జడ్జిలు క్రీమీ లేయర్ ను గుర్తించి రిజర్వేషన్ పరిధి నుండి తప్పించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“ఎస్.సి కేటగిరీకి చెందిన ఒక వ్యక్తి రిజర్వేషన్ ద్వారా లబ్ది పొందిన తర్వాత రిజర్వేషన్ లబ్ది పొందని వ్యక్తి పిల్లలతో సమానంగా పరిగణించడం సరైనది కాదు. అయితే ఓబిసి లలో క్రీమీ లేయర్ ను గుర్తించేందుకు అనుసరించిన కొలబద్దనే ఎస్.సి/ఎస్.టి లలోని క్రీమీ లేయర్ ని గుర్తించేందుకు ఉపయోగించరాదు. ఎస్.సి/ఎస్.టి లలో క్రీమీ లేయర్ ని గుర్తించేందుకు విభిన్న కొలబద్దను రూపొందించాలి” అని జస్టిస్ గవాయ్ తీర్పు పేర్కొన్నది.
జస్టిస్ గవాయ్ తీర్పు ప్రకారం అసమానంగా ఉన్న గ్రూపులో సమానత గురించిన సమస్యను సుప్రీం కోర్టు పరిశీలిస్తున్నందున క్రీమీ లేయర్ అంశాన్ని కూడా కోర్టు పరిగణించాలి. “ఇక్కడ మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో అసమానులలో సమానతను తీసుకు రావాలన్న అంశం, సమానతను తీసుకు రావాలన్న రాజ్యాంగ లక్ష్యాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నదా లేక దానిని ఆటంకపరుస్తున్నదా? అని. ఐఏఎస్/ఐపిఎస్ లేదా సివిల్ సర్వీసు అధికారుల పిల్లలను, అననుకూలతలకు గురవుతున్న షెడ్యూల్డ్ కులాల సభ్యుడికి చెందిన పిల్లలు గ్రామం లోని గ్రామ పంచాయితీ లేదా జిల్లా పరిషత్ స్కూల్ లో చదువుతున్నట్లయితే ఆ పిల్లలతో సమానం చేసి చూడవచ్చా?” అని జస్టిస్ గవాయ్ తీర్పు ప్రశ్నించింది.
జస్టిస్ విక్రమ్ నాధ్ తీర్పు, జస్టిస్ గవాయ్ వ్యక్తపరిచిన అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఓబిసి లలో క్రీమీ లేయర్ ను గుర్తించే సూత్రం ఎస్.సి/ఎస్.టి లలో క్రీమీ లేయర్ ను గుర్తించేందుకు కూడా పాటించాలని జస్టిస్ విక్రమ్ నాధ్ తీర్పు పేర్కొంది. అయితే ఓబిసిలలో క్రీమీ లేయర్ ను గుర్తించే విధానాన్నే ఎస్.సి/ఎస్.టి లకు వర్తింపజేయాలా అన్న అంశంలో జస్టిస్ విక్రమ్ నాధ్ తీర్పు, జస్టిస్ గవాయ్ తీర్పుతో ఏకీభవిస్తోందా అన్న సంగతి తెలియలేదు.
జస్టిస్ పంకజ్ మిట్టల్ తీర్పు, “రిజర్వేషన్ అనేది కేవలం ఒక తరానికి మాత్రమే వర్తింప జేయాలి. మొదటి తరానికి చెందిన ఏ వ్యక్తి అయినా, రిజర్వేషన్ ద్వారా ఉన్నత స్థాయి (heigher status) కి చేరుకున్నట్లయితే ఇక రెండవ తరం రిజర్వేషన్ కు అర్హులుగా పరిగణించరాదు” అని ప్రకటించింది.
జస్టిస్ బెలా త్రివేది అసమ్మతి తీర్పును వెలువరించింది. ఆరుగురు జడ్జిల తీర్పుతో ఆమె తీర్పు విభేదించింది. ఆర్టికల్ 341 లో పొందుపరిచిన షెడ్యూల్డ్ కులాల ప్రెసిడెన్షియల్ జాబితాను రాష్ట్రాలు మార్చడానికి వీలు లేదని ఆమె తీర్పు స్పష్టం చేసింది. ఉపవర్గీకరణ చేస్తే అది ప్రెసిడెన్షియల్ జాబితాను సవరించినట్లు అవుతుంది. ప్రెసిడెన్షియల్ జాబితాలో కులాలను కలపాలన్నా, తొలగించాలన్నా అది కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాల ద్వారా చేయగలుతుంది. ఎస్.సి-ఎస్.టి జాబితా తయారీలో రాజకీయ జోక్యాన్ని నివారించడమే ఆర్టికల్ 341 యొక్క లక్ష్యం అని ఆమె తీర్పులో పేర్కొన్నారు.
“రాష్ట్రపతి జాబితాలో ఏ ఉప-తరగతికి అయినా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది అదే కేటగిరీలోని ఇతర తరగతులకు ఫలాలు అందకుండా చేసినట్లవుతుంది. ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేటివ్ అధికారం కొరవడిన నేపధ్యంలో రాష్ట్రాలకు కులాల జాబితాను ఉప-వర్గీకరించే అధికారం గానీ ఫలాలను ఉప-వర్గీకరించే అధికారం గానీ రాష్ట్రాలకు లేదు. అలా చేసేందుకు రాష్ట్రాలను అనుమతీస్తే అధికారాన్ని ఇతర రూపాల్లో వినియోగించడంతో సమానం అవుతుంది” అని జస్టిస్ బెలా త్రివేది వెలువరించిన అసమ్మతి తీర్పు పేర్కొంది.
వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు వెలువరించిన ఆరుగురు జడ్జిలలో నలుగురు జడ్జిలు వెలువరించిన తీర్పులు “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయిన” తరహాలో ఉండడం విచారకరం. తీర్పులోని ప్రతికూల అంశాల గురించి మునుముందు ఇతర ఆర్టికల్స్ లో వివరంగా చర్చిద్దాం.