
Amaravati the Ghost Town
2024-25 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు ప్రకటించారు. టిడిపి, జెడి(యు) పార్టీల మద్దతు పైన బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందునే ఆర్ధిక మంత్రి ‘కుర్సీ కో బచావో’ పధకం మేరకు ఆ రెండు రాష్ట్రాలకు నిధులు ప్రకటించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించాడు. ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపిందని ఆరోపించాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 16,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆర్ధిక మంత్రి ఆ నిధులు ఏ రూపంలో, ఎలా ఇస్తుందన్న వివరాలను మాత్రం వెల్లడి చేయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని వివరాలు ఇచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రకటించిన రు 16,500 కోట్లు తాము ప్రపంచ బ్యాంకు నుండి అప్పుగా సేకరించి ఇస్తామని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ బ్యాంకు తో పాటు ఇంకా ఇతర బహుళపక్ష ఋణదాత ఏజన్సీల (మల్టీ లేటరల్ ఏజన్సీలు) నుండి కూడా నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తామని ఆమె మరోమాట చెప్పారు. ఆసియన్ డవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ కూటమికి చెందిన న్యూ డవలప్మెంట్ బ్యాంకు, చైనా స్థాపించిన ‘ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మొ.న సంస్థలు మంత్రి చెప్పిన మల్టీలేటరల్ ఏజన్సీల కిందకు వస్తాయి.
వరల్డ్ బ్యాంకుని ఇంతవరకు ఈ నిధుల గురించి ఇండియా అడిగింది లేదు. అసలు వరల్డ్ బ్యాంక్, ఆంధ్ర ప్రదేశ్ కోసం బడ్జెట్ లో ప్రకటించిన నిధులు/అప్పు ఇస్తుందో కూడా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలియదు. “వరల్డ్ బ్యాంక్ ని అడుగుతాము. అది సుముఖంగా లేకపోతే ఇతర మల్టీలేటరల్ ఏజన్సీలను అడుగుతాము” అని చెప్పారావిడ.
ఒక వేళ వరల్డ్ బ్యాంక్ గానీ లేదా ఇతర సంస్థలు గానీ అప్పు ఇచ్చేందుకు సుముఖంగా ఉంటే గనక ఆ అప్పు చెల్లించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వామా లేక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమా అన్న అంశం గురించి కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుని ఎపి కి గ్రాంటుగా ఇస్తుందా లేక ఎపి రాష్ట్ర ప్రభుత్వమే ఆ అప్పు చెల్లించాలా అన్నది తెలియరాలేదు. అడిగినా చెప్పేవారు లేరు.
బీహార్ కి రు 58,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మొదట స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేసిన నితీశ్ కుమార్ బడ్జెట్ ప్రకటించాక గమ్మున ఉండిపోయాడు. బీహార్ లో కోసి వరదలు వచ్చిన నేపధ్యంలో ఆ రాష్ట్రానికి సాయం చేయొద్దని ఎవరైనా అనగలరా అని మంత్రి నిలదీశారు. బీహార్ లో అనేక వంతెనలు, రహదారులు నిర్మించ వలసిన అవసరం ఉందని ఆమె వక్కాణించారు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టిడిపి, జెడి(యు) లపై ఆధారపడి ఉన్నందునే ఎపి, బీహార్ లకు బడ్జెట్ లో నిధులు ప్రకటించారని రాహుల్ గాంధీ చేసిన విమర్శను ఖండిస్తూ ఆమె “తూర్పు భారత్ లో మౌలిక నిర్మాణాలను నిర్మించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతోనే ఆ రెండు రాష్ట్రాలకు నిధులు కేటాయించాము తప్ప ఇందులో మరే రాజకీయమూ లేదనీ, ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీయే ప్రచారంలో పెడుతున్నదని ఆమె విమర్శించారు.

Glorified Vision of Amaravati
దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని, రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తామన్న హామీని ఎపి రీ ఆర్గనైజేషన్ చట్టంలోనే పొందుపరిచారని సదరు చట్టాన్ని గౌరవించి తీరాలని ఆమె నొక్కి చెప్పటం విశేషం. అంతే కాకుండా విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగుళూరు – హైద్రాబాద్ కారిడార్ లను కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి నిర్మల చెప్పారు.
అలాగే పోలవరం డ్యాం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఆర్ధిక మంత్రి చెప్పడం విశేషం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారత దేశ ఆహార భద్రతకు గ్యారంటీ ఇచ్చే రాష్ట్రం అవుతుందనీ, అందుకే పోలవరం ను త్వరలో పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నిర్మల చెప్పారు.
ఆర్ధిక మంత్రి సమాధానం చెప్పవలసిన ప్రశ్న ఒకటుంది. బిజెపి ఇప్పుడు మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత పదేళ్లుగా ఆ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ పదేళ్లలోనూ మోడి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు గానీ, రాజధాని నిర్మాణం గురించి కానీ ఒక్క కాణీ అయినా విదిలించింది లేదు. కనీసం వాటి గురించి మాట్లాడిన పాపాన కూడా పోలేదు.
పదేళ్ళ పాలన తర్వాత హఠాత్తుగా ఎపి రాష్ట్రానికి రాజధాని లేదన్న సంగతి బిజెపి గుర్తు వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు నిధుల లేమితో సతమతం అవుతూ భారీ వర్షాలకు చేసిన నిర్మాణాలు కూడా కొట్టుకుపోతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉలకలేదు, పలకలేదు. గత ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటూ ఆంధ్ర ప్రజలతో ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు కూడా బిజెపి గానీ, కేంద్రం గానీ పట్టించుకున్నది లేదు. అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి మూడు రాజధానుల గేమ్ ను ఖండించలేదు.
కేవలం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రమే, అది కూడా హై కోర్టు జగన్ ప్రభుత్వానికి అక్షింతలు వేశాక మాత్రమే మూడు రాజధానుల వ్యవహారాన్ని ఖండిస్తూ రాష్ట్ర బిజెపి నేతలు ముందుకు వచ్చారు, అది కూడా హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి సందర్శించి ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళాకనే.

