కులం వికృత రూపాన్ని చూడండి!


సో-కాల్డ్ అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళకి దళితులు కుల అణచివేత గురించి మాట్లాడటం అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకేం తక్కువయిందట అని ప్రశ్నిస్తుంటారు. ‘నువ్వు కడ జాతి వాడివి’ అని చెప్పకుండానే చూపుల్తో చెప్పేసే చూపులని భరించడం ఎంత కష్టమో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు. చిన్న కులాల పట్ల వాళ్ళ తేలిక భావాల్ని పెద్ద విషయం కాదన్నట్లు తేలికగా తేల్చేస్తారు.

మీరు ప్రభుత్వానికి దత్త పుత్రులు అంటూ ఒక వ్యంగ్యాన్ని మొఖం మీద విసిరి కొడతారు. తాము తెగ కష్ట పడుతున్నా స్కూళ్ళు, కాలేజీల్లో సీట్లు రాకపోతుంటే, వీళ్ళు ఏమీ కష్టపడక పోయినా, బుర్ర తక్కువ వాళ్లయినా సీట్లు, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ బాధ పడుతూ ఉంటారు. ప్రతిభ వారికి మాత్రమే సొంతం అయినట్లు ‘సేవ్ మెరిట్, సేవ్ ఇండియా’ అంటూ నినాదాలిస్తారు. ఆ నినాదమే కులాధిక్యత లో నుండి పుట్టిందన్న వాస్తవాన్ని ఒప్పుకోరు.

సరే, మాకు చదువులు, ఉద్యోగాలు వద్దు. అవన్నీ మీరే తీసేసుకోండి. కానీ మీ పొలాలు, ఫ్యాక్టరీలు, షేర్ మార్కెట్లు, అనేకానేక సంస్థల యాజమాన్యాలతో పాటు రాజ్యం, రాజ్య పాలనను మాత్రం మాకు ఇవ్వండి! అని కోరితే మాత్రం నోట్లో నుంచి మాట పెగలదు.

వర్ణ/కుల వ్యవస్థ విస్తృతంగా, పచ్చిగా అమలులో ఉన్న గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగంగా ఆర్ఎస్ఎస్ లాంటి హిందూత్వ సంస్థలు కీర్తిస్తారు. నిమ్న కులాల జనానికి ‘మెడకు ముంత, మొలకు తాటాకు’ తగిలించిన అత్యంత హేయమైన పీష్వా బ్రాహ్మణ రాజుల పాలనను ఉత్కృష్ట పాలనగా కీర్తిస్తారు.

వెయ్యి మాటలు చెప్పలేనిది ఒక ఫోటో చెబుతుందని జర్నలిస్టులు తరచుగా చెప్పే మాట! పీష్వా రాజుల ఉత్కృష్ట పాలన ఎంత ఉత్కృష్టమో కింది ఫోటో ఒక్కటి చెబుతుంది. ప్రతిభా సంపన్నులకు రాజ్యం అప్పగించినప్పటి పాలనా ఉత్కృష్టతను ఈ ఫోటోలో చూసి తరించవచ్చు.

ఈ ఫోటోకి టైటిల్ అవసరమా?

ఇదంతా చెప్పాక, మరొక ముఖ్య విషయం చెప్పకుండా ఉండటం అన్యాయం అవుతుంది. అదేంటంటే, అగ్ర కులాలుగా చెప్పబడుతున్న కులాల్లో పుట్టి కూడా ఎటువంటి కుల భావనలను వ్యక్తం చేయని, చూపని, పాటించని మంచి మనుషులు, నిజమైన మనుషులు చాలా మంది భారత సమాజంలో ఉన్నారు. వాళ్ళలో అత్యధికులు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముతున్న వారో లేక ఇష్ట పడే వాళ్ళో అయి ఉండడం కూడా ఒక వాస్తవమే.

అలాగే కమ్యూనిస్టులు కాకుండా కూడా కుల భావన, కులాధిక్య భావన లేని వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ‘సంఖ్య తక్కువే’ అని తీసి పారేయదగ్గ విషయం కాదది. తమ చుట్టూ ఉన్న తమ కులానికే చెందిన మనుషులు చిన్నప్పటి నుండీ నిమ్న కులాల ప్రజలపై చిన్న చూపు చూసే పరిస్ధితులను చూస్తూ పెరిగినప్పటికీ అటువంటి భావాలను వంటబట్టించుకోకుండా ఉండడం మామాలు విషయం కాదు. అలాంటి వాళ్ళకు వేన వేల దండాలు పెట్టి తీరవలసిందే.

One thought on “కులం వికృత రూపాన్ని చూడండి!

  1. కళ్ళముందు ఎన్ని కనిపిస్తున్నప్పటికీ ఒకప్పట్టిలా ఇప్పుడు కుల వివక్ష ఎక్కడుంది? ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు!

వ్యాఖ్యానించండి