
—–రచన: డాక్టర్ కోయి కోటేశ్వరరావు
జోగినికి పుట్టిన బిడ్డ అంటూ లోకం అతనిని అవమానించింది. తండ్రి ఎవరో తెలియని అనామకుడని సభ్య సమాజం తిరస్కరించింది. అంటరాని అభాగ్యుడని ఊరు ‘బాకున కుమ్మినట్లు’ బాధించింది. కుల భూతం విషం చిమ్మింది. పేదరికం వెక్కిరించింది.
చుట్టుముట్టిన లెక్కలేని అవమానాలను ధిక్కరించి, కఠోర శ్రమతో అచంచల కార్యదీక్షతో ధీరోచితంగా అతను ముందడుగు వేశాడు. దారి కడ్డంగా పరుచుకున్న రాళ్ల గుట్టలను దాటుకుంటూ, ముళ్ళ తుప్పలను తొక్కుకుంటూ నెత్తుటి పాదాలతోనే నడక సాగించి వెలివాడనుండి కెనడా లోని కార్లెటాన్ విశ్వవిద్యాలయం పీఠం పై కాలు మోపాడు.
నేడు ఆ జోగినీ పుత్రుడు ప్రఖ్యాత పరిశోధకుడిగా అణగారిన ప్రజల చరిత్రను తిరగరాస్తున్నాడు. తెలుగు దళిత సాహిత్య ఔన్నత్యాన్ని దశ దిశల చాటిచెబుతున్నాడు. తెలంగాణ కీర్తి పతాకాన్ని విశ్వ వీధుల్లో ఎగుర వేస్తున్నాడు. గాయాలనే స్వర మాతృకలుగా చేసుకొని పిల్లన గ్రోవి, మధుర రాగాలు పలికినట్లు, అవమానాలనే సోపానాలుగా మార్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆ జ్ఞానయోధుడు ద గ్రేట్ సన్నాఫ్ చిన్నూబాయి “ప్రొఫెసర్ చిన్నయ్య జంగం.”
గుర్రం జాషువ గబ్బిలం కావ్యాన్ని (Gabbilam A Dalit Epic) జంగం చిన్నయ్య అసాధారణ రీతిలో ఆంగ్లంలోకి అనువదించి ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ ఏ కె రామానుజన్ అంతర్జాతీయ పురస్కారాన్ని(2024) సాధించాడు. వాషింగ్ టన్ లోని సియాటెల్ నగరంలో ఈ మధ్య జరిగిన ‘అసోసియేషన్ ఫర్ ఏసియన్ స్టడీస్’ వార్షిక సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు చిన్నయ్యకు అరుదైన పురస్కారాన్ని అందించారు.
దక్షిణాసియా దేశాల్లోని లబ్ధ ప్రతిష్టులైన రచయితలతో పోటీ పడి ఈ విశిష్ట గౌరవాన్ని అందుకొని ‘టాక్ ఆఫ్ ద గ్లోబల్’ గా నిలిచిన జంగం చిన్నయ్య ప్రస్థానాన్నిపరిశీలిస్తే మహత్తరమైన స్ఫూర్తి కలుగుతుంది. అవరోధాలను అధిగమించి జీవితాన్ని గెలిచే శక్తి సమకూరుతుంది. లక్ష్య సాధనా క్రమంలో కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొని విజేతగా నిలిచే నైపుణ్యం అలవడుతుంది.
జంగం చినయ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో మాదిగ కుటుంబంలో చిన్నూబాయికి జన్మించాడు. బాల్యంలో పోలియో బారిన పడిన చిన్నూబాయిని ఊరి పెద్దలు జోగినిగా మార్చారు. ముక్కుపచ్చలారకుండానే చిన్నూబాయి జోగినీ దురాచార సర్ప పరిష్వంగంలో నలిగిపోయింది. ఐదు సంవత్సరాల ప్రాయం నుండే భూస్వాముల పశువుల కొట్టంలో జీతగాడిగా బంధీ అయిన చిన్నయ్య, దొరల బిడ్డల్లా తాను కూడా చదువుకోవాలని ఆరాట పడ్డాడు.
