ఉక్రెయిన్: ఆయుధ రహస్యాలు చైనాకు చేరుతున్నాయన్న బెంగలో అమెరికా!


ఇప్పుడు అమెరికాకి కొత్త భయం పట్టుకుంది. ఉక్రెయిన్ సైన్యానికి సరఫరా చేస్తున్న అమెరికా ఆయుధాలన్నీ రష్యా యుద్ధ ఎత్తుగడల ముందు ఎందుకూ పనికి రాకుండా విఫలం అవుతుండడంతో తమ ఆయుధాల రహస్యాలు రష్యాకు తెలిసిపోతున్నాయని ఆందోళన చెందుతోంది. అంతకంటే ముఖ్యంగా తమ ఆయుధాల రహస్యాలను రష్యా, చైనాకు కూడా సరఫరా చేస్తున్నదని అనుమానిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల ఆయుధాల సమాచారం చైనాకు సరఫరా అవుతోందన్న అనుమానం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నది.

అమెరికా మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ గురించిన హౌస్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ జాన్ మూలెనార్, ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ కు లేఖ రాస్తూ “అమెరికా మరియు అమెరికా భాగస్వాములు, మిత్ర దేశాల ఆయుధాల సామర్ధ్యం గురించి రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీకి అందజేసిన సమాచారం పైన అధ్యయనం చేసి మదింపు చేసిన నివేదికను తమ కమిటీకి సమర్పించాలని కోరాడు. ఈ లేఖపై, హౌస్ కమిటీ లోని మరో సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది.

“జులై 9 తేదీన మీరు చెప్పినట్లుగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పి.ఆర్.సి) లాంటి విదేశీ విరోధులు, రష్యాకు ఉచితంగా సహాయం అంద జేస్తున్నాయని మనం భావించ కూడదు. నిజానికి అమెరికా మరియు దాని మిత్ర దేశాల ఆయుధ వ్యవస్థల లోని బలహీనతలను పి.ఆర్.సి కి రష్యా అందజేస్తున్నదని మనం భావించాలి. అటువంటి అంచనాతోనే మనం ఆ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకునేందుకు కృషి చేయాలి. రష్యాతో ‘అవధులు లేని భాగస్వామ్యం’ లో చైనా ఉన్నందుకు ప్రతిఫలంగా రష్యా మన ఆయుధాల బలహీనతలను చైనాకు సరఫరా చేస్తుండవచ్చు” అని ఆ లేఖలో మూలేనార్ ఆందోళన వ్యక్తం చేశాడు (ది ఎకనమిక్ టైమ్స్, జులై 17, 2024). అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల ఆయుధ వ్యవస్థలలో బలహీనతలను కనిపెట్టినందునే రష్యా ఆయుధ వ్యవస్థ ముందు అవి ప్రభావవంతంగా పని చేయడం లేదని కమిటీ భావిస్తున్నది.

లేఖలో కమిటీ ఇంకా ఇలా పేర్కొంది, “రష్యా దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్ తరపున అమెరికా మరియు నాటో మిత్రుల మద్దతు కొనసాగుతున్న నేపధ్యంలో అమెరికా సరఫరా చేసిన అనేక ఆయుధాల పనితీరును, ప్రభావశీలతను ఆందోళనకర స్థాయిలో రష్యా ఆయుధాలు బలహీన పరిచాయని ఇటీవలి నివేదికల ద్వారా తెలుస్తోంది. కొన్ని ఆయుధ వ్యవస్థలు పాతవి, తక్కువ ఆధునీకరణ చెందినవి ఐనప్పటికీ, రష్యన్ ఎలక్ట్రానిక్ యుద్ధ కుశలత ముందు మన కొత్త ఆయుధ వ్యవస్థలు కూడా పని చేయడం లేదని, అందుకు తగినట్లుగా రష్యా ప్రతిచర్యలు తీసుకోవడంలో సఫలం అయిందని తెలుస్తున్నది.

