
పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్ కంపెనీల కంటే మిడిల్ క్లాస్ ఆదాయంతో రోజులు కనాకష్టంగా వెళ్లదీసే వర్గమే అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గత ఆర్టికల్ లో, ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే సాక్షిగా, చూశాం. అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్ధితిని కాస్త చూద్దాం.
కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా రెండు రకాల పన్నుల ద్వారా ప్రజల నుండి ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు: ఆదాయ పన్ను, కార్పొరేట్ల లాభాలపై పన్నులు. రెండవది, పరోక్ష పన్నులు: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్‌టి – సరుకులు సేవలపై పన్ను).
ఇవి కాకుండా ఫారెన్ రెమిటెన్సెస్ రూపం లోనూ, విదేశాల్లో భారత కంపెనీలు పెట్టిన పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని రు. 2 కోట్లకు మించి ఇండియాకు తలలిస్తే ఆ మొత్తంపై వేసే పన్నుల ఆదాయం రూపం లోనూ కేంద్ర ప్రభుత్వానికి కాస్త ఆదాయం వస్తుంది. ఈ అంశాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం.
మిడిల్ క్లాస్ (లోయర్, హైయర్ మిడిల్ క్లాస్ తో కలుపుకుని) ప్రజలు అటు ఆదాయం పైనా ఇటు తాము చేసే ఖర్చుల పైనా కూడా పన్నులు చెల్లిస్తున్నారు. తమకు వచ్చే ఆదాయం పైన పన్ను చెల్లించడం ద్వారా అత్యధిక మొత్తంలో ప్రత్యక్ష పన్నులను వాళ్ళు చెల్లిస్తున్నారు.
మరో పక్క తాము చేసే సమస్త ఖర్చుల పైనా, ఉప్పులు, పప్పులు, బట్టలు, చెప్పులు, ధాన్యం, హోటల్ భోజనం, టీ, కాఫీ, సబ్బులు, షాంపూలు, బ్రష్-పేస్ట్-హ్యాండ్ వాష్ లు, రేజర్లు, షేవింగ్ క్రీంలు, ఆఫ్టర్ షేవ్ లోషన్లు, జబ్బులు (ఔషధాలు), బల్పులు, స్విచ్ లు, విద్యుత్… ఇలా సమస్త ఖర్చుల పైనా జి.ఎస్.టి రూపంలో పన్నులు చెల్లిస్తున్నారు. పెట్రోల్, డీజెల్ లపై చెల్లించే కస్టమ్ సుంకాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సర్ ఛార్జీలు వీటికి అదనం.
విచిత్రం ఏమిటంటే ప్రజలు తమ ఆదాయంలో కాస్త మిగుల్చుకుని బ్యాంకుల్లో దాచుకుంటే వాటి పైనా ఛార్జీలు చెల్లిస్తున్నారు. కరెన్సీ రద్దు ద్వారా మోడి ప్రభుత్వం అమలు చేసిన డిజిటలైజేషన్ వల్ల ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఇది. గతంలో ఎప్పుడంటే అప్పుడు బ్యాంకుకు వెళ్ళి ఒక విత్ డ్రా ఫారం ఇస్తే మన డబ్బు మనకు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఏటిఎంలో పరిధికి మించి విత్ డ్రా చేస్తే ఛార్జీ, పక్క బ్యాంకు ఏటిఎం లో విత్ డ్రా చేస్తే చార్జి, పేటిఎం/యుపిఐ ద్వారా పిల్లలకు, స్నేహితులకు డబ్బు పంపితే చార్జి.
ఎల్.ఐ.సిలో డబ్బు దాచుకునేందుకు ప్రీమియం కడితే దాని పైన జి.ఎస్.టి చెల్లించే ఘోరమైన దరిద్రాన్ని బిజెపి/మోడి ప్రభుత్వం దేశ ప్రజలకు తెచ్చి పెట్టింది. సమస్త సరుకుల్ని జి.ఎస్.టి పరిధిలోకి తెచ్చిన మోడి ప్రభుత్వం పెట్రోలు, డీజెల్ లను మాత్రం జి.ఎస్.టి పరిధి లోకి తేలేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గినా ఆ తగ్గింపు ప్రజలకు చేరనివ్వదు, కానీ పెరిగినప్పుడు మాత్రం ఆ పెరుగుదల తప్పనిసరిగా జనం జేబుల్లోకి ఠంచన్ గా వచ్చేస్తుంది. ఇంధనాన్ని జి.ఎస్.టి పరిధిలోకి తేవడం గురించి ప్రశ్నిస్తే ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీదికి నెట్టడం సీతారామన్ కు ఒక ఆనవాయితీ. అక్కడికి అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పి చేస్తున్నట్లు?!

దేశంలో 50 నుండి 60 కోట్ల మంది వరకు మిడిల్ క్లాస్ ఉన్నారని అంచనా. మొత్తం జనాభాలో ఆదాయ పన్ను చెల్లించేది 2 శాతం ప్రజలే అయినా, జి.ఎస్.టి మాత్రం కూలీ నుండి ఉన్నత ఉద్యోగి వరకు చెల్లిస్తున్నారు. జి.ఎస్.టి ఆదాయం నెల నెలా పెరుగుతూ పోవడం గమనిస్తే జనం ముక్కు పిండి వసూలు చేసే పద్ధతులను మోడి ప్రభుత్వం శక్తివంతంగా తయారు చేసినట్లు అర్ధం అవుతుంది.
కనుక మిడిల్ క్లాస్ జనం ఆదాయం పన్నును కాస్త తగ్గిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఆదాయ పన్నుకు బదులు జి.ఎస్.టి చెల్లిస్తాడు. ఎందుకంటే ఆ తగ్గిన పన్ను ద్వారా మిగిలే సొమ్ము పెట్టి ఏదో ఒకటి కొంటాడు గనుక!
వెరసి మిడిల్ క్లాస్ ప్రజలు ఆదాయాల పైన పన్నులు చెల్లిస్తున్నారు. తాము చేసే ఖర్చుల పైనా పన్నులు చెల్లిస్తున్నారు. వారికి జేబులోకి వచ్చే ప్రతి రూపాయి పైనా, జేబులో నుండి వెళ్ళే ప్రతి రూపాయి పైనా పన్ను చెల్లిస్తూ మధ్య తరగతి జీవి దేశానికి చాలానే చేస్తున్నాడు.
రాజకీయ నాయకుడు ఎవరైనా “దేశం మీకు ఏం ఇచ్చింది అనే కంటే మీరు దేశానికి ఏమిచ్చారు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటూ అబ్రహాం లింకన్ ని కోట్ చేస్తే మిడిల్ క్లాస్ జనం ధైర్యంగా మేం పన్నులు కడుతున్నాం, నాయకుడుగా నువ్వు దేశానికి ఏం చేశావో చెప్పు అని ధైర్యంగా ప్రశ్నించవచ్చు.