బిడ్డను చదివించి ప్రయోజకుణ్ణి చేయాలనే ధ్యేయంతో చిన్నూ బాయి బీడీ కార్మికురాలుగా మారింది. కొడుకును వెంట బెట్టుకొని కోటి ఆశలతో పాఠశాలకు వెళ్ళిన చిన్నూబాయిని, చిన్నయ్య తండ్రి పేరు చెబితేనే అతనికి ఇక్కడ ప్రవేశం లభిస్తుందని హెడ్ మాస్టర్ అడ్డు చెప్పాడు. అంతా తెలిసి కూడా, తల లేని ఆ హెడ్ మాస్టర్ వేస్తున్న సూటి పోటీ ప్రశ్నలకు బదులు చెప్పలేక తల్లడిల్లిన ఆ తల్లి చివరకు పోచయ్య అనే తన బావ పేరునే కొడుకు తండ్రి పేరుగా రాయిచింది. బాల కూలిగా ఒక వైపు కష్టపడి పనిచేస్తూ ఇష్టపడి చదువుతూ తెలివైన విద్యార్థిగా రాణిస్తున్న తన గారాల బిడ్డను చూసి, కాబోయే కలక్టర్ లా కనబడుతున్నాడని చిన్నూబాయి మురిసి పోయింది.
కొడుకు చదువు కోసం కొండంత తపనతో తనను తాను కరిగించుకొని బిడ్డకు అండగా నిలవాలని సంకల్పించుకుంది. అనునిత్యం ఇలాంటి ఆలోచనలతోనే గడుపుతూ పొలంలో పనిచేస్తూ ఒక రోజు పాము కాటుకు బలై చిన్నుబాయి చనిపోవడంతో చిన్నయ్య, అతని చెల్లి సుజాత అనాథలయ్యారు. అనుకోకుండా జీవితాన్నికుదిపి వేసిన ఈ బాధాసరిత్సాగరం నుండి బయటపడి చిన్నమ్మ భూదేవి ఆదరణతో, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ మన్నన్ సలహాతో ఉప్పలవాయి పాఠశాలలో హై స్కూల్ విద్యనభ్యసించి, ఉట్నూరులోని గురుకల జూనియర్ కళాశాలలో చిన్నయ్య ఇంటర్ పూర్తిచేశాడు.
ఏదైనా ఉద్యోగం సంపాదించి చెల్లెలిని చదివించాలనే తలంపుతో ఉన్న చిన్నయ్యను ఉట్నూరు సబ్ కలక్టర్ డాక్టర్ పి.వి రమేశ్, అతని సహచరి డాక్టర్ మణి చేరదీసి కన్న బిడ్డలా ఆదరించారు. అనురాగ మూర్తులైన ఆ దంపతులు అతనిని ఉన్నత విద్య వైపు మళ్ళించి, హార్దికంగా, ఆర్ధికంగా తోడ్పాటు నందించారు. నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాలలో బి.ఏ డిగ్రీ, హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎ (హిస్టరీ) పూర్తి చేసి, ఢిల్లీ జవహార లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎం. ఫిల్. పరిశోధన చేశాడు.