“రక్షణ, స్వాధీనం మరియు నిలకడ శాఖ అండర్ సెక్రటరీ ఫైలియం లప్లాంటే, మన ఖచ్చితత్వ ఆయుధాలను (ప్రెసిషన్ మ్యూనిషన్స్) నాశనం చేయటంలో రష్యన్లు చాలా చాలా గొప్ప పరిణతి సాధించాయని చెప్పాడు. ఈ తరహా రష్యన్ ఎత్తుగడలు మరియు ఇతర విరోధులతో జరిగే ఇతర యుద్ధాలలో వారి పరిణతి విస్తరించే ప్రమాదాన్ని నిలువరించడంలో అమెరికా మిలటరీ మరియు పారిశ్రామిక సామర్ధ్యంపై ఈ నివేదికలు పలు ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి” అని మూలెనార్ తమ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై సమాచారం కోరింది.

  • ఉక్రెయిన్ లో అమెరికా ఆయుధ వ్యవస్థలను బలహీనపరచడంలో, నిరోధించడంలో రష్యా సాధించిన సామర్ధ్యంపై మదింపు.
  • ఉక్రెయిన్ యుద్ధరంగంలో రష్యా నేర్చుకుని సాధించిన ఆధునిక ఆవిష్కరణలను, ముఖ్యంగా అమెరికా ఆయుధాలకు సంభంచినంత వరకు ఏమేరకు చైనాతో పంచుకుంది.
  • ఉక్రెయిన్ యుద్ధరంగంలో నేర్చుకున్న పాఠాల ద్వారా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా మిలటరీ) రష్యన్ మిలటరీ ఆవిష్కరణలను ప్రతిబింబించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు.
  • ఈ ప్రమాదాల నేపధ్యంలో రష్యా, చైనాలకు వ్యతిరేకంగా అమెరికా ఆయుధ వ్యవస్థల ప్రభావశీలత తగ్గకుండా మెరుగుపరిచేందుకు బైడెన్ ప్రభుత్వం రూపొందిస్తున్న పధకాలు.
  • ఉక్రెయిన్ లో రష్యా దురాక్రమణ యుద్ధంలో చైనా ఇస్తున్న మద్దతుకు గాను చైనాను బాధ్యురాలిగా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.

ఎందుకీ ఆందోళన?

అమెరికా ఇంతగా ఎందుకు ఆందోళన చెందుతోంది? ఎందుకంటే ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన దగ్గర నుండి రష్యా, చైనాల మధ్య సంబంధాలు రాకెట్ వేగంతో అభివృద్ధి చెందాయి. ఇందుకు కారణం కూడా అమెరికాయే. అమెరికా, తన ప్రపంచ ఆధిపత్యాన్ని నిలుపుకునే తుత్తరలో తన శత్రువులు అనివార్యంగా ఒకరికొకరు మరింత సన్నిహితంగా సహకరించుకునే పరిస్ధితిని అమెరికా కల్పిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు అమెరికా చైనా వాణిజ్యం పైనా, చైనా 5జి టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ) టెక్నాలజీల పైనా తీవ్రమైన ఆంక్షలు విధించింది. చైనా సాధించిన 5జి టెక్నాలజీని, సదరు టెక్నాలజీ పరికరాలను ఐరోపా దేశాలు దిగుమతి చేసుకోకుండా ఆటంకాలు, ఆంక్షలు విధించింది. టిక్ టాక్ లాంటి చైనా ఆధారిత అప్లికేషన్లను అమెరికన్లు వినియోగించకుండా బహిష్కరించింది. అనేక చైనా మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల సరుకులను కూడా అమెరికా నిషేధించింది.