Laying of Foundation Stone for Amaravati with Much Fanfare
కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిలకడ కోసం టిడిపి పార్లమెంటు సీట్లపై ఆధారపడి ఉన్న కారణంగానే బిజెపి ఇప్పుడు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ – చెన్నై కారిడార్ లకు నిధులు ఇస్తున్నామని ప్రకటించారు అన్నది అక్షరాలా నిజం. తూర్పు ఇండియా అభివృద్ధి లక్ష్యం కోసమే బీహార్, ఆంధ్ర ప్రదేశ్ లకు నిధులు ప్రకటించామని చెప్పటం సత్యదూరం. తూర్పు తీరంలో ఉన్న వెస్ట్ బెంగాల్ కు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వటం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా ఆరోపిస్తున్నది. బెంగాల్ తూర్పు రాష్ట్రం కాదా? ఒడిషా రాష్ట్రం కూడా స్పెషల్ స్టేటస్ కోరింది. ఆ రాష్ట్రానికి గత పదేళ్ళలో ఏయే ప్రాజెక్టులు ఇచ్చారు?
దీర్ఘ కాలిక పధకం అంటే పదేళ్ళు ఆగి ఆ తర్వాత బడ్జెట్ లో నిధులు ప్రకటించి, ఆ నిధులు కూడా ప్రపంచ బ్యాంకును అడుగుతామని తీరిగ్గా చెప్పడమా? ప్రధాన మంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ కి ప్రతి యేటా వేల కోట్లు ఇవ్వటం, వచ్చే పెట్టుబడుల్లో గరిష్టం గుజరాత్ కే తరలించడం, గుజరాత్ కి చెందిన ఆదానీ కంపెనీకి దేశం లోని సీ పోర్టులు, ఎయిర్ పోర్టులు, స్టీల్ కంపెనీలు అన్నీ కట్టబెట్టడం… ఇవన్నీ కూడా దీర్ఘ కాలిక కమిట్మెంట్లను నెరవేర్చడంలో భాగమేనా?
ఇప్పటి బడ్జెట్ లో ప్రకటించిన రు 16,500 కోట్లతో పాటు రానున్న సంవత్సరాలలో కూడా ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు ఇవ్వబోతున్నామని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇస్తే మంచిదే గానీ అప్పులు తెచ్చి ఆ అప్పులు కూడా మీరే తీర్చుకోండి అని చెబితే మాత్రం రాష్ట్ర ప్రజలే భవిష్యత్తులో పెరిగే పన్నుల రూపంలో వివిధ రకాల చార్జీల రూపంలో మరింత మోయలేని భారం పడటం ఖాయం.

Polavaram Dam Site
ఇప్పటికే ఎన్నికల ముందు మాటలకి, ఎన్నికల తర్వాత మాటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేడా చూపిస్తున్నాడు. జగన్ ఓదార్పు యాత్రలో యధేచ్చగా వాగ్దానాలు ఇచ్చి అధికారం వచ్చాక వాటన్నింటినీ తుంగలో తొక్కినట్లే టిడిపి ప్రభుత్వం కూడా అదే తరహా పద్ధతి అవలంబించబోదన్న గ్యారంటీ అయితే లేదు. అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అక్కడక్కడ టిడిపి నేతలు, అభిమానులు సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. కొన్ని చోట్ల ఆ భారం మోయలేక ఆపేశారు కూడాను.
రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, భూమిలేని పేద రైతులు వీరంతా చంద్రబాబు పాలన జగన్ పాలన కంటే భిన్నంగా గొప్పగా ఉంటుంది అని భావిస్తే వాళ్ళు నిరాశకు గురి కాక తప్పదు. ప్రజల మీద భారం వేయకుండా కనీసం అమరావతి, పోలవరం ప్రాజెక్టులను త్వరిత గతిన నిర్మించగలిగితే, పాడైపోయిన రోడ్లను పునరుద్ధరించగలిగితే అదే పదివేలు అని భావించవచ్చు.