ఉస్మానియా విశ్వ విద్యాలయం చరిత్ర శాఖలో కొంతకాలం సహాయ ఆచార్యుడిగా పాఠాలు బోధించిన చిన్నయ్య అక్కడే ఆగిపోలేదు. అనునిత్యం శ్రమించి ప్రఖ్యాత సంస్థల ఫెలోషిప్ సాధించి లండన్ మరియు, న్యూయార్క్ యూనివర్సిటీలలో పి. హెచ్ డి తో పాటు పోస్ట్ డాక్టరేట్ చేశాడు. ప్రస్తుతం జంగం చిన్నయ్య కెనడా లోని కార్లెటాన్ యూనివర్సిటీలో చరిత్ర ఆచార్యుడి గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన చిన్నయ్య ఆంగ్ల భాషపై అపారమైన పట్టుసాధించి, విస్తృతమైన అధ్యయనంతో, విద్యా విషయక క్రమ శిక్షణతో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ తాత్విక స్ఫూర్తితో ప్రపంచంలోనే ప్రథమ శ్రేణి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి ప్రత్యామ్నాయ చరిత్ర కారుడిగా, ప్రభావశీలమైన పరిశోధకుడుగా చిన్నయ్య ఎదిగిన తీరు ఎంతైనా ఆదర్శనీయం. ఎమర్జెన్సీ తరువాత నిజామాబాద్ ప్రాంతంలోని ఎంతో మంది దళిత, బహుజన యువకులు ఉపాధి వేటలో గల్ఫ్ దేశాలకు వలస పోతుంటే, అణిచివేతను భరించలేక మరికొంత మంది అడవి బాట పడుతుంటే జంగం చిన్నయ్య మాత్రం మాతృవాక్య పరిపాలకుడై మడిమ తిప్పకుండా జ్ఞాన వీరునిగా దూసుకు పోయాడు.
పశ్చిమ బెంగాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువతి మయూరికా చక్రవర్తిని చిన్నయ్య ప్రేమించి వివాహం చేసుకొని తన ఆదర్శాలను ఆచరణలో కూడా కనబరిచాడు. భర్తతోపాటు ఆమె కూడా కార్లెటాన్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్ గా పాఠాలు బోధిస్తుంది. చరిత్ర పరిశోధనలో, అనువాదంలో తన సహచరుడికి సహకరిస్తూ జీవిత భాగస్వామిని ప్రేమించడమంటే అతని ఆశయాలను, కార్యాచరణను అనుసరించడమేనని నిరూపిస్తున్నది.
వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలను త్రోసిరాజని సింహం తన వీరోచిత చరిత్రను రాసుకున్నట్లుగా దేశ సంస్కృతికి, నాగరికతకు నడకలు నేర్పిన దళితుల చరిత్రను చిన్నయ్య తవ్విపోస్తున్నాడు. సమాజ ఉపాంతంలోకి నెట్టివేయ బడిన అభాగ్యుల గురించి కొత్త చరిత్రను రచిస్తున్నాడు.
భారత జాతీయోద్యమ పర్యవసానాల గురించి ఎం.ఫిల్ చేద్దామనుకున్న చిన్నయ్య, కంచె ఐలయ్య సూచనతో తన ఆలోచన విరమించుకొన్నాడు. సవర్ణుల చరిత్రను శోధించడానికి సవాలక్షమంది ఉన్నారని, దళితుల చరిత్ర వైపు దృష్టి సారించాలని ఐలయ్య చేసిన దిశానిర్దేశంతో చిన్నయ్య పరిశోధన మలుపుతిరిగింది. మనువాద సమాజంలో అట్టడుగున పడి కాన్పించని అణగారిన జాతుల మహా చరిత్రని వేయి కన్నులతో పరిశీలించి, ‘Dalits and the making of modern India’ అనే గ్రంథాన్నిచిన్నయ్య వెలువరించాడు.
పొట్ట పొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షరం ముక్క రాని కుటుంబం నుండి వచ్చిన చిన్నయ్య రాసిన ఈ గ్రంథాన్ని ‘ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’, ప్రచురించడం విశేషంగా భావించవచ్చు. ‘Social and intellectual History of Dalits in Modern South Asia, అనే పేరుతో ఆయన రచించిన మరొక పరిశోధన గ్రంథం సుప్రసిద్ధ చరిత్రకారుల దృష్టిని ఆకర్షించింది.