అంతటితో ఆగకుండా అనునిత్యం దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ధ నౌకలను తిప్పుతోంది. ‘ఫ్రీడం ఆఫ్ నేవిగేషన్’ కోసమే తానిలా చేస్తున్నానని కాకమ్మ కబుర్లు చెప్పింది. చైనా తన భూభాగంగా భావించే తైవాన్ కు ఆయుధాలు సరఫరా చెస్తూ ఆ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతోంది. దక్షిణ కొరియా – చైనా, జపాన్ – చైనా ల మధ్య వాణిజ్యం అభివృద్ధి కాకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఫిలిప్పైన్స్ తో చైనా వాణిజ్య సంబంధాలను చెడగొట్టి దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించింది. దానితో నిన్న మొన్నటి వరకు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఫిలిప్పైన్స్ ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రపంచ వాణిజ్యం కోసం చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బిఆర్ఐ) లో చేరిన దేశాలను బెదిరించి తప్పుకునేలా ఒత్తిడి తెస్తోంది. రష్యాకు ఆయుధాలు సరఫరా చేయవద్దని, చేస్తే చైనా వాణిజ్యానికి మరింత చేటు తెస్తానని గుర్తొచ్చినప్పుడల్లా బెదిరిస్తోంది.

ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా గ్యాస్, చమురు వాణిజ్యం పైన అమెరికా తీవ్ర ఆంక్షలు ప్రకటించి అమలు చేస్తున్నది. స్విఫ్ట్ (SWIFT – Society for Worldwide Inter-bank Financial Telecommunications) వ్యవస్థ నుండి రష్యాను తొలగించింది. ఫలితంగా ప్రపంచ దేశాలతో జరిపే వాణిజ్యానికి అటూ-ఇటూ చెల్లింపులు చేసే సౌకర్యాన్ని రష్యా కోల్పోయింది. ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా నిమిత్తం రష్యా నిర్మించిన నార్డ్ స్ట్రీం -1 మరియు నార్డ్ స్ట్రీం -2 లను రహస్యంగా బాంబులు పెట్టి పేల్చివేసింది. తద్వారా పశ్చిమ ఐరోపా దేశాలతో గ్యాస్ సరఫరాను శాశ్వతంగా బంద్ చేయించి ఖరీదైన తన గ్యాస్ ను ఐరోపా దేశాలకు సరఫరా చేస్తోంది. ఈ ఒక్క చర్య వల్ల జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి పెద్ద ఐరోపా దేశాల నుండి తూర్పు యూరప్ దేశాల వరకు ఒక్కసారిగా ఇంధనం ధరలు పెరిగిపోయి, దాని వలన సమస్త సరుకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. జిడిపి కుదించుకుపోయింది. అయినా సరే, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్వీడన్ దేశాలతో పాటు ఐరోపా దేశాలన్నీ అమెరికాకు భయపడి రష్యాతో వాణిజ్యం రద్దు చేసుకుని భారాన్ని మోస్తున్నాయి.

ఈ పరిస్ధితుల్లో రష్యా గ్లోబల్ సౌత్ దేశాలతో వాణిజ్యం అభివృద్ధి చేసుకుంటోంది. ఐరోపాకు గ్యాస్ సరఫరా రద్దు వల్ల సంభవించిన నష్టాన్ని చైనాకు గ్యాస్ సరఫరా ద్వారా పూడ్చుకుంది. ఇండియా లాంటి దేశాలకు చౌక ధరకు చమురు సరఫరా చేస్తున్నది. విచిత్రం ఏమిటంటే రష్యా నుండి దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన చమురును ఐరోపా దేశాలు మారు బేరానికి కొనుగోలు చేయటం! పశ్చిమ దేశాల నుండి దిగుమతి చేసుకున్న సరుకులను తమ వద్దనే ఉత్పత్తి చేసుకోవడం రష్యా ప్రారంభించింది. విదేశీ వాణిజ్యంలో ఎక్కడి కక్కడ స్థానిక కరెన్సీలలో చెల్లింపులు చేయడం ప్రారంభించింది. తద్వారా అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రక్రియ ప్రారంభించింది. రష్యా, చైనాలు ఇటీవల అమెరికా, ఐరోపాల మధ్యన ఉన్న అట్లాంటిక్ సముద్రం లోనే ఉమ్మడి మిలటరీ విన్యాసాలు జరపడంతో అమెరికా మరింత ఉక్రోషంతో ఊగిపోతోంది. దక్షిణ చైనా తీరంలోని మిలటరీ పోర్ట్ లో కూడా రష్యా, చైనాలు ఉమ్మడి మిలటరీ విన్యాసాలు జరిపాయి.

ఇటీవల వాషింగ్టన్ లో 32 నాటో కూటమి దేశాలు సమావేశం అయినాయి. అందులో ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి చైనాను ‘నిర్ణయాత్మక మద్దతుదారు’ (Decisive Enabler) గా నాటో కూటమి ముద్ర వేసింది. (ఈ సమావేశం జరిపిన తర్వాతే రష్యా, చైనాలు ఉమ్మడి మిలటరీ విన్యాసాలు జరపడం గమనార్హం). అక్కడితో ఆగకుండా పశ్చిమ మరియు ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో కూడా రష్యా, చైనాల నావికా బలగాలు విన్యాసాలు (మిలటరీ ఎక్సర్సైజెస్) జరిపాయి. తమ విన్యాసాలు ఏ దేశాన్ని ఉద్దేశించినవి కావని ఇరు దేశాలు ప్రకటించాయి. తద్వారా అమెరికా తరచుగా రష్యా, చైనాలకు వ్యతిరేకంగా మిలటరీ విన్యాసాలను జరిపి “అబ్బే, ఇవి ఎవరికీ వ్యతిరేకం కాదు” అంటూ చేసే ప్రకటనలను హేళన చేశాయి.

రష్యా, చైనాలు సంయుక్తంగా అటాక్ డ్రోన్ ను అభివృద్ధి చేస్తున్నాయని వార్తల ద్వారా తెలుస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ సరఫరా చేసిన షహీద్ డ్రోన్ లను రష్యా విస్తృతంగా ప్రయోగించింది. ఈ డ్రోన్ లతోనే అమెరికా, జర్మనీ, బ్రిటన్ లు సరఫరా చేసిన పేరు మోసిన ట్యాంక్ లను రష్యా నాశనం చేయగలిగింది. ఇరాన్ డ్రోన్ ను పోలిన డ్రోన్ ను చైనా లో ఇరు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసి 2023లో పరీక్షలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. వీటిని త్వరలో రష్యాకు పెద్ద మొత్తంలో చైనా ఎగుమతి చేస్తుందని అమెరికా అనుమానిస్తున్నదని బ్లూమ్ బర్గ్ న్యూస్ వెబ్ సైట్ వెల్లడి చేసింది. మిలటరీ ఉపయోగం నిమిత్తం శాటిలైట్ చిత్రాలు, ట్యాంకుల నిర్మాణంలో ఉపయోగించే మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు మెషిన్ టూల్స్ లు చైనా ఇప్పటికే రష్యాకు అందిస్తోందని అమెరికా నేతల నిశ్చితాభిప్రాయం. చైనా, రష్యాకు నేరుగా ఆయుధాలు, ఫిరంగులు సరఫరా చేస్తే చైనాపై మరిన్ని ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధపడుతున్నట్లు పశ్చిమ పత్రికలు ఎప్పటి నుండో చెబుతున్నాయి.

ఉక్రెయిన్ లో జరుగున్నది రష్యా-నాటో యుద్ధమే!

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న ఆయుధాలన్నీ అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు సరఫరా చేసినవే. ఈ యుద్ధం పైకి చూసేందుకు ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా ఇది రష్యా – నాటో కూటమిల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం. నిజానికి రష్యా- నాటోల ప్రత్యక్ష యుద్ధం అని చెప్పినా తప్పు లేదు. ఉక్రెయిన్ సైన్యంతో పాటు అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల సైన్యం కూడా సలహాదారుల రూపంలో, ప్రైవేటు కాంట్రాక్టు సైన్యం రూపంలో ఉక్రెయిన్ లో ఉండి, తాము సరఫరా చేసిన ఆయుధాలను తామే ప్రత్యక్షంగానే ఉపయోగిస్తూ రష్యా సైన్యంతో తలపడుతున్నారు. కనుక ఇది ప్రాక్టికల్ గా రష్యా, నాటో యుద్ధ కూటమి మధ్య జరుగుతున్న ప్రత్యక్ష సామ్రాజ్యవాద యుద్ధం.

Ukrainian servicemen cry near the coffin of their comrade Andrii Trachuk during his funeral service on Independence square in Kyiv, Ukraine, Friday, Dec. 15, 2023. Trachuk was killed by Russian forces on Dec. 9, 2023 near Kherson. (AP Photo/Evgeniy Maloletka)

తమ ప్రపంచాధిపత్య ప్రయోజనాలకు, నాటో కూటమి దేశాలు, ముఖ్యంగా అమెరికా ఉక్రెయిన్ సైన్యాన్ని పావుగా ఉపయోగిస్తున్నది. తమ సైన్యాన్ని భద్రంగా ఉంచుకుని ఉక్రెయిన్ సైన్యాన్ని, సైనిక రిక్రూట్ మెంట్ ద్వారా ఉక్రెయిన్ ప్రజలను బలి పశువులుగా నాటో కూటమి, రష్యా నిర్మించిన వధ్యశిలపై బలి పెడుతోంది. నాటో చేస్తున్న వ్యూహాత్మక విస్తరణవాద సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధంలో తప్పనిసరి పరిస్ధితుల్లో తన భద్రత కోసం ఉక్రెయిన్ లో నాటోతో యుద్ధం చేస్తున్నది. అంత మాత్రాన రష్యాకు సామ్రాజ్యవాద ప్రయోజనాలు లేవని చెప్పలేము. అయితే రష్యా చేస్తున్నది ఆత్మరక్షణ యుద్ధం కాగా, నాటో కూటమి (ఉక్రెయిన్ ని వినియోగిస్తూ) చేస్తున్నది ప్రపంచాధిపత్య యుద్ధం అన్నది ఒక వాస్తవ పరిస్ధితిగా చూడాలి.

ఈ సంగతి చెప్పటానికి లోతుల్లోకి వెళ్లి విశ్లేషించవలసిన అవసరం లేదు. అమెరికా సెనేట్ లో రిపబ్లికన్ పార్టీకి చెందిన తీవ్రవాద మితవాద (Right Extremists) సెనేటర్లు (జాన్ మెక్ కెయిన్, లిండ్సే గ్రాహం మొ.), నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్, ఇయు కమిషన్ కు ఇటీవల మళ్ళీ అధ్యక్షురాలుగా ఎన్నికయిన ఊర్సులా ఫన్డే లైన్ మొ.న నేతలు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో చేసిన ప్రకటనలు చూస్తే సరిపోతుంది.

ఉదాహరణకి “ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా చేస్తున్న సహాయం అత్యంత తెలివైన, అత్యుత్తమ పెట్టుబడి. ఎందుకంటే ఇందులో అమెరికా సైన్యం పాల్గొనకుండానే రష్యాతో మనం యుద్ధం చేస్తున్నాం” అని లిండ్సే గ్రాహం వ్యాఖ్యానించాడు. “చివరి ఉక్రెయిన్ సైనికుడు మరణించే వరకు రష్యాతో యుద్ధం చేసి తీరుతాం” అని జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ప్రకటించాడు. ఊర్సులా ఫన్డే లైన్ అయితే “ఉక్రెయిన్ కి అవసరం అయినదంతా మనం ఇవ్వాలి. ఇయు కూటమి దేశాలన్నీ ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేసి రష్యా ఓటమికి కృషి చేయాలి” అని పిలుపు ఇచ్చింది. లేనట్లయితే మనం అనుసరించే “రూల్స్ బేస్డ్ వరల్డ్ కుప్పకూలుతుంది” అని హెచ్చరించింది. అమెరికా పశ్చిమ దేశాల దృష్టిలో ‘రూల్స్ బేస్డ్ వరల్డ్’ అంటే పశ్చిమ దేశాల ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగే ప్రపంచ వ్యవస్థ అని మాత్రమే అర్ధం. ఆ వ్యవస్థలో స్వార్ధ ప్రయోజనాల కోసం రూల్స్ ని అతిక్రమించే హక్కు కేవలం అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు మాత్రమే ఉంటుంది. సార్వభౌమత్వం కోరుకునే హక్కు ఇతర దేశాలకు ఉండదు.

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మొదలైన రెండు నెలలకే శాంతి ఒప్పందం దాదాపుగా కుదిరింది. చివరి నిమిషంలో అమెరికా, పశ్చిమ ఐరోపాల కూటమి శాంతి ఒప్పందం జరగకుండా అడ్డుపుల్ల వేశాయి. అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన ఉక్రెయిన్ వచ్చి శాంతి ఒప్పందం అమలు లోకి రాకుండా నిరోధించాడు. ఉక్రెయిన్ సైన్యాలు పెద్ద మొత్తంలో చనిపోతున్నప్పటికీ నాటో కూటమి ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్నాయి. రష్యా సేనలు ఒక్కో పట్టణం, గ్రామం వశం చేసుకుంటూ పోతున్నప్పటికీ పశ్చిమ వార్తా సంస్థలు ఉక్రెయిన్ విజయం పధంలో దూసుకు వెళ్తున్నదనీ, రష్యా సేనలు పెద్ద సంఖ్యలో మట్టి కరుస్తున్నాయని వార్తలు సృష్టించి ప్రచారంలో పెడుతున్నాయి. తద్వారా ఉక్రెయిన్ ప్రజలను తామే బలి పీఠంపై నిలబెడుతున్న సంగతి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త వహిస్తున్నాయి.

ఇంత చేస్తూ చైనాను లక్ష్యంగా చేస్తూ ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు, బలహీన పరిచేందుకు నాటో దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నాటో కూటమి దేశాల ఆలోచనలు, ఎత్తుగడలు, వ్యూహాలు, చర్యలు అన్నీ ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపుకు ఒక్కో అడుగు నడిపిస్తున్నాయి. “సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం” అన్న రష్యా మహా నాయకుడు వ్లాదిమిర్ ఇల్యునోవిక్ లెనిన్ వాక్కును ప్రత్యక్షర సత్యంగా మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నాయి. “యుద్ధానికి యుద్ధానికి మధ్య విరామమే శాంతి” అన్న టాల్ స్టాయ్ చేసిన నిర్ధారణను మళ్ళీ నిర్ద్వంద్వంగా నిర్ధారిస్తున్నాయి. సామ్రాజ్యవాదం శాశ్వతంగా ఊపిరి పీల్చడం ఆగితే తప్ప ఈ యుద్ధాలకు అంతం ఉండదు. సామ్రాజ్యవాదం తన స్వార్ధ ప్రయోజనాల నిమిత్తం అత్యంత సుందరమైన భూగోళాన్ని అణు బాంబులతో గడ్డి పోచ సైతం మొలవలేని స్మశానంగా మార్చక ముందే ప్రజా సామాన్యం ముఖ్యంగా ప్రపంచ కార్మికవర్గం మేలుకుని నిర్ణయాత్మక పోరాటం ద్వారా అమెరికా, ఐరోపా, రష్యా, చైనా సామ్రాజ్యవాదాలకు శాశ్వత సమాధి కట్టవలసి ఉన్నది.

  • నాటో కూటమి తూర్పు యూరప్ దేశాల విస్తరణ నుండి ఉపసంహరించుకుని 1990 నాటి హద్దులకు వెనక్కి మళ్ళాలి!
  • రష్యా వెంటనే ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమించి తన సేనలను ఉపసంహరించాలి. ఉక్రెయిన్ లో మారణహోమాన్ని ఆపాలి!
  • ఉక్రెయిన్ పాలకులు ఆత్మహత్యా సదృశమైన నాటో సేవల విధానాన్ని రద్దు చేసుకుని తటస్థ దేశంగా తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలి.
  • అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య విధానాలు మానుకుని ప్రపంచ దేశాల, జాతుల, ప్రజల స్వాతంత్రాన్ని, స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించి గౌరవించాలి.
  • ఉక్రెయిన్ కార్మికవర్గం జెలెన్ స్కీ నేతృత్వం లోని నయా-నాజీ పాలక వర్గాన్ని కూలదోసేందుకు నిర్ణయాత్మక పోరాటం నిర్మించాలి.

వ్యాఖ్యానించండి