భారతీయ చరిత్రలోని విస్మృత కోణాలను చిన్నయ్య తన రచనల్లో ఆవిష్కరించాడు. బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంలో, స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో సవర్ణులతోపాటు దళితులకు సమాన భాగస్వామ్యం ఉందని చిన్నయ్య తన పరిశోధనల్లో నిగ్గు తేల్చాడు. సామాజిక పరమైన, మేధో పరమైన దళితుల కృషిని, చరిత్ర పొడవునా వారు సాగించిన రాజకీయ, పోరాటాల తీరుతెన్నులను ప్రామాణికంగా తన గ్రంథాల్లో విశ్లేషించాడు. నైతిక, సమానత్వంతో కూడిన సమాజ ఆవిర్భావానికి కుల నిర్మూలన పోరాటమే ఆలంబనగా నిలుస్తుందని పరిశోధనా పత్రాల్లో చిన్నయ్య ప్రతిపాదించాడు.
తెలుగు ప్రాంతం లోని దళితుల సామాజిక సాంస్కృతిక, సాహిత్య చరిత్ర స్వరూప స్వభావాలను చిన్నయ్య ఎంతో ఆసక్తిదాయకంగా వివరించాడు. కుసుమ ధర్మన్న, జాలా రంగ స్వామి, జాలా మంగమ్మ, తాడి నాగమ్మ, గ్యార ప్రేమయ్య, వాగిరి ఆమోసు లాంటి తొలి తరం దళిత సంస్కర్తల, రచయితల నిరుపమాన కృషిని ఆయన లోకానికి పరిచయం చేశాడు. అసమానతలు లేని ఆధునిక వ్యవస్థకు, దళిత సాహిత్యం మార్గం చూపుతుందని చిన్నయ్య పేర్కొన్నాడు.
పాఠశాల నుండి గుర్రం జాషువా పద్యాలు విని, ప్రేరణ పొందిన చిన్నయ్య దళిత ఉద్యమ చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో జాషువ గబ్బిలం కావ్యాన్నిఅర్థం చేసుకొని ఈ కావ్యంలో తనను తాను చూసుకున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు అంటరాని ప్రజల చరిత్రకు ఈకావ్యం అద్దం పడుతుందని, గబ్బిలం దళిత పురాణమని ఆయన వ్యాఖ్యానించాడు. కుల, మత, లింగ, జాతి వివక్షలను వ్యతిరేకిస్తూ వెలువడిన సాహిత్యం అత్యంత శక్తివంతమైనదని, ఈ విధమైన రచనలను ఆంగ్లంలోకి అనువదిస్తే ఎంతో మందికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆయన భావించాడు.
అప్పుడే తనకిష్టమైన గబ్బిలం కావ్యం చిన్నయ్య మదిలో మెదిలింది. జాతీయోద్యమ కాలధర్మాన్ని, తన అస్తిత్వ చైతన్యంతో సమన్వయించి, జాషువ గబ్బిలం కావ్యం రచించాడు. భారతదేశ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక వైభవ ప్రభావాలను ఉన్నతీకరిస్తూనే దళిత వేదనను ఆర్ద్రంగా చిత్రించటం వల్ల ఈ కావ్యం ఒక క్లాసిక్ గా మిగిలింది. చిన్నయ్య చరిత్ర విద్యార్థి అయినప్పటికీ గబ్బిలం కావ్యాన్ని అధ్యయనం చేసి, రెండు సంవత్సరాల పరిశ్రమతో ఆంగ్లంలోకి అనువదించాడు. దార్శనిక దృష్టితో గబ్బిలం కావ్యాన్ని దళిత ఇతిహాసంగా ఆయన పేర్కొన్నాడు. ఛందో బద్ధమైన భావధారను కవితాత్మక, ప్రతీకాత్మకమైన అభివ్యక్తులను సామాజిక, ప్రాదేశిక పరమైన పరిభాషను నుడికారాలను, ఆంగ్లంలోకి అనువదించటం అత్యంత కష్టమైననప్పటికి సాహితీవేత్త్లల సహకారంతో, ఈ తరహా రచనల అధ్యయనంతో చిన్నయ్య ఈ బృహత్కార్యాన్ని సముచితంగా నిర్వహించాడు.

వర్ణవ్యవస్థను ఆదర్శీకరించిన ప్రాచీన తెలుగు సాహిత్య రాజకీయాల వైఖరిని, గబ్బిలం చారిత్రక నేపథ్యాన్నివివరించటంతో పాటు, రాజ్యాంగ నైతికతను, ఆత్మ గౌరవాన్ని, కులనిర్మూలనా దృష్టిని ప్రబోధించే సాహిత్య ఆవశ్యకతను Dalit Epic గ్రంథ పీఠికలో ఈ రచయిత విశ్లేషణాత్మకంగా తెలియజేశాడు. ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో జాషువ నిర్వహించిన పాత్రను, ఆయన స్థానాన్ని సూక్ష్మ పరిశీలనతో పీఠికలో నిర్ధారించాడు.
అనువాదం జెరాక్స్ కాపీ లా ఉండకూడదు. తల్లి పోలికలు బిడ్డలో ప్రతిఫలించినట్లుగా కనబడాలి. ఈ శైలితోనే గబ్బిలం అనువాదం సాగింది. కాకి మాధవ రావు గారు గతంలో ఈ కావ్యాన్ని అనువాదం చేసినప్పటికీ దీనికంటే భిన్నంగా జాషువ కావ్య హృదయాన్నిఆకళింపు చేసుకొని ఆయన పద్యాల్లోని ఆర్ద్రతను, పదునైన వ్యంగాన్ని అందిపుచ్చుకొని చిన్నయ్య ఈ రచన చేశాడు. చిన్నయ్య అనువాద గ్రంథానికి ఎ కె రామానుజం బహుమతి లభించటం అత్యంత సమంజసం.
ప్రాచీన తెలుగు కవిత్వాన్ని అనువాదం చేసినందుకు గాను, డేవిడ్ షుల్మన్ తో కలిసి వెల్చేరు నారాయణ రావు 2004 లో ఈ పురస్కారం అందుకున్నాడు. భారతీయ సంప్రదాయ సాహిత్యాన్ని అనువాదం చేసి గతంలో ఎక్కువమంది రచయితలు ఈ పురస్కారాన్ని అందుకోగా, చిన్నయ్య మాత్రం దళిత నేపథ్యం కలిగిన గ్రంథం ద్వారా ఈ అరుదైన గౌరవాన్ని పొందటం గొప్ప విషయం. ఈ విధమైన అంతర్జాతీయ స్థాయి ఘనతను సాదించిన విజేతల్లో చిన్నయ్య తొలి దళిత రచయిత కావడం మరింత విశేషం.
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విశ్వ విద్యాలయాల్లోజంగం చిన్నయ్య రచనలను పాఠ్యాంశాలుగా చేర్చినట్లైతే నిజమైన చరిత్ర నిర్మాతలు ఎవరో ఈ తరానికి బోధపడుతుంది. ప్రపంచాన్ని గెలిచిన జంగం చిన్నయ్య జీవిత కథను పాఠశాల చిన్నారులకు ఉప వాచకంగా నిర్ణయిస్తే, చిన్న కష్టాన్ని కూడాఎదుర్కొనే ధైర్యం లేక క్షణికావేశంతో ఆత్మహత్య దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు గుణపాఠంగా నిలుస్తుంది .
(ఇటీవల ప్రొఫెసర్ చిన్నయ్య జంగం ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ ఏ కె రామానుజన్ అనువాద పురస్కారం అందుకున్న సందర్భంగా)
డాక్టర్ కోయి కోటేశ్వరరావు
తెలుగు శాఖ అధ్యక్షులు
ప్రభుత్వ సిటీ కళాశాల.
94404